కాఫీ పండ్లను గ్రేడ్ చేస్తున్న రైతులు
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, నాణ్యమైన విత్తనాలను అందించడంలో తనదైన వ్యూహంతో ముందుకెళ్తోంది ‘మా భూమి’ ఎఫ్.పి.ఓ.!
2012–13లో గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో పది మంది రైతులు కలిసి ‘శ్రీ వెంకటేశ్వర రైతు క్లబ్’ను ఏర్పాటు చేసుకున్నారు. డి.పారినాయుడు నేతృత్వంలోని జట్టు ట్రస్టుతో పాటు నాబార్డు సహకారం తీసుకున్నారు. రూ.5 లక్షల యంత్ర సామాగ్రిని 90 శాతం రాయితీపై సమకూర్చుకొని విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
తర్వాత గరుగుబిల్లి మండలంలోని రైతు క్లబ్‌లన్నింటినీ ఏకం చేసి.. మా భూమి రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్‌పి.ఓ.ను) కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించారు. 4 మండలాలకు చెందిన 573 మంది రైతులు ఈ ఎఫ్.పి.ఓ.లో సభ్యులుగా, 15 మంది డైరెక్టర్లుగా వున్నారు.
ఆరేళ్ల క్రితం నుంచి ఎఫ్.పి.ఓ. ప్రకృతి వ్యవసాయ విధానం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, వేపపిండి, కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తోంది. వీటి రవాణాకు ఎస్‌బీఐ సీఎస్‌ఆర్ నిధులతో రూ.7 లక్షల వ్యాన్ సమకూరింది.
నూనె గానుగను రైతుసాధికార సంస్థ తోడ్పాటుతో ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల నుంచి దఫదఫాలుగా రూ. 70 లక్షల రుణాలు తీసుకొని వ్యాపారాభివృద్ధికి ఉపయోగించారు. 2016–17లో రూ.18 లక్షల వ్యాపారం ద్వారా రూ. 80 వేల నికర లాభం గడించిన ఎఫ్.పి.ఓ... 2020–21 నాటికి రూ.70.02 లక్షల వార్షిక టర్నోవర్‌తో రూ.46 వేల నికరాదాయం ఆర్జించటం విశేషం.
రైతుల్లో 90% చిన్న, సన్నకారు రైతులే. పెరుగుతున్న సాగు ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, దళారుల దగాలు, ప్రకృతి వైపరీత్యాలు.. ఇవీ ఈ బడుగు రైతుల సమస్యలు. ఈ సమస్యలను తట్టుకొని రైతులు నిలబడాలంటే.. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లటంతో పాటు తమ ఉత్పత్తులకు విలువను జోడించి, గిట్టుబాటు ధరలకు అమ్ముకోగలగటం ముఖ్యం.
బడుగు రైతులను ఈ దిశగా సమైక్యంగా నడిపించడంలో ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ రైతులకు చెందిన అటువంటి రెండు ఎఫ్.పి.ఓ.లు 2022–23కు సంబంధించి జాతీయ స్థాయి ‘జైవిక్ ఇండియా’ అవార్డుల్ని గెలుచుకోవటం విశేషం. ఈ నెల 23న ఆగ్రాలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. పాడేరు, పార్వతీపురం ప్రాంత రైతులకు విశేష సేవలందిస్తున్న ఈ రెండు ఎఫ్.పి.ఓ.ల విజయగాథలు రైతు లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
గిరిజన రైతులకు ఎఫ్‌పివో దన్ను!
కాఫీ, మిరియాలు, పసుపు కొనుగోళ్లతో రైతులకు మంచి ఆదాయం
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని ఎం. నిట్టాపుట్టు గ్రామం కేంద్రంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పివో) 2018లో ఏర్పాటైంది. 549 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 11 పంచాయతీలకు చెందిన 75 గ్రామాల్లోని 3,685 మంది గిరిజన రైతుల ద్వారా 9,575 ఎకరాల్లో ఈ ఎఫ్.పి.ఓ. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.
దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యంగా గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. గత మూడేళ్లుగా కాఫీ పండ్లు, పాచ్‌మెంట్, మిరియాలు, పసుపు ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. బ్యాంకుల సహకారంతో నిట్టాపుట్టు ఎఫ్‌పివో వ్యాపారంలో రాణిస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ఎఫ్‌పివోగా గుర్తింపు పొందింది.
కాఫీ, మిరియాలు, పసుపు తదితర ఉత్పత్తుల వ్యాపారం ద్వారా 2019–20లో రూ.29.9 లక్షలు, 2020–21లో రూ.1.91 కోట్ల టర్నోవర్ సాధించింది. కాఫీ పండ్లను కిలో రూ.50కు, మిరియాలను రూ.400–430కి, పసుపును రూ.65–80కు ఎఫ్.పి.ఓ. కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది.
సీజన్‌లో రోజుకు 35–45 మంది గిరిజనులకు పని కల్పిస్తూ రూ.350ల రోజు కూలీ చెల్లిస్తున్నారు. గిరిజన రైతులు రసాయనాలు వాడకుండా పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికెట్లు సాధించి గిట్టుబాటు ధర రాబట్టడంలో ఎం.నిట్టాపుట్టు ఎఫ్‌టీవో మంచి పేరు తెచ్చుకుంది.
– ఎన్.ఎం. కొండబాబు, సాక్షి, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా
∙మాభూమి ఎఫ్.పి.ఓ.లో విత్తనాల ప్రాసెసింగ్ యంత్రం
దళారులు లేకుండా నేరుగా వ్యాపారం
మాభూమి విత్తన కంపెనీ ద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నాం. ఆరోగ్యానికి మేలు చేసే వరి దేశీయ రకాలైన నవారా, కాలాభట్, రత్నచోడి, ఢిల్లీ బాస్మతి, చిట్టి ముత్యాలు, సుగంధ సాంబ విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించటం, దళారుల్లేకుండా నేరుగా వ్యాపారం నిర్వహించడం వంటి పనులు చేస్తున్నాం.
– తాడేన మన్మథనాయుడు (63649 93344), మాభూమి ఎఫ్‌ఏవో కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలం
ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం కృషి
మాభూమి ఎఫ్‌ఏవో ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం హైదరాబాద్‌లోని స్కంద ఆర్గానిక్–42 కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ కంపెనీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి సర్టిఫికేట్‌ను మంజూరు చేస్తారు. ఇంటర్నేషనల్æ కంట్రోల్ సిస్టమ్(ఐసీఎస్) సర్టిఫికెట్ ఉంటే రైతులు పండించిన ఉత్పత్తులను లాభాలున్న చోట ఎక్కడైనా విక్రయించుకొనేందుకు అవకాశం ఉంటుంది.
– ఎం. నూకం నాయుడు (94400 94384), సీఈవో, మాభూమి ఎఫ్‌పీవో, తోటపల్లి
తూకాలు, ధరల్లో మోసాలకు స్వస్తి
దళారుల తూకాలు, ధరల్లో మోసాలకు స్వస్తి చెప్పి తోటి గిరిజనులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఎఫ్‌పీవోను ప్రారంభించాం. కాఫీ, మిరియాలు, పసుపు మార్కెటింగ్ బాధ్యతలు చేపట్టి రైతులకు మంచి లాభాలు అందిస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో చిరుధాన్యాలను కూడా కొనుగోలు చేస్తాం. ప్రకృతి వ్యవసాయంపై అన్ని గ్రామాల్లోనూ విస్తృత ప్రచారం చేస్తున్నాం.
– పరదాని విజయ (63000 39552) , చైర్‌పర్సన్, ఎం.నిట్టాపుట్టు ఎఫ్‌టీవో, జి.మాడుగుల మం., అల్లూరి సీతారామరాజు జిల్లా
రెండేళ్లుగా ఎఫ్‌పీవోకే అమ్ముతున్నా...
ఎఫ్‌పీవో ద్వారా రెండేళ్లుగా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ ఏడాది కిలో రూ.50ల ధరతో 200 కిలోల కాఫీ పండ్లు, రూ.250ల ధరతో 500 కిలోల పాచ్‌మెంట్ కాఫీ గింజలను అమ్మాను. మిరియాలు కిలో రూ.460కి ఎఫ్‌పివో కొనుగోలు చేసింది.
– పరదాని లక్ష్మయ్య, నిట్టాపుట్టు గ్రామం, జి.మాడుగుల మం. ,ఏఎస్సార్ జిల్లా
– అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment