వయసు రీత్యా.. లేదంటే ప్రమాదాల కారణంగానో మనం కోల్పోయిన పళ్లు మళ్లీ పెరిగితే ఎలా ఉంటుంది? ఆహారాన్ని చక్కగా ఆస్వాదించడమే కాదు.. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకమైన ముందడుగు పడింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త యాంగ్ చాయ్ పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడుమన పళ్ల మూలాలు (రూట్)ను పునరుజ్జీవింప చేయడం సాధ్యం కానుంది. ఇది కాస్తా మళ్లీ మళ్లీ పళ్లను పెంచుకునేందుకు దారితీస్తుందని అంచనా. పిప్పిపళ్ల సమస్య బాగా తీవ్రమైనప్పుడు మనం రూట్ కెనాల్ థెరపీ చేయించుకుంటాం.
దీంతో ఆ ప్రాంతంలో మళ్లీ పన్ను వచ్చేందుకు అస్సలు అవకాశం ఉండదు. మొదలంటా శుభ్రం చేసి ఉండటం దీనికి కారణం. అయితే డీఎన్‌ఏలో మార్పులేవీ చేయకుండానే కొన్ని జన్యువులను నియంత్రించడం ద్వారా పంటి మూలాలను మళ్లీ అభివృద్ధి చేయవచ్చునని చాయ్ తదితరులు ప్రయోగపూర్వకంగా తెలుసుకోగలిగారు. మన ముఖం ఎముకలు అభివృద్ధి చెందేందుకు ఈజెడ్‌హెచ్ 2 అనే ప్రొటీన్ ఉపయోగపడుతుందని చాలాకాలంగా తెలిసినా.. పంటి రూట్ విషయంలో దీని పాత్ర ఏమిటన్నది పరిశీలించేందుకు చాయ్ తదితరులు ప్రయత్నం చేశారు. ఇంకో ప్రొటీన్ ఆరిడ్1ఏతో సమానంగా ఉంటే రూట్ వృద్ధి చెందేందుకు, దవడ ఎముకలతో రూట్స్ అనుసంధానమయ్యేందుకు వీలేర్పడుతోందని వీరు గుర్తించారు. అయితే నోట్లోని అన్ని రకాల పళ్లను కాకపోయినా సమీప భవిష్యత్తులో దవడ పళ్లను మళ్లీ మళ్లీ పెరిగేలా చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment