Hearing loss
-
హల్లో ప్లీజ్ హియర్..
ఇంట్లో, ఆఫీసుల్లో ల్యాప్టాప్స్ పట్టుకుని చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పనిచేయడం, రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదించడం.. ఇవి సరిపోవన్నట్టు వీకెండ్స్‌లో పబ్స్, క్లబ్స్‌లో చెవులు చిల్లులు పడే మ్యూజిక్ హోరులో మునిగి తేలడం.. ఇవన్నీ నగరంలో టీనేజర్లు, యువత జీవనశైలిలో రొటీన్ పనులు. అయితే నేడు వీరు అనుసరిస్తున్న ఈ రకమైన పద్ధతులు రేపటి వారి వినికిడి లోపానికి కారణం కానున్నాయా? అంటే.. అవుననే సమాధానం ఇస్తున్నాయి అధ్యయనాలు. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు.. సురక్షితం కాని శ్రవణ పద్ధతులు అవలంబిస్తుండడం వల్ల ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. వీరిలో కూడా అత్యధికులు యువత, టీనేజర్లే కానుండడం ఆందోళనకరం. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలు బిఎమ్‌జె గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం, పరిమితికి మించి స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాలు (పర్సనల్ లిజనింగ్ డివైజెస్/పిఎల్డిలు) ఉపయోగించడం, పెద్దగా ధ్వనించే సంగీత వేదికలు యువత వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24 శాతం టీనేజర్లు, 48 శాతం మంది యుక్తవయసు్కలు పరిమితికి మించి చెవులుకు పనిపెడుతున్నారని పరిశోధనలో తేలింది. ఈ సంఖ్యల ఆధారంగా, పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 0.67, 1.35 బిలియన్ల మంది మధ్య, యుక్తవయసు్కలు వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని కూడా పరిశోధకులు లెక్కగట్టారు.పరిమితి మీరుతున్నారు..గతంలో వెలువడిన ఓ పరిశోధన ఫలితాల ప్రకారం పీఎల్డీ వినియోగదారులు తరచూ 105 డెసిబుల్స్ కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటారు. వినోద వేదికలలో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డెసిబుల్స్మించి ఉంటాయి.. అయితే వైద్యులు అనుమతించిన స్థాయి పెద్దలకు 80 డెసిబుల్స్. పిల్లలకు 75 డెసిబుల్స్ మాత్రమే కావడం గమనార్హం. ‘ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు సురక్షితమైన వినికిడి మార్గాలను ప్రోత్సహించడం ద్వారా నష్ట నివారణకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం’ అని ఈ సందర్భంగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.టిన్నిటస్ సమస్యే ఎక్కువ.. నన్ను కలిసిన నగరవాసుల్లో కొందరికి చిన్న వయసులోనే వినికిడిలోపాలతో పాటు టిన్నిటస్ అనే ఒక సమస్య పెరుగుతోందని కూడా గుర్తించాం. టిన్నిటస్ అంటే ఫోన్ రింగింగ్, ఇతర శబ్దాలు పదే పదే తలలో, చెవుల్లో గింగురుమనే ఫాంటమ్ సెన్సేషన్స్. కొంత మంది దీని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే మరి కొందరు దీర్ఘకాలిక చెవినొప్పి అనుభవిస్తున్నారు. తీవ్రమైన శబ్దాలు, తద్వారా కలిగే అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వినికిడి లోపానికి దారి తీస్తాయి. అంతేకాదు వినికిడి సమస్యలు డిప్రెషన్, డిమెన్షియా, మతిమరుపు వ్యాధుల తీవ్రత పెరగడానికి కూడా కారణం అవుతాయి. – డా.ఎమ్.ప్రవీణ్‌కుమార్, ఇఎన్టీ వైద్యులు -
ఆమెకు పాట వినపడదు
వేల కొలది పాటలు పాడిన గాయనికి హటాత్తుగా పాట వినపడకపోతే? వాయిద్య ధ్వని వినపడకపోతే? సంగీతమే చెవులకు సోకకపోతే? అసలు ఏమీ వినిపించకపోతే? అంతకు మించిన వేదన ఉంటుందా? గాయని అల్కా యాగ్నిక్ తనకు అరుదైన ‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ వచ్చిందని ప్రకటించింది. ‘మిత్రులారా... పెద్ద పెద్ద శబ్దాలకు, హెడ్ఫోన్ల అతి వాడకానికి దూరంగా ఉండండి’ అని హెచ్చరించింది.ఆమె అవస్థ నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటి?‘ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్’ (తేజాబ్), ‘చోలీ కే పీఛే క్యా హై’ (ఖల్ నాయక్), ‘తాళ్ సే తాళ్ మిలా’ (తాళ్) వంటి వందలాది హిట్ పాటలు పాడిన అల్కా యాగ్నిక్ (56) ఏ సంగీతాన్ని విని, పాడాలో ఆ సంగీతాన్ని వినలేని హఠాత్ స్థితికి వచ్చి పడింది. ఆమె ‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’తో బాధ పడుతున్నట్టు డాక్టర్లు నిర్థారించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా అకౌంట్ ‘ది రియల్ అల్కా యాగ్నిక్’ ద్వారా లోకానికి వెల్లడి చేసింది.ఆమె చెప్పింది ఏమిటి?‘కొన్ని వారాల క్రితం నేను విమానం దిగగానే అసలు ఏమీ వినపడని స్థితికి చేరుకున్నాను. ఆ దెబ్బ నుంచి నేను ధైర్యం చిక్కబట్టుకోవడానికి కొన్నివారాల సమయం పట్టింది. ఇన్నాళ్లుగా నేను ఎందుకు కనపడటం లేదని అడుగుతున్న అభిమానులకు, మిత్రులకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ అనే అరుదైన జబ్బుతో బాధ పడుతున్నట్టు డాక్టర్లు తేల్చారు. ఇది వైరల్ అటాక్ అని చెప్పారు. ఈ స్థితి నుంచి కోలుకొని నేను తిరిగి వస్తానని భావిస్తున్నాను. దయచేసి అందరూ పెద్ద శబ్దాలకు, హెడ్ఫోన్ల విపరీత వాడకానికి దూరంగా ఉండండి’ అని తన ఇన్‌స్టా అకౌంట్లో రాసిందామె.‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ అంటే?ఇది హఠాత్తుగా వచ్చే చెవుడు. చెవిలోని హియరింగ్ నర్వ్ మీద వైరస్ దాడి చేయడంతో ఆ నర్వ్ ఉబ్బుతుంది. అయితే ఆ నర్వ్ ఒక ఇరుకైన అస్థిక ద్వారా ప్రయాణిస్తుంది కనుక ఎప్పుడైతే ఉబ్బుతుందో అప్పుడు ఒత్తిడికి లోనవుతుంది. దాంతో పనిచేసే గుణం కోల్పోతుంది. దీనివల్ల శబ్దాలు మెదడుకు చేరే వ్యవస్థ దెబ్బ తింటుంది. హఠాత్తుగా చెవుడు వస్తుంది.⇒ ఈ స్థితికి ముందు ఎటువంటి లక్షణాలూ కనిపించవు.⇒ ఒక చెవితో మొదలై రెండోచెవికి వ్యాధి రావచ్చు. ఒకోసారి రెండు చెవులకు ఒకేసారి రావచ్చు.⇒ వార్థక్యం వల్ల, అనువంశికంగా ఈ వ్యాధి రావచ్చు.⇒ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు.⇒ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల రావచ్చు.⇒ కొన్ని రకాల మందుల వాడకం వల్ల రావచ్చు.⇒ పెద్ద పెద్ద శబ్దాలు వినడం, పెద్ద శబ్దంతో హెడ్‌ఫోన్ ఎక్కువ సేపు వాడటం వల్ల రావచ్చు.అల్కా కోలుకోవాలిఅల్కా తన పరిస్థితిని ప్రకటించిన వెంటనే ఆమె సహ గాయకులు సోను నిగమ్, ఇలా అరుణ్, శంకర్ మహదేవన్, కుమార్ సాను స్పందించారు. ‘మళ్లీ నిన్ను యథావిధిగా చూస్తాం. మా ప్రేమ నీతో ఉంది’ అని వారు కామెంట్లు చేశారు. ధైర్యం చెప్పారు. గాయనిగా ఉంటూనే అల్కా వివిధ రియాల్టీ షోలలో హోస్ట్‌గా పాల్గొంటూ ఉంటుంది. ఆమె మన బాలూతో పాడిన ‘దేఖా హై పెహెలీ బార్’ (సాజన్) వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.అలాగే ప్రపంచవ్యాప్తంగా స్టేజ్షోలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్నాళ్ల పాటు వాటన్నింటికి ఆమె దూరంగా ఉండాల్సిందే. అన్నింటికంటే పెద్ద ఇబ్బంది ఏమిటంటే హఠాత్తుగా వచ్చిన చెవుడు వల్ల తిరిగి సహజంగా/ కృత్రిమంగా వినికిడి వ్యవస్థ పునరుద్ధరింపబడే వరకూ అసలేమీ వినిపించకపోవడంతో అయోమయం ఏర్పడుతుంది. డిప్రెషన్ రావచ్చు. జీవితేచ్ఛ నశించవచ్చు. బంధుమిత్రుల గట్టి సపోర్ట్ ఉంటే, ఆత్మవిశ్వాసం నిలుపుకుంటే తప్ప ఈ పరిస్థితి దాటటం కష్టం. ‘మీ ప్రార్థనల్లో నన్ను ప్రస్తావించండి’ అని కోరిన అల్కాకు అభిమానుల ప్రార్థనలు సమృద్ధిగా ఉన్నాయి. ఆమె తప్పక కోలుకుంటుందని ఆశిద్దాం. చికిత్స⇒ ఈ స్థితి కనిపించిన వెంటనే చికిత్సకు వెళితే కొన్ని రకాల హైడోస్ స్టెరాయిడ్స్ వల్ల పరిస్థితిని మెరుగు పరిచే వీలు ఉంటుంది.⇒ కొంతమంది ఏ చికిత్సా చేయించుకోకపోయినా కొన్నాళ్లకు యాభై శాతం వినికిడి రావచ్చు.⇒ కొందరి విషయంలో కాక్లియర్ ఇం΄్లాంట్స్ పని చేయవచ్చు.⇒ ఎక్కువమంది విషయంలో చికిత్స ఉండదనే చెప్పాలి.⇒ వినికిడి సాధనాలతో వీరు జీవితం గడపాల్సి వస్తుంది. -
సైగలకు మాటలొచ్చాయి
న్యాయవాది అడ్వా సారా సన్ని భారతదేశపు మొట్టమొదటి వినికిడి లోపం గల రిజిస్టర్డ్ ప్రాక్టీసింగ్ లాయర్‌గా చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 4న ఆమెకు సహాయం చేయడానికి సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ద్వారా సర్టిఫైడ్ ఇంటర్ప్రెటర్ సేవలను పొందాలని కోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్ 8న కర్ణాటక హైకోర్ట్ రిజిస్టర్డ్ సంజ్ఞా భాషా వ్యాఖ్యాత ద్వారా వినికిడి లోపం ఉన్న న్యాయవాది నుంచి వాదనలు విన్నది. దీంతో అడ్వకేట్ సారా సన్నీతోపాటు కర్ణాటక హైకోర్ట్ కూడా దివ్యాంగులకు ఒక గొప్ప బాసటగా నిలిచినట్లయింది. ఇది న్యాయ నిపుణులకు మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్న పౌరులకు కూడా సమగ్ర న్యాయవ్యవస్థకు మార్గం మరింతగా సుగమం చేస్తుంది. జస్టిస్ ఎం నాగప్రసన్న, అదనపు సొలిసిటర్ జనరల్ అరవింద్ కామత్‌లతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ అడ్వా సన్నీ నమోదును ప్రశంసించింది. ఏఎస్జీ కామత్ మాట్లాడుతూ ‘ఇంటర్ప్రెటర్ ద్వారా హియరింగ్, స్పీచ్ ఇంపెయిర్డ్ అడ్వకేట్ వాదనను విన్న మొదటి హైకోర్టుగా కర్ణాటక హైకోర్టు చరిత్రలో నిలిచిపోతుంది. సారా సన్నీ సంకేత భాషా వ్యాఖ్యాత ద్వారా వినికిడిలోపం, ప్రసంగం బలహీనంగా ఉండటం వల్ల కలిగే వైకల్యాన్ని ఓడించింది. అందుకు సారా సన్నీని అభినందించాల్సిందే. సంజ్ఞా భాషా వ్యాఖ్యాత ద్వారా వాదప్రతివాదనలు జరిగినప్పటికీ ప్రశంసలు రికార్డులలో నమోదు అవుతాయి’ అని తెలియజేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ‘భారత న్యాయవ్యవస్థలో వివిధ నేపథ్యాల నుండి ఎక్కువ మంది మహిళలు చేరాల’ని పదే పదే ప్రస్తావించారు. ప్రోత్సహించడానికి... అడ్వా సారా సన్నీ కేరళలోని కొట్టాయం వాసి. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. కేవలం స్వీయ ఆసక్తితో మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్న ఇతరులను కూడా ప్రోత్సహించడానికి న్యాయవాద వృత్తిని ఎంచుకుంది. అడ్వకేట్ సన్నీ ఇప్పుడు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ అండ్ హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్‌లో యాక్టివ్ మెంబర్. సెప్టెంబరు 2023లో న్యాయవాది సన్నీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక కేసు వాదించిన, వినికిడి లోపం ఉన్న మొట్ట మొదటి లాయర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంలో సన్నీ ‘డీవై చంద్రచూడ్ ఓపెన్ మైండ్ ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం తలుపులు తెరిచింది’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సన్నీ కోర్టు సబిమిషన్స్‌లో సహాయం చేయడానికి సంకేత భాషా ఇంటర్‌ప్రెటర్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు గతంలో తన రిజిస్ట్రీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అది అమలు అయ్యింది. వైకల్యాలున్నవారు తమ అడ్డంకులను అధిగమించడంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అయ్యింది. -
మిమ్మల్నే మీకు వినపడుతోందా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ జనాభాలో ప్రతీ నలుగురిలో ఒకరు 2050 నాటికి వినికిడి సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. బుధవారం ‘వరల్డ్ హియరింగ్ డే’ను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా చెవుడుకు సంబంధించిన అంశాలపై ఒక నివేదిక విడుదల చేసింది. చెవుడుకు కారణాలు, దాని నియంత్రణకు సరైన కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఇక నుంచి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది. వినికిడి లోపాల నివారణకు జాతీయ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. వినికిడి లోపం వల్ల పరస్పర సంభాషణ జరగదు. పైగా విద్య, ఉపాధికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 18 మందిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 2050 నాటికి వినికిడి లోపం (ఏదో ఒక స్థాయిలో... అంటే ఓ మోస్తరు నుంచి తీవ్రమైన వినికిడి సమస్యలు) ఉన్నవారి సంఖ్య 250 కోట్లకు పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అందులో 70 కోట్ల మందికి తప్పనిసరిగా ఏదో రకమైన పరికరం, లేదా వారికి అవసరమైన సాయం తప్పనిసరి. చెవుడును ప్రజారోగ్య సమస్యగా గుర్తించాలని స్పష్టం చేసింది. తక్కువ సౌండ్‌తో వినడం మంచిది చిన్నతనంలో వైరస్, బ్యాక్టీరియా వంటి వాటివల్ల చెవుడు వస్తుంది. బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో పూర్తిగా వినికిడి లోపం వస్తుంది. రూబెల్లా, మెదడు వాపునకు వ్యాక్సిన్ వేయడం ద్వారా చిన్నపిల్లల్లో వచ్చే వినికిడి సమస్యలను 60 శాతం తగ్గించొచ్చు. అలాగే చీముతో వచ్చే ఇన్ఫెక్షన్లను ఆరంభంలోనే గుర్తించి నియంత్రించాలి. మాతృత్వ సేవలు మెరుగుపరచడం వంటివి చేయాలి. పెద్దయ్యాక ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉంటాయి. కానీ వారిలో శబ్ద కాలుష్యం వల్ల చెవుడు వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, టీవీల్లో, మ్యూజిక్ సిస్టమ్స్‌లలో (ఇయర్‌ఫోన్స్‌లో కూడా) వాల్యూమ్‌ను పరిమితికి లోబడి ఉండేలా చూసుకోవడం, చెవులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వినికిడి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. కొన్ని మందులు చెవి సామర్థ్యాన్ని తగ్గించేవి ఉంటాయి. ఉదాహరణకు ఎమెనో గ్లైకోజైడ్స్ వర్గానికి చెందిన యాంటీబయాటిక్ మందుల వాడకం కొందరిలో చెవుడుకు దారితీ స్తుంది. 50 శాతం వరకు వినికిడి సమస్య వచ్చాకే బయటపడుతుంది. అప్పటివరకు చాలామంది గుర్తించలేరు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో ముందే గుర్తించవచ్చు. వినికిడి సమస్య ఉన్నవారు తరచుగా చెక్ చేసుకోవాలి. చిన్న లోపం ఉన్నా ప్రారంభంలోనే డాక్టర్ సలహా తీసుకోవాలి. 10 లక్షల జనాభాకు ఒకరే ఈఎన్టీ డాక్టర్ వినికిడి లోపం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. చెవుడు వల్ల వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాదు సమాజంలో వివక్షకు గురవుతారు. అలాంటి వారు వైద్యున్ని కూడా సంప్రదించకుండా మధనపడతారు. అల్పాదాయ దేశాల్లో ఈఎన్టీ డాక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు. 78 శాతం పేదదేశాల్లో 10 లక్షల జనాభాకు ఒక్క ఈఎన్టీ డాక్టర్ కూడా లేడు. ఆడియాలజిస్ట్ (వినికిడి పరీక్షించేవారు), స్పీచ్ థెరపిస్ట్‌లు ఇంకా తక్కువ ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అందువల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ల్లో వినికిడి సమస్యలకు చికిత్స జరగాలి. జనాభాలో ఎంతమందికి వినికిడి సమస్య ఉందో లెక్క తేల్చాలి. సార్వజనీన ఆరోగ్య పథకంలో వినికిడి సంబంధిత వ్యాధులను చేర్చాలి. -
నేను వినలేను సార్..!
ప్రకాశం, ఉలవపాడు: పుట్టిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వినికిడి లోపంతో పుట్టిన ఆ బిడ్డను చూసి నిశ్చేష్టులయ్యారు. దీనిని గుర్తించడానికి కాస్త సమయం పట్టింది. అయితే వయసు పెరిగే కొద్దీ వినికిడి జ్ఞానం వస్తుందేమో అని కొందరు వైద్యులు అనడంతో ఎదురుచూశారు. నెమ్మదిగా బాబుకు 8 ఏళ్లు దాటినా వినపడకపోవడంతో పెద్ద వైద్యశాలలో చూపించారు. రెండు చెవులు పనిచేయడంలేద.. ఆపరేషన్ చేసి లోపల యంత్రాలు అమరిస్తే వినబడుతుందని డాక్టర్లు తల్లిదండ్రులకు తెలియచేశారు. దీనికి సుమారు రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి అంత డబ్బు ఎలా తేవాలో తెలియక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో నివాసం ఉంటున్న ఆండ్ర సిద్దయ్య సొంత గ్రామం వలేటివారిపాలెం మండలం నలదలపూరు. అయితే బద్దిపూడి గ్రామానికి చెందిన అమరావతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు సంతానంగా కలిగారు. మగబిడ్డ అయిన యశ్వంత్ సాయి పుట్టుక నుంచి వినికిడి లోపం కలిగింది. అయితే ఇతని తల్లి అమరావతి తమ్ముళ్లు కూడా దివ్యాంగులు కావడంతో ఆ కుటుంబం ప్రస్తుతం బద్దిపూడి గ్రామంలో నివాసం ఉంటోంది. యశ్వంత్ సాయికి పలు చోట్ల చెవిటికి సంబంధించి పరీక్షలు చేశారు. హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాల వైద్యులు పరీక్షలు జరిపి ఆపరేషన్ చేస్తే వినబడుతుందని తెలియచేశారు. కూలీ పనులు చేసుకునే సిద్దయ్యకు రూ. 7 లక్షలు ఎక్కడ నుంచి తేవాలో తెలియక అల్లాడిపోతున్నాడు. సీఎం సహాయ నిధి నుంచిరూ. 2 లక్షలు .. బాధితుని తండ్రి తన కుమారునికి నయం చేయించాలని సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డికి దరఖాస్తు అందచేయడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే రూ. 2 లక్షలు మంజూరుచేసింది. కానీ మరో రూ. 5 లక్షలు తీసుకుని వైద్యశాలకు వెళితే కానీ ఆపరేషన్ చేసే వీలు కలుగుతుంది. యశ్వంత్ సాయికి ఆపరేషన్ చేస్తే వినికిడి శక్తి వస్తుందని వైద్యులు నిర్ధారించారు. చెవి ఆపరేషన్‌లో భాగంగా కాక్లియర్ ఇంప్లాంట్, స్పీచ్ డివైస్‌ను లోపల అమర్చితే బాబుకు మాట వినబడుతుంది. పరీక్షల నిమిత్తం ప్రస్తుతం ఈ చిన్నారి హైదరాబాద్ వైద్యశాలలోనే ఉన్నాడు. పేదరికంలో ఉన్న ఈ కుటుంబానికి ప్రస్తుతం చేయూత అవసరం. ఆదుకోవాలనుకునేవారు ఆండ్ర సిద్దయ్య బ్యాంకు అకౌంటు నంబరు 6652355277 (శాఖవరం గ్రామం), ఐయఫ్యస్సీ కోడు ఐడీఐబీ 0005068 నంబరుకు పంపాలని కోరారు. బద్దిపూడి గ్రామానికి చెందిన ఫిజియోధెరపీ వైద్యుడు తాటితోటి సుధాకర్ (ఫోన్ నంబర్లు 9182007257,9948345663)ను సంప్రదించి దాతలు సహకరించాలని కోరారు. -
శస్త్రచికిత్సతో వినికిడి లోపం మాయం
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి ‘హైరెన్ ఆల్ట్రా కాక్లియర్ ఇంప్లాంటేషన్’వినికిడి శక్తిని ప్రసాదించింది. దేశంలోనే ఈ తరహా ఇంప్లాంటేషన్ ఇదే తొలిదని ప్రముఖ కాక్లి్లయర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ ఈసీ వినయ్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన చికిత్స వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన నర్సింగరావు, నిత్య కుమారుడు యశ్వంత్(6) పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అపోలో ఆస్పత్రి డాక్టర్ వినయ్‌కుమార్‌ను సంప్రదించారు. ఆయన కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా వినికిడి శక్తితో పాటు మాటలను తెప్పించవచ్చని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో దేశంలోనే తొలిసారిగా దీన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో యశ్వంత్‌కు విజయవంతంగా అమర్చారు. ఈ సర్జరీ సులువుగా, సురక్షితంగా నిర్వహించామని డాక్టర్ వినయ్ చెప్పారు. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి చిన్న సాధనాల్లో ఇది కూడా ఒకటి కావడం వల్ల పిల్లలకు సరిగ్గా అతుకుతుందన్నారు. ఈ పరికరాన్ని ఎముక, చర్మానికి మధ్యలో పెడతారని తెలిపారు. ఉత్తమ వినికిడికి వీలుగా విస్తృత స్థాయిలో శబ్దాలను గ్రహిస్తుందని చెప్పారు. -
చిన్నారుల మూగ..రోదన..
♦ ఖరీదైన వైద్యం.. పేదలకు దూరం ♦ కాక్లియర్ ఇంప్లాంటేషన్లేక మాట, వినికిడి సమస్య ♦ ఎన్టీఆర్ ఆరోగ్యసేవలో తొలగింపుతో ఇబ్బందులు ♦ వయస్సుతో ముడిపెడుతున్న అధికారులు ♦ పాఠశాలల్లో విద్యార్థులకు తప్పని కష్టాలు ♦ జిల్లాలో శస్త్రచికిత్స అవసరమైన వారు 542 మంది పేరు యు.వెంకటజనార్దన్(10). చెన్నూరు పడమటి వీధిలో వీరి కుటుంబం ఉంటోంది. పుట్టుక నుంచి ఇతనికి మాట వినపడదు. మాటలు రావు. తండ్రి వెంక టేష్ అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లిపైనే కుటుంబ భారం పడింది. ఇంటివద్ద దోశెలు పోసుకుంటూ జీవించే పేద కుటుంబానికి ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేదు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేస్తే ప్రయోజనమని చెప్పారు. అప్పట్లో రేషన్‌కార్డులో పేరు లేకపోవడంతో ఆపరేషన్ చేయలేదు. తర్వాత పలుమార్లు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ప్రయోజనం లేదు. పేరు ఎస్ నాగేంద్ర(11). చెన్నూరు మండలం కొండపేటకి చెందిన నాగరాజు, గంగమ్మల కుమారుడు. మేనరికం కావడంతో ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి పుట్టుకతోనే వినికిడిలోపం వచ్చిం ది. వారిలో నాగేంద్రతో పాటూ అతని అక్క సురేఖ(15)కు గొంతు మూగబోయింది. వీరికి లక్షల ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయించే స్తోమత తల్లిదండ్రులకు లేదు. వైద్యసేవలో చేయించాలన్నా జాబితా నుంచి తొలగించడంతో ఇక వారికి వైద్యం అందనంత దూరమైంది. 100 శాతం లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించినా వికలాంగ పింఛను రావడం లేదు. చెన్నూరు : పేద లకు ఖరీదైన వైద్యం దూరమైంది. జిల్లాలో వినికిడిలోపం ఉన్న 6 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు 599మంది ఉండగా వీరిలో మాటలు రానివారు 510 మంది ఉన్నారు. వీరు 100 శాతం వికలాంగులుగా అధికారులు నిర్ధారించారు. వీరికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేస్తే వినికిడి సమస్య నుంచి బయటపడతారు. కానీ ఆ అదృష్టాన్ని ఇప్పటి ప్రభుత్వం వారికి దూరం చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్యసేవలో ఈ ఆపరేషన్‌కు అనేక నిబంధనలు పెట్టడంతో ఈ చిన్నారుల భవిష్యత్ మూగబోయినట్లయింది. కేవలం రెండేళ్లలోపు చిన్నారులకు మాత్రమే ఈ సౌకర్యం ఉందని చెబుతున్న ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇంతవరకు శస్త్రచికిత్స చేసిన దాఖలాలు లేవు. మన రాష్ట్రంలో ఈ ఆధునికి శస్త్రచికిత్స చేసే వైద్యశాల కూడా లేదంటున్నారు వైద్యులు. నవ్యాంధ్రలో ఇప్పటివరకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స ప్రభుత్వరంగంలో జరగలేదని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం చెబుతున్న రెండేళ్లలోపు చిన్నారులు జిల్లాలో 32మంది ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కనీసం వారికైనా ఆ ఆపరేషన్ చేస్తారా అంటే అదీ లేదు. చిన్నారులపై కనికరం చూపే వారే కరువయ్యారు. వైఎస్సార్ చలువతో.. వినికిడిలోపం వల్ల మాటలు రాక ఇబ్బందులు పడుతున్న వారి జీవితాల్లో వెలుగు నింపారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయన ప్రవే శపెట్టిన ఆరోగ్యశ్రీలో పేదలకు అందనంత దూరంలో ఉన్న కాక్లియర్ ఇంప్లాంటేషన్‌ను చేర్చి వందలమంది చిన్నారులకు ప్రయోజనం కల్గించారు. ఒక్క 2008లోనే జిల్లాలో 13మందికి ఆ ప్రయోజనం కల్గించారు. అయితే అప్పట్లో రేషన్‌కార్డులో పేర్లులేకపోవడం, రేషన్‌కార్డులు లేకపోవడం ఇతరత్రా కారణాలతో కొందరు ఆ ఆపరేషన్ చేయించుకోలేకపోయారు. తర్వాత రేషన్‌కార్డుల్లో పేర్లు చేర్చినా ప్రయోజనం లేకపోయింది. వినికిడిలోపం వల్ల మూగబోయిన వీరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలల్లో మిగతా పిల్లల మాదిరిగా పాఠాలు వినలేక ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూరు మండలంలో కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులు ఆరుగురు ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులు చెన్నూరు మండలంలో ఉప్పరపల్లెలో ఓబులేసు(13), రామనపల్లెలో వాణి(16), చెన్నూరు అరుందతినగర్‌లో అఖిల(14), కొండపేటకు చెందిన గడ్డం సుకుమార్(4) రామనపల్లెకు చెందిన కె హరి(4)లు ఉన్నారు. ఆపరేషన్ చేస్తే చాలా ప్రయోజనం విద్యార్థులు చాలా చురుగ్గా ఉన్నారు. వినపడకపోవడంతో వారి గొంతు పూర్తిగా మూగబోయింది. కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయిస్తే సాధారణ వ్యక్తుల్లాగే వారు సమాజంలో జీవించగలరు. భవిత కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా ఈ ఆపరేషన్ చేయించడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది. -సుభద్రమ్మ ఐఈడీ ఉపాధ్యాయురాలు. చెన్నూరు మాదృష్టికి వస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి చేయిస్తాం నవ్యాంధ్రలో కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేసే వైద్యశాల లేదు. జిల్లాలో ఈ శస్త్రచికిత్స అవసరమున్నవారి వివరాలు ఇస్తే వారిని ఈఎన్టీ వైద్యుల వద్ద పరిక్షీంచి ఉన్నతాధికారులకు నివేదించి వైద్యం చేయిస్తాం. గ్రహణమొర్రి, చిన్న శస్త్రచికిత్సలను చేయిస్తున్నాం. -సత్యనారాయణరాజు, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి -
పిల్లలూ...వింటున్నారా?
కన్ను తర్వాత పరిసరాల గురించి అత్యంత ఎక్కువ సమాచారం దొరికేది వినికిడి జ్ఞానంతోనే. అందుకే పంచేంద్రియాల్లో చెవికి ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనిది. తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినేందుకు ఉపకరించేది చెవే. కాబట్టి పాఠశాల పిల్లల్లో జ్ఞాన సముపార్జనకు తోడ్పడే ఈ చెవినీ, దాని వల్ల వచ్చే పరిజ్ఞానాన్ని విస్మరించడానికి వీల్లేదు. సాధారణంగా పిల్లలకు చెవుల విషయంలో కనిపించే సమస్యలను ఇప్పుడే తెలుసుకుంటే ప్రస్తుతం ఉన్న సెలవుల్లోనే వాటిని చక్కదిద్దుకొని స్కూలుకు వెళ్లే సమయానికి హాయిగా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే ముఖ్యమైన సమస్యల్లో శాశ్వత వినికిడి లోపం ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో పుట్టే ప్రతి వెయ్యిమంది పిల్లల్లో నలుగురు వినికిడి లోపంతో జన్మిస్తున్నారని అంచనా. వినికిడి లోపం కారణంగా భవిష్యత్తులో మాట్లాడటం కూడా రాకపోవచ్చు. అందుకే పుట్టీపుట్టగానే వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి తగిన వైద్యం చేసి, ఆ లోపాలను సరిదిద్దవచ్చు. ఇక బాల్యంలో స్యూలుకు వెళ్లే సమయంలోనూ పిల్లల్లో చెవికి సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. వినికిడి సమస్యల వల్ల మనం ఇతరులతో సమచారాన్ని రాబట్టుకోవడం, పంచుకోవడం కష్టమవుతుంది. చెవితో పాటు గొంతు, ముక్కు సమస్యలు కూడా పిల్లలను సమస్యలకు లోను చేస్తాయి. ఇలాంటివారు తమ చెవితో పాటు, సంబంధిత ఇతర సమస్యలను చక్కదిద్దుకోడానికే ఈ కింది సూచనలు. 1.మనలో చాలామంది తరచూ చేసే తప్పు... చెవులను శుభ్రపరచడం. నిజానికి చెవులు తమంతట తామే శుభ్రమయ్యేలా ప్రకృతి వాటిని డిజైన్ చేసింది. మనం చెవులను శుభ్రం చేయడానికి ఉపయోగించే ‘ఇయర్ బడ్స్’ వల్ల మన చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. చెవిలోని గువిలిని ఇంకా లోపలికి నెడుతున్నాం. చెవిలోకి ఏదైనా వస్తువుగానీ, పురుగుగానీ ప్రవేశించినప్పుడు వాటినుంచి చెవిని రక్షించడం కోసమే ఈ గువిలి ఎక్కువ స్రవిస్తుంది. ఆ గువిలిని శుభ్రం చేయడం కోసం మనం పుల్లలను ఉపయోగించడం వల్ల చెవిలోని గ్రంథులు మరింత ఎక్కువగా గువిలిని స్రవించేలా చేసి సమస్య తీవ్రత అధికమవుతుంది. అందుకే చెవులను తరచూ శుభ్రపరచుకునే వారిలోనే గువిలి లేదా వ్యాక్స్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే ఇయర్‌బడ్స్, పుల్లలు, పెన్నులు, పిన్నీసులు వంటివి చెవుల్లో పెట్టుకొని శుభ్రం చేసుకోకూడదు. 2.చెవులను శుభ్రం చేయడానికి కొబ్బరి నూనె, ఆముదం లాంటివి వేయడం వల్ల కొత్త సమస్యలు మొదలువుతాయి. కాబట్టి ఆ పని ఎప్పుడూ చేయకూడదు. 3.చెవులలో చీముకారడం మరొక ముఖ్యమైన చెవికి సంబంధించిన సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే నిపుణులైన ఈఎన్టీ వైద్యులకు కలిసి సరైన చికిత్స, మందులు తీసుకోవాలి. సమస్యను బట్టి అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయించాల్సి రావచ్చు. 4.పిల్లలు ముఖ్యంగా వేసవికాలం సెలవుల్లో ఈత నేర్చుకోవడం కోసం నీటి కుంటలు, చెరువుల వంటి చోట్లకు వెళ్తుంటారు. ఆ సమయంలో పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు నీళ్లలో దిగిన సమయంలో పరిశుభ్రమైన నీళ్లలోకి దిగాలి. ఈత కొట్టే సమయంలో ఇయర్ ప్లగ్స్ ధరించడం ద్వారా ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. 5.తరచూ జలుబు చేసే పిల్లల్లో కూడా ముక్కు మూసుకుపోవడం వల్ల చెవి మధ్యభాగంలో గాలి ప్రసరణ జరగకపోవడం వల్ల వీరిలో చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. అందువల్ల తరచూ జలుబు చేసేవారిలో అందుకు సంబంధించిన కారణాలు కనుక్కొని తగిన చికిత్స తీసుకోవాలి. ఈమధ్యకాలంలో పిల్లల్లో అలర్జీలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి వల్ల కూడా పిల్లల్లో తరచూ జలుబు కనిపిస్తోంది. ఇలా తరచూ జలుబు కనిపిస్తున్న పిల్లలను శ్రద్ధగా గమనిస్తూ ఏది తింటే సరిపడకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి, దాని నుంచి వారిని దూరంగా ఉంచడం, లేదా సరిపడని వాతావరణంలోకి వారిని తీసుకెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 6.గట్టి శబ్దాలను ఎక్కువసేపు వినడం, సంగీతం వినే సమయంలో ఎక్కువ తీవ్రతతో వినడం మొదలైన వాటి వల్ల పిల్లల్లో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అందుకే పిల్లలు పెద్ద పెద్ద శబ్దాలను గట్టిగా వినడం సరికాదు. మ్యూజిక్‌ను పెద్దగా సౌండ్ పెట్టుకొని వినడం, గట్టిగట్టిగా పేలే టపాకాయ శబ్దాలను వినడం వారిలో వినికిడి సమస్యలు రావడానికి కారణం కావచ్చు. 7.కొంతమంది పిల్లలు చెవిలో పుల్లలు, పెన్నులు, పిన్నులు, పిన్నీసులు వంటి వస్తువులు ఎక్కువగా పెట్టుకుంటుంటారు. దీనివల్ల ఒక్కోసారి వాళ్ల కర్ణభేరికి దెబ్బతగలవచ్చు. ఇలా జరగడం వల్ల కూడా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. దాంతో భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. 8.శుభ్రమైన తాగు నీరు తీసుకోకపోవడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, ఐస్‌క్రీములు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడంతో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ తర్వాత ఇవే ఇన్ఫెక్షన్లు చెవులకూ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చెవి, ముక్కు, గొంతు... ఈ మూడు కీలక అవయవాల్లో ఏ భాగంలో ఆరోగ్య సమస్య తలెత్తినా అది ఇతర భాగాలకు వ్యాపించే ఆస్కారం ఉంది. అవన్నీ వినికిడి సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి చెవి, గొంతు, ముక్కు... ఈ మూడు కీలక అవయవాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా, దాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ముఖ్యంగా పిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్లను అస్సలు విస్మరించకూడదు. 9.చెవిలో ఎక్కువ గువిలి వస్తున్నా, చెవి నుంచి చీము కారుతున్నా, చెవిలో నొప్పి వస్తున్నా, చెవిపోటు అనిపించినా, రాత్రి సమయాల్లో చెవిలో గుయ్ మనే శబ్దం వినిపిస్తున్నా, గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నా, మాటలు సరిగా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతున్నా... ఈ లక్షణాలలో ఏది కనిపించినా వెంటనే ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. వీలైతే ఈ సెలవుల్లోనే పిల్లలను ఈఎన్టీ నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. తగిన సలహా, చికిత్స తీసుకోండి. బడికి వెళ్లే సమయానికల్లా వారి సమస్యలు దూరమవుతాయి. - డాక్టర్ ఈసీ వినయకుమార్, హెచ్ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్ -
11 నెలల చిన్నారికి అరుదైన సర్జరీ
సాక్షి, హైదరాబాద్ : పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు సంవత్సరంలోగానే గుర్తించి శస్త్రచికిత్స నిర్వహిస్తే వారు సాధారణ జీవితాన్ని గడపవచ్చని డాక్టర్ కేఆర్ మేఘనాథ్ తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా 11 నెలల బాబుకు బైలాట్రల్ కన్స్ట్రక్ట్ సర్జరీని తమ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించగలిగినట్టు ఆయున తెలిపారు. బుధవారం హైదరాబాద్ వాసవి హాస్పిటల్‌లోని మా ఇఎన్‌టి ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాంత్రిక తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే ఇన్‌ప్లాంట్స్‌ను అమర్చే శస్త్రచికిత్స ద్వారా వినికిడి లోపాన్ని తగ్గించవచ్చు అన్నారు. ఈ శస్త్రచికిత్సను ఇప్పటివరకు 11సంవత్సరాల నుంచి మొదలుకొని 52 సంవత్సరాల వయస్సు వారికి కూడా నిర్వహించినట్లు తెలిపారు. గతంలో ఒక చెవికి మాత్రమే చేసేవారమని, అయితే ఇప్పుడు రెండు చెవులకు కూడా ఈ సర్జరీ నిర్వహిస్తున్నావుని అన్నారు. ఇలా రెండు చెవులకు శస్త్రచికిత్స ద్వారా మామూలు వ్యక్తుల్లో ఉన్నట్టే వినికిడి శక్తి వస్తుందన్నారు. ఒక్కసారి ఇన్‌ప్లాంట్స్ అమరిస్తే దాదాపు పదేళ్లకుపైగా ఎలాంటి వినికిడి సమస్యలు తలెత్తవన్నారు. ఏడాదిలోపు పిల్లలకు ఉచితంగా పరీక్ష చేస్తున్నావుని డాక్టర్ మేఘనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, సతీష్, చీఫ్ ఆర్డియాలజిస్ట్ రాజా తదితరులు పాల్గొన్నారు.