Maa Bhoomi
-
తెలుగు సినిమాల్లో ‘తెలంగాణ’ ఆయన కృషే.. అప్పట్లోనే ఆయన అలా..
తెలుగు సినిమా ఇప్పుడు సెకండ్ హాఫ్‌కు వచ్చింది. ఈ సెకండ్ హాఫ్ తెలంగాణ సినిమాది. తెలంగాణ హీరో, తెలంగాణ హీరోయిన్, తెలంగాణ పల్లె, తెలంగాణ పలుకుబడి.. తెలంగాణ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా అయ్యింది. ఇకపై తెలంగాణ లేకుండా తెలుగు సినిమా మనజాలదు. ఈ కొమ్మరెమ్మల పూలు ఫలాలకు ఒకప్పుడు పాదు కట్టినది బి.నరసింగరావు.‘ఈ మట్టికి ఒక చరిత్ర ఉంది. ఈ మాటకు ఒక మిఠాస్ ఉంది. ఇక్కడి పేదకు ఒక గాథ ఉంది. ఇక్కడి ఆగ్రహానికి ఒక ఆయుధం ఉంది’ అని తెలుగు సినిమాలోకి తెలంగాణ జీవనాన్ని మొదటగా తీసుకువచ్చిన దర్శక నిర్మాత బి.నరసింగరావు. న్యూ సినిమా, ఆర్ట్ సినిమా, నియో రియలిస్టిక్ సినిమా, పారలెల్ సినిమా, ఆఫ్‌బీట్ సినిమా.. ఇలా రకరకాల పేర్లతో నవ సినిమా ఉద్యమం ప్రపంచమంతా వికసిస్తున్నప్పుడు ఆ ప్రభాతం వైపు చూపుడువేలు తిప్పి అటుగా దృష్టి ఇచ్చిన దార్శనికుడు బి.నరసింగరావు. ఆయన వల్ల తెలుగు సినిమా తల ఎత్తుకు తిరిగింది. ఆయనకి తెలంగాణ సినిమా తల వొంచి నమస్కరిస్తుంది. ప్రజలు వెలుతురులో ఉండాలనుకునేవాడు ఒక్కోసారి చీకటిలో దాక్కోక తప్పదు.బి. నరసింగరావు పరిస్థితి అలాగే ఉంది– 1975లో. ‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది’ అనుకునేవారు అడవుల్లోకి మళ్లారు. ‘కుంచెతో కలంతో కూడా ప్రజలను రాజ్యాధికారం వైపు నడిపించవచ్చు’ అని మరికొందరు జనం మధ్య ఉండిపోయారు. కళ అంటే ప్రజాకళ.. కళాకారుడికి ఉండవలసిన దృక్పథం అభ్యుదయ దృక్పథం.. రచన కూడా ఉద్యమమే.. నాలుగు వాక్యాల కవిత కూడా డైనమైటే.. అనుకునే కళాకారులు తయారవుతున్న సమయం అది. దీని కంటే ముందు ‘ఆర్ట్ లవర్స్’ పేరుతో ఒక సమూహాన్ని సిద్ధం చేసి సామన్యుల వద్దకు నాటకాన్ని విస్తృతంగా తీసుకెళుతున్న బి.నరసింగరావు 1974 నాటికి ప్రభుత్వానికి ‘వాంటెడ్’ అయ్యారు. ‘దొరికితే కాల్చేస్తారు. లేదా జైల్లో వేస్తారు’ అని తెలిసిపోయింది. బి.నరసింగరావు చేసిన నేరం? ప్రజల్ని చైతన్యపరచడం. ప్రజలు చైతన్యం కావడం పాలకులకు నచ్చదు. ‘పొత్తుల వ్యవసాయం’, ‘సమాధి’, ‘బీదలపాట్లు’, ‘కొత్తమనిషి’ వంటి నాటకాలు స్వయంగా రాసి, నటిస్తూ, ‘మీ పరిస్థితి ఇలా ఉంది.. మీరిలా చేయాలి’ అని ‘నూరి పోస్తున్న’ బి.నరసింగరావు కనుకనే ప్రభుత్వానికి ‘వాంటెడ్’ అయ్యారు. 1974–75. రెండేళ్లు. ‘అండర్‌గ్రౌండ్’. హైదరాబాద్‌లోనే అజ్ఞాత జీవితం. ఉదయం ఐదున్నరలోపు ఎవరినైనా కలిస్తే కలవాలి. రాత్రి తొమ్మిది తర్వాత మళ్లీ. సూర్యుడు తిరుగాడే సమయంలో తిరుగాడ్డానికి వీల్లేదు. పగలంతా గదిలో బందిఖానా అయి ఉన్న నరసింగరావులో ఎన్నో ఆలోచనలు. ‘నేను కళాకారుణ్ణి.. నా కళ జనం చూడాలి.. దానికి స్పందన నేను చూడాలి.. అడవిలోకో అండర్గ్రౌండ్లోకో వెళ్లేలా నా కళా జీవితం ఉండకూడదు.. నా కళ వెలుతురులో ఉండాలి’.. అనే నిర్ణయానికి వచ్చారు. 1976లో అండర్‌గ్రౌండ్ నుంచి బయటకొచ్చాక ఆయన పెట్టుకున్న మూడు ఆప్షన్లు.. భగత్ సింగ్ గురించి ఒపెరా మాదిరిగా రవీంద్ర భారతిలో ఆరు నెలలు వరుసగా నాటకం ఆడటం లేదా ‘రీడర్స్ డైజెస్ట్’ లాంటి మేగజీన్‌ను నడపడం లేదా సినిమా తీయడం. అసలు దొరల కుటుంబంలో బంగారు చెమ్చాతో పుట్టిన బి.నరసింగరావు సినిమాల్లో చూపినట్టుగా గుర్రం ఎక్కి తిరుగుతూ అమాయకులను భయభ్రాంతం చేస్తుండాలి గాని ఈ నాటకాలు, పాటలు, పదుగురితో కలసి చాయ్ సిగరెట్ల మధ్య సాహిత్యాన్ని చర్చించడాలు.. ఏమిటిలా.. ఎందుకిలా? ∙∙ ‘లెక్కలు వచ్చేవి కావు. ఎక్కాలు చెప్పలేకపోయేవాణ్ణి. మా నాన్న ఎంత పెద్ద పట్వారీ అయినా లెక్కల పంతులు ఎండలో ఒంటికాలి మీద నిలబెట్టేవాడు. పదో క్లాసు పాస్ అవడం కూడా కష్టమైంది. అందరూ చదివే చదువు వల్ల కాదనిపించింది. అందుకే ఆ తర్వాత ఫైన్ ఆర్ట్స్‌లో పెయింటింగ్, ఫొటోగ్రఫీ చదివాను’ అంటారు బి.నరసింగరావు. గజ్వేల్ (మెదక్)కు దగ్గరగా ఉన్న ప్రజ్ఞాపూర్ బి.నరసింగరావుది. కాని ఆ తర్వాతి జీవితం అంతా హైదరాబాద్‌లో ‘అల్వాల్’లో గడిచింది. ‘హైదరాబాద్‌లోని రీగల్ థియేటర్లో నా చిన్నప్పుడు చూసిన తొలి సినిమా ‘మేనరికం’ (1953). ఆ తర్వాత హిందీ ‘సువర్ణసుందరి’ చూశాను. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కాలేజ్‌లో చదువుతున్నప్పుడు కాలేజ్‌కి వెళ్లనే లేదు. దాని పక్కనే ఉండే థియేటర్లలో ఉండేవాణ్ణి’ అంటారాయన. పుస్తకాల పిచ్చి కూడా అలాగే పట్టింది. ‘మా నాన్నగారి గదిలో చాలా పుస్తకాలు ఉండేవి. ఒకసారి వాటిని చదవడం మొదలెట్టి 40 రోజుల్లో 60 పుస్తకాలు చదివాను. ఆ తర్వాత కోఠి లైబ్రరీలో మకాం వేశాను. టెక్ట్స్‌బుక్స్ కన్నా ఈ పుస్తకాలు నాకు నచ్చాయి. అధికారం, దర్పం కన్నా గోడ మీద పడే ఉదయపు ఎండ నన్ను ఎక్కువ సంతోషపెట్టేది’ అని గుర్తు చేసుకున్నారాయన.సాహిత్యం, సినిమాలు, నాటకాలు, చిత్రలేఖనం.. ఇవన్నీ బి.నరసింగరావును చేర్చవలసిన చోటుకే చేర్చాయి– సినిమాకు– తన భూమికి– మాభూమికి. ∙∙ సందర్భవశాన మన దేశ దాదాపు తొలి నియో రియలిస్టిక్ సినిమా ‘దో బిఘా జమీన్’ (1953) భూమి సమస్యనే చర్చించింది. పేదవాడికి దక్కని భూమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూవేవ్ సినిమా, న్యూ సినిమా మొదలయ్యిందే పేదల గురించి పీడకుల గురించి మాట్లాడటానికి. నిర్మాతల, నటీనటుల గుప్పిట్లో ఉండే కాలక్షేప సినిమాను దర్శకుడు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని తెలియని ముఖాలతో, మామూలు మనుషులనే నటులుగా చేసి తక్కువ ఖర్చు, తక్కువ వనరులతో ప్రయోజన్మాతక సినిమాను చెప్పడమే న్యూ సినిమా. సత్యజిత్ రే వచ్చి ‘పథేర్ పాంచాలి’ (1955) తీసి ఆర్ట్ సినిమా అనే మాటను దేశానికి పరిచయం చేశాడు. అయితే ఒక ధోరణిగా ఆర్డ్/పారలెల్ ఫిల్మ్స్ రావాలంటే 1970లు రావాల్సి వచ్చింది. హిందీలో ఎం.ఎస్.సత్యు ‘గరం హవా’ (1973), శ్యాం బెనగళ్ ‘అంకుర్’ (1974) పారలెల్ సినిమాను తీసుకొచ్చాయి. మరోవైపు మలయాళంలో ఆదూర్ గోపాల్‌కృష్ణన్ వచ్చి ‘స్వయంవరం’ (1972) తీశాడు. కన్నడంలో మన తెలుగు పఠాభి ‘సంస్కార’ (1970) తీశాడు. కాని గమనించవలసిన విషయం ఏమిటంటే తెలుగులో పారలెల్ సినిమా ముగ్గురు బయటి దర్శకుల వల్ల వచ్చింది. మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’ (1977), శ్యామ్ బెనగళ్ ‘అనుగ్రహం’ (1977), గౌతమ్ ఘౌష్ ‘మాభూమి’ (1979). ఈ ‘మాభూమి’ బి. నరసింగరావు చెమటా, నెత్తురు, తెలంగాణ సినిమాకు ఆయన తెరవాలనుకున్న తొలివాకిలి. ∙∙ ‘నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ ప్రసాదరావు గారి అబ్బాయి రవీంద్రనాథ్ నా క్లాస్మేట్. వాడు కూడా ఎమర్జన్సీ టైమ్‌లో కోల్‌కతా వెళ్లి అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. తిరిగి వచ్చాక వాణ్ణి ప్రొడక్షన్లో పెట్టారు. మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’కు వాడు పని చేస్తుంటే నేను వెళ్లేవాణ్ణి. అప్పటికే నాకు సినిమా తీయాలని ఉంది. దర్శకత్వం చేయాలని ఉంది. కాని ఎలా తీయాలో తెలియదు. ఒక లక్ష రూపాయల్లో సినిమా తీయమని మృణాల్‌సేన్‌ను అడిగితే అంత తక్కువలో నేను చేయలేను.. కొత్త కుర్రాడొకడున్నాడు..అతన్ని ఉపయోగించుకో అని గౌతమ్ ఘోష్‌ను పంపారు. తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం నేపథ్యం ఉన్న కిషన్ చందర్ నవల ‘జబ్ ధర్తీ జాగే’ను తీసుకున్నాం. గౌతమ్ ఘోష్ దానికి రాసుకొచ్చిన స్క్రీన్‌ప్లే నాకు నచ్చలేదు. మళ్లీ కూచుని అందరం రాశాం. దర్శకత్వం ఎలా చేయాలో తెలుసుకుందామంటే గౌతం ఘోష్ నేర్పే మనిషి కాదు. అందుకని అతని వెంటే తిరుగుతూ అబ్సర్వ్ చేస్తూ సినిమా తీయడం తెలుసుకున్నాను’ అంటారు బి. నరసింగరావు. 1980లో తెలుగులో రిలీజైన రెండు సినిమాలు ‘శంకరాభరణం’, ‘మాభూమి’ సంచలనం సృష్టించాయి. కె. విశ్వనాథ్‌తో ప్రయోగం అంతో ఇంతో సేఫ్. కాని తెలంగాణ సినిమా కొత్తవాళ్లతో తీసి విడుదల చేయడం చాలా రిస్క్. ‘లక్ష అనుకున్న బడ్జెట్ ఐదున్నర లక్షలు అయ్యింది. ఆస్తి అమ్మాల్సి వచ్చింది. మొత్తం ఔట్‌డోర్‌లో తీయడం వల్ల ఎన్నో సమస్యలు. అందరూ పడి దెబ్బలు తగిలించుకునేవారే. రోజుకు ఒక అయొడిన్ సీసా అయిపోయేది’ అన్నారు బి.నరసింగరావు. కాని ఆ శ్రమ వృథా పోలేదు. ‘మాభూమి’ తెలంగాణ కథకు, సినిమాకు అరుగు కట్టింది. దాని మీద బంగారు నందిని కూచోబెట్టింది. హైదరాబాద్‌లో వంద రోజులు ఆడి అందరినీ చకితులను చేసింది. ఇదే సినిమాతో గద్దర్ని బి. నరసింగరావు యుద్ధనౌకను చేసి జనంలోకి వదిలారు. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పెద్ద హిట్. ∙∙ ‘రంగుల కల.. దర్శకుడిగా నా మొదటి సినిమా. మన దేశంలో మోడర్న్ పెయింటర్ మీద అప్పటికి ఒక్క సినిమా లేదు. జీవితంలో, కళలో ఒకేసారి దారి తెన్నూ వెతుక్కునే చిత్రకారుల కథ అది. కళ ప్రజల పక్షం ఉండాలి సరే. కళాకారుడు ఏ విధంగా బతకాలి. అతణ్ణి ఎక్స్‌ప్లాయిట్ చేసే వర్గాల కళారాధనలో బోలుతనం ఎంత.. ఇవన్నీ చర్చించాను. పస్తుల చిత్రకారుల 1980ల స్థితికి దర్పణం ఆ సినిమా’ అన్నారు బి. నరసింగరావు. ‘రంగుల కల’ (1983)లో బి. నరసింగరావు హీరో. హైదరాబాద్ నగరం ఇందులో ఒక పాత్రధారి. ఒక స్లమ్‌లో నివసించే చిత్రకారుడిగా ఆయన నటన ఆశ్చర్యం కలిగిస్తుంది. రూప హీరోయిన్. గద్దర్ పాడిన ‘భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న’ పాట రేడియోలో నిత్యం మోగిపోయింది. ∙∙ ‘సీనియర్ జర్నలిస్ట్ జి.కృష్ణగారు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. అప్పుడాయనొక మాట చెప్పారు– నరసింగరావు.. 1940ల్లో నేనొక దొరల గడీకి వెళ్లాను. అక్కడ ఒక దాసి నా కాళ్ల మీద నీళ్లు పోసి కడగడానికి వచ్చింది. నా కాళ్లు నేను కడుక్కోలేనా అన్నాను. ఇక్కడ ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో కడిగించుకుంటారు మీరు కాళ్లకే ఇబ్బంది పడితే ఎలా అంది. అలా కడిగించుకునే మనుషులు ఎలాంటి వాళ్లు– అన్నారు. ఆ మాట నా మనసులో పడింది. మా నాన్న హయాంకు మా ఇంట్లో దాసీలు లేరు. నేను చూళ్లేదు. నేను నేరుగా మా అమ్మ దగ్గరకు వెళ్లి మనింట్లో దాసీలు ఉండేవారా అనంటే నిన్ను చిన్నప్పుడు చూసుకున్న లచ్చవ్వ దాసీయే కదా అంది. లచ్చవ్వ నా చిన్నప్పటికి ముసలిదైపోయింది. అంటే మా తాతల కాలంలో ఉండేవారన్న మాట. అక్కడి నుంచే దాసి సినిమా కథ పుట్టింది’ అన్నారు బి. నరసింగరావు. 1988లో వచ్చిన ‘దాసి’ తెలంగాణ సినిమా కీర్తిని, తద్వారా బి. నరసింగరావు కీర్తిని ప్రపంచానికి చాటింది. ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రపంచంలోని అనేక సినిమా స్కూళ్లలో ఆ సినిమా సిలబస్. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఆ సినిమా చూసి కదిలిపోయి బి. నరసింగరావుకు ఫ్యాన్‌గా మారారు. తనకు ఆత్మీయులను చేసుకున్నారు. ఏమిటి ‘దాసి’ గొప్పతనం? అది వేదనను సహజంగా చెప్పింది. మనుషులు క్రూరత్వాన్ని సాధారణ విషయంగా భావించేలా జీవిస్తుంటారు. ఎదుటివారిని హింసించడం వారి ఖర్మ వల్లే అనుకుంటారు. పశ్చాత్తాపం ఎరగని ఇలాంటి మనుషులు ఈనాడు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తూనే ఉన్నారు. నటి అర్చన ఈ సినిమా మొత్తం ఒకటి రెండు చీరల్లో కనిపిస్తుంది. ఆమెతో దొర గడిపినా ఆమె హోదా ఏమీ మారదు. వంట గదిలో చాలా ఘోరమైన బొచ్చెలో తిండి పెడతారు. ఆమెకు కడుపు వస్తే అది వెలి కడుపు. దొరసానికి కడుపు రాకపోయినా పర్లేదు కాని దాసిదానికి రాకూడదు. ‘కడుపు తీయించు’ అని దొరసాని హుకుం జారీ చేస్తే గడిలోని ముసలి దాసి పచ్చి బొప్పాయి కాయని కత్తి పీట మీద రెండుగా కోస్తుంది. ప్రేక్షకులకు గుండె ఝల్లుమంటుంది. తీవ్రమైన హింస అతి మామూలుగా ఉంటుందని బి. నరసింగరావు చూపుతారు. నేటికీ ‘దాసి’ చూడకపోతే తెలుగువారు ఒక కాలాన్ని ఒక జీవన వేదనని తెలుసుకోనట్టే. అందుకే ముసోరి ట్రైనింగ్‌లో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్‌లకు ఈ సినిమా చూపిస్తారు. ∙∙ బి. నరసింగరావుకు సినిమా ఆదాయ మార్గం కాదు. కాంబినేషన్ సెట్ చేసి అడ్వాన్సులు తీసుకోవడం కాదు. ఏరియా వారి కలెక్షన్లు కాదు. సినిమా అనేది బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ‘నా సినిమాలు చూశాక అవి చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయి’ అంటారాయన. బి. నరసింగరావు తీసిన ‘మట్టి మనుషులు’ భవన నిర్మాణ కూలీల వ్యథాత్మక జీవితాన్ని చూపిస్తుంది. ఆ సినిమాలో కూలీల పై సాగే భౌతిక దోపిడి ఒక ఎత్తయితే వారిలో స్త్రీల పై సాగే లైంగిక దోపిడి మరో ఎత్తు. ‘మట్టి మనుషులు’ చూస్తే భవన నిర్మాణ కూలీల పట్ల సగటు మనిషి వైఖరి మారుతుంది. ఇదే కాదు హైదరాబాద్ నగరం మీద ‘ది సిటీ’, ఊరి జీవనం మీద ‘మా ఊరు’ డాక్యుమెంటరీలు తీసినా గాఢంగా ముద్రవేసే జీవన దృశ్యాలు. ‘మా ఊరు’ అయితే భావి తరాల కోసం దాచి పెట్టిన తాళపత్రగ్రంథం. ∙∙ బి. నరసింగరావు ఇప్పుడు డెబ్బయిల వయసు దాటారు. కాని నిత్యం సినిమా గురించో చిత్రకళ గురించో ఏదైనా కవిత్వం గురించో కథ గురించో పని చేస్తూనే ఉన్నారు. కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్‌తో వేలకొలది ఫొటోలు తీస్తూ ప్రతి కొత్త సాంకేతిక పరికరం సాంస్కృతికంగా ఎలా ఉపయోగపడుతుందో చూస్తుంటారు. ఆయన తెలంగాణ సినిమాకు భూమిక ఏర్పరచకపోతే ఇవాళ ఊరూరా ప్రదర్శించిన ‘బలగం’ లాంటి సినిమాలు ఇప్పటికీ సాధ్యమయ్యేవి కావు. ‘తెలంగాణ ఏర్పడ్డాక సాంస్కృతికంగా చేయవలసింది చాలా ఉంది’ అంటారాయన. ‘అందుకై ప్రత్యేకంగా ఎవరితోనూ తలపడాలని నేను అనుకోను. కాని తలపడే సందర్భం వస్తే సిద్ధంగా ఉంటాను’ అన్నారాయన. ఆరగడుగుల పై చిలుకు ఎత్తుతో తన నివాసంలో ఆయన తెలంగాణ సినిమా భీష్మాచార్యుడిలా కనిపించారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి ‘దాసి’ చూసి పొంగిపోతూ ‘మై కంట్రీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ’ అన్నారట. నిజమే. ఈ గొప్ప దర్శకుణ్ణి చూసి దేశం గర్విస్తూనే ఉంటుంది. ► ‘మట్టి మనుషులు’లో మొదటిసారి నీనా గుప్తాను పరిచయం చేశారు బి.నరసింగ రావు. ఆ సినిమాలో ఆమె భవన నిర్మాణ కూలీగా నటించింది. అందుకోసం రెండువారాలు హైదరాబాద్‌లో ఉండి తెలుగు కొద్దిగా నేర్చుకుంది. సినిమాలో ఆమె పాడే బిట్సాంగ్ ఉంది. అది ఆమే పాడింది. ► ‘దాసి’ కోసం నటి అర్చన స్నానం చేసే సీన్ తీయాల్సి ఉంది. ఒప్పుకోదేమో అనుకున్నారు. కాని అప్పటికే షూట్ జరుగుతున్న విధంలోని సీరియస్‌నెస్‌ను గమనించిన అర్చన ఆ సీన్ తీయడానికి అంగీకరించింది. కేవలం కెమెరామేన్ ఎ.కె.బీర్, తాను మాత్రమే లొకేషన్లో ఉండి మిగిలిన వారిని బయటకు పంపించి ఆ సీన్ తీశారు. ► ‘దాసి’లో దొర వేషం వేసిన భూపాల్ నిజ జీవితంలో శాంత స్వభావి. కాని దొర మనస్తత్వం ఏర్పడటానికి ఇంట్లో కూడా కటువుగా వ్యవహరించమని భూపాల్‌కు నరసింగరావు సూచించారు. షూటింగ్ మొదలయ్యాక భూపాల్ ఇంట్లో కూడా భార్యతో కఠినంగా వ్యవహరిస్తుండేసరికి ఆమె బెదిరిపోయి ఏం జరిగిందో తెలుసుకోవడానికి బి. నరసింగరావు దగ్గరకు వచ్చింది. అలా ఉండమని చెప్పింది తనే కనుక ఏం జవాబు చెప్పాలో తెలియక ఏదో సర్దిచెప్పి పంపించారు. ► బి.నరసింగరావు తెలుగు సినిమాకు పరిచయం చేసినవారిలో దర్శకుడు గౌతమ్ ఘోష్, నటుడు భూపాల్, ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం, కవి దేవిప్రియ, నటుడు సాయి చంద్, గద్దర్, చిత్రకారుడు చంద్ర తదితరులు ఉన్నారు. తోట వైకుంఠం ‘రంగుల కల’ సినిమాలో కనిపిస్తారు. ‘రంగుల కల’లో గద్దర్ ‘భద్రం కొడుకో’ పాడుతుంటే కోరస్ సింగర్స్‌లో వంగపండు ఒకరిగా కనపడతారు. ► బి.నరసింగరావుకు సంగీతంలో గొప్ప ప్రవేశం ఉంది. ‘దాసి’కి ఆయన కూర్చిన నేపథ్య సంగీతం చూస్తే ఆ విషయం తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతాన్ని తెలుగు సినిమాల్లో నేపథ్య సంగీతంగా బి.నరసింగరావు సమర్థంగా ఉపయోగించారు. ‘ది సిటీ’ డాక్యుమెంటరీ అందుకు ఉదాహరణ. ► ‘రంగుల కల’లో క్రేన్ ఉపయోగించి ఒక షాట్ తీయాల్సి వచ్చింది. కాని క్రేన్‌కు అద్దె ఎక్కువ. తక్కువ బడ్జెట్లో తీస్తున్న సినిమా కనుక కార్పొరేషన్ వారు వీధి దీపాలు మార్చడానికి ఉపయోగించే నిచ్చెన వాడి ఆ షాట్ తీశారు. ► బి.నరసింగరావు మంచి నటులు. ‘మా భూమి’లో ముఖ్యపాత్ర పోషించారు. రజాకార్లు తల మీద వాత పెట్టగా ఆ బాధ పట్టక జనం కోసం మాట్లాడే పాత్ర అది. ‘రంగుల కల’లో బి.నరసింగరావు హీరో. రూప హీరోయిన్. ఆ సినిమాలో ‘కౌగిలించుకోని’ హీరో హీరోయిన్లను చూపించడం ఒక వింత. ఎందుకంటే అప్పటికి హీరో హీరోయిన్ల గెంతులు శ్రుతి మించి ఉన్నాయి. - ఖదీర్ -
గిరిజన రైతులకు ఎఫ్‌పివో దన్ను! కాఫీ పండ్లు కిలో రూ. 50, మిరియాలు 400– 430కి కొని!
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, నాణ్యమైన విత్తనాలను అందించడంలో తనదైన వ్యూహంతో ముందుకెళ్తోంది ‘మా భూమి’ ఎఫ్.పి.ఓ.! 2012–13లో గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో పది మంది రైతులు కలిసి ‘శ్రీ వెంకటేశ్వర రైతు క్లబ్’ను ఏర్పాటు చేసుకున్నారు. డి.పారినాయుడు నేతృత్వంలోని జట్టు ట్రస్టుతో పాటు నాబార్డు సహకారం తీసుకున్నారు. రూ.5 లక్షల యంత్ర సామాగ్రిని 90 శాతం రాయితీపై సమకూర్చుకొని విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత గరుగుబిల్లి మండలంలోని రైతు క్లబ్లన్నింటినీ ఏకం చేసి.. మా భూమి రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్‌పి.ఓ.ను) కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించారు. 4 మండలాలకు చెందిన 573 మంది రైతులు ఈ ఎఫ్.పి.ఓ.లో సభ్యులుగా, 15 మంది డైరెక్టర్లుగా వున్నారు. ఆరేళ్ల క్రితం నుంచి ఎఫ్.పి.ఓ. ప్రకృతి వ్యవసాయ విధానం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, వేపపిండి, కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తోంది. వీటి రవాణాకు ఎస్బీఐ సీఎస్ఆర్ నిధులతో రూ.7 లక్షల వ్యాన్ సమకూరింది. నూనె గానుగను రైతుసాధికార సంస్థ తోడ్పాటుతో ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల నుంచి దఫదఫాలుగా రూ. 70 లక్షల రుణాలు తీసుకొని వ్యాపారాభివృద్ధికి ఉపయోగించారు. 2016–17లో రూ.18 లక్షల వ్యాపారం ద్వారా రూ. 80 వేల నికర లాభం గడించిన ఎఫ్.పి.ఓ... 2020–21 నాటికి రూ.70.02 లక్షల వార్షిక టర్నోవర్‌తో రూ.46 వేల నికరాదాయం ఆర్జించటం విశేషం. రైతుల్లో 90% చిన్న, సన్నకారు రైతులే. పెరుగుతున్న సాగు ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, దళారుల దగాలు, ప్రకృతి వైపరీత్యాలు.. ఇవీ ఈ బడుగు రైతుల సమస్యలు. ఈ సమస్యలను తట్టుకొని రైతులు నిలబడాలంటే.. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లటంతో పాటు తమ ఉత్పత్తులకు విలువను జోడించి, గిట్టుబాటు ధరలకు అమ్ముకోగలగటం ముఖ్యం. బడుగు రైతులను ఈ దిశగా సమైక్యంగా నడిపించడంలో ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ రైతులకు చెందిన అటువంటి రెండు ఎఫ్.పి.ఓ.లు 2022–23కు సంబంధించి జాతీయ స్థాయి ‘జైవిక్ ఇండియా’ అవార్డుల్ని గెలుచుకోవటం విశేషం. ఈ నెల 23న ఆగ్రాలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. పాడేరు, పార్వతీపురం ప్రాంత రైతులకు విశేష సేవలందిస్తున్న ఈ రెండు ఎఫ్.పి.ఓ.ల విజయగాథలు రైతు లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. గిరిజన రైతులకు ఎఫ్‌పివో దన్ను! కాఫీ, మిరియాలు, పసుపు కొనుగోళ్లతో రైతులకు మంచి ఆదాయం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని ఎం. నిట్టాపుట్టు గ్రామం కేంద్రంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పివో) 2018లో ఏర్పాటైంది. 549 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 11 పంచాయతీలకు చెందిన 75 గ్రామాల్లోని 3,685 మంది గిరిజన రైతుల ద్వారా 9,575 ఎకరాల్లో ఈ ఎఫ్.పి.ఓ. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యంగా గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. గత మూడేళ్లుగా కాఫీ పండ్లు, పాచ్మెంట్, మిరియాలు, పసుపు ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. బ్యాంకుల సహకారంతో నిట్టాపుట్టు ఎఫ్‌పివో వ్యాపారంలో రాణిస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ఎఫ్పివోగా గుర్తింపు పొందింది. కాఫీ, మిరియాలు, పసుపు తదితర ఉత్పత్తుల వ్యాపారం ద్వారా 2019–20లో రూ.29.9 లక్షలు, 2020–21లో రూ.1.91 కోట్ల టర్నోవర్ సాధించింది. కాఫీ పండ్లను కిలో రూ.50కు, మిరియాలను రూ.400–430కి, పసుపును రూ.65–80కు ఎఫ్.పి.ఓ. కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. సీజన్లో రోజుకు 35–45 మంది గిరిజనులకు పని కల్పిస్తూ రూ.350ల రోజు కూలీ చెల్లిస్తున్నారు. గిరిజన రైతులు రసాయనాలు వాడకుండా పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికెట్లు సాధించి గిట్టుబాటు ధర రాబట్టడంలో ఎం.నిట్టాపుట్టు ఎఫ్‌టీవో మంచి పేరు తెచ్చుకుంది. – ఎన్.ఎం. కొండబాబు, సాక్షి, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా ∙మాభూమి ఎఫ్.పి.ఓ.లో విత్తనాల ప్రాసెసింగ్ యంత్రం దళారులు లేకుండా నేరుగా వ్యాపారం మాభూమి విత్తన కంపెనీ ద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నాం. ఆరోగ్యానికి మేలు చేసే వరి దేశీయ రకాలైన నవారా, కాలాభట్, రత్నచోడి, ఢిల్లీ బాస్మతి, చిట్టి ముత్యాలు, సుగంధ సాంబ విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించటం, దళారుల్లేకుండా నేరుగా వ్యాపారం నిర్వహించడం వంటి పనులు చేస్తున్నాం. – తాడేన మన్మథనాయుడు (63649 93344), మాభూమి ఎఫ్ఏవో కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలం ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం కృషి మాభూమి ఎఫ్ఏవో ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం హైదరాబాద్‌లోని స్కంద ఆర్గానిక్–42 కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ కంపెనీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి సర్టిఫికేట్‌ను మంజూరు చేస్తారు. ఇంటర్నేషనల్æ కంట్రోల్ సిస్టమ్(ఐసీఎస్) సర్టిఫికెట్ ఉంటే రైతులు పండించిన ఉత్పత్తులను లాభాలున్న చోట ఎక్కడైనా విక్రయించుకొనేందుకు అవకాశం ఉంటుంది. – ఎం. నూకం నాయుడు (94400 94384), సీఈవో, మాభూమి ఎఫ్‌పీవో, తోటపల్లి తూకాలు, ధరల్లో మోసాలకు స్వస్తి దళారుల తూకాలు, ధరల్లో మోసాలకు స్వస్తి చెప్పి తోటి గిరిజనులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఎఫ్‌పీవోను ప్రారంభించాం. కాఫీ, మిరియాలు, పసుపు మార్కెటింగ్ బాధ్యతలు చేపట్టి రైతులకు మంచి లాభాలు అందిస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో చిరుధాన్యాలను కూడా కొనుగోలు చేస్తాం. ప్రకృతి వ్యవసాయంపై అన్ని గ్రామాల్లోనూ విస్తృత ప్రచారం చేస్తున్నాం. – పరదాని విజయ (63000 39552) , చైర్పర్సన్, ఎం.నిట్టాపుట్టు ఎఫ్‌టీవో, జి.మాడుగుల మం., అల్లూరి సీతారామరాజు జిల్లా రెండేళ్లుగా ఎఫ్పీవోకే అమ్ముతున్నా... ఎఫ్‌పీవో ద్వారా రెండేళ్లుగా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ ఏడాది కిలో రూ.50ల ధరతో 200 కిలోల కాఫీ పండ్లు, రూ.250ల ధరతో 500 కిలోల పాచ్మెంట్ కాఫీ గింజలను అమ్మాను. మిరియాలు కిలో రూ.460కి ఎఫ్‌పివో కొనుగోలు చేసింది. – పరదాని లక్ష్మయ్య, నిట్టాపుట్టు గ్రామం, జి.మాడుగుల మం. ,ఏఎస్సార్ జిల్లా – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరం చదవండి: Sagubadi: కాసుల పంట డ్రాగన్! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా! -
నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’
సాక్షి, హైదరాబాద్: ‘మా భూమి’ ఒక సినిమా మాత్రమే కాదు. ఒక చారిత్రక దృశ్యకావ్యం. తెలుగు సినీచరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయోగం. నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టిన సామాజిక చిత్రం. నలభై రెండేళ్ల క్రితం విడుదలైన ‘మా భూమి’సినిమా ఇప్పటికీ ప్రేక్షాకాదరణను పొందుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఒక చర్చనీయాంశం. సాయుధపోరాటాన్ని, తెలంగాణలో పోలీస్ యాక్షన్ కాలాన్ని ‘మాభూమి’లో చిత్రీకరించారు. రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలను, హింసను చూసిన హైదరాబాద్ రాజ్యం పోలీసు యాక్షన్‌తో భారత యూనియన్‌లో భాగమైంది.ఆ నాటికి ఒక కీలకమైన దశాబ్ద కాలాన్ని అద్భుతమైన మా భూమి సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు చిత్ర నిర్మాత, సంగీత దర్శకులు బి. నర్సింగ్‌రావు. అప్పటి అనుభవాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... నిర్మాత నర్సింగరావుతో నటుడు సాయిచంద్ అదొక ప్రయోగం.. ‘మా భూమి’ సినిమా ఒక ప్రయోగం.అప్పటి వరకు సినిమా తీసిన అనుభవం లేదు. నటీనటులు కూడా అంతే. స్టేజీ ఆర్టిస్టులు. సాయిచంద్ బహుశా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్రికెట్ ఆడుతుండగా తీసుకెళ్లాం, ఆయనకు అదే మొదటి సినిమా. కాకరాల, భూపాల్‌రెడ్డి, రాంగోపాల్, తదితరులంతా రంగస్థల నటులు. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు గౌతమ్‌ఘోష్ అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ సినిమా కోసం పని చేశాం. ►1978 నుంచి 1980 వరకు సినిమా నిర్మాణం కొనసాగింది. చిత్రం షూటింగ్ ప్రారంభోత్సం నుంచి లెక్కిస్తే ఇప్పటికి 44 ఏళ్లు. విడుదలైనప్పటి నుంచి అయితే 42 సంవత్సరాలు. సినిమా విడుదలైన రోజుల్లో సినిమా టాకీస్ల వద్దకు జనం పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు. సినిమా టాకీసులన్నీ జాతర వాతావరణాన్ని తలపించేవి. హైదరాబాద్‌లో ఈ సినిమాకు అపూర్వమైన ఆదరణ లభించింది. దర్శకుడు గౌతమ్‌ఘోష్ మా భూమిని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా, ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు. ‘మా భూమి’ సినిమాలోని సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరణ... మా భూమి సినిమాను చాలా వరకు మొదక్ జిల్లా మంగళ్పర్తి, దొంతి గ్రామాల్లో , శివంపేట గడీలో చిత్రీకరించాము. విద్యుత్ సదుపాయం కూడా లేని ఆ రోజుల్లో పగటిపూటనే చీకటి వాతావరణాన్ని చిత్రీకరించి సినిమా షూటింగ్ చేశాం.రజాకార్ల దాడి , కమ్యూనిస్టుల పోరాటాలు వంటి కీలకమైన ఘట్టాలను చిత్రీకరించే సమయంలో కళాకారులకు దెబ్బలు కూడా తగిలేవి. గాయాలకు కట్టుకట్టేందుకు రోజుకు ఒక అయోడిన్ బాటిల్ చొప్పున వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్ నగర సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా ఆఫ్జల్‌గంజ్‌లోని ఇరానీ హాటల్లో ఒక సన్నివేశాన్ని తీశాం. అలాగే కార్వాన్, జాహనుమా, జూబ్లీహాల్, వనస్థలిపురం, నయాఖిల్లా, సాలార్జంగ్ మ్యూజియం, కాలాగూడ, తదితర ప్రాంతాల్లో మా భూమి సినిమా తీశాం. కథానాయిక చంద్రి నివాసం, గుడిసెలు అంతా హైదరాబాద్‌లోనే సెట్టింగ్ వేశాం.ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభవం. అందరికీ ఒకే కిచెన్ ఉండేది. అందరం కలిసి ఒకే చోట భోజనాలు చేసేవాళ్లం. లారీల్లో ప్రయాణం చేసేవాళ్లం, ప్రజలు కళాకారులే... ఆ రోజుల్లో కేవలం రూ.5.40 లక్షలతో ఈ సినిమా పూర్తయింది. ఆర్టిస్టులకు రూ.300, రూ.500, రూ.1000 చొప్పున ఇచ్చాం.చాలా మంది స్వచ్చందంగా నటించారు. సగం మంది ఆర్టిస్టులు ఉంటే మిగతా సగం మంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలే. షూటింగ్ సందర్శన కోసం వచ్చిన వాళ్లే ఆర్టిస్టులయ్యారు. ఒకసారి 80 మంది గ్రామస్తులకు ఆ రోజు కూలి డబ్బులు మాత్రమే చెల్లించి సినిమా షూటింగ్లో భాగస్వాములను చేశాం.అప్పటి తెలంగాణ సమాజాన్ని, రజాకార్ల హింసను, పోలీసు చర్య పరిణామాలను ఈ సినిమా ఉన్నదున్నట్లుగా చూపించింది. ‘ అని వివరించారు. బండెనుక బండి కట్టి... ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్ పాడిన పాట అప్పటి నిజాం రాక్షస పాలన, జమీందార్ల దౌర్జన్యాలపైన ప్రజల తిరుగుబాటును కళ్లకు కట్టింది. ‘బండెనుక బండి కట్టి. పదహారు బండ్లు కట్టి.. నువు ఏ బండ్లె పోతవురో నైజాము సర్కరోడా....’ అంటూ గద్దర్ ఎలుగెత్తి పాడిన ఆ పాటు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది. నిజాం నిరంకుశ పాలనపైన, దొరలు, జమీందార్ల పెత్తనంపైన ప్రజాగ్రహం పెల్లుబికేవిధంగా ఈ పాట స్ఫూర్తిని రగిలించింది. -
మా భూమి @ 40
ఇండస్ట్రీ కొన్నిసార్లు మూస దారిలో ప్రయాణిస్తుంటుంది... అదే రహదారని భ్రమపడేంత. కొన్నిసార్లు ఆ దారిని ఏమాత్రం లెక్క చేయకుండా.. కొత్త దారుల్ని వెతుక్కుంటూ కొన్ని సినిమాలు వెళ్తాయి. ‘పాత్ బ్రేకింగ్’ సినిమాలంటాం వాటిని. 40 ఏళ్ల క్రితం చేసిన అలాంటి ప్రయత్నమే ‘మా భూమి’. ఫలితం – ప్రభంజనం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మా భూమి’. తెలుగు సినిమాల్లో సంచలనాలను ప్రస్తావించాల్సినప్పుడల్లా ‘మా భూమి’ని నెమరువేసుకుంటూనే ఉన్నాం. ఇవాళ మళ్లీ గుర్తు చేసుకుందాం. నేటితో ‘మా భూమి’ 40ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి వంద విశేషాలు ఉంటాయి. కానీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమైన 40 విశేషాలు మీకోసం. ► కిషన్ చందర్ రాసిన ‘జబ్ ఖేత్ జాగే’ అనే ఉర్దూ నవల ఈ సినిమాకు స్ఫూర్తి. ► ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ సలహా మేరకు గౌతమ్ – ఘోష్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ► దర్శకుడు గౌతమ్ ఘోష్‌కి ఇదే తొలి సినిమా. ► నవల ఆధారంగా గౌతమ్ ఘోష్ ఓ కథను రాసుకొచ్చారు. కానీ నిర్మాతలకు అంతగా నచ్చలేదు. మళ్లీ తెలంగాణాలో పలు ప్రాంతాలు సందర్శిస్తూ ఈ కథను రాసుకున్నారు. ► ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు త్రిపురనేని సాయిచంద్ ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యారు. ► ఈ సినిమాను నిర్మించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను అందించారు బి. నర్సింగరావు. ► ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఈ సినిమాకు నంది అవార్డులు వరించాయి. ► కార్వే వారీ ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో మన దేశం తరఫున అధికారికంగా ఎంపికయిన చిత్రం ‘మా భూమి’. ► సీఎన్ఎన్– ఐబీఎన్ తయారు చేసిన ‘వంద అత్యుత్తమ భారతీయ చిత్రాల’ జాబితాలో ‘మా భూమి’ చోటు చేసుకుంది. ► ఈ సినిమా చిత్రీకరణ చాలా భాగాన్ని మెదక్ జిల్లాలోని మంగళ్పర్తిలో చేశారు. అది బి. నరసింగరావుగారి అత్తగారి ఊరే. ► లక్షన్నర బడ్జెట్ అనుకుని మొదలయిన ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఐదున్నర లక్షలయింది. ► ఈ సినిమాకు గౌతమ్ ఘోష్ భార్య నిలాంజనా ఘోష్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ► ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను దర్శకుడు గౌతమే స్వయంగా చూసుకున్నారు. ► పాపులర్ నటి తెలంగాణ శకుంతల ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ► కేవలం ఉదయం ఆటగానే ప్రదర్శించేట్టు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదల తర్వాత హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో ఏడాది పాటు నిర్విరామంగా ఆడింది. ► ప్రజాగాయకుడు గద్దర్ తొలిసారి స్క్రీన్ మీద కనిపించిన చిత్రం ఇదే. ► తెలంగాణ పల్లె జీవితం ఎలా ఉండాలో అర్థం చేసుకోవడానికి గౌతమ్, నర్సింగరావు తెల్లవారగానే పల్లెలోకి వెళ్లి ఊరిలోని ప్రజలు ఎలా జీవిస్తున్నారో గమనిస్తూ ఉండేవారట. ► సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇల్లును కుదవపెట్టారట నర్సింగరావు. ► సినిమాలో ఒక సన్నివేశంలో శవం దగ్గర ఏడ్చే సన్నివేశం ఉంది. కానీ ఆ సీన్లో యాక్ట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదట. సుమారు మూడు నాలుగు ఊర్లు గాలించి పోచమ్మ అనే ఆవిడను తీసుకువచ్చి నటింపజేశారట. ► ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి... పదహారు బళ్లు కట్టి..’ పాట చాలా పాపులర్. మొదట ఈ పాటను నర్సింగరావు మీద తీశారు. రషెష్ చూసుకున్న తర్వాత నా కంటే గద్దర్ మీద చిత్రీకరిస్తే బావుంటుంది అని సూచించారు నర్సింగరావు. ► మా భూమి చిత్రాన్ని మార్చి 23నే విడుదల చేయాలని దర్శక–నిర్మాతల ఆలోచన. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఉరి తీసింది మార్చి 23వ తేదీనే. ఆ రోజు విడుదల చేస్తే ఆ ముగ్గురికీ నివాళిలా ఉంటుందని భావించారట. ► సినిమా పూర్తయి సెన్సార్‌కి నిర్మాతల జేబులు ఖాళీ అయిపోతే సహ నిర్మాత రవీంద్రనాథ్ పెళ్లి ఉంగరాలను తాకట్టుపెట్టి వచ్చిన రూ.700లతో సెన్సార్ జరిపించారు. ► సహజత్వానికి దగ్గరగా ఉండాలని సాయి చంద్ పాత్రకు ఊర్లోని వారి బట్టలను అడిగి తీసుకుని కాస్ట్యూమ్స్‌గా కొన్ని రోజులు వాడారు. ► ఈ సినిమా మొత్తాన్ని మూడు షెడ్యూల్స్‌లో 50 రోజుల్లో పూర్తి చేశారు. ► షూటింగ్స్, సెన్సార్ వంటి అవరోధాలన్నీ దాటినప్పటికీ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి పంపిణీదారులెవ్వరూ ముందుకు రాలేదు. ఇదేదో రాజకీయ పాఠాలు చెబుతున్న సినిమాలా ఉందని కామెంట్ చేశారట. చివరికి లక్ష్మీ ఫిలింస్, శ్రీ తారకరామా ఫిలింస్ వారు ఈ సినిమాను విడుదల చేశారు. ► ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన రవీంద్రనాథ్, ఆయన భార్య సినిమా విడుదలైన మూడో రోజు సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లారు. కానీ వారికి కూడా టికెట్లు దొరకలేదట. ► ‘చిల్లర దేవుళ్లు’ తర్వాత సినిమా సంభాషణల్లో పూర్తి స్థాయి తెలంగాణ యాసను వాడిన సినిమా ఇదే. ► యూనిట్ దగ్గర ఉన్న కొత్త చీరలు, రుమాల్లు, పంచెలు గ్రామంలో వారికి ఇచ్చి వారి దగ్గర ఉన్న పాత బట్టలు తీసుకుని చిత్రీకరణ కోసం వినియోగించేవారట చిత్రబృందం. ► తొలుత ఈ సినిమాకు ‘జైత్రయాత్ర’ అనే టైటిల్‌ని పరిశీలించారట. భూమి కోసం పోరాటం జరుగుతుంది. ‘మన భూమి’ పెడితేనే బావుంటుందని నర్సింగరావు సూచించారట. ► సినిమాలో గడీను ముట్టడి చేసే సన్నివేశాల చిత్రీకరణకు ఆ గ్రామ ప్రజలు సహకరించలేదు. చివరికి వారి అనుమతి లేకుండానే చిత్రబృందం తయారు చేయించుకొని తెచ్చుకున్న తలుపును బద్దల కొట్టినట్టుగా షూట్ చేశారు. ► 1948లో హైదరాబాద్ రాష్ట్రంపై భారతప్రభుత్వం చేసిన సైనిక చర్యకు సంబంధించిన సన్నివేశాలనే సినిమాలో వినియోగించుకున్నారు. ∙పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల గాయాలకే రోజుకో ఐయోడిన్ సీసా ఖాళీ అయ్యేదట. ► చిత్రకారుడు తోట వైకుంఠం ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.. ఇదే తొలి సినిమా. ► దేవీప్రియ ఈ సినిమాకు పబ్లిసిటీ ఇన్చార్జ్గా పని చేశారు. ► ఈ సినిమాలోని ‘పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడా..’ పాటను సీనియర్ రచయిత సుద్దాల హనుమంతు రచించారు. ప్రస్తుతం ప్రముఖ గేయ రచయితగా కొనసాగుతున్న సుద్దాల అశోక్ తేజ ఆయన కుమారుడే. ► సినిమా చిత్రీకరిస్తున్న రోజుల్లో యూనిట్ మొత్తం మంగళ్ పర్తిలోనిæ బడిలో నివసించారు. ఆ పక్కనే ఉన్న బావి దగ్గర మగవాళ్లు స్నానాలు చేసేవారు. స్త్రీలేమో ఆ ఊర్లోని సంపన్న కుటుంబీకుల ఇంట్లోని స్నానాల గదులు వాడుకునేవారట. ► ఈ సినిమా నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. ► ఈ సినిమా నెగటివ్ పాడైపోవడంతో 2015 ప్రాంతంలో డిజిటలైజ్ చేసి డీవీడీ విడుదల చేశారు. ‘మాభూమి’ చిత్రంలో సాయిచంద్ సాయిచంద్, రమణి మాభూమి షూటింగ్ సందర్భంగా గద్దర్, దర్శకుడు గౌతమ్, బి.నరసింగరావు, నీలంబన ఘోష్ – గౌతమ్ మల్లాది -
మాభూమి హీరో ఎలా దొరికాడంటే
1979లో వచ్చిన క్లాసిక్ ‘మాభూమి’ కోసం ముందు ఒక ఊరి కథలో నటించిన నారాయణరావును అనుకున్నారు. ఆయన కార్లోవారి ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లి, అక్కడ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారు. వెంటనే ఇండియా రాలేని పరిస్థితి. ఆయన అన్నయిన నిర్మాత జి.రవీంద్రనాథే స్వయంగా హీరోను మార్చడానికి ఒప్పుకున్నారు. దాంతో ఆ పాత్ర త్రిపురనేని సాయిచంద్‌ని అక్షరాలా వరించింది. సాయిచంద్ ఆత్మకథ ‘కేరాఫ్’లోంచి ఆ ఘట్టం సంక్షిప్తంగా... రేపు షూటింగ్‌కు బయలుదేరాల్సిన సమయం. అంతా సిద్ధంగా వుండి హీరో లేడు. ఎవరికీ ఏమీ పాలుపోవడం లేదు. మనకు తెలిసినవాళ్లలో ఆ పాత్రకి సూటయ్యేవాళ్లు ఎవరున్నారా అని కొత్తకోణంలో ఆలోచన మొదలైంది. హైదరాబాద్‌లో ఒక్కొక్క ఏరియా తీసుకుని అందులో తెలిసినవారు ఎవరున్నారు? అని చర్చించుకుంటున్నారు. నారాయణగూడ ఏరియాకి వచ్చేటప్పటికి కొన్నిపేర్లు వస్తున్నాయి. ఆ సినిమాకి కవి దేవిప్రియ పబ్లిక్ రిలేషన్స్ చూస్తున్నారు. అకస్మాత్తుగా ‘సాయి’ అయితే ఎలా వుంటుంది? అన్నాడు. నేను అక్కవాళ్లింటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి యింటి తాళానికి ఒక చీటీ పెట్టివుంది. ‘ఒకసారి పంజాగుట్ట ఆఫీస్‌కి రా’ అని మోహన్ కోడా సంతకం వుంది. నన్ను ఎందుకు రమ్మంటున్నారో అర్థం కాలేదు. వెతుక్కుంటూ ఆఫీసుకు వెళ్లాను. ఆఫీసు పైభాగంలో ఉంది. మోహన్ కోడా ఎదురయి ఒక హాల్ అంత పెద్ద గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మొత్తం పరుపులు వేసి వున్నాయి. చాలామంది కూర్చుని వున్నారు. బి.నర్సింగరావు వచ్చి నన్ను లోపలికి రమ్మన్నాడు. అదో చిన్నగది. టేబుల్, కుర్చీ వేసి ఉన్నాయి. గౌతంఘోష్ నిలబడి వున్నాడు. ‘ఒకసారి చొక్కా విప్పు’ అని ఇంగ్లిష్‌లో అడిగాడు. నాకు అర్థం కాక నర్సింగరావు వైపు చూశాను. ‘తరువాత చెబుతాను కానీ, ఒకసారి చొక్కావిప్పు’ అన్నాడు. గౌతంఘోష్ కాసేపు నన్ను చూసి, నర్సింగరావుకు సైగచేసి అవతలి గదిలోకి వెళ్లాడు. కాసేపటికి యిద్దరూ వచ్చారు. కుర్చీలో కూర్చున్న నేను నిలబడ్డాను. ‘నువ్వే మా హీరోవి’ అన్నాడు గౌతంఘోష్. ఒక్కసారిగా క్రింద భూమి కదలిపోతున్నట్టుగా, నేను క్రింద లోయలో పడిపోతున్నట్లుగా... అస్సలేమీ అర్థం కాలేదు. నర్సింగరావు సినిమా గురించీ, హీరో మార్పిడి గురించీ చెప్పాడు. ‘నేను... నేను అంత గొప్ప పాత్ర చేయగలనా!’ అన్నాను. నా భుజం మీద చెయ్యి వేసి ‘నువ్వు చేస్తావని గట్టిగా నమ్ము. మేం చేయించుకుంటాం’ అన్నాడు నర్సింగరావు. అప్పటికి కొద్దిరోజుల ముందే నా 22వ పుట్టినరోజు జరిగింది. ఆ వయసున్న నేను సామాన్యుడు అసామాన్యుడిగా మారి, తెలంగాణ రైతాంగ పోరాటానికి నాయకుడు అయిన రామయ్య పాత్ర పోషించాలా! భయం, సందేహం, ఆశ్చర్యం, ఆనందం యిలా ఎన్నో భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే నెమ్మదిగా తలెత్తి వారిద్దరిని చూసి అంగీకారం తెలిపాను. వెంటనే గౌతంఘోష్ నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నెమ్మదిగా మొదట కూర్చున్న గదికి వచ్చాం. అక్కడ కూర్చున్న వాళ్లందరికీ మన ‘హీరో’ అని చెప్పాడు గౌతంఘోష్. ఆ మాట కోసమే అందరూ ఎదురుచూస్తున్నట్లుగా చప్పట్లు కొట్టారు. కేరాఫ్; త్రిపురనేని సాయిచంద్ పేజీలు: 256; వెల: 190; ప్రచురణ: కవిరాజు అకాడమీ. ఫోన్: 9347500041 -
రెవెన్యూ అంటే సేవ.. వసూళ్లు కాదు
♦ బాగా పనిచేస్తే అవార్డులిస్తాం.. ప్రజలను ఇబ్బంది పెడితే శిక్షిస్తాం ♦ ‘మా భూమి’ పోర్టల్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ అంటే ప్రజలకు సేవ చేయడమేనని, వారి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేయడం ఎంత మాత్రం కాదని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి మహమూద్ అలీ చెప్పారు. బుధవారం భూ పరిపాలన కార్యాలయంలో ‘మా భూమి’ ప్రజా పోర్టల్‌తో పాటు మరో మూడు రెవెన్యూ వెబ్సైట్లు... ‘లోన్ చార్జ్ మాడ్యూల్, రెక్టిఫికేషన్ మాడ్యూల్, సీసీఎల్ఏ’లను ఆయన ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... ‘జననం నుంచి మరణం వరకు ప్రజల జీవితంలో ఎన్నో అంశాలు రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉన్నాయి. ఎంతో కీలకమైన ఈ వ్యవస్థలో బాగా పనిచేసే వారికి అవార్డులిస్తాం. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని కఠినంగా శిక్షిస్తాం. ఆసరా, ఆహార భద్రత, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. తదితర ప్రభుత్వ పథకాలన్నీ రెవెన్యూ శాఖ సహకారంతోనే విజయవంతంగా అమలవుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానం మాదిరిగానే రెవెన్యూ సేవలన్నీ ప్రజలకు నిర్ధేశిత సమయంలో లభించేలా నూతన రెవెన్యూ విధానాన్ని త్వరలో తెస్తాం. ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన భూముల రీసర్వేను రెండేళ్లలో పూర్తి చేస్తాం. దీని కోసం సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న 2,500 సర్వేయర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆదేశాలిచ్చాం’ అన్నారు. ప్రతి వ్యక్తీ తన భూమి వివరాలను ఇంట్లో నుంచి తెలుసుకునేలా మా భూమి పోర్టల్, ఇతర వెబ్సైట్లు రూపొందించిన రెవెన్యూ, ఎన్ఆర్ఎస్ఏ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. సీసీఎల్ఎ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, సీసీఎల్ఏ కార్యదర్శి రవీంద్రబాబు, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ హోళీకేరి, డిప్యూటీ కలెక్టర్లు సత్యశారద, నిఖిల, రఘురామ్‌శర్మ, తహసీల్దార్ల సం ఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఆవిష్కరించిన వెబ్సైట్ల వివరాలివీ... మా భూమి ప్రజాపోర్టల్ రాష్ట్రంలోని ఏప్రాంతంలో ఉండే రైతయినా తన భూమికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో చూసుకునేందుకు అవకాశం కల్పి స్తూ.. కొత్తగా‘మా భూమి’ప్రజాపోర్టల్ను సీసీఎల్ఏ రూపొందించారు. ఈ పోర్టల్‌లో సర్వే, ఖాతా, ఆధార్ నంబర్లు, పట్టాదారు పేర ు తదితర వివరాలను ఎంటర్ చేస్తే రైతుకు కావల్సిన వ్యక్తిగత పహాణీ ప్రత్యక్షమవుతుంది. అలాగే ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) 1-బి, టిప్పన్ (సర్వే నంబరు కొలతలు) తదితర రికార్డులు డిజిటలైజ్డ్ కెడస్ట్రియల్ విలేజ్ మ్యాప్ (గ్రామ పట ం)లను కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. లోన్ చార్జ్ మాడ్యూల్ వ్యయ ప్రయాసలు లేకుండా రైతులు వ్యవసాయ రుణాలు పొందేలా లోన్ చార్జ్ మాడ్యూల్‌ను రూపొందించారు. రైతు లేదా కౌలు రైతు బ్యాంకుకు వెళ్లి తాను సాగు చేస్తున్న భూమి సర్వే నంబరును అధికారులకు చెబితే చాలు.. బ్యాంకు అధికారులు తమ వెబ్సైట్లో పరిశీలించి వెంటనే రుణం మంజూరు చేస్తారు. దీనికోసమని సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ డేటాబేస్‌ను బ్యాంకులకు లింక్ చేస్తున్నారు. సర్వే నంబరును ఎంటర్ చేస్తే సదరు భూమి సొంతదారు/హక్కుదారు/కౌలుదారు, సాగుచేస్తున్న పంట, భూమి విస్తీర్ణం, గతంలో వేరే ఏవైనా ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారా.. తదితర వివరాలన్నీ అందులోనే ప్రత్యక్షమవుతాయి. రెక్టిఫికేషన్ మాడ్యూల్ మా భూమి పోర్టల్‌లో తమ భూముల రికార్డులను చూసుకున్న యజమానులు వాటిలో (సర్వే నెంబర్లు, పట్టాదారు పేరు, విస్తీర్ణం తదితర వివరాలు) తప్పులున్నట్లు గమనిస్తే సరిచేసుకునేందుకు రెక్టిఫికేషన్ మాడ్యూల్‌ను రూపొందించారు. సీసీఎల్ఏ వెబ్సైట్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం వెబ్‌సైట్‌ను కొత్తగా రూపొందించారు. సీసీఎల్ఏ సమాచారంతో పాటు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, భూ భారతి, యూఎల్సీ విభాగాల సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. -
ఇది ప్రజల సినిమా
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన తెలుగు సినీ ఆణిముత్యం ‘మా భూమి’ అని పలువురు సినీ ప్రముఖులు, మేధావులు మరొక్కసారి గుర్తు చేసుకున్నారు. ‘మా భూమి’ చిత్రం విడుదలై (1980 మార్చి, 23) సోమవారంతో 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ చిత్రంలో పాల్గొన్న నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ఆదివారం హైదరాబాద్‌లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్రనిర్మాతల్లో ఒకరైన బి. నరసింగరావు మాట్లాడుతూ... ‘మా భూమి’ చిత్రనిర్మాణానికి ఆ రోజుల్లో తాము పడిన కష్టనష్టాలను, చిత్రప్రదర్శనకు రాజ్యవ్యవస్థ నుంచి ఎదురైన నిర్భంధాలను గుర్తు చేశారు. చాలా ఏళ్లుగా అందుబాటులో లేని ఈ చిత్రాన్ని పాతిక లక్షల రూపాయల ఖర్చుతో డిజిటలైజ్ చేశామనీ, అది మరో పది రోజుల్లో బ్లూ రే డీవీడీ రూపంలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ‘‘సమాజం కోసం 40 ఏళ్ల క్రితం ప్రజా కళాకారులుగా మేం చేసిన పనిని ఇప్పటి యువతరం అందుకుని బాధ్యతలు చేపట్టాలి. అందుకు మేము అన్ని విధాలా అండదండగా ఉంటాం’’ అని కూడా బి. నరసింగరావు చెప్పారు. ‘‘ఇది ప్రజల సినిమా. కేవలం ఆంధ్రా సినిమానో.. తెలంగాణా సినిమాని కాదు’’ అని చిత్రనిర్మాతల్లో మరొకరైన జి. రవీంద్రనాథ్ (అమెరికా) అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా భూమి’ చిత్రంలో నటించిన సాయిచంద్, సీనియర్ నటుడు కాకరాల, భూపాల్‌రెడ్డి. గాయని సంధ్య తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ రాజకీయ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. చిత్రబృందానికి జ్ఞాపికలు అందించడం విశేషం. సోమవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు మా టీవీలో ‘మా భూమి’ని ప్రసారం చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. సభానంతరం కిక్కిరిసిన జనాల మధ్య ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.