Tripuraneni Saichand
-
మాభూమి హీరో ఎలా దొరికాడంటే
1979లో వచ్చిన క్లాసిక్ ‘మాభూమి’ కోసం ముందు ఒక ఊరి కథలో నటించిన నారాయణరావును అనుకున్నారు. ఆయన కార్లోవారి ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లి, అక్కడ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారు. వెంటనే ఇండియా రాలేని పరిస్థితి. ఆయన అన్నయిన నిర్మాత జి.రవీంద్రనాథే స్వయంగా హీరోను మార్చడానికి ఒప్పుకున్నారు. దాంతో ఆ పాత్ర త్రిపురనేని సాయిచంద్‌ని అక్షరాలా వరించింది. సాయిచంద్ ఆత్మకథ ‘కేరాఫ్’లోంచి ఆ ఘట్టం సంక్షిప్తంగా... రేపు షూటింగ్‌కు బయలుదేరాల్సిన సమయం. అంతా సిద్ధంగా వుండి హీరో లేడు. ఎవరికీ ఏమీ పాలుపోవడం లేదు. మనకు తెలిసినవాళ్లలో ఆ పాత్రకి సూటయ్యేవాళ్లు ఎవరున్నారా అని కొత్తకోణంలో ఆలోచన మొదలైంది. హైదరాబాద్‌లో ఒక్కొక్క ఏరియా తీసుకుని అందులో తెలిసినవారు ఎవరున్నారు? అని చర్చించుకుంటున్నారు. నారాయణగూడ ఏరియాకి వచ్చేటప్పటికి కొన్నిపేర్లు వస్తున్నాయి. ఆ సినిమాకి కవి దేవిప్రియ పబ్లిక్ రిలేషన్స్ చూస్తున్నారు. అకస్మాత్తుగా ‘సాయి’ అయితే ఎలా వుంటుంది? అన్నాడు. నేను అక్కవాళ్లింటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి యింటి తాళానికి ఒక చీటీ పెట్టివుంది. ‘ఒకసారి పంజాగుట్ట ఆఫీస్‌కి రా’ అని మోహన్ కోడా సంతకం వుంది. నన్ను ఎందుకు రమ్మంటున్నారో అర్థం కాలేదు. వెతుక్కుంటూ ఆఫీసుకు వెళ్లాను. ఆఫీసు పైభాగంలో ఉంది. మోహన్ కోడా ఎదురయి ఒక హాల్ అంత పెద్ద గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మొత్తం పరుపులు వేసి వున్నాయి. చాలామంది కూర్చుని వున్నారు. బి.నర్సింగరావు వచ్చి నన్ను లోపలికి రమ్మన్నాడు. అదో చిన్నగది. టేబుల్, కుర్చీ వేసి ఉన్నాయి. గౌతంఘోష్ నిలబడి వున్నాడు. ‘ఒకసారి చొక్కా విప్పు’ అని ఇంగ్లిష్‌లో అడిగాడు. నాకు అర్థం కాక నర్సింగరావు వైపు చూశాను. ‘తరువాత చెబుతాను కానీ, ఒకసారి చొక్కావిప్పు’ అన్నాడు. గౌతంఘోష్ కాసేపు నన్ను చూసి, నర్సింగరావుకు సైగచేసి అవతలి గదిలోకి వెళ్లాడు. కాసేపటికి యిద్దరూ వచ్చారు. కుర్చీలో కూర్చున్న నేను నిలబడ్డాను. ‘నువ్వే మా హీరోవి’ అన్నాడు గౌతంఘోష్. ఒక్కసారిగా క్రింద భూమి కదలిపోతున్నట్టుగా, నేను క్రింద లోయలో పడిపోతున్నట్లుగా... అస్సలేమీ అర్థం కాలేదు. నర్సింగరావు సినిమా గురించీ, హీరో మార్పిడి గురించీ చెప్పాడు. ‘నేను... నేను అంత గొప్ప పాత్ర చేయగలనా!’ అన్నాను. నా భుజం మీద చెయ్యి వేసి ‘నువ్వు చేస్తావని గట్టిగా నమ్ము. మేం చేయించుకుంటాం’ అన్నాడు నర్సింగరావు. అప్పటికి కొద్దిరోజుల ముందే నా 22వ పుట్టినరోజు జరిగింది. ఆ వయసున్న నేను సామాన్యుడు అసామాన్యుడిగా మారి, తెలంగాణ రైతాంగ పోరాటానికి నాయకుడు అయిన రామయ్య పాత్ర పోషించాలా! భయం, సందేహం, ఆశ్చర్యం, ఆనందం యిలా ఎన్నో భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే నెమ్మదిగా తలెత్తి వారిద్దరిని చూసి అంగీకారం తెలిపాను. వెంటనే గౌతంఘోష్ నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నెమ్మదిగా మొదట కూర్చున్న గదికి వచ్చాం. అక్కడ కూర్చున్న వాళ్లందరికీ మన ‘హీరో’ అని చెప్పాడు గౌతంఘోష్. ఆ మాట కోసమే అందరూ ఎదురుచూస్తున్నట్లుగా చప్పట్లు కొట్టారు. కేరాఫ్; త్రిపురనేని సాయిచంద్ పేజీలు: 256; వెల: 190; ప్రచురణ: కవిరాజు అకాడమీ. ఫోన్: 9347500041 -
ప్రశ్నకు పట్టం కట్టిన కవి
ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో కవిరాజు రాసిన ‘వీరగంధము తెచ్చినారము.. వీరుడెవ్వడు తెల్పుడీ’ పద్యం జాతికి మేలు కొలుపు. కవిరాజు ఎంత జాతీయవాదో అంత తెలుగుజాతి అభిమాని కూడా. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం అనేక గేయాలు రాశారు. సరిగ్గా వందేళ్ల క్రితం– బారిస్టర్ చదువు పూర్తి చేసుకున్న ఒక మహానుభావుడు నవంబర్ 12, 1917న తెలుగు నేలపై అడుగుపెట్టారు. రష్యాలో అక్టోబర్ విప్లవం విజయవంతమైన నెల తర్వాత, విప్లవ ప్రారంభ సూచకంగా ఇక్కడ ఆయన అడుగుపెట్టినప్పుడు లభించిన స్వాగతం మాటలకందనిది. బెజవాడ నుంచి నూజెళ్ల రైల్వే స్టేషన్ దాకా, అక్కడి నుంచి ఆయన స్వగ్రామం అంగలూరు వరకు విజయధ్వజ సహస్రముల్లాగా రోడ్డుకి అటూ ఇటూ అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజానీకం బారులు తీర్చి నిలబడి నినాదాలు చేశారు. అంతటి ఘన స్వాగతం అందుకున్న ఆ మహనీయుడే–తెలుగుజాతికి ‘ఎందుకు?’ అన్న ప్రశ్నను నేర్పిన భావ విప్లవ ప్రదాత త్రిపురనేని రామస్వామి. మా తాతగారు రామస్వామి జనవరి 15, 1887న జన్మించారు. తర్వాతకాలంలో ఆయన పెను సంచలనమయ్యారు. బాల్యం నుంచే హేతువాది. మూఢ విశ్వాసాలపై తిరగబడేవాడు. ఒకరోజు పళ్లుతోముకోవడానికి వేపపుల్ల కోసం వెళితే, ఆ చెట్టుకు దిగ్గొట్టిన ఓ మేకు, దానికి చుట్టి ఉన్న వెంట్రుకలు కనిపించాయి. చెట్టు మొదలులో డబ్బులు, నిమ్మకాయలు, వేపబెత్తం. అవి చేతబడి సామగ్రి. ఆ డబ్బులతో చిరుతిండి కొనుక్కుని, వేపబెత్తంతో గాడిదలను అదిలిస్తూ వస్తున్న ఆ బాలుడిని చూసి ఊరంతా విస్తుపోయింది. చాలాకాలం ఆ బెత్తాన్ని తన దగ్గరే ఉంచుకుని ఊరివాళ్ల మూఢ విశ్వాసాలను చెల్లాచెదురు చేసిన ఆ బాలుడి వయసు అప్పటికి ఆరేళ్లు. మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీ యుడు వర్ణవివక్షతో రైలు బోగీనుంచి నెట్టివేసిన సంఘటన లాంటిదే రామస్వామి బాల్యంలో జరి గింది. తన విద్యాభ్యాసం రోజుల్లో ఒకరోజు మిఠాయిలు కొనుక్కుంటుంటే, ఒక అగ్రకుల సహ విద్యార్థి తనకూ కొనిపెట్టమని అడిగాడు. సరేనని రెండు పొట్లాలు తీసుకోబోతుంటే ఆ స్నేహితుడు ‘ఆగాగు.. ఆ పొట్లం నువ్వు తాకకూడదు రామస్వామీ’ అని ఒక పొట్లం తానే తీసుకున్నాడు. వెంటనే ప్రశ్న –ఎందుకు తాకకూడదు? నేనే కదా డబ్బులిచ్చింది? జీవితంలో ప్రశ్నల పరంపరకు దోహదం చేసిన ప్రశ్న. ఉదయాన్నే స్నానం చేసే ఆ బాలుడి అలవాటుని, ‘ఏమిటీ, నీకు ప్రాతఃస్నానమా? ప్రాతః స్నానమూ, దైవధ్యానమూ అగ్రకులానికేనోయ్!’ అని అగ్రకుల గురువు చులకన చేశాడు. ప్రకృతి సౌకర్యాలు అందరికీ భోగ్యాలు కావా? అంద రికీ సమానం కాదా? ఆధిక్యమూ, అల్పత్వమూ ఏమిటి అని మళ్లీ ‘ప్రశ్న’. ఆ ప్రశ్నే రామస్వామిని ‘మనీషి’ని చేసింది. తాత హిందూ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అక్కడే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (తిరుపతివేంకట కవులలో ఒకరు) దగ్గర శిష్యరికం. కాలేజీ విద్య బందరు నోబెల్ కళాశాలలో జరిగింది. 1907లో వందేమాతరం నినాదం బందరును తాకింది. ఆ సమయంలో రామస్వామిలోని కవి సాక్షీమాత్రుడిగా ఉండగలడా? కలం చేపట్టి నిప్పులు కురిపిం చారు. దాని ఫలితమే కారెంపూడి కథనం. ‘కొండవీటి పతనం’, ‘రాణా ప్రతాప్’ వంటి నాటకాలు నిషేధం పాలయ్యాయి. పిన్నవయసులోనే రామస్వామి సాధించిన ఘనవిజయమిది. 1910లో మా తండ్రి గోపీచంద్ పుట్టారు. దాదాపు ఆ సమయంలోనే తాత రాసిన ‘కురుక్షేత్ర సంగ్రామం’ నాటకం వెలువడింది. తాత విమర్శనాదృష్టికి, హేతువాద ఆలోచనా ధోరణికి మచ్చుతునక. 1911వ సంవత్సరంలో అష్టావధానం, 1912లో శతావధానం చేశారు. తాత శాకాహారి. ఐర్లండ్‌లో మూడేళ్లపాటు ఎంత కష్టమైనా దోసకాయ, టమాట లాంటి శాకాహారాన్నే తీసుకునేవారు. మొదట ట్రినిటీ కాలేజీలో చేరారు. విదేశంలోను తెలుగువాడిలాగే పంచె, లాల్చీ, తలకట్టుతోనే ఉండేవారు, క్లాసుకు వెళ్లేవారు. ట్రినిటీ ప్రొఫెసర్ అందుకు అభ్యంతరం చెబితే ఆ కాలేజీకి స్వస్తి చెప్పి ఇంటర్నల్ టెంపుల్ లా కాలేజీలో చేరారు. బారిస్టర్ అయ్యాక 1917లో భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. సొంతగడ్డపై కాలుమోపే వేళకి స్వాతంత్యోద్యమం ఊపులో ఉంది. అప్పటికే ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు!’ అని బాలగంగాధర్ తిలక్ గర్జించాడు. అనీబిసెంట్ హోంరూల్ నినాదం దేశమంతటా ప్రతిధ్వనించింది. తాత జస్టిస్ పార్టీకి చెందినా ఇలాంటి కార్యక్రమాల్లో జాతీయ కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేవారు. ఆయన భారత్‌కు వచ్చిన సంవత్సరమే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడి, బెజవాడలో సమావేశాలు జరి పింది. వాటికి రామస్వామి అధ్యక్షులు. విదేశం నుంచి తిరిగివచ్చిన తర్వాత రామస్వామి చేసిన మొదటి రచన ‘శంభుక వధ’. దీనితో తెలుగుజాతి ఉలిక్కిపడింది. కాదు కాదు.. మేల్కొంది. తెలుగులో మొదటిసారి సాంస్కృతిక విప్లవానికి నాంది పలి కింది. ఎందుకు? అని ప్రశ్నించడం నేర్పింది. 1922లో నాటి రైతు నాయకుడు ఎన్.జి. రంగా రైతు పత్రిక సంపాదకులుగా తాతగారిని తెనాలికి ఆహ్వానించారు. తెనాలిలో ఆయన నివాసం పేరు మొదట ‘శంభుకాశ్రమం’. అదే తర్వాత ‘సూతాశ్రమం’. తెనాలి మున్సిపల్ చైర్మన్‌గా మూడుసార్లు చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. శంభుక వధ తర్వాత ఆయనకు శాశ్వత కీర్తి తెచ్చిపెట్టిన సంచలన కావ్యం ‘సూత పురాణము’. ఈ మహాకావ్యమే రామస్వామి గారిని ‘కవిరాజు’ మకుటంతో అలంకరించింది. కవిరాజు చేసిన మరో గొప్ప ప్రయోగం వివాహవిధి. వధూవరులకు అర్థం కాని సంస్కృత మంత్రాలతో జరిపే పెళ్లి కాకుండా అందరికీ అర్థం అయ్యే విధంగా తెలుగు పెళ్లి జరిపించడం ఉద్యమంలాగా మొదలైంది. ఆ దశలో రాసిందే ‘కుప్పుస్వామి శతకము’. 1930లో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో కవిరాజు రాసిన ‘వీరగంధము తెచ్చినారము.. వీరుడెవ్వడు తెల్పుడీ’ పద్యం జాతికి మేలు కొలుపు. కవిరాజు ఎంత జాతీయవాదో అంత తెలుగుజాతి అభిమాని కూడా. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం అనేక గేయాలు రాశారు. ‘ఖూనీ’ నాటకంలో ‘పగవారు మనపైకి వచ్చినప్పుడు’ గేయం ఎంతో కీర్తి ప్రతి ష్టలు తెచ్చిపెట్టింది. భారత–చైనా యుద్ధకాలంలో కూడా ఊరూవాడా మారుమోగింది. ‘కుప్పుస్వామి శతకము’ తర్వాత అంతకు మించిన మరో శతకం ‘ధూర్తమానవా!’ ఇది పూర్తిగా వ్యంగ్యపూరితం. కవిరాజు కలం నుంచి జాలువారిన చిట్టిచివరి కళాఖండం భగవద్గీత. పల్నాటి పౌరుషం ఇతి వృత్తంగా ఆవిర్భవించింది. ఆయన అభిమానులు 1942 నవంబర్ 25, 26 తేదీల్లో గుడివాడలో గజారోహణం చేయించారు. అవి క్విట్ ఇండియా ఉద్యమరోజులు. తెనాలిలో జరిగిన కాల్పులకు నిరసనగా ఏర్పాటు చేసిన సభలో కవిరాజు ఉపన్యసించారు. మరుసటి రోజు అంటే 1943 జనవరి 1న ఆయనకు జ్వరం మొదలైంది. అలాంటి సమయంలో ఒక పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహించారు. ఆ ప్రయాణం ఆయన్ని మరింత దెబ్బతీసింది. కవిరాజు మృత్యువుతో పది హేను రోజులుపోరాడి 1943 జనవరి 16న కన్నుమూశారు. ‘విధి ప్రాణికోటిని పీల్చేస్తుంది. ఒకే ఒక్కడు దాన్నే సముద్రంలో పడేస్తాడు’ అని డబ్లు్యహెచ్ ఆడెన్ అన్న మాటలు కవిరాజు విషయంలో అక్షరసత్యం. (కవిరాజు ఐర్లండ్ నుంచి బారిస్టర్‌గా తిరిగివచ్చి రేపటికి నూరేళ్లు) - సాయిచంద్ వ్యాసకర్త సినీనటులు, కవిరాజు మనవడు‘ 93475 00041 -
వెండితెర ‘బంగారాలు’
‘ఈ పని నాన్నగారు చనిపోవడానికి ఐదేళ్ల క్రితమే మేము చేయాల్సింది. అన్నీ ఉన్నా రికార్డ్ చేయలేకపోయాం!’ అన్నారు ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్. త్రిపురనేని సాయిచంద్ 20 ఏళ్ల క్రితం తాను రూపొందించిన 25 డాక్యుమెంటరీ చిత్రాలను వందేళ్ల భారతీయ-తెలుగు సినిమా ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించాలని సంకల్పించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దివంగత ఎల్.వి. ప్రసాద్‌పై రూపొందించిన చిత్రంతో మొన్న ఆదివారం లామకాన్ (హైదరాబాద్)లో ఈ ప్రదర్శనలను ప్రారంభించారు. తండ్రిపై సాయిచంద్ రూపొందించిన డాక్యుమెంటరీని చూసి, ప్రపంచస్థాయి సినీ ఎక్విప్మెంట్, థియేటర్స్ అధినేత, ఎల్.వి.ప్రసాద్ కుమారుడు అయిన రమేష్ ప్రసాద్ పైవ్యాఖ్యను చేశారు. సాయిచంద్‌ను మనస్పూర్తిగా అభినందించారు. ఈ నేపథ్యంలో సాయిచంద్‌తో జరిపిన ఇంటర్వ్యూ సారాంశం, ఆయన మాటల్లోనే... గౌతమ్ ప్రేరణ-ఇంటి వాతావరణం అనుకూలత తెలుగు సినిమాలో తొలి తరానికి చెందిన కుటుంబ వారసత్వం నాకు సంక్రమించింది. 1939లో విడుదలైన ‘రైతుబిడ్డ’ సినిమాకు నాన్నగారు త్రిపురనేని గోపీచంద్ సంభాషణల రచయిత. సాహితీపరులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఎప్పుడూ ఇంటికి వచ్చేవారు. ఆ వాతావరణం నుంచి అనుకోకుండా గౌతమ్‌ఘోష్ దర్శకత్వం వహించిన ‘మాభూమి’ ద్వారా సినీనటుడినయ్యా. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, సత్యజిత్‌రాయ్ వంటి ప్రముఖులపై గౌతమ్ డాక్యుమెంటరీలు తీశారు. అతని స్ఫూర్తితో తెలుగు ప్రముఖులపై డాక్యుమెంటరీలు తీయాలనే అభిప్రాయం ఏర్పడింది. సిమీగెర్వాల్ రాజ్‌కపూర్‌పై తీసిన డాక్యుమెంటరీ ఉత్తేజితం చేసింది. మనం, మనవాళ్ల మీద ఎందుకు డాక్యుమెంటరీలు తీయకూడదు? అనిపించింది. ఎవరెవరిపై డాక్యుమెంటరీలు తీయాలి? ఒక జాబితాను రూపొందించుకున్నాను. 1989 నుంచి 1991 వరకూ డాక్యుమెంటరీలు తీశాను. డాక్యుమెంటరీల క్రమం ఎల్.వి.ప్రసాద్, బి.నాగిరెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఎ.ఎస్.ప్రకాశరావు, సి.ఎస్.రావు, విఠలాచార్య, మార్కస్ బార్ట్లే, రెహమాన్ , బాపు, రమణ, సినారె, ఆరుద్ర, వేటూరి సుందరరామమూర్తి, జిక్కి, సంజీవి (ఎడిటర్), సూర్యకాంతం, సుసర్ల దక్షిణామూర్తి, కె.వి.మహదేవన్, తరణి (కళ), జెమిని కోటేశ్వరరావు వంటి వివిధ రంగాల సినీ ప్రముఖులపై తీసిన డాక్యుమెంటరీలు ప్రతి ఆదివారం సాయంత్రం లామకాన్‌లో ప్రదర్శిస్తున్నాం. బంగారం పాతదైనా కొత్త అవసరాలకు పనికొస్తుంది మన సినిమాల్లో వాణిజ్య చిత్రాలు, కళాత్మక చిత్రాలు అనే రెండు పాయలున్నాయి. తొలితరం చిత్రాలు వాణిజ్య చిత్రాలే అయినప్పటికీ సామాజిక బాధ్యతకు, కళలకు, సాహిత్యానికి పెద్దపీట వేశాయి. వినోదాన్ని విస్మరించకుండా ఆరోగ్యకరమైన అనుభూతులను పంచాయి. ఆ చిత్రాల రూపకర్తలను, వారి చిత్రాలలోని ఎంపిక చేసిన భాగాలను ఈ డాక్యుమెంటరీల ద్వారా చూడడం వలన ఆనాటి కట్టూ, బొట్టూ, భాష, ఆహార్యం, సాహిత్యం... తదితర అంశాలు పునశ్చరణ చేసుకునే వీలుంటుందని భావిస్తున్నాను. బంగారం పాతదయినా కొత్తతరానికీ ఎప్పుడంటే అప్పుడు ఉపయోగపడుతుంది కదా! ప్రేక్షకులకు ఇవి మంచి ఫ్లాష్‌బాక్‌లు. డాక్యుమెంటరీలన్నిటినీ ఒక డీవీడీగా, పుస్తకంగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. మార్కస్‌బార్‌ట్లే రియల్ జెంటిల్‌మ్యాన్! డాక్యుమెంటరీలు తీసే క్రమంలో కొన్ని ముచ్చట్లున్నాయి. మూకీల్లో టాకీల్లో పనిచేసిన ఎల్.వి.ప్రసాద్ దగ్గరికి కెమెరాతో వెళ్లగానే ‘రా డెరైక్టరూ’ అని ఉబ్బించేవారు. బహుశా వాస్తురీత్యానేమో విజయాప్రొడక్షన్స్ అధినేత బి.నాగిరెడ్డి స్టూడియోలో నిరంతరం కొన్ని గోడలను, గదులను కూల్చివేయించేవారు. కొత్తగా కట్టించడం, మళ్లీ కూల్చివేయించడం బహుశా ఆయనకు హాబీ. ఆయన వింతైన అలవాటు కారణంగా కెమెరాతో నేనూ ఆయన వెంట తిరుగుతూ మాట్లాడాల్సి వచ్చేది. సూర్యకాంతం గారు ఎంత హాయైన మనిషో! తాను షూటింగులకు వెళ్లినపుడల్లా సెట్‌పై ఉండే వారందరికీ చక్కటి భోజన పదార్ధాలు తీసుకువెళ్లేవారట. ఆ విషయాలు గుర్తుచేస్తూ కడుపునూ మనస్సునూ నింపేవారు. సూర్యకాంతం నటించేవారు కాదు. సాటిలేని సహజనటి! అంజలిగారు నిండుగా, అందంగా అలంకరించుకోవడంలో సాటి. ‘మామ’ పాటలు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. కె.వి.మహదేవన్ ఆరోగ్యం సహకరించకపోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆయనపై కొంతసేపైనా డాక్యుమెంటరీ చేయగలిగాను. అందరిలోకి ప్రత్యేకమైన వ్యక్తి మార్కస్‌బార్‌ట్లే. ప్రతి పలుకులో, కదలికలో హుందాతనం తొణికిసలాడుతుంది. రియల్ జంటిల్మాన్. బార్ట్లే ఇంటర్వ్యూకు వి.ఎస్.ఆర్.స్వామి సహకరించారు. సెల్ కెమెరాతో ‘డాక్యుమెంటేషన్’ చేసినా సక్సెస్ అయినట్లే! నా డాక్యుమెంటరీల సారాంశం ఒక్కటే. నిన్నే నేడు. నేడే రేపు. నేడు మన మధ్య మిగిలిన వారిని మరచిపోతే రేపు లేదు. సినిమా రంగానికి చెందినవారనే కాదు, వివిధ రంగాల ప్రముఖులు ఎందరో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఉంటారు. ఆయా ప్రాంతాల యువకులు తమకు అందుబాటులో ఉన్న కెమెరాల ద్వారానైనా వారి రూపాన్ని, మాటను, హితవును రికార్డు చేస్తే నా శ్రమ ఫలించినట్లే! - పున్నా కృష్ణమూర్తి ఫొటో: అనిల్