న్యాయవాది అడ్వా సారా సన్ని భారతదేశపు మొట్టమొదటి వినికిడి లోపం గల రిజిస్టర్డ్ ప్రాక్టీసింగ్ లాయర్‌గా చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 4న ఆమెకు సహాయం చేయడానికి సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ద్వారా సర్టిఫైడ్ ఇంటర్‌ప్రెటర్ సేవలను పొందాలని కోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్ 8న కర్ణాటక హైకోర్ట్ రిజిస్టర్డ్ సంజ్ఞా భాషా వ్యాఖ్యాత ద్వారా వినికిడి లోపం ఉన్న న్యాయవాది నుంచి వాదనలు విన్నది. దీంతో అడ్వకేట్ సారా సన్నీతోపాటు కర్ణాటక హైకోర్ట్ కూడా దివ్యాంగులకు ఒక గొప్ప బాసటగా నిలిచినట్లయింది. ఇది న్యాయ నిపుణులకు మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్న పౌరులకు కూడా సమగ్ర న్యాయవ్యవస్థకు మార్గం మరింతగా సుగమం చేస్తుంది.
జస్టిస్ ఎం నాగప్రసన్న, అదనపు సొలిసిటర్ జనరల్ అరవింద్ కామత్‌లతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ అడ్వా సన్నీ నమోదును ప్రశంసించింది. ఏఎస్‌జీ కామత్ మాట్లాడుతూ ‘ఇంటర్‌ప్రెటర్ ద్వారా హియరింగ్, స్పీచ్ ఇంపెయిర్‌డ్ అడ్వకేట్ వాదనను విన్న మొదటి హైకోర్టుగా కర్ణాటక హైకోర్టు చరిత్రలో నిలిచిపోతుంది. సారా సన్నీ సంకేత భాషా వ్యాఖ్యాత ద్వారా వినికిడిలోపం, ప్రసంగం బలహీనంగా ఉండటం వల్ల కలిగే వైకల్యాన్ని ఓడించింది. అందుకు సారా సన్నీని అభినందించాల్సిందే. సంజ్ఞా భాషా వ్యాఖ్యాత ద్వారా వాదప్రతివాదనలు జరిగినప్పటికీ ప్రశంసలు రికార్డులలో నమోదు అవుతాయి’ అని తెలియజేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ‘భారత న్యాయవ్యవస్థలో వివిధ నేపథ్యాల నుండి ఎక్కువ మంది మహిళలు చేరాల’ని పదే పదే ప్రస్తావించారు.
ప్రోత్సహించడానికి... అడ్వా సారా సన్నీ కేరళలోని కొట్టాయం వాసి. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. కేవలం స్వీయ ఆసక్తితో మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్న ఇతరులను కూడా ప్రోత్సహించడానికి న్యాయవాద వృత్తిని ఎంచుకుంది. అడ్వకేట్ సన్నీ ఇప్పుడు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ అండ్ హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్‌లో యాక్టివ్ మెంబర్. సెప్టెంబరు 2023లో న్యాయవాది సన్నీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక కేసు వాదించిన, వినికిడి లోపం ఉన్న మొట్ట మొదటి లాయర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంలో సన్నీ ‘డీవై చంద్రచూడ్ ఓపెన్ మైండ్ ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం తలుపులు తెరిచింది’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సన్నీ కోర్టు సబిమిషన్స్‌లో సహాయం చేయడానికి సంకేత భాషా ఇంటర్‌ప్రెటర్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు గతంలో తన రిజిస్ట్రీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అది అమలు అయ్యింది. వైకల్యాలున్నవారు తమ అడ్డంకులను అధిగమించడంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment