ఆటల్లేవ్‌.. మాటల్లేవ్‌! | World Health Organization consider classifying gaming addiction as a disease | Sakshi
Sakshi News home page

ఆటల్లేవ్‌.. మాటల్లేవ్‌!

Published Mon, May 20 2019 2:21 AM | Last Updated on Mon, May 20 2019 2:21 AM

World Health Organization consider classifying gaming addiction as a disease - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరుబయట పిల్లలు ఆడే ఆటలతో ఒకప్పుడు కాలనీలు సందడిసందడిగా ఉండేవి. పాఠశాలల రోజుల్లోసాయంత్రం పూట.. వేసవి సెలవుల్లో రోజంతా ఆటలాడి శారీరకంగా అలసి పిల్లలందరూ ఇళ్లకు చేరేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి దాదాపు కనుమరుగైంది. స్మార్ట్‌ ఫోన్లు చేతికి వచ్చాక పిల్లలంతా గంటల తరబడి వాటితోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్‌ ఫోన్లలోనే అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఇదే విషయమే ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, వీడియో గేమ్స్‌ వంటి ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు చిన్నపిల్లలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. వీటి వాడకం పెరిగితే చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఊబకాయం, కంటి సమస్యలు, మున్ముందు మధుమేహం వంటి అనారోగ్యాలు దరిచేరే ప్రమాదముందని హెచ్చరించింది. రెండు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు రోజుకు గంట కంటే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఉపయోగించకూడదని, అంతకంటే చిన్నపిల్లలు అసలే వాడకూడదని తాజాగా నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ సందర్భంగా ప్రస్తుతం చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. 
   
శారీరక శ్రమకు సెలవు..
ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వల్ల పెద్దలు, పిల్లలు శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం 23 శాతం మంది పెద్దలు, 80 శాతం టీనేజీ పిల్లలు శారీరకంగా ఉత్సాహంగా ఉండటం లేదని తేలింది. అత్యధికంగా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తేల్చింది. మరో విస్మయం కలిగించే వాస్తవం ఏంటంటే ఊబకాయం వల్ల చిన్నతనంలోనే పిల్లల్లో డయాబెటిక్‌ రావడం. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల్లో తలనొప్పి అత్యంత సాధారణమైంది.

అలాగే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల కూడా ఉండటంలేదు. అలాగే సెల్‌ఫోన్లకు, ట్యాబ్‌లకు అతుక్కుపోయే పిల్లలు సామాజిక సంబంధాలకు దూరమవుతున్నారు. ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా గ్రహించడంలేదు. యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది చూస్తున్నారని, అందులో పిల్లలు కూడా ఉన్నారని తేల్చింది. ఇది పిల్లల మెదళ్లపై చెడు ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. అంతేకాదు అనేక పాఠశాలలు పిల్లలకు ట్యాబ్‌లను తప్పనిసరి చేయడం కూడా సమస్యలకు కారణంగా నిలుస్తుంది. ప్రపంచంలో ఎనిమిదేళ్లలోపు పిల్లల్లో 42 శాతం మంది ట్యాబ్‌లను వినియోగిస్తున్నారని తేలింది.  

మాటలే కరువయ్యాయి..
పిల్లలు ప్రధానంగా తల్లిదండ్రులు, ఇతరులతో పరస్పరం మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో మనుషులతో సంబంధాలు కోల్పోతున్నారు. 24 గంటలూ మొబైల్‌లోనే మునుగుతూ ఇంట్లో పెద్దలతో మాట్లాడటం అనే మాటనే మరిచిపోతున్నారు. హైదరాబాద్‌ నగరంలో చిన్నతనం నుంచే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వాడకం పెరిగిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక అనేక స్కూళ్లు చిన్నప్పటి నుంచే ట్యాబ్‌లను ప్రవేశపెట్టాయని, కొందరు విద్యార్థులు తమ రోజువారీ అసైన్‌మెంట్ల కోసం గాడ్జెట్లను వాడుతున్నారని తేలింది.  

ఆహారం తినిపించడానికీ గాడ్జెట్లే..
అనేకమంది తల్లిదండ్రులు పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఏడాది రెండేళ్ల వయసున్న పిల్లలకు ఆహారం తినిపించడానికి తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పిల్లలు వినడంలేదన్న భావనతో వారి చేతికి సెల్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌లు ఇచ్చి తినిపించడమో చేస్తున్నారు. వాటిల్లో వీడియో గేమ్స్‌ చూపించడం ద్వారా తినిపిస్తున్నారు. ఈ పరిస్థితి హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల నుంచి మొదలు పెడితే చిన్నచిన్న పట్టణాల్లోనూ 60–70 శాతం మంది తల్లిదండ్రులు గాడ్జెట్లనే ఆశ్రయిస్తున్నారని
తేలింది.  

నూతన మార్గదర్శకాలు..
► చిన్నపిల్లలు ఆరోగ్యవంతంగా పెరగాలంటే వాళ్లు తక్కువగా కూర్చొని.. ఎక్కువ
శారీరకంగా ఆడాలి.  

►ఐదేళ్ల చిన్నారులు అత్యంత తక్కువ సమయంపాటే టీవీలు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌ల ముందు కూర్చోవాలి.  

►ఎక్కువ సేపు ఆడాలి. అలసిపోయి నిద్రపోవాలి. అలాగే పిల్లలు మానసికంగా ఎదగడానికి పుస్తకాలు చదవాలి. కథలు చెప్పాలి. పజిల్స్‌ ఆడాలి. పాటలు పాడాలి. అదే వారి అభివృద్ధికి కారకంగా నిలుస్తుంది.  

►ఏడాది లోపు పిల్లలు తప్పనిసరిగా రోజుకు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి.  
►ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలు కనీసం 3 గంటలపాటు వివిధ రకాల శారీరకమైన ఆటల్లో నిమగ్నమవ్వాలి.  

►రెండేళ్లలోపు పిల్లలు గంటకు మించి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో ఆడకూడదు. వాళ్లు రోజుకు కనీసం 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి.  

►మూడు నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలు 3 గంటలపాటు ఏదో ఒకరకమైన శారీరక శ్రమలో ఉండాలి. ఆడుతూ ఉండాలి. కనీసం గంటపాటు ఒకరకమైన ఆ వయసుకు సంబంధించిన కఠినమైన వ్యాయా మం ఉండాలి. ఈ వయసు వారు రోజుకు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement