Ent
-
బాబోయ్ బొద్దింక! ముప్పు(క్కు)తిప్పలు పెట్టింది!
మన వంట ఇంట్లో బొద్దింకలు, ఈగలు,బల్లులు కనిపిస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కొంతమందైతే బల్లి, బొద్దింకల్ని చూడగానే చాలా హడలిపోతారు. ఇవి ఆహారంలో చేరితే చాలా ప్రమాదం. ఇవన్నీమనకు తెలుసు. కానీ హాయిగా నిద్రపోతున్న మనిషి ముక్కులోకి బొద్దింక చేరి ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ముప్పు తిప్పలు మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఇంతకీ విషయం ఏమిటంటే..చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి మాంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఆయన ముక్కులోకి చేరిపోయిందొక బొద్దింక. ఏదో అసౌకర్యంగా అనిపించి మెలకువ వచ్చింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అటు తిరిగి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజులకు విపరీతమైన నొప్పి మొదలైంది. దీనికి తోడు భరించలేని దగ్గు పట్టుకుంది. ఇది చాలదన్నట్టు ముక్కులోంచి దుర్వాసన రావడం మొదలైంది. అప్పుడు అనుమానంతో ముక్కు, చెవి, గొంతు డాక్టర్‌ను కలిసాడు. అయినా ఫలితం లేదు.బొద్దింకను ఎలా గుర్తించారు?ఎంతకీ తన బాధలనుంచి విముక్తి లభించకపోవడంతో శ్వాసకోశ , క్రిటికల్ కేర్ వైద్యుడిని కలిసాడు. స్టోరీ అంతా విన్నాక సదరు వైద్యుడు ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్, బ్రోంకోస్కోపీ చేయడంతో మన బొద్దింగ గారి గుట్టు రట్టు అయింది. శ్వాసనాళంలో కఫంతో కప్పి ఉన్న బొద్దింకను గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ బొద్దింకను బయటకు తీసి, శ్వాసనాళాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. దీంతో దగ్గు, కఫం అన్నీ పోయి రోగికి ఉపశమనం లభించింది. దీంతో బాబోయ్ బొద్దింక అంటున్నారు నెటిజన్లు. -
దృష్టి లోపంతో మేధా క్షీణత
సాక్షి, హైదరాబాద్: మతిభ్రమణం, మేధా క్షీణత వంటి సమస్యల పరిష్కారానికి దృష్టి లోపాన్ని సవరించడం కీలక మార్గమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించి నగరానికి చెందిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిపుణుల సహకారంతో బీఎంజే ఓపెన్ యాక్సెస్ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురించిన విశ్లేషణ దృష్టి లోపం ఉన్న వృద్ధుల్లో మేధో సామర్థ్యాల వైకల్యం అధిక ప్రాబల్యాన్ని సూచిస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగా నలుగురు వృద్ధుల్లో ఒకరు మేధో సామర్థ్యాల వైకల్యంతో జీవిస్తున్నారని తేలింది. వాస్తవానికి దృష్టి లోపం లేనివారితో పోలిస్తే దృష్టిలోపం ఉన్నవారికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉండే అవకాశం 4 రేట్లు ఉంది. సమీప దృష్టి వైకల్యం (కళ్లద్దాలు లేకుండా ఫోన్, పుస్తకాలు చదవలేని స్థితి) కూడా మేధో సామర్థ్యాల వైకల్యానికి సంబంధం ఉంది. మహిళల్లో మేధో వైకల్యం అధికం.. నగరంలోని వృద్ధాశ్రమాల్లో ఉంటున్న 1,500 మందికి పైగా వృద్ధులపై జరిపిన ఈ అధ్యయనంలో 965 మందిని ఇందులో చేర్చారు. ఇందులో దాదాపు 27% మందికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉందని వెల్లడైంది. తేలికపాటి దృష్టి లోపం ఉన్న వృద్ధుల్లో 30% కంటే తక్కువ మందికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉండగా, దృష్టి వైకల్యం మరింత దిగజారుతున్న కొద్దీ ఈ శాతం క్రమంగా పెరుగుతుంది. అధ్యయనంలో అంధత్వం ఉన్నవారు 15 మంది ఉన్నారు. అందులో 60% మేధో సామర్థ్యాల క్షీణతను ప్రదర్శించారు. మహిళల్లో మేధో సామర్థ్యాల వైకల్య ప్రాబల్యం అధికంగా ఉంటుంది. పురుషులకంటే మేధో సామర్థ్యాల వైకల్యం మహిళలకు 2 రేట్లు ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం కనుగొంది. ఈ సందర్భంగా మేధో సామర్థ్యాల వైకల్యం తీవ్రరూపాలు మతిభ్రమణానికి (డిమెన్షియా) దారితీస్తాయని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ పరిశోధకులు డా.శ్రీనివాస్ మర్మముల పేర్కొన్నారు. ఈ పరిశోధనా పత్రం హైదరాబాద్ ఆక్యులర్ మోర్బిడిటీ ఇన్ ది ఎల్డర్లీ స్టడీ(హోమ్స్)లో భాగంగా ప్రచురించిన 16 పేపర్లలో ఒక భాగమని తెలిపారు. -
శబ్ధాలు, పరికరాలతో చెవిచిల్లు.. ఆధునిక జీవనశైలి చెవి‘నిల్లు’
ఇటీవలి కాలంలో వినికిడి సమస్యలతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వైద్యులు అంటున్నారు. వైద్యుల గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, ఒక బిలియన్ పైగా యువతకు వినికిడి లోపం ప్రమాదం పొంచి ఉంది. టీనేజర్లలో వినికిడి శైలిని విశ్లేషించి దాని ప్రకారం వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉన్న వారి సంఖ్యల గురించి పరిశోధకులు ఈ అంచనాను రూపొందించారు. కరోనా విజృంభణ సమయంలో, ఆన్లైన్ సమావేశాలు, స్నేహితులు కుటుంబ సభ్యులతో వీడియో కాల్లు లేదా అతిగా చూసే సెషన్ల కారణంగా, మనలో చాలా మంది గంటల తరబడి హెడ్ఫోన్లకు అతుక్కుపోయారు. ఇప్పుడు, కోవిడ్‌తో సంబంధం లేకుండా హెడ్ఫోన్లు రోజువారీ జీవితంలో భాగంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాల (పిఎల్డిలు) వాడకం తో పాటు పెద్ద ఎత్తున హైఓల్టేజ్‌తో ఉండే సంగీత వేడుకలకు హాజరుకావడం వంటివి వినికిడి పాలిట శాపాలుగా అధ్యయనం తేల్చింది. పరిమితి మించిన సంగీతధ్వని.. పెద్దలకు 80 డీబీ, పిల్లలకు 75 డీబీ మాత్రమే అనుమతించదగిన ధ్వని స్థాయి. వినియోగదారులు తరచుగా 105 డెసిబెల్ (డిబి) కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటున్నారని గతంలో ప్రచురించిన మరో పరిశోధన వెల్లడించింది, అయితే మ్యూజిక్ కన్సర్ట్స్, వినోద వేడుకల్లో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డిబి వరకు ఉంటాయి. ఇందుగలదందు లేదని సందేహంబు లేదు.. ఇతర శబ్ధాల సమస్య లేకుండా సంగీతాన్ని ఆస్వాదించడానికి స్ట్రీమ్ సిరీస్, సినిమాలను చూడడానికి ఇష్టపడే యువతరం పెరిగింది. వీరు తరచుగా ఇయర్‌బడ్‌లు లేదా హెడ్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. మెట్రో నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టుపక్కల వారి మాటలు, శబ్ధాలు.. వగైరా తప్పించుకోవడానికి ఇయర్ఫోన్లు పెట్టుకుని వినడం సర్వసాధారణం. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా ఉండడానికి తమ వాల్యూమ్లను పెంచుతారు. మరోవైపు ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లు వినోదం మాత్రమే కాకుండా చాలా మందికి వృత్తిరీత్యా కూడా అవసరంగా మారాయి. ఏతావాతా ఈ ఆడియో గాడ్జెట్ల పెరుగుతున్న వినియోగం జుట్టు కణాలు, పొరలు, నరాలు లేదా చెవిలోని ఇతర భాగాలకు హాని కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి నష్టం కలిగిస్తుంది. వైద్యుల సూచనలివే.. ► టీవీ లేదా స్పీకర్లను లేదా హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాల్యూమ్‌ను నియంత్రించండి. ► ఇయర్‌బడ్‌లు హెడ్ఫోన్లలో మీ పక్కన ఉన్న వ్యక్తి వినే స్థాయికి వాల్యూమ్ చేరకుండా జాగ్రత్తపడాలి. ► బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా తరచుగా వాల్యూమ్‌ను పెంచాల్సిన అవసరం రాకుండా బయటి నుంచి శబ్దం–రాకుండాచేసే ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లను కొనుగోలు చేయండి. ► ఇయర్‌బడ్‌లు ఇయర్లోబ్ను కవర్ చేస్తాయి చెవికి అతి దగ్గరగా ఉంటాయి. మరోవైపు, హెడ్ఫోన్లు సంగీతపు వైబ్రేషన్‌ను నేరుగా చెవులకు పంపవు. కాబట్టి, దీర్ఘకాలంలో ఇయర్ బడ్స్ కన్నా హెడ్ఫోన్లకు మారడం మంచిది. ► ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాల విరామం లేదా ప్రతి 60 నిమిషాలకు 10 నిమిషాల పాటు చెవులకు విరామం ఇవ్వాలి. ► స్మార్ట్ఫోన్ల సెట్టింగ్‌లలో అనుకూల వాల్యూమ్ పరిమితిని కూడా సెట్ చేయవచ్చు. జాగ్రత్తలు అవసరం.. చెవిలో సున్నితమైన చర్మం, పొర ఉంటుంది. చెవికి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంటుంది. అయితే అతిగా ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఈ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది. తద్వారా చర్మానికి ఇన్ఫెక్షన్స్ అవకాశాలు పెరుగుతాయి. వాక్స్ జిగిరీ అనే ఆ పొర పోయిదంటే... ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వీటిని అతిగా వినియోగించకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు వీలున్నంత వరకూ అసలు వాడకూడదు. ఇయర్ డ్రమ్ ముఖ ద్వారం కాస్త పెద్దగా ఉన్నవాళ్ల కన్నా సన్నగా ఉన్నవాళ్లకి ప్రమాదం మరింత ఎక్కువ. వీళ్లు వాడేటప్పుడు దాన్ని ఇంకా ఇంకా లోపలికి తోస్తారు. అలా మరీ లోపలికి పెట్టడం వల్ల ఇయర్ డ్రమ్‌కు నష్టం కలుగుతుంది. వీలున్నంత వరకూ అవసరాన్ని బట్టి తప్ప ఎడాపెడా ఉపయోగించడం మంచింది కాదు. అలాగే వినికిడి సామర్ధ్యానికి హెడ్ ఫోన్స్, హై ఓల్టేజ్ సంగీతం కూడా హానికరమే. –డా.ఎం.ప్రవీణ్ కుమార్, ఇఎన్టీ సర్జన్ అమోర్ హాస్పిటల్స్ -
మిమ్మల్నే మీకు వినపడుతోందా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ జనాభాలో ప్రతీ నలుగురిలో ఒకరు 2050 నాటికి వినికిడి సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. బుధవారం ‘వరల్డ్ హియరింగ్ డే’ను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా చెవుడుకు సంబంధించిన అంశాలపై ఒక నివేదిక విడుదల చేసింది. చెవుడుకు కారణాలు, దాని నియంత్రణకు సరైన కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఇక నుంచి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది. వినికిడి లోపాల నివారణకు జాతీయ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. వినికిడి లోపం వల్ల పరస్పర సంభాషణ జరగదు. పైగా విద్య, ఉపాధికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 18 మందిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 2050 నాటికి వినికిడి లోపం (ఏదో ఒక స్థాయిలో... అంటే ఓ మోస్తరు నుంచి తీవ్రమైన వినికిడి సమస్యలు) ఉన్నవారి సంఖ్య 250 కోట్లకు పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అందులో 70 కోట్ల మందికి తప్పనిసరిగా ఏదో రకమైన పరికరం, లేదా వారికి అవసరమైన సాయం తప్పనిసరి. చెవుడును ప్రజారోగ్య సమస్యగా గుర్తించాలని స్పష్టం చేసింది. తక్కువ సౌండ్‌తో వినడం మంచిది చిన్నతనంలో వైరస్, బ్యాక్టీరియా వంటి వాటివల్ల చెవుడు వస్తుంది. బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో పూర్తిగా వినికిడి లోపం వస్తుంది. రూబెల్లా, మెదడు వాపునకు వ్యాక్సిన్ వేయడం ద్వారా చిన్నపిల్లల్లో వచ్చే వినికిడి సమస్యలను 60 శాతం తగ్గించొచ్చు. అలాగే చీముతో వచ్చే ఇన్ఫెక్షన్లను ఆరంభంలోనే గుర్తించి నియంత్రించాలి. మాతృత్వ సేవలు మెరుగుపరచడం వంటివి చేయాలి. పెద్దయ్యాక ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉంటాయి. కానీ వారిలో శబ్ద కాలుష్యం వల్ల చెవుడు వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, టీవీల్లో, మ్యూజిక్ సిస్టమ్స్‌లలో (ఇయర్‌ఫోన్స్‌లో కూడా) వాల్యూమ్‌ను పరిమితికి లోబడి ఉండేలా చూసుకోవడం, చెవులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వినికిడి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. కొన్ని మందులు చెవి సామర్థ్యాన్ని తగ్గించేవి ఉంటాయి. ఉదాహరణకు ఎమెనో గ్లైకోజైడ్స్ వర్గానికి చెందిన యాంటీబయాటిక్ మందుల వాడకం కొందరిలో చెవుడుకు దారితీ స్తుంది. 50 శాతం వరకు వినికిడి సమస్య వచ్చాకే బయటపడుతుంది. అప్పటివరకు చాలామంది గుర్తించలేరు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో ముందే గుర్తించవచ్చు. వినికిడి సమస్య ఉన్నవారు తరచుగా చెక్ చేసుకోవాలి. చిన్న లోపం ఉన్నా ప్రారంభంలోనే డాక్టర్ సలహా తీసుకోవాలి. 10 లక్షల జనాభాకు ఒకరే ఈఎన్టీ డాక్టర్ వినికిడి లోపం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. చెవుడు వల్ల వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాదు సమాజంలో వివక్షకు గురవుతారు. అలాంటి వారు వైద్యున్ని కూడా సంప్రదించకుండా మధనపడతారు. అల్పాదాయ దేశాల్లో ఈఎన్టీ డాక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు. 78 శాతం పేదదేశాల్లో 10 లక్షల జనాభాకు ఒక్క ఈఎన్టీ డాక్టర్ కూడా లేడు. ఆడియాలజిస్ట్ (వినికిడి పరీక్షించేవారు), స్పీచ్ థెరపిస్ట్‌లు ఇంకా తక్కువ ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అందువల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ల్లో వినికిడి సమస్యలకు చికిత్స జరగాలి. జనాభాలో ఎంతమందికి వినికిడి సమస్య ఉందో లెక్క తేల్చాలి. సార్వజనీన ఆరోగ్య పథకంలో వినికిడి సంబంధిత వ్యాధులను చేర్చాలి. -
ఇక వారు కూడా ఆపరేషన్లు చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయు ఆయుర్వేద వైద్య విధానం ప్రోత్సాహానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన కేంద్రం తాజాగా ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య) 2016 నిబంధనలను సవరించింది. షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (ఈఎన్టీ, హెడ్, డెంటల్ స్పెషలైజేషన్) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారికి ప్రత్యేక శిక్షణను ప్రవేశపెట్టింది. శిక్షణ అనంతరం ఈఎన్టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది. ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్ గ్రాఫ్టింగ్, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (చెవి, ముక్కు, గొంతు వ్యాధులు) విధానాలలో అధికారికంగా శిక్షణనిస్తుంది. తద్వారా వారు స్వతంత్రగా సర్జరీలను నిర్వహించే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఎంఎస్ (ఆయుర్వేద) శాల్య తంత్రం డీబ్రిడ్ మెంట్ / ఫాసియోటోమీ / క్యూరెట్టేజ్ పెరియానల్ చీము, రొమ్ము గడ్డ, ఆక్సిలరీ చీము, సెల్యులైటిస్ అన్ని రకాల స్కిన్ గ్రాఫ్టింగ్, ఇయర్ లోబ్ రిపైర్ లింఫోపోమా, ఫైబ్రోమా, స్క్వాన్నోమా మొదలైన కణతుల తొలగింపు గ్యాంగ్రేన్ ఎక్సిషన్ / విచ్ఛేదనం తీవ్ర గాయాలనిర్వహణ, అన్ని రకాల సూటరింగ్, హేమోస్టాటిక్ లిగెచర్స్, బిగుసుకుపోయిన కండరాల చికిత్స లాపరోటమీ హేమోరాయిడెక్టమీ, రబ్బర్ బ్యాండ్ లిగేషన్, స్క్లెరోథెరపీ, ఐఆర్పీ, రేడియో ఫ్రీక్వెన్సీ / లేజర్ అబ్లేషన్ మొదలైన వివిధ పద్ధతులు. యానల్ డైలేటేషన్, స్పింక్టెరోటోమీ అనోప్లాస్టీ ఫిస్టులెక్టమీ, ఫిస్టులోటోమీ, పైలోనిడల్ సైనస్ ఎక్సిషన్, వివిధ రెక్టోపెక్సీలు యురేత్రల్ డైలేటేషన్, మీటోమి, సున్తీ పుట్టుకతో వచ్చే హెర్నియోటమీ, హెర్నియోరాఫీ, హెర్నియోప్లాస్టీ హైడ్రోసెల్ ఎవర్షన్, థొరాసిక్ గాయానికి ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్ మొదలైనవి ఉన్నాయి కన్ను కనుపాపలను సరిచేసే సర్జరీ, క్యూరెట్టేజ్ ట్యూమర్ తొలగింపు సర్జరీ పాటరీజియం ఐరిస్ ప్రోలాప్స్-ఎక్సిషన్ సర్జరీ గ్లాకోమా-ట్రాబెక్యూలెక్టమీ కంటికి గాయం: - కనుబొమ్మ, మూత, కండ్లకలక, స్క్లెరా కార్నియా గాయాలకుమరమ్మత్తు శస్త్రచికిత్స స్క్వింట్ సర్జరీ - ఎసోట్రోపియా, ఎక్సోట్రోపియా డాక్రియోసిస్టిటిస్- డిసిటి / డాక్రియోసిస్టోరినోస్టోమీ [డిసిఆర్] కంటిశుక్లం శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సతో కంటిశుక్లం వెలికితీత మొదలైనవి ముక్కు: సెప్టోప్లాస్టీ, పాలీపెక్టమీ, రినోప్లాస్టీ చెవి : లోబులోప్లాస్టీ. అక్యూట్ సపరేటివ్ ఓటిటిస్, మాస్టోయిడెక్టమీ గొంతు వ్యాధులు : టాన్సిలెక్టమీతో పాటు ఇతర చికిత్సలు దంత : వదులు దంతాల బిగింపు, రూట్ కెనాల్,ఇతర చికిత్స -
పంటి మూలాన్ని మళ్లీ పెంచవచ్చు!
వయసు రీత్యా.. లేదంటే ప్రమాదాల కారణంగానో మనం కోల్పోయిన పళ్లు మళ్లీ పెరిగితే ఎలా ఉంటుంది? ఆహారాన్ని చక్కగా ఆస్వాదించడమే కాదు.. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకమైన ముందడుగు పడింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త యాంగ్ చాయ్ పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడుమన పళ్ల మూలాలు (రూట్)ను పునరుజ్జీవింప చేయడం సాధ్యం కానుంది. ఇది కాస్తా మళ్లీ మళ్లీ పళ్లను పెంచుకునేందుకు దారితీస్తుందని అంచనా. పిప్పిపళ్ల సమస్య బాగా తీవ్రమైనప్పుడు మనం రూట్ కెనాల్ థెరపీ చేయించుకుంటాం. దీంతో ఆ ప్రాంతంలో మళ్లీ పన్ను వచ్చేందుకు అస్సలు అవకాశం ఉండదు. మొదలంటా శుభ్రం చేసి ఉండటం దీనికి కారణం. అయితే డీఎన్ఏలో మార్పులేవీ చేయకుండానే కొన్ని జన్యువులను నియంత్రించడం ద్వారా పంటి మూలాలను మళ్లీ అభివృద్ధి చేయవచ్చునని చాయ్ తదితరులు ప్రయోగపూర్వకంగా తెలుసుకోగలిగారు. మన ముఖం ఎముకలు అభివృద్ధి చెందేందుకు ఈజెడ్హెచ్ 2 అనే ప్రొటీన్ ఉపయోగపడుతుందని చాలాకాలంగా తెలిసినా.. పంటి రూట్ విషయంలో దీని పాత్ర ఏమిటన్నది పరిశీలించేందుకు చాయ్ తదితరులు ప్రయత్నం చేశారు. ఇంకో ప్రొటీన్ ఆరిడ్1ఏతో సమానంగా ఉంటే రూట్ వృద్ధి చెందేందుకు, దవడ ఎముకలతో రూట్స్ అనుసంధానమయ్యేందుకు వీలేర్పడుతోందని వీరు గుర్తించారు. అయితే నోట్లోని అన్ని రకాల పళ్లను కాకపోయినా సమీప భవిష్యత్తులో దవడ పళ్లను మళ్లీ మళ్లీ పెరిగేలా చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చాయ్ తెలిపారు. -
త్వరలో ఈఎన్టీ పరీక్ష శిబిరాలు..
సాక్షి, హైదరాబాద్: చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) సహా దంత పరీక్షలను పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లో అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈఎన్టీ శిబిరాలను నిర్వహించనుంది. అందుకోసం ఈఎన్టీ విభాగానికి చెందిన మూడు ప్రత్యేక బృందాలు, దంత విభాగం నుంచి మరో 3 ప్రత్యేక బృందాలను గుర్తించింది. ఒక్కో బృందంలో మొత్తం 11 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వారందరికీ బుధ, గురువారాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక వారిని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించిన ప్రాంతాలకు ఈ నెల 6 నుంచి పంపిస్తారు. వారక్కడ శిబిరాలు నిర్వహిస్తారు. ఆ ప్రాజెక్టు అనుభవాల ఆధారంగా మార్గదర్శకాలు ఖరారు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఈఎన్టీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ఈఎన్టీ శిబిరాల నిర్వహణపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచే శిబిరాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వైద్యాధికారులు ఆగమేఘాల మీద కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐదు జిల్లాల కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. పైలట్ ప్రాజెక్టు నిర్వహణ తదితర అంశాలపై రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ల నుంచి సలహాలు తీసుకున్నారు. ఏడాదిపాటు ఈఎన్టీ పరీక్షలు.. ప్రస్తుతం కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం ఫిబ్రవరిలో పూర్తి కానుంది. ఆ వెంటనే ఈఎన్టీ, దంత వైద్య శిబిరాలు ప్రారంభం కానున్నాయి. కంటి వెలుగు కింద వచ్చే నెల నాటికి దాదాపు 2 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసే అవకాశముంది. అదే స్థాయిలో ఈఎన్టీ, దంత పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కంటి పరీక్షలు చేయడం, వెంటనే రీడింగ్ గ్లాసులు ఇవ్వ డం సులువే. కానీ ఈఎన్టీ, దంత పరీక్షలు చేయడం కష్టమైన వ్యవహారం. దానికి సరం జామా అధికంగా ఉండాల్సి ఉందని అధికా రులు చెబుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఆరు నెలల్లోపే పూర్తి చేయగలిగితే, ఈఎన్టీ పరీక్షలు పూర్తి చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అంటున్నారు. -
ఆరు వినికిడి స్క్రీనింగ్ సెంటర్లు
హైదరాబాద్: పుట్టిన నెలలోపు పిల్లల్లో విని కిడి లోపాన్ని గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఆరు అధునాతన వినికిడి స్క్రీనింగ్ సెంట ర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఇందులో ఒక సెంటర్‌ను హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రికి మంజూరు చేసేందుకు తన వంతుగా కృషి చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం ఇప్పటి వరకు అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను వివరిస్తూ.. దరఖాస్తు చేయాల్సిందిగా సంబంధిత అధికా రులను ఆదేశించారు. కోఠిలోని చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ)ఆసుపత్రి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ... ఈ సెంటర్ మంజూరైతే ఆస్పత్రికి కేంద్రం నుంచి రూ. వంద కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈఎన్టీ ఆస్పత్రి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడిం చిందని, ఇక్కడి ఖాళీ స్థలంలో నూతన భవనం నిర్మించాల్సిందిగా కోరుతూ కేసీఆర్‌కు లేఖ రాస్తానని తెలిపారు. ప్రధాని ఆశయం ప్రకా రం ఆస్పత్రిలోని రికార్డులు డిజిటలైజ్ కావాల న్నారు. సనత్‌నగర్‌లో రూ.200 కోట్లతో నిర్మించిన ఈఎస్ఐ వైద్య కళాశాలలో ఈఎన్టీ బ్లాక్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జర్మనీ పౌరుడు తాను జర్మన్నని, జపాన్ పౌరుడు తాను జపనీయుడినని చెప్పు కుంటారు. కానీ మనదేశంలో మాత్రం తాను ఫలానా కులం వాడినని చెప్పుకుంటున్నారని, ఈ సంస్కృతి మారాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈఎన్టీ ఆస్పత్రి పూర్వ సూపరింటెండెంట్, ఆర్ఎంవోలకు ఆయన ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ అరుణా రామయ్య, ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెం డెంట్ శంకర్, ఉస్మానియా సూపరింటెండెంట్ వి.ఎస్. మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఈఎన్టీ శస్త్రచికిత్స శిక్షణ శిబిరం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేటలో ఉన్న శ్రీ సత్యసాయి ఈఎన్టీ హాస్పిటల్లో రెండురోజులుగా కొనసాగుతున్న ఈఎన్టీ శస్త్రచికిత్స శిబిరం(టెంపోరల్ బోన్ డిసెక్షన్, ఆసిక్యులోప్లాస్టి, మైక్రో ఇయర్) ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఈఎన్టీ వైద్యులు డాక్టర్ బి. జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చెవి వినికిడి లోపం ఉన్న వారిలో వినికిడి పెంచడానికి చేసే క్లిష్టమైన ఆపిక్యులోప్లాస్టీ అనే శస్త్రచికిత్సపై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, కర్ణాటక, కేరళ, తెలంగాణా రాష్ట్రాల నుంచి 25 మంది ప్రతినిధులు హాజరై శిక్షణ పొందారని తెలిపారు. తనతోపాటు డాక్టర్ నదీమ్, గోవిందరాజు, డాక్టర్ కుమారస్వామి(బెంగళూరు), డాక్టర్ అమతపీతి(తిరుపతి), డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(రామమండ్రి), డాక్టర్ మహేంద్రకుమార్(కర్నూలు) శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. -
ఫార్ములేషన్స్ మార్కెటింగ్‌లోకి వాసు గ్రూప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల పంపిణీ రంగంలోని వాసు గ్రూప్ తాజాగా ఫార్ములేషన్స్ మార్కెటింగ్‌లోకి ప్రవేశించింది. ముందుగా గైనకాలజీ, పీడియాట్రిక్, ఈఎన్టీ తదితర విభాగాలకు సంబంధించిన ఔషధాలను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ చైర్మన్ బి. భానుమార్తి తెలిపారు. రెండు, మూడు నెలల తర్వాత హృద్రోగాలు, మధుమేహం వంటి వాటి చికిత్సలో ఉపయోగించే ఔషధాలను అందుబాటులోకి తేనున్నట్లు సోమవారం ఇక్కడ ఆయన విలేకరులకు వివరించారు. ప్రస్తుతం సుమారు 49 ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నామని, మరో 10 ఔషధాలపై కసరత్తు జరుగుతోందని భానుమూర్తి చెప్పారు. మొత్తం మీద ఏడాది వ్యవధిలో 150 ఔషధాల దాకా అందుబాటులోకి తేనున్నామని పేర్కొన్నారు. వీటిని అకుమ్స్, అయోసిస్ మొదలైన సంస్థలతో తయారు చేయించి, తమ బ్రాండ్ మీద విక్రయించనున్నట్లు భానుమూర్తి తెలిపారు. ప్రాథమికంగా వీటిపై ప్రతి నెలా రూ.1 కోటి మేర టర్నోవరు అంచనా వేస్తున్నామని, పెరుగుదలను బట్టి సొంత తయారీ ప్లాంటును నెలకొల్పే యోచన కూడా ఉందన్నారు. పరిస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్‌లోనూ డిపోలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో విక్రయాలు ఉంటాయన్న భానుమూర్తి, 2020 నాటికి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.