ముప్పు(క్కు)తిప్పలు పెట్టిన బొద్దింక
మన వంట ఇంట్లో బొద్దింకలు, ఈగలు,బల్లులు కనిపిస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కొంతమందైతే బల్లి, బొద్దింకల్ని చూడగానే చాలా హడలిపోతారు. ఇవి ఆహారంలో చేరితే చాలా ప్రమాదం. ఇవన్నీమనకు తెలుసు. కానీ హాయిగా నిద్రపోతున్న మనిషి ముక్కులోకి బొద్దింక చేరి ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ముప్పు తిప్పలు మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఇంతకీ విషయం ఏమిటంటే..
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి మాంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఆయన ముక్కులోకి చేరిపోయిందొక బొద్దింక. ఏదో అసౌకర్యంగా అనిపించి మెలకువ వచ్చింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అటు తిరిగి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజులకు విపరీతమైన నొప్పి మొదలైంది. దీనికి తోడు భరించలేని దగ్గు పట్టుకుంది. ఇది చాలదన్నట్టు ముక్కులోంచి దుర్వాసన రావడం మొదలైంది. అప్పుడు అనుమానంతో ముక్కు, చెవి, గొంతు డాక్టర్‌ను కలిసాడు. అయినా ఫలితం లేదు.
బొద్దింకను ఎలా గుర్తించారు?
ఎంతకీ తన బాధలనుంచి విముక్తి లభించకపోవడంతో శ్వాసకోశ , క్రిటికల్ కేర్ వైద్యుడిని కలిసాడు. స్టోరీ అంతా విన్నాక సదరు వైద్యుడు ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్, బ్రోంకోస్కోపీ చేయడంతో మన బొద్దింగ గారి గుట్టు రట్టు అయింది. శ్వాసనాళంలో కఫంతో కప్పి ఉన్న బొద్దింకను గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ బొద్దింకను బయటకు తీసి, శ్వాసనాళాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. దీంతో దగ్గు, కఫం అన్నీ పోయి రోగికి ఉపశమనం లభించింది. దీంతో బాబోయ్ బొద్దింక అంటున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment