సాక్షి, హైదరాబాద్: చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) సహా దంత పరీక్షలను పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లో అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈఎన్‌టీ శిబిరాలను నిర్వహించనుంది. అందుకోసం ఈఎన్‌టీ విభాగానికి చెందిన మూడు ప్రత్యేక బృందాలు, దంత విభాగం నుంచి మరో 3 ప్రత్యేక బృందాలను గుర్తించింది. ఒక్కో బృందంలో మొత్తం 11 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వారందరికీ బుధ, గురువారాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక వారిని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించిన ప్రాంతాలకు ఈ నెల 6 నుంచి పంపిస్తారు.
వారక్కడ శిబిరాలు నిర్వహిస్తారు. ఆ ప్రాజెక్టు అనుభవాల ఆధారంగా మార్గదర్శకాలు ఖరారు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఈఎన్‌టీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ఈఎన్‌టీ శిబిరాల నిర్వహణపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచే శిబిరాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వైద్యాధికారులు ఆగమేఘాల మీద కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐదు జిల్లాల కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. పైలట్ ప్రాజెక్టు నిర్వహణ తదితర అంశాలపై రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ల నుంచి సలహాలు తీసుకున్నారు.
ఏడాదిపాటు ఈఎన్‌టీ పరీక్షలు..
ప్రస్తుతం కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం ఫిబ్రవరిలో పూర్తి కానుంది. ఆ వెంటనే ఈఎన్‌టీ, దంత వైద్య శిబిరాలు ప్రారంభం కానున్నాయి. కంటి వెలుగు కింద వచ్చే నెల నాటికి దాదాపు 2 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసే అవకాశముంది. అదే స్థాయిలో ఈఎన్‌టీ, దంత పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కంటి పరీక్షలు చేయడం, వెంటనే రీడింగ్ గ్లాసులు ఇవ్వ డం సులువే. కానీ ఈఎన్‌టీ, దంత పరీక్షలు చేయడం కష్టమైన వ్యవహారం. దానికి సరం జామా అధికంగా ఉండాల్సి ఉందని అధికా రులు చెబుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఆరు నెలల్లోపే పూర్తి చేయగలిగితే, ఈఎన్‌టీ పరీక్షలు పూర్తి చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అంటున్నారు.
త్వరలో ఈఎన్‌టీ పరీక్ష శిబిరాలు..
Published Thu, Jan 3 2019 1:36 AM | Last Updated on Thu, Jan 3 2019 1:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment