మాభూమి హీరో ఎలా దొరికాడంటే | Article On Maa Bhoomi Hero Sai Chand | Sakshi
Sakshi News home page

మాభూమి హీరో ఎలా దొరికాడంటే

Published Mon, Sep 9 2019 12:11 AM | Last Updated on Mon, Sep 9 2019 12:11 AM

Article On Maa Bhoomi Hero Sai Chand - Sakshi

1979లో వచ్చిన క్లాసిక్‌ ‘మాభూమి’ కోసం ముందు ఒక ఊరి కథలో నటించిన నారాయణరావును అనుకున్నారు. ఆయన కార్లోవారి ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లి, అక్కడ పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్నారు. వెంటనే ఇండియా రాలేని పరిస్థితి. ఆయన అన్నయిన నిర్మాత జి.రవీంద్రనాథే స్వయంగా హీరోను మార్చడానికి ఒప్పుకున్నారు. దాంతో ఆ పాత్ర త్రిపురనేని  సాయిచంద్‌ని అక్షరాలా వరించింది. సాయిచంద్‌ ఆత్మకథ ‘కేరాఫ్‌’లోంచి ఆ ఘట్టం సంక్షిప్తంగా... 

రేపు షూటింగ్‌కు బయలుదేరాల్సిన సమయం. అంతా సిద్ధంగా వుండి హీరో లేడు. ఎవరికీ ఏమీ పాలుపోవడం లేదు. మనకు తెలిసినవాళ్లలో ఆ పాత్రకి సూటయ్యేవాళ్లు ఎవరున్నారా అని కొత్తకోణంలో ఆలోచన మొదలైంది. హైదరాబాద్‌లో ఒక్కొక్క ఏరియా తీసుకుని అందులో తెలిసినవారు ఎవరున్నారు? అని చర్చించుకుంటున్నారు. నారాయణగూడ ఏరియాకి వచ్చేటప్పటికి కొన్నిపేర్లు వస్తున్నాయి. ఆ సినిమాకి కవి దేవిప్రియ పబ్లిక్‌ రిలేషన్స్‌ చూస్తున్నారు. అకస్మాత్తుగా ‘సాయి’ అయితే ఎలా వుంటుంది? అన్నాడు.

నేను అక్కవాళ్లింటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి యింటి తాళానికి ఒక చీటీ పెట్టివుంది. ‘ఒకసారి పంజాగుట్ట ఆఫీస్‌కి రా’ అని మోహన్‌ కోడా సంతకం వుంది. నన్ను ఎందుకు రమ్మంటున్నారో అర్థం కాలేదు.

వెతుక్కుంటూ ఆఫీసుకు వెళ్లాను. ఆఫీసు పైభాగంలో ఉంది. మోహన్‌ కోడా ఎదురయి ఒక హాల్‌ అంత పెద్ద గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మొత్తం పరుపులు వేసి వున్నాయి. చాలామంది కూర్చుని వున్నారు.

బి.నర్సింగరావు వచ్చి నన్ను లోపలికి రమ్మన్నాడు. అదో చిన్నగది. టేబుల్, కుర్చీ వేసి ఉన్నాయి. గౌతంఘోష్‌ నిలబడి వున్నాడు. ‘ఒకసారి చొక్కా విప్పు’ అని ఇంగ్లిష్‌లో అడిగాడు. నాకు అర్థం కాక నర్సింగరావు వైపు చూశాను. ‘తరువాత చెబుతాను కానీ, ఒకసారి చొక్కావిప్పు’ అన్నాడు. గౌతంఘోష్‌ కాసేపు నన్ను చూసి, నర్సింగరావుకు సైగచేసి అవతలి గదిలోకి వెళ్లాడు. కాసేపటికి యిద్దరూ వచ్చారు. కుర్చీలో కూర్చున్న నేను నిలబడ్డాను. ‘నువ్వే మా హీరోవి’ అన్నాడు గౌతంఘోష్‌. ఒక్కసారిగా క్రింద భూమి కదలిపోతున్నట్టుగా, నేను క్రింద లోయలో పడిపోతున్నట్లుగా... అస్సలేమీ అర్థం కాలేదు. నర్సింగరావు సినిమా గురించీ, హీరో మార్పిడి గురించీ చెప్పాడు. ‘నేను... నేను అంత గొప్ప పాత్ర చేయగలనా!’ అన్నాను. నా భుజం మీద చెయ్యి వేసి ‘నువ్వు చేస్తావని గట్టిగా నమ్ము. మేం చేయించుకుంటాం’ అన్నాడు నర్సింగరావు.

అప్పటికి కొద్దిరోజుల ముందే నా 22వ పుట్టినరోజు జరిగింది. ఆ వయసున్న నేను సామాన్యుడు అసామాన్యుడిగా మారి, తెలంగాణ రైతాంగ పోరాటానికి నాయకుడు అయిన రామయ్య పాత్ర పోషించాలా! భయం, సందేహం, ఆశ్చర్యం, ఆనందం యిలా ఎన్నో భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే నెమ్మదిగా తలెత్తి వారిద్దరిని చూసి అంగీకారం తెలిపాను. వెంటనే గౌతంఘోష్‌ నన్ను గట్టిగా హత్తుకున్నాడు.
నెమ్మదిగా మొదట కూర్చున్న గదికి వచ్చాం. అక్కడ కూర్చున్న వాళ్లందరికీ మన ‘హీరో’ అని చెప్పాడు గౌతంఘోష్‌. ఆ మాట కోసమే అందరూ ఎదురుచూస్తున్నట్లుగా చప్పట్లు కొట్టారు.


కేరాఫ్‌; 
త్రిపురనేని సాయిచంద్‌
పేజీలు: 256; వెల: 190; 
ప్రచురణ: కవిరాజు అకాడమీ. ఫోన్‌: 9347500041

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement