పిల్లలూ...వింటున్నారా? | After eye the most information about the environment and ear | Sakshi
Sakshi News home page

పిల్లలూ...వింటున్నారా?

Published Sat, May 23 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

పిల్లలూ...వింటున్నారా?

పిల్లలూ...వింటున్నారా?

కన్ను తర్వాత పరిసరాల గురించి అత్యంత ఎక్కువ సమాచారం దొరికేది వినికిడి జ్ఞానంతోనే. అందుకే పంచేంద్రియాల్లో చెవికి ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనిది. తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినేందుకు ఉపకరించేది చెవే. కాబట్టి పాఠశాల పిల్లల్లో జ్ఞాన సముపార్జనకు తోడ్పడే ఈ చెవినీ, దాని వల్ల వచ్చే పరిజ్ఞానాన్ని విస్మరించడానికి వీల్లేదు. సాధారణంగా పిల్లలకు చెవుల విషయంలో కనిపించే సమస్యలను ఇప్పుడే తెలుసుకుంటే ప్రస్తుతం ఉన్న సెలవుల్లోనే వాటిని చక్కదిద్దుకొని స్కూలుకు వెళ్లే సమయానికి హాయిగా ఉండొచ్చు.
 

చిన్నపిల్లల్లో వచ్చే ముఖ్యమైన సమస్యల్లో శాశ్వత వినికిడి లోపం ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో పుట్టే ప్రతి వెయ్యిమంది పిల్లల్లో నలుగురు వినికిడి లోపంతో జన్మిస్తున్నారని అంచనా. వినికిడి లోపం కారణంగా భవిష్యత్తులో మాట్లాడటం కూడా రాకపోవచ్చు. అందుకే పుట్టీపుట్టగానే వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి తగిన వైద్యం చేసి, ఆ లోపాలను సరిదిద్దవచ్చు. ఇక బాల్యంలో స్యూలుకు వెళ్లే సమయంలోనూ పిల్లల్లో చెవికి సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. వినికిడి సమస్యల వల్ల మనం ఇతరులతో సమచారాన్ని రాబట్టుకోవడం, పంచుకోవడం కష్టమవుతుంది. చెవితో పాటు గొంతు, ముక్కు సమస్యలు కూడా పిల్లలను సమస్యలకు లోను చేస్తాయి. ఇలాంటివారు తమ చెవితో పాటు, సంబంధిత ఇతర సమస్యలను చక్కదిద్దుకోడానికే ఈ కింది సూచనలు.
 
1.మనలో చాలామంది తరచూ చేసే తప్పు... చెవులను శుభ్రపరచడం. నిజానికి చెవులు తమంతట తామే శుభ్రమయ్యేలా ప్రకృతి వాటిని డిజైన్ చేసింది. మనం చెవులను శుభ్రం చేయడానికి ఉపయోగించే ‘ఇయర్ బడ్స్’ వల్ల మన చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. చెవిలోని గువిలిని ఇంకా లోపలికి నెడుతున్నాం. చెవిలోకి ఏదైనా వస్తువుగానీ, పురుగుగానీ ప్రవేశించినప్పుడు వాటినుంచి చెవిని రక్షించడం కోసమే ఈ గువిలి ఎక్కువ స్రవిస్తుంది. ఆ గువిలిని శుభ్రం చేయడం కోసం మనం పుల్లలను ఉపయోగించడం వల్ల చెవిలోని గ్రంథులు మరింత ఎక్కువగా గువిలిని స్రవించేలా చేసి సమస్య తీవ్రత అధికమవుతుంది. అందుకే చెవులను తరచూ శుభ్రపరచుకునే వారిలోనే గువిలి లేదా వ్యాక్స్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే ఇయర్‌బడ్స్, పుల్లలు, పెన్నులు, పిన్నీసులు వంటివి చెవుల్లో పెట్టుకొని శుభ్రం చేసుకోకూడదు.
 
2.చెవులను శుభ్రం చేయడానికి కొబ్బరి నూనె, ఆముదం లాంటివి వేయడం వల్ల కొత్త సమస్యలు మొదలువుతాయి. కాబట్టి ఆ పని ఎప్పుడూ చేయకూడదు.

3.చెవులలో చీముకారడం మరొక ముఖ్యమైన చెవికి సంబంధించిన సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులకు కలిసి సరైన చికిత్స, మందులు తీసుకోవాలి. సమస్యను బట్టి అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయించాల్సి రావచ్చు.
 
4.పిల్లలు ముఖ్యంగా వేసవికాలం సెలవుల్లో ఈత నేర్చుకోవడం కోసం నీటి కుంటలు, చెరువుల వంటి చోట్లకు వెళ్తుంటారు. ఆ సమయంలో పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు నీళ్లలో దిగిన సమయంలో పరిశుభ్రమైన నీళ్లలోకి దిగాలి. ఈత కొట్టే సమయంలో ఇయర్ ప్లగ్స్ ధరించడం ద్వారా ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు.
 
5.తరచూ జలుబు చేసే పిల్లల్లో కూడా ముక్కు మూసుకుపోవడం వల్ల చెవి మధ్యభాగంలో గాలి ప్రసరణ జరగకపోవడం వల్ల వీరిలో చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. అందువల్ల తరచూ జలుబు చేసేవారిలో అందుకు సంబంధించిన కారణాలు కనుక్కొని తగిన చికిత్స తీసుకోవాలి. ఈమధ్యకాలంలో పిల్లల్లో అలర్జీలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి వల్ల కూడా పిల్లల్లో తరచూ జలుబు కనిపిస్తోంది. ఇలా తరచూ జలుబు కనిపిస్తున్న పిల్లలను శ్రద్ధగా గమనిస్తూ ఏది తింటే సరిపడకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి, దాని నుంచి వారిని దూరంగా ఉంచడం, లేదా సరిపడని వాతావరణంలోకి వారిని తీసుకెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

6.గట్టి శబ్దాలను ఎక్కువసేపు వినడం, సంగీతం వినే సమయంలో ఎక్కువ తీవ్రతతో వినడం మొదలైన వాటి వల్ల పిల్లల్లో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అందుకే పిల్లలు పెద్ద పెద్ద శబ్దాలను గట్టిగా వినడం సరికాదు. మ్యూజిక్‌ను పెద్దగా సౌండ్ పెట్టుకొని వినడం, గట్టిగట్టిగా పేలే టపాకాయ శబ్దాలను వినడం వారిలో వినికిడి సమస్యలు రావడానికి కారణం కావచ్చు.
 
7.కొంతమంది పిల్లలు చెవిలో పుల్లలు, పెన్నులు, పిన్నులు, పిన్నీసులు వంటి వస్తువులు ఎక్కువగా పెట్టుకుంటుంటారు. దీనివల్ల ఒక్కోసారి వాళ్ల కర్ణభేరికి  దెబ్బతగలవచ్చు. ఇలా జరగడం వల్ల కూడా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. దాంతో భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది.
 
8.శుభ్రమైన తాగు నీరు తీసుకోకపోవడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, ఐస్‌క్రీములు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడంతో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ తర్వాత ఇవే ఇన్ఫెక్షన్లు చెవులకూ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చెవి, ముక్కు, గొంతు... ఈ మూడు కీలక అవయవాల్లో ఏ భాగంలో ఆరోగ్య సమస్య తలెత్తినా అది ఇతర భాగాలకు వ్యాపించే ఆస్కారం ఉంది. అవన్నీ వినికిడి సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి చెవి, గొంతు, ముక్కు... ఈ మూడు కీలక అవయవాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా, దాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ముఖ్యంగా పిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్లను అస్సలు విస్మరించకూడదు.
 
9.చెవిలో ఎక్కువ గువిలి వస్తున్నా, చెవి నుంచి చీము కారుతున్నా, చెవిలో నొప్పి వస్తున్నా, చెవిపోటు అనిపించినా, రాత్రి సమయాల్లో చెవిలో గుయ్ మనే శబ్దం వినిపిస్తున్నా, గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నా, మాటలు సరిగా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతున్నా... ఈ లక్షణాలలో ఏది కనిపించినా వెంటనే ఈఎన్‌టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. వీలైతే ఈ సెలవుల్లోనే పిల్లలను ఈఎన్‌టీ నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. తగిన సలహా, చికిత్స తీసుకోండి. బడికి వెళ్లే సమయానికల్లా వారి సమస్యలు దూరమవుతాయి.
 
- డాక్టర్ ఈసీ వినయకుమార్, హెచ్‌ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్
అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement