♦ ఖరీదైన వైద్యం.. పేదలకు దూరం
♦ కాక్లియర్ ఇంప్లాంటేషన్‌లేక మాట, వినికిడి సమస్య
♦ ఎన్టీఆర్ ఆరోగ్యసేవలో తొలగింపుతో ఇబ్బందులు
♦ వయస్సుతో ముడిపెడుతున్న అధికారులు
♦ పాఠశాలల్లో విద్యార్థులకు తప్పని కష్టాలు
♦ జిల్లాలో శస్త్రచికిత్స అవసరమైన వారు 542 మంది
పేరు యు.వెంకటజనార్దన్(10). చెన్నూరు పడమటి వీధిలో వీరి కుటుంబం ఉంటోంది. పుట్టుక నుంచి ఇతనికి మాట వినపడదు. మాటలు రావు. తండ్రి వెంక టేష్ అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లిపైనే కుటుంబ భారం పడింది. ఇంటివద్ద దోశెలు పోసుకుంటూ జీవించే పేద కుటుంబానికి ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేదు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేస్తే ప్రయోజనమని చెప్పారు. అప్పట్లో రేషన్‌కార్డులో పేరు లేకపోవడంతో ఆపరేషన్ చేయలేదు. తర్వాత పలుమార్లు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ప్రయోజనం లేదు.
పేరు ఎస్ నాగేంద్ర(11). చెన్నూరు మండలం కొండపేటకి చెందిన నాగరాజు, గంగమ్మల కుమారుడు. మేనరికం కావడంతో ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి పుట్టుకతోనే వినికిడిలోపం వచ్చిం ది. వారిలో నాగేంద్రతో పాటూ అతని అక్క సురేఖ(15)కు గొంతు మూగబోయింది. వీరికి లక్షల ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయించే స్తోమత తల్లిదండ్రులకు లేదు. వైద్యసేవలో చేయించాలన్నా జాబితా నుంచి తొలగించడంతో ఇక వారికి వైద్యం అందనంత దూరమైంది. 100 శాతం లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించినా వికలాంగ పింఛను రావడం లేదు.
చెన్నూరు : పేద లకు ఖరీదైన వైద్యం దూరమైంది. జిల్లాలో వినికిడిలోపం ఉన్న 6 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు 599మంది ఉండగా వీరిలో మాటలు రానివారు 510 మంది ఉన్నారు. వీరు 100 శాతం వికలాంగులుగా అధికారులు నిర్ధారించారు. వీరికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేస్తే వినికిడి సమస్య నుంచి బయటపడతారు. కానీ ఆ అదృష్టాన్ని ఇప్పటి ప్రభుత్వం వారికి దూరం చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్యసేవలో ఈ ఆపరేషన్‌కు అనేక నిబంధనలు పెట్టడంతో ఈ చిన్నారుల భవిష్యత్ మూగబోయినట్లయింది. కేవలం రెండేళ్లలోపు చిన్నారులకు మాత్రమే ఈ సౌకర్యం ఉందని చెబుతున్న ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇంతవరకు శస్త్రచికిత్స చేసిన దాఖలాలు లేవు. మన రాష్ట్రంలో ఈ ఆధునికి శస్త్రచికిత్స చేసే వైద్యశాల కూడా లేదంటున్నారు వైద్యులు. నవ్యాంధ్రలో ఇప్పటివరకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స ప్రభుత్వరంగంలో జరగలేదని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం చెబుతున్న రెండేళ్లలోపు చిన్నారులు జిల్లాలో 32మంది ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కనీసం వారికైనా ఆ ఆపరేషన్ చేస్తారా అంటే అదీ లేదు. చిన్నారులపై కనికరం చూపే వారే కరువయ్యారు.
వైఎస్సార్ చలువతో..
వినికిడిలోపం వల్ల మాటలు రాక ఇబ్బందులు పడుతున్న వారి జీవితాల్లో వెలుగు నింపారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయన ప్రవే శపెట్టిన ఆరోగ్యశ్రీలో పేదలకు అందనంత దూరంలో ఉన్న కాక్లియర్ ఇంప్లాంటేషన్‌ను చేర్చి వందలమంది చిన్నారులకు ప్రయోజనం కల్గించారు. ఒక్క 2008లోనే జిల్లాలో 13మందికి ఆ ప్రయోజనం కల్గించారు. అయితే అప్పట్లో రేషన్‌కార్డులో పేర్లులేకపోవడం, రేషన్‌కార్డులు లేకపోవడం ఇతరత్రా కారణాలతో కొందరు ఆ ఆపరేషన్ చేయించుకోలేకపోయారు. తర్వాత రేషన్‌కార్డుల్లో పేర్లు చేర్చినా ప్రయోజనం లేకపోయింది. వినికిడిలోపం వల్ల మూగబోయిన వీరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలల్లో మిగతా పిల్లల మాదిరిగా పాఠాలు వినలేక ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూరు మండలంలో కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులు ఆరుగురు ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులు చెన్నూరు మండలంలో ఉప్పరపల్లెలో ఓబులేసు(13), రామనపల్లెలో వాణి(16), చెన్నూరు అరుందతినగర్‌లో అఖిల(14), కొండపేటకు చెందిన గడ్డం సుకుమార్(4) రామనపల్లెకు చెందిన కె హరి(4)లు ఉన్నారు.
ఆపరేషన్ చేస్తే చాలా ప్రయోజనం
విద్యార్థులు చాలా చురుగ్గా ఉన్నారు. వినపడకపోవడంతో వారి గొంతు పూర్తిగా మూగబోయింది. కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయిస్తే సాధారణ వ్యక్తుల్లాగే వారు సమాజంలో జీవించగలరు. భవిత కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా ఈ ఆపరేషన్ చేయించడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది. -సుభద్రమ్మ ఐఈడీ ఉపాధ్యాయురాలు. చెన్నూరు
మాదృష్టికి వస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి చేయిస్తాం
నవ్యాంధ్రలో కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేసే వైద్యశాల లేదు. జిల్లాలో ఈ శస్త్రచికిత్స అవసరమున్నవారి వివరాలు ఇస్తే వారిని ఈఎన్‌టీ వైద్యుల వద్ద పరిక్షీంచి ఉన్నతాధికారులకు నివేదించి వైద్యం చేయిస్తాం. గ్రహణమొర్రి, చిన్న శస్త్రచికిత్సలను చేయిస్తున్నాం.
-సత్యనారాయణరాజు, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి