వేల కొలది పాటలు పాడిన గాయనికి హటాత్తుగా పాట వినపడకపోతే? వాయిద్య ధ్వని వినపడకపోతే? సంగీతమే చెవులకు సోకకపోతే? అసలు ఏమీ వినిపించకపోతే? అంతకు మించిన వేదన ఉంటుందా? గాయని అల్కా యాగ్నిక్ తనకు అరుదైన ‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ వచ్చిందని ప్రకటించింది. ‘మిత్రులారా... పెద్ద పెద్ద శబ్దాలకు, హెడ్‌ఫోన్ల అతి వాడకానికి దూరంగా ఉండండి’ అని హెచ్చరించింది.ఆమె అవస్థ నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటి?
‘ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్’ (తేజాబ్), ‘చోలీ కే పీఛే క్యా హై’ (ఖల్ నాయక్), ‘తాళ్ సే తాళ్ మిలా’ (తాళ్) వంటి వందలాది హిట్ పాటలు పాడిన అల్కా యాగ్నిక్ (56) ఏ సంగీతాన్ని విని, పాడాలో ఆ సంగీతాన్ని వినలేని హఠాత్ స్థితికి వచ్చి పడింది. ఆమె ‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’తో బాధ పడుతున్నట్టు డాక్టర్లు నిర్థారించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా అకౌంట్ ‘ది రియల్ అల్కా యాగ్నిక్’ ద్వారా లోకానికి వెల్లడి చేసింది.
ఆమె చెప్పింది ఏమిటి?
‘కొన్ని వారాల క్రితం నేను విమానం దిగగానే అసలు ఏమీ వినపడని స్థితికి చేరుకున్నాను. ఆ దెబ్బ నుంచి నేను ధైర్యం చిక్కబట్టుకోవడానికి కొన్నివారాల సమయం పట్టింది. ఇన్నాళ్లుగా నేను ఎందుకు కనపడటం లేదని అడుగుతున్న అభిమానులకు, మిత్రులకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ అనే అరుదైన జబ్బుతో బాధ పడుతున్నట్టు డాక్టర్లు తేల్చారు. ఇది వైరల్ అటాక్ అని చెప్పారు. ఈ స్థితి నుంచి కోలుకొని నేను తిరిగి వస్తానని భావిస్తున్నాను. దయచేసి అందరూ పెద్ద శబ్దాలకు, హెడ్‌ఫోన్ల విపరీత వాడకానికి దూరంగా ఉండండి’ అని తన ఇన్‌స్టా అకౌంట్‌లో రాసిందామె.
‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ అంటే?
ఇది హఠాత్తుగా వచ్చే చెవుడు. చెవిలోని హియరింగ్ నర్వ్ మీద వైరస్ దాడి చేయడంతో ఆ నర్వ్ ఉబ్బుతుంది. అయితే ఆ నర్వ్ ఒక ఇరుకైన అస్థిక ద్వారా ప్రయాణిస్తుంది కనుక ఎప్పుడైతే ఉబ్బుతుందో అప్పుడు ఒత్తిడికి లోనవుతుంది. దాంతో పనిచేసే గుణం కోల్పోతుంది. దీనివల్ల శబ్దాలు మెదడుకు చేరే వ్యవస్థ దెబ్బ తింటుంది. హఠాత్తుగా చెవుడు వస్తుంది.
⇒ ఈ స్థితికి ముందు ఎటువంటి లక్షణాలూ కనిపించవు.
⇒ ఒక చెవితో మొదలై రెండోచెవికి వ్యాధి రావచ్చు. ఒకోసారి రెండు చెవులకు ఒకేసారి రావచ్చు.
⇒ వార్థక్యం వల్ల, అనువంశికంగా ఈ వ్యాధి రావచ్చు.
⇒ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు.
⇒ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల రావచ్చు.
⇒ కొన్ని రకాల మందుల వాడకం వల్ల రావచ్చు.
⇒ పెద్ద పెద్ద శబ్దాలు వినడం, పెద్ద శబ్దంతో హెడ్‌ఫోన్ ఎక్కువ సేపు వాడటం వల్ల రావచ్చు.
అల్కా కోలుకోవాలి
అల్కా తన పరిస్థితిని ప్రకటించిన వెంటనే ఆమె సహ గాయకులు సోను నిగమ్, ఇలా అరుణ్, శంకర్ మహదేవన్, కుమార్ సాను స్పందించారు. ‘మళ్లీ నిన్ను యథావిధిగా చూస్తాం. మా ప్రేమ నీతో ఉంది’ అని వారు కామెంట్లు చేశారు. ధైర్యం చెప్పారు. గాయనిగా ఉంటూనే అల్కా వివిధ రియాల్టీ షోలలో హోస్ట్‌గా పాల్గొంటూ ఉంటుంది. ఆమె మన బాలూతో పాడిన ‘దేఖా హై పెహెలీ బార్’ (సాజన్) వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా స్టేజ్‌షోలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్నాళ్ల పాటు వాటన్నింటికి ఆమె దూరంగా ఉండాల్సిందే. అన్నింటికంటే పెద్ద ఇబ్బంది ఏమిటంటే హఠాత్తుగా వచ్చిన చెవుడు వల్ల తిరిగి సహజంగా/ కృత్రిమంగా వినికిడి వ్యవస్థ పునరుద్ధరింపబడే వరకూ అసలేమీ వినిపించకపోవడంతో అయోమయం ఏర్పడుతుంది. డిప్రెషన్ రావచ్చు. జీవితేచ్ఛ నశించవచ్చు. బంధుమిత్రుల గట్టి సపోర్ట్ ఉంటే, ఆత్మవిశ్వాసం నిలుపుకుంటే తప్ప ఈ పరిస్థితి దాటటం కష్టం. ‘మీ ప్రార్థనల్లో నన్ను ప్రస్తావించండి’ అని కోరిన అల్కాకు అభిమానుల ప్రార్థనలు సమృద్ధిగా ఉన్నాయి. ఆమె తప్పక కోలుకుంటుందని ఆశిద్దాం.
చికిత్స
⇒ ఈ స్థితి కనిపించిన వెంటనే చికిత్సకు వెళితే కొన్ని రకాల హైడోస్ స్టెరాయిడ్స్ వల్ల పరిస్థితిని మెరుగు పరిచే వీలు ఉంటుంది.
⇒ కొంతమంది ఏ చికిత్సా చేయించుకోకపోయినా కొన్నాళ్లకు యాభై శాతం వినికిడి రావచ్చు.
⇒ కొందరి విషయంలో కాక్లియర్ ఇం΄్లాంట్స్ పని చేయవచ్చు.
⇒ ఎక్కువమంది విషయంలో చికిత్స ఉండదనే చెప్పాలి.
⇒ వినికిడి సాధనాలతో వీరు జీవితం గడపాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment