Young childrens
-
ఆటల్లేవ్.. మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: ఆరుబయట పిల్లలు ఆడే ఆటలతో ఒకప్పుడు కాలనీలు సందడిసందడిగా ఉండేవి. పాఠశాలల రోజుల్లోసాయంత్రం పూట.. వేసవి సెలవుల్లో రోజంతా ఆటలాడి శారీరకంగా అలసి పిల్లలందరూ ఇళ్లకు చేరేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి దాదాపు కనుమరుగైంది. స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక పిల్లలంతా గంటల తరబడి వాటితోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లలోనే అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఇదే విషయమే ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, వీడియో గేమ్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చిన్నపిల్లలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. వీటి వాడకం పెరిగితే చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఊబకాయం, కంటి సమస్యలు, మున్ముందు మధుమేహం వంటి అనారోగ్యాలు దరిచేరే ప్రమాదముందని హెచ్చరించింది. రెండు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు రోజుకు గంట కంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగించకూడదని, అంతకంటే చిన్నపిల్లలు అసలే వాడకూడదని తాజాగా నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ సందర్భంగా ప్రస్తుతం చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. శారీరక శ్రమకు సెలవు.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వల్ల పెద్దలు, పిల్లలు శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం 23 శాతం మంది పెద్దలు, 80 శాతం టీనేజీ పిల్లలు శారీరకంగా ఉత్సాహంగా ఉండటం లేదని తేలింది. అత్యధికంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తేల్చింది. మరో విస్మయం కలిగించే వాస్తవం ఏంటంటే ఊబకాయం వల్ల చిన్నతనంలోనే పిల్లల్లో డయాబెటిక్ రావడం. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల్లో తలనొప్పి అత్యంత సాధారణమైంది. అలాగే ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల కూడా ఉండటంలేదు. అలాగే సెల్ఫోన్లకు, ట్యాబ్‌లకు అతుక్కుపోయే పిల్లలు సామాజిక సంబంధాలకు దూరమవుతున్నారు. ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా గ్రహించడంలేదు. యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది చూస్తున్నారని, అందులో పిల్లలు కూడా ఉన్నారని తేల్చింది. ఇది పిల్లల మెదళ్లపై చెడు ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. అంతేకాదు అనేక పాఠశాలలు పిల్లలకు ట్యాబ్‌లను తప్పనిసరి చేయడం కూడా సమస్యలకు కారణంగా నిలుస్తుంది. ప్రపంచంలో ఎనిమిదేళ్లలోపు పిల్లల్లో 42 శాతం మంది ట్యాబ్‌లను వినియోగిస్తున్నారని తేలింది. మాటలే కరువయ్యాయి.. పిల్లలు ప్రధానంగా తల్లిదండ్రులు, ఇతరులతో పరస్పరం మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో మనుషులతో సంబంధాలు కోల్పోతున్నారు. 24 గంటలూ మొబైల్లోనే మునుగుతూ ఇంట్లో పెద్దలతో మాట్లాడటం అనే మాటనే మరిచిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో చిన్నతనం నుంచే ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకం పెరిగిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక అనేక స్కూళ్లు చిన్నప్పటి నుంచే ట్యాబ్‌లను ప్రవేశపెట్టాయని, కొందరు విద్యార్థులు తమ రోజువారీ అసైన్మెంట్ల కోసం గాడ్జెట్లను వాడుతున్నారని తేలింది. ఆహారం తినిపించడానికీ గాడ్జెట్లే.. అనేకమంది తల్లిదండ్రులు పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఏడాది రెండేళ్ల వయసున్న పిల్లలకు ఆహారం తినిపించడానికి తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పిల్లలు వినడంలేదన్న భావనతో వారి చేతికి సెల్‌ఫోన్ లేదా ట్యాబ్‌లు ఇచ్చి తినిపించడమో చేస్తున్నారు. వాటిల్లో వీడియో గేమ్స్ చూపించడం ద్వారా తినిపిస్తున్నారు. ఈ పరిస్థితి హైదరాబాద్ వంటి మెట్రో నగరాల నుంచి మొదలు పెడితే చిన్నచిన్న పట్టణాల్లోనూ 60–70 శాతం మంది తల్లిదండ్రులు గాడ్జెట్లనే ఆశ్రయిస్తున్నారని తేలింది. నూతన మార్గదర్శకాలు.. ► చిన్నపిల్లలు ఆరోగ్యవంతంగా పెరగాలంటే వాళ్లు తక్కువగా కూర్చొని.. ఎక్కువ శారీరకంగా ఆడాలి. ►ఐదేళ్ల చిన్నారులు అత్యంత తక్కువ సమయంపాటే టీవీలు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ల ముందు కూర్చోవాలి. ►ఎక్కువ సేపు ఆడాలి. అలసిపోయి నిద్రపోవాలి. అలాగే పిల్లలు మానసికంగా ఎదగడానికి పుస్తకాలు చదవాలి. కథలు చెప్పాలి. పజిల్స్ ఆడాలి. పాటలు పాడాలి. అదే వారి అభివృద్ధికి కారకంగా నిలుస్తుంది. ►ఏడాది లోపు పిల్లలు తప్పనిసరిగా రోజుకు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. ►ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలు కనీసం 3 గంటలపాటు వివిధ రకాల శారీరకమైన ఆటల్లో నిమగ్నమవ్వాలి. ►రెండేళ్లలోపు పిల్లలు గంటకు మించి ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో ఆడకూడదు. వాళ్లు రోజుకు కనీసం 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి. ►మూడు నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలు 3 గంటలపాటు ఏదో ఒకరకమైన శారీరక శ్రమలో ఉండాలి. ఆడుతూ ఉండాలి. కనీసం గంటపాటు ఒకరకమైన ఆ వయసుకు సంబంధించిన కఠినమైన వ్యాయా మం ఉండాలి. ఈ వయసు వారు రోజుకు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి. -
పిల్లలూ...వింటున్నారా?
కన్ను తర్వాత పరిసరాల గురించి అత్యంత ఎక్కువ సమాచారం దొరికేది వినికిడి జ్ఞానంతోనే. అందుకే పంచేంద్రియాల్లో చెవికి ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనిది. తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినేందుకు ఉపకరించేది చెవే. కాబట్టి పాఠశాల పిల్లల్లో జ్ఞాన సముపార్జనకు తోడ్పడే ఈ చెవినీ, దాని వల్ల వచ్చే పరిజ్ఞానాన్ని విస్మరించడానికి వీల్లేదు. సాధారణంగా పిల్లలకు చెవుల విషయంలో కనిపించే సమస్యలను ఇప్పుడే తెలుసుకుంటే ప్రస్తుతం ఉన్న సెలవుల్లోనే వాటిని చక్కదిద్దుకొని స్కూలుకు వెళ్లే సమయానికి హాయిగా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే ముఖ్యమైన సమస్యల్లో శాశ్వత వినికిడి లోపం ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో పుట్టే ప్రతి వెయ్యిమంది పిల్లల్లో నలుగురు వినికిడి లోపంతో జన్మిస్తున్నారని అంచనా. వినికిడి లోపం కారణంగా భవిష్యత్తులో మాట్లాడటం కూడా రాకపోవచ్చు. అందుకే పుట్టీపుట్టగానే వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి తగిన వైద్యం చేసి, ఆ లోపాలను సరిదిద్దవచ్చు. ఇక బాల్యంలో స్యూలుకు వెళ్లే సమయంలోనూ పిల్లల్లో చెవికి సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. వినికిడి సమస్యల వల్ల మనం ఇతరులతో సమచారాన్ని రాబట్టుకోవడం, పంచుకోవడం కష్టమవుతుంది. చెవితో పాటు గొంతు, ముక్కు సమస్యలు కూడా పిల్లలను సమస్యలకు లోను చేస్తాయి. ఇలాంటివారు తమ చెవితో పాటు, సంబంధిత ఇతర సమస్యలను చక్కదిద్దుకోడానికే ఈ కింది సూచనలు. 1.మనలో చాలామంది తరచూ చేసే తప్పు... చెవులను శుభ్రపరచడం. నిజానికి చెవులు తమంతట తామే శుభ్రమయ్యేలా ప్రకృతి వాటిని డిజైన్ చేసింది. మనం చెవులను శుభ్రం చేయడానికి ఉపయోగించే ‘ఇయర్ బడ్స్’ వల్ల మన చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. చెవిలోని గువిలిని ఇంకా లోపలికి నెడుతున్నాం. చెవిలోకి ఏదైనా వస్తువుగానీ, పురుగుగానీ ప్రవేశించినప్పుడు వాటినుంచి చెవిని రక్షించడం కోసమే ఈ గువిలి ఎక్కువ స్రవిస్తుంది. ఆ గువిలిని శుభ్రం చేయడం కోసం మనం పుల్లలను ఉపయోగించడం వల్ల చెవిలోని గ్రంథులు మరింత ఎక్కువగా గువిలిని స్రవించేలా చేసి సమస్య తీవ్రత అధికమవుతుంది. అందుకే చెవులను తరచూ శుభ్రపరచుకునే వారిలోనే గువిలి లేదా వ్యాక్స్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే ఇయర్‌బడ్స్, పుల్లలు, పెన్నులు, పిన్నీసులు వంటివి చెవుల్లో పెట్టుకొని శుభ్రం చేసుకోకూడదు. 2.చెవులను శుభ్రం చేయడానికి కొబ్బరి నూనె, ఆముదం లాంటివి వేయడం వల్ల కొత్త సమస్యలు మొదలువుతాయి. కాబట్టి ఆ పని ఎప్పుడూ చేయకూడదు. 3.చెవులలో చీముకారడం మరొక ముఖ్యమైన చెవికి సంబంధించిన సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే నిపుణులైన ఈఎన్టీ వైద్యులకు కలిసి సరైన చికిత్స, మందులు తీసుకోవాలి. సమస్యను బట్టి అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయించాల్సి రావచ్చు. 4.పిల్లలు ముఖ్యంగా వేసవికాలం సెలవుల్లో ఈత నేర్చుకోవడం కోసం నీటి కుంటలు, చెరువుల వంటి చోట్లకు వెళ్తుంటారు. ఆ సమయంలో పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు నీళ్లలో దిగిన సమయంలో పరిశుభ్రమైన నీళ్లలోకి దిగాలి. ఈత కొట్టే సమయంలో ఇయర్ ప్లగ్స్ ధరించడం ద్వారా ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. 5.తరచూ జలుబు చేసే పిల్లల్లో కూడా ముక్కు మూసుకుపోవడం వల్ల చెవి మధ్యభాగంలో గాలి ప్రసరణ జరగకపోవడం వల్ల వీరిలో చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. అందువల్ల తరచూ జలుబు చేసేవారిలో అందుకు సంబంధించిన కారణాలు కనుక్కొని తగిన చికిత్స తీసుకోవాలి. ఈమధ్యకాలంలో పిల్లల్లో అలర్జీలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి వల్ల కూడా పిల్లల్లో తరచూ జలుబు కనిపిస్తోంది. ఇలా తరచూ జలుబు కనిపిస్తున్న పిల్లలను శ్రద్ధగా గమనిస్తూ ఏది తింటే సరిపడకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి, దాని నుంచి వారిని దూరంగా ఉంచడం, లేదా సరిపడని వాతావరణంలోకి వారిని తీసుకెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 6.గట్టి శబ్దాలను ఎక్కువసేపు వినడం, సంగీతం వినే సమయంలో ఎక్కువ తీవ్రతతో వినడం మొదలైన వాటి వల్ల పిల్లల్లో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అందుకే పిల్లలు పెద్ద పెద్ద శబ్దాలను గట్టిగా వినడం సరికాదు. మ్యూజిక్‌ను పెద్దగా సౌండ్ పెట్టుకొని వినడం, గట్టిగట్టిగా పేలే టపాకాయ శబ్దాలను వినడం వారిలో వినికిడి సమస్యలు రావడానికి కారణం కావచ్చు. 7.కొంతమంది పిల్లలు చెవిలో పుల్లలు, పెన్నులు, పిన్నులు, పిన్నీసులు వంటి వస్తువులు ఎక్కువగా పెట్టుకుంటుంటారు. దీనివల్ల ఒక్కోసారి వాళ్ల కర్ణభేరికి దెబ్బతగలవచ్చు. ఇలా జరగడం వల్ల కూడా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. దాంతో భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. 8.శుభ్రమైన తాగు నీరు తీసుకోకపోవడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, ఐస్‌క్రీములు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడంతో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ తర్వాత ఇవే ఇన్ఫెక్షన్లు చెవులకూ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చెవి, ముక్కు, గొంతు... ఈ మూడు కీలక అవయవాల్లో ఏ భాగంలో ఆరోగ్య సమస్య తలెత్తినా అది ఇతర భాగాలకు వ్యాపించే ఆస్కారం ఉంది. అవన్నీ వినికిడి సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి చెవి, గొంతు, ముక్కు... ఈ మూడు కీలక అవయవాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా, దాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ముఖ్యంగా పిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్లను అస్సలు విస్మరించకూడదు. 9.చెవిలో ఎక్కువ గువిలి వస్తున్నా, చెవి నుంచి చీము కారుతున్నా, చెవిలో నొప్పి వస్తున్నా, చెవిపోటు అనిపించినా, రాత్రి సమయాల్లో చెవిలో గుయ్ మనే శబ్దం వినిపిస్తున్నా, గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నా, మాటలు సరిగా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతున్నా... ఈ లక్షణాలలో ఏది కనిపించినా వెంటనే ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. వీలైతే ఈ సెలవుల్లోనే పిల్లలను ఈఎన్టీ నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. తగిన సలహా, చికిత్స తీసుకోండి. బడికి వెళ్లే సమయానికల్లా వారి సమస్యలు దూరమవుతాయి. - డాక్టర్ ఈసీ వినయకుమార్, హెచ్ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్ -
శుభకార్యాలు చేస్తున్నారా... బహుపరాక్!
చిన్నారుల పంపి బంగారు ఆభరణాలను మాయం చేస్తున్న ముఠా సాక్షి, ముంబై: ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సందెట్లో సడేమీయా అన్నట్లు రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ముఠా సభ్యులు శుభకార్యాలు జరుగుతున్న ఫంక్షన్ హాళ్లలోకి చొరబడి పథకం ప్రకారం చేతికందిన విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. ఇలాంటి పనులకు చిన్నపిల్లలను వాడుకుంటుండడంతో ఎవరికీ అనుమానం కలగడం లేదు. పెళ్లి హడావుడిలో ఇరువర్గాల వారు నిమగ్నమై ఉన్న సమయంలో బంధువులు సమర్పించిన కానుకలు, వధూవరుల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. ఇందుకోసం సదరు పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు, గుర్తు తెలియని వ్యక్తులపై కన్నేసి ఉంచాలని వధూవరుల తరఫు బంధువులకు స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. గత పెళ్లిళ్ల సీజన్లో ఫంక్షన్ హాళ్ల నుంచి విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు అనేక ఫిర్యాదులందాయి. దీంతో నేర నిరోధక శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. చోరీ ఘటనలు జరిగినచోట అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. అందులో ఖరీదైన దుస్తులు ధరించిన కొందరు పిల్లలు అటే ఇటూపరుగులు తీయడం కనిపించింది. ఇందులో ఓ పిల్లాడి కదలికలు అనుమానాస్పదంగా తోచాయి. పిల్లలతో కలిసిపోయి వేదికపైకి ఎక్కి ఏకంగా వధూవరులతో ఫొటోలు దిగాడు. అతడిపై ఎవరికి అనుమానం రాలేదు. ఆ తర్వాత అదను చూసుకుని బంధువులు సమర్పించిన కానుకల ప్యాకెట్లు తీసుకుని మెల్లిగా జారుకుంటున్న దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇదే తరహాలో రెండు, మూడు ఫంక్షన్ హాళ్లవద్ద పలువురు పిల్లలు చోరీ చేసినట్లు వీడియో దృశ్యాల్లో కనిపించింది. దీంతో పోలీసులు వేటలో పడ్డారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లికి పోలీసులు మారువేషాల్లో హాజరయ్యారు. అక్కడ ఓ బాలుడి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అతనిపై నిఘా వేయగా ఎప్పటిలాగే విలువైన వస్తువులు చోరీ చేసేందుకు యత్నించాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు అతనిని ఆరా తీశారు. తన తల్లి ఫంక్షన్ హాలు బయట ప్రవేశద్వారం వద్ద బెలూన్లు విక్రయిస్తోందని చెప్పాడు. దీంతో వెంటనే అతని తల్లిని కూడా పట్టుకున్నారు. తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి, నేరాలకు పాల్పడుతున్నట్టు వారు అంగీకరించారు.