ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్.. మితిమీరి వినియోగంతో ప్రమాదం
చిన్న వయసులోనే వినికిడి లోపాలు వస్తున్నాయన్న వైద్యులు
నిర్ధారిస్తున్న అంతర్జాతీయ వైద్య పరిశోధనలు
ఆందోళనకరంగా పరిశోధన ఫలితాలు
బిఎమ్‌జె గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితం
ఇంట్లో, ఆఫీసుల్లో ల్యాప్‌టాప్స్ పట్టుకుని చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పనిచేయడం, రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదించడం.. ఇవి సరిపోవన్నట్టు వీకెండ్స్‌లో పబ్స్, క్లబ్స్‌లో చెవులు చిల్లులు పడే మ్యూజిక్ హోరులో మునిగి తేలడం.. ఇవన్నీ నగరంలో టీనేజర్లు, యువత జీవనశైలిలో రొటీన్ పనులు. అయితే నేడు వీరు అనుసరిస్తున్న ఈ రకమైన పద్ధతులు రేపటి వారి వినికిడి లోపానికి కారణం కానున్నాయా? అంటే.. అవుననే సమాధానం ఇస్తున్నాయి అధ్యయనాలు. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు..
సురక్షితం కాని శ్రవణ పద్ధతులు అవలంబిస్తుండడం వల్ల ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం
ఉందని తాజా పరిశోధనలో తేలింది. వీరిలో కూడా అత్యధికులు యువత, టీనేజర్లే కానుండడం ఆందోళనకరం. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలు బిఎమ్‌జె గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం, పరిమితికి మించి స్మార్ట్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాలు (పర్సనల్ లిజనింగ్ డివైజెస్/పిఎల్‌డిలు) ఉపయోగించడం, పెద్దగా ధ్వనించే సంగీత వేదికలు యువత వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24 శాతం టీనేజర్లు, 48 శాతం మంది యుక్తవయసు్కలు పరిమితికి మించి చెవులుకు పనిపెడుతున్నారని పరిశోధనలో తేలింది. ఈ సంఖ్యల ఆధారంగా, పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 0.67, 1.35 బిలియన్ల మంది మధ్య, యుక్తవయసు్కలు వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం
ఉందని కూడా పరిశోధకులు లెక్కగట్టారు.
పరిమితి మీరుతున్నారు..
గతంలో వెలువడిన ఓ పరిశోధన ఫలితాల ప్రకారం పీఎల్‌డీ వినియోగదారులు తరచూ 105 డెసిబుల్స్ కంటే ఎక్కువ వాల్యూమ్‌లను ఎంచుకుంటారు. వినోద వేదికలలో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డెసిబుల్స్‌మించి ఉంటాయి.. అయితే వైద్యులు అనుమతించిన స్థాయి పెద్దలకు 80 డెసిబుల్స్. పిల్లలకు 75 డెసిబుల్స్ మాత్రమే కావడం గమనార్హం. ‘ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు సురక్షితమైన వినికిడి మార్గాలను ప్రోత్సహించడం ద్వారా నష్ట నివారణకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం’ అని ఈ సందర్భంగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
టిన్నిటస్ సమస్యే ఎక్కువ..
నన్ను కలిసిన నగరవాసుల్లో కొందరికి చిన్న వయసులోనే వినికిడిలోపాలతో పాటు టిన్నిటస్ అనే ఒక సమస్య పెరుగుతోందని కూడా గుర్తించాం. టిన్నిటస్ అంటే ఫోన్ రింగింగ్, ఇతర శబ్దాలు పదే పదే తలలో, చెవుల్లో గింగురుమనే ఫాంటమ్ సెన్సేషన్స్. కొంత మంది దీని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే మరి కొందరు దీర్ఘకాలిక చెవినొప్పి అనుభవిస్తున్నారు. తీవ్రమైన శబ్దాలు, తద్వారా కలిగే అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వినికిడి లోపానికి దారి తీస్తాయి. అంతేకాదు వినికిడి సమస్యలు డిప్రెషన్, డిమెన్షియా, మతిమరుపు వ్యాధుల తీవ్రత పెరగడానికి కూడా కారణం
అవుతాయి.
– డా.ఎమ్.ప్రవీణ్‌కుమార్, ఇఎన్‌టీ వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment