ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అధ్యయనం
బీఎంజే ఓపెన్ యాక్సెస్ అనే శాస్త్రీయ పత్రికలో విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: మతిభ్రమణం, మేధా క్షీణత వంటి సమస్యల పరిష్కారానికి దృష్టి లోపాన్ని సవరించడం కీలక మార్గమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించి నగరానికి చెందిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిపుణుల సహకారంతో బీఎంజే ఓపెన్ యాక్సెస్ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురించిన విశ్లేషణ దృష్టి లోపం ఉన్న వృద్ధుల్లో మేధో సామర్థ్యాల వైకల్యం అధిక ప్రాబల్యాన్ని సూచిస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగా నలుగురు వృద్ధుల్లో ఒకరు మేధో సామర్థ్యాల వైకల్యంతో జీవిస్తున్నారని తేలింది. వాస్తవానికి దృష్టి లోపం లేనివారితో పోలిస్తే దృష్టిలోపం ఉన్నవారికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉండే అవకాశం 4 రేట్లు ఉంది. సమీప దృష్టి వైకల్యం (కళ్లద్దాలు లేకుండా ఫోన్, పుస్తకాలు చదవలేని స్థితి) కూడా మేధో సామర్థ్యాల వైకల్యానికి సంబంధం ఉంది.
మహిళల్లో మేధో వైకల్యం అధికం..
నగరంలోని వృద్ధాశ్రమాల్లో ఉంటున్న 1,500 మందికి పైగా వృద్ధులపై జరిపిన ఈ అధ్యయనంలో 965 మందిని ఇందులో చేర్చారు. ఇందులో దాదాపు 27% మందికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉందని వెల్లడైంది. తేలికపాటి దృష్టి లోపం ఉన్న వృద్ధుల్లో 30% కంటే తక్కువ మందికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉండగా, దృష్టి వైకల్యం మరింత దిగజారుతున్న కొద్దీ ఈ శాతం క్రమంగా పెరుగుతుంది.
అధ్యయనంలో అంధత్వం ఉన్నవారు 15 మంది ఉన్నారు. అందులో 60% మేధో సామర్థ్యాల క్షీణతను ప్రదర్శించారు. మహిళల్లో మేధో సామర్థ్యాల వైకల్య ప్రాబల్యం అధికంగా ఉంటుంది. పురుషులకంటే మేధో సామర్థ్యాల వైకల్యం మహిళలకు 2 రేట్లు ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం కనుగొంది. ఈ సందర్భంగా మేధో సామర్థ్యాల వైకల్యం తీవ్రరూపాలు మతిభ్రమణానికి (డిమెన్షియా) దారితీస్తాయని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ పరిశోధకులు డా.శ్రీనివాస్ మర్మముల పేర్కొన్నారు. ఈ పరిశోధనా పత్రం హైదరాబాద్ ఆక్యులర్ మోర్బిడిటీ ఇన్ ది ఎల్డర్లీ స్టడీ(హోమ్స్)లో భాగంగా ప్రచురించిన 16 పేపర్లలో ఒక భాగమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment