సాక్షి, హైదరాబాద్: ప్రపంచ జనాభాలో ప్రతీ నలుగురిలో ఒకరు 2050 నాటికి వినికిడి సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. బుధవారం ‘వరల్డ్ హియరింగ్ డే’ను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా చెవుడుకు సంబంధించిన అంశాలపై ఒక నివేదిక విడుదల చేసింది. చెవుడుకు కారణాలు, దాని నియంత్రణకు సరైన కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఇక నుంచి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది. వినికిడి లోపాల నివారణకు జాతీయ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. వినికిడి లోపం వల్ల పరస్పర సంభాషణ జరగదు. పైగా విద్య, ఉపాధికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 18 మందిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 2050 నాటికి వినికిడి లోపం (ఏదో ఒక స్థాయిలో... అంటే ఓ మోస్తరు నుంచి తీవ్రమైన వినికిడి సమస్యలు) ఉన్నవారి సంఖ్య 250 కోట్లకు పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అందులో 70 కోట్ల మందికి తప్పనిసరిగా ఏదో రకమైన పరికరం, లేదా వారికి అవసరమైన సాయం తప్పనిసరి. చెవుడును ప్రజారోగ్య సమస్యగా గుర్తించాలని స్పష్టం చేసింది.
తక్కువ సౌండ్‌తో వినడం మంచిది
చిన్నతనంలో వైరస్, బ్యాక్టీరియా వంటి వాటివల్ల చెవుడు వస్తుంది. బ్యాక్టీరియాతో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. దీంతో పూర్తిగా వినికిడి లోపం వస్తుంది. రూబెల్లా, మెదడు వాపునకు వ్యాక్సిన్ వేయడం ద్వారా చిన్నపిల్లల్లో వచ్చే వినికిడి సమస్యలను 60 శాతం తగ్గించొచ్చు. అలాగే చీముతో వచ్చే ఇన్‌ఫెక్షన్లను ఆరంభంలోనే గుర్తించి నియంత్రించాలి. మాతృత్వ సేవలు మెరుగుపరచడం వంటివి చేయాలి. పెద్దయ్యాక ఇన్‌ఫెక్షన్లు తక్కువగా ఉంటాయి. కానీ వారిలో శబ్ద కాలుష్యం వల్ల చెవుడు వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, టీవీల్లో, మ్యూజిక్ సిస్టమ్స్‌లలో (ఇయర్‌ఫోన్స్‌లో కూడా) వాల్యూమ్‌ను పరిమితికి లోబడి ఉండేలా చూసుకోవడం, చెవులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వినికిడి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.
కొన్ని మందులు చెవి సామర్థ్యాన్ని తగ్గించేవి ఉంటాయి. ఉదాహరణకు ఎమెనో గ్‌లైకోజైడ్స్ వర్గానికి చెందిన యాంటీబయాటిక్ మందుల వాడకం కొందరిలో చెవుడుకు దారితీ స్తుంది. 50 శాతం వరకు వినికిడి సమస్య వచ్చాకే బయటపడుతుంది. అప్పటివరకు చాలామంది గుర్తించలేరు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో ముందే గుర్తించవచ్చు. వినికిడి సమస్య ఉన్నవారు తరచుగా చెక్ చేసుకోవాలి. చిన్న లోపం ఉన్నా ప్రారంభంలోనే డాక్టర్ సలహా తీసుకోవాలి.
10 లక్షల జనాభాకు ఒకరే ఈఎన్‌టీ డాక్టర్
వినికిడి లోపం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. చెవుడు వల్ల వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాదు సమాజంలో వివక్షకు గురవుతారు. అలాంటి వారు వైద్యున్ని కూడా సంప్రదించకుండా మధనపడతారు. అల్పాదాయ దేశాల్లో ఈఎన్‌టీ డాక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు. 78 శాతం పేదదేశాల్లో 10 లక్షల జనాభాకు ఒక్క ఈఎన్‌టీ డాక్టర్ కూడా లేడు. ఆడియాలజిస్ట్ (వినికిడి పరీక్షించేవారు), స్పీచ్ థెరపిస్ట్‌లు ఇంకా తక్కువ ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అందువల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)ల్లో వినికిడి సమస్యలకు చికిత్స జరగాలి. జనాభాలో ఎంతమందికి వినికిడి సమస్య ఉందో లెక్క తేల్చాలి. సార్వజనీన ఆరోగ్య పథకంలో వినికిడి సంబంధిత వ్యాధులను చేర్చాలి.
మిమ్మల్నే మీకు వినపడుతోందా?
Published Thu, Mar 4 2021 4:10 AM | Last Updated on Thu, Mar 4 2021 8:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment