ప్లాస్టిక్ ఫ్రీ చెరువుల కోసం యత్నం
వలస పక్షులకు ఇబ్బంది కలుగకుండా..
సెలవు రోజుల్లో చెత్త సేకరణ పనులు
ఆదర్శంగా నిలుస్తున్న విశ్వ సస్టైనబుల్ సొసైటీ
సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలను కాల్వలు, చెరువు కట్టలు, రహదారికి ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటం గమనిస్తాం. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలంటే పురపాలక సిబ్బంది రావాలని అనుకుంటాం. ఆలస్యమైతే ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తాం.. అలా కాకుండా మనమే శుభ్రం చేద్దామని కంకణం కట్టుకున్నవారెంతమంది ఉంటారు? అలాంటి వారు నగరంలో చాలా అరుదనే చెప్పాలి.
కొందరు యువత మాత్రం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలను తొలగించే కార్యక్రమానికి నడుం బిగించారు. 2021 నుంచి నగరంలో సరూర్‌నగర్ చెరువు, అమీన్‌పూర్ చెరువు, నల్లగండ్ల చెరువు, గాంధీ చెరువు, పీరంచెరువు, ఖాజాగూడ చెరువు, తదితర ప్రాంతాల వద్ద కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి సెలవు రోజునా చెరువు కట్ట, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలన్నది వారి లక్ష్యం. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ, ఇతర వ్యక్తుల్లో క్లీనింగ్ పట్ల స్పృహ కల్పించడం, ఎన్నో రకాల పక్షులను ఆదుకున్నట్లవుతుందని భావిస్తున్నారు. ఐదుగురు స్నేహితులతో ప్రారంభమైన విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ ప్రస్తుతం సుమారు 500 మందికిపైగా వలంటీర్లను జత చేసుకుంది.
బృందాలుగా ఏర్పడి...
వీరంతా బృందాలుగా ఏర్పడి చెరువులను దత్తత తీసుకుంటున్నారు. వారాంతంలో వారికి కేటాయించిన చెరువుల దగ్గర ప్రజలు వేసే చెత్త, ప్లాస్టిక్ సంచులు, తాగుబోతులు విసిరేసిన గాజు సీసాలు వంటి వ్యర్థాలను ఏరిపారేస్తున్నారు. సంచుల్లో ప్యాక్ చేసి జీహెచ్‌ఎంసీకి తరలిస్తున్నారు. దేశంలోనే మొదటి బయోడైవర్సిటీ చెరువుగా గుర్తింపు పొందిన అమీన్‌పూర్ చెరువుతో పాటు నగరంలో పలు చెరువులకు వలస పక్షలు వస్తున్నాయి.
ఈ సీజన్‌లో వాటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా వలస వచ్చిన పక్షలు ఇక్కడ ప్లాస్టిక్ భూతానికి బలైపోతున్నాయి. ఆహారంగా చేపలు, ఇతర కీటకాలను వేటాడే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. ఈ క్రమంలో వాటికి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి. ప్రకృతి సిద్ధంగా ఉన్న చెరువులను ఆహ్లాదకరంగా మార్చాలనే పట్టుదలతో ఒక్కో చెరువునూ ఒక్కో బృందం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment