వెండితెర ‘బంగారాలు’
‘ఈ పని నాన్నగారు చనిపోవడానికి ఐదేళ్ల క్రితమే మేము చేయాల్సింది. అన్నీ ఉన్నా రికార్డ్ చేయలేకపోయాం!’ అన్నారు ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్. త్రిపురనేని సాయిచంద్ 20 ఏళ్ల క్రితం తాను రూపొందించిన 25 డాక్యుమెంటరీ చిత్రాలను వందేళ్ల భారతీయ-తెలుగు సినిమా ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించాలని సంకల్పించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దివంగత ఎల్.వి. ప్రసాద్‌పై రూపొందించిన చిత్రంతో మొన్న ఆదివారం లామకాన్ (హైదరాబాద్)లో ఈ ప్రదర్శనలను ప్రారంభించారు. తండ్రిపై సాయిచంద్ రూపొందించిన డాక్యుమెంటరీని చూసి, ప్రపంచస్థాయి సినీ ఎక్విప్‌మెంట్, థియేటర్స్ అధినేత, ఎల్.వి.ప్రసాద్ కుమారుడు అయిన రమేష్ ప్రసాద్ పైవ్యాఖ్యను చేశారు. సాయిచంద్‌ను మనస్పూర్తిగా అభినందించారు. ఈ నేపథ్యంలో సాయిచంద్‌తో జరిపిన ఇంటర్వ్యూ సారాంశం, ఆయన మాటల్లోనే...
గౌతమ్ ప్రేరణ-ఇంటి వాతావరణం అనుకూలత
తెలుగు సినిమాలో తొలి తరానికి చెందిన కుటుంబ వారసత్వం నాకు సంక్రమించింది. 1939లో విడుదలైన ‘రైతుబిడ్డ’ సినిమాకు నాన్నగారు త్రిపురనేని గోపీచంద్ సంభాషణల రచయిత. సాహితీపరులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఎప్పుడూ ఇంటికి వచ్చేవారు. ఆ వాతావరణం నుంచి అనుకోకుండా గౌతమ్‌ఘోష్ దర్శకత్వం వహించిన ‘మాభూమి’ ద్వారా సినీనటుడినయ్యా. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, సత్యజిత్‌రాయ్ వంటి ప్రముఖులపై గౌతమ్ డాక్యుమెంటరీలు తీశారు. అతని స్ఫూర్తితో తెలుగు ప్రముఖులపై డాక్యుమెంటరీలు తీయాలనే అభిప్రాయం ఏర్పడింది. సిమీగెర్వాల్ రాజ్‌కపూర్‌పై తీసిన డాక్యుమెంటరీ ఉత్తేజితం చేసింది. మనం, మనవాళ్ల మీద ఎందుకు డాక్యుమెంటరీలు తీయకూడదు? అనిపించింది. ఎవరెవరిపై డాక్యుమెంటరీలు తీయాలి? ఒక జాబితాను రూపొందించుకున్నాను. 1989 నుంచి 1991 వరకూ డాక్యుమెంటరీలు తీశాను.
డాక్యుమెంటరీల క్రమం
ఎల్.వి.ప్రసాద్, బి.నాగిరెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఎ.ఎస్.ప్రకాశరావు, సి.ఎస్.రావు, విఠలాచార్య, మార్కస్ బార్‌ట్లే, రెహమాన్ , బాపు, రమణ, సినారె, ఆరుద్ర, వేటూరి సుందరరామమూర్తి, జిక్కి, సంజీవి (ఎడిటర్), సూర్యకాంతం, సుసర్ల దక్షిణామూర్తి, కె.వి.మహదేవన్, తరణి (కళ), జెమిని కోటేశ్వరరావు వంటి వివిధ రంగాల సినీ ప్రముఖులపై తీసిన డాక్యుమెంటరీలు ప్రతి ఆదివారం సాయంత్రం లామకాన్‌లో ప్రదర్శిస్తున్నాం.
బంగారం పాతదైనా కొత్త అవసరాలకు పనికొస్తుంది
మన సినిమాల్లో వాణిజ్య చిత్రాలు, కళాత్మక చిత్రాలు అనే రెండు పాయలున్నాయి. తొలితరం చిత్రాలు వాణిజ్య చిత్రాలే అయినప్పటికీ సామాజిక బాధ్యతకు, కళలకు, సాహిత్యానికి పెద్దపీట వేశాయి. వినోదాన్ని విస్మరించకుండా ఆరోగ్యకరమైన అనుభూతులను పంచాయి. ఆ చిత్రాల రూపకర్తలను, వారి చిత్రాలలోని ఎంపిక చేసిన భాగాలను ఈ డాక్యుమెంటరీల ద్వారా చూడడం వలన ఆనాటి కట్టూ, బొట్టూ, భాష, ఆహార్యం, సాహిత్యం... తదితర అంశాలు పునశ్చరణ చేసుకునే వీలుంటుందని భావిస్తున్నాను. బంగారం పాతదయినా కొత్తతరానికీ ఎప్పుడంటే అప్పుడు ఉపయోగపడుతుంది కదా! ప్రేక్షకులకు ఇవి మంచి ఫ్లాష్‌బాక్‌లు. డాక్యుమెంటరీలన్నిటినీ ఒక డీవీడీగా, పుస్తకంగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను.
మార్కస్‌బార్‌ట్లే రియల్ జెంటిల్‌మ్యాన్!
డాక్యుమెంటరీలు తీసే క్రమంలో కొన్ని ముచ్చట్లున్నాయి. మూకీల్లో టాకీల్లో పనిచేసిన ఎల్.వి.ప్రసాద్ దగ్గరికి కెమెరాతో వెళ్లగానే ‘రా డెరైక్టరూ’ అని ఉబ్బించేవారు. బహుశా వాస్తురీత్యానేమో విజయాప్రొడక్షన్స్ అధినేత బి.నాగిరెడ్డి స్టూడియోలో నిరంతరం కొన్ని గోడలను, గదులను కూల్చివేయించేవారు. కొత్తగా కట్టించడం, మళ్లీ కూల్చివేయించడం బహుశా ఆయనకు హాబీ. ఆయన వింతైన అలవాటు కారణంగా కెమెరాతో నేనూ ఆయన వెంట తిరుగుతూ మాట్లాడాల్సి వచ్చేది. సూర్యకాంతం గారు ఎంత హాయైన మనిషో! తాను షూటింగులకు వెళ్లినపుడల్లా సెట్‌పై ఉండే వారందరికీ చక్కటి భోజన పదార్ధాలు తీసుకువెళ్లేవారట. ఆ విషయాలు గుర్తుచేస్తూ కడుపునూ మనస్సునూ నింపేవారు. సూర్యకాంతం నటించేవారు కాదు. సాటిలేని సహజనటి! అంజలిగారు నిండుగా, అందంగా అలంకరించుకోవడంలో సాటి. ‘మామ’ పాటలు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. కె.వి.మహదేవన్ ఆరోగ్యం సహకరించకపోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆయనపై కొంతసేపైనా డాక్యుమెంటరీ చేయగలిగాను. అందరిలోకి ప్రత్యేకమైన వ్యక్తి మార్కస్‌బార్‌ట్లే. ప్రతి పలుకులో, కదలికలో హుందాతనం తొణికిసలాడుతుంది. రియల్ జంటిల్‌మాన్. బార్‌ట్లే ఇంటర్వ్యూకు వి.ఎస్.ఆర్.స్వామి సహకరించారు.
సెల్ కెమెరాతో ‘డాక్యుమెంటేషన్’ చేసినా సక్సెస్ అయినట్లే!
నా డాక్యుమెంటరీల సారాంశం ఒక్కటే. నిన్నే నేడు. నేడే రేపు. నేడు మన మధ్య మిగిలిన వారిని మరచిపోతే రేపు లేదు. సినిమా రంగానికి చెందినవారనే కాదు, వివిధ రంగాల ప్రముఖులు ఎందరో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఉంటారు. ఆయా ప్రాంతాల యువకులు తమకు అందుబాటులో ఉన్న కెమెరాల ద్వారానైనా వారి రూపాన్ని, మాటను, హితవును రికార్డు చేస్తే నా శ్రమ ఫలించినట్లే!
- పున్నా కృష్ణమూర్తి
ఫొటో: అనిల్