ఇటీవలి కాలంలో వినికిడి సమస్యలతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వైద్యులు అంటున్నారు. వైద్యుల గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, ఒక బిలియన్ పైగా యువతకు వినికిడి లోపం ప్రమాదం పొంచి ఉంది. టీనేజర్లలో వినికిడి శైలిని విశ్లేషించి దాని ప్రకారం వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉన్న వారి సంఖ్యల గురించి పరిశోధకులు ఈ అంచనాను రూపొందించారు.
కరోనా విజృంభణ సమయంలో, ఆన్‌లైన్ సమావేశాలు, స్నేహితులు కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లు లేదా అతిగా చూసే సెషన్‌ల కారణంగా, మనలో చాలా మంది గంటల తరబడి హెడ్‌ఫోన్‌లకు అతుక్కుపోయారు. ఇప్పుడు, కోవిడ్‌తో సంబంధం లేకుండా హెడ్‌ఫోన్‌లు రోజువారీ జీవితంలో భాగంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాల (పిఎల్‌డిలు) వాడకం తో పాటు పెద్ద ఎత్తున హైఓల్టేజ్‌తో ఉండే సంగీత వేడుకలకు హాజరుకావడం వంటివి వినికిడి పాలిట శాపాలుగా అధ్యయనం తేల్చింది.
పరిమితి మించిన సంగీతధ్వని..
పెద్దలకు 80 డీబీ, పిల్లలకు 75 డీబీ మాత్రమే అనుమతించదగిన ధ్వని స్థాయి. వినియోగదారులు తరచుగా 105 డెసిబెల్ (డిబి) కంటే ఎక్కువ వాల్యూమ్‌లను ఎంచుకుంటున్నారని గతంలో ప్రచురించిన మరో పరిశోధన వెల్లడించింది, అయితే మ్యూజిక్ కన్సర్ట్స్, వినోద వేడుకల్లో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డిబి వరకు ఉంటాయి.
ఇందుగలదందు లేదని సందేహంబు లేదు..
ఇతర శబ్ధాల సమస్య లేకుండా సంగీతాన్ని ఆస్వాదించడానికి స్ట్రీమ్ సిరీస్, సినిమాలను చూడడానికి ఇష్టపడే యువతరం పెరిగింది. వీరు తరచుగా ఇయర్‌బడ్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. మెట్రో నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టుపక్కల వారి మాటలు, శబ్ధాలు.. వగైరా తప్పించుకోవడానికి ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని వినడం సర్వసాధారణం. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా ఉండడానికి తమ వాల్యూమ్‌లను పెంచుతారు.
మరోవైపు ఇయర్‌ఫోన్‌లు హెడ్‌ఫోన్‌లు వినోదం మాత్రమే కాకుండా చాలా మందికి వృత్తిరీత్యా కూడా అవసరంగా మారాయి. ఏతావాతా ఈ ఆడియో గాడ్జెట్‌ల పెరుగుతున్న వినియోగం జుట్టు కణాలు, పొరలు, నరాలు లేదా చెవిలోని ఇతర భాగాలకు హాని కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి నష్టం కలిగిస్తుంది.
వైద్యుల సూచనలివే..
► టీవీ లేదా స్పీకర్‌లను లేదా హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాల్యూమ్‌ను నియంత్రించండి.
► ఇయర్‌బడ్‌లు హెడ్‌ఫోన్‌లలో మీ పక్కన ఉన్న వ్యక్తి వినే స్థాయికి వాల్యూమ్ చేరకుండా జాగ్రత్తపడాలి.
► బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా తరచుగా వాల్యూమ్‌ను పెంచాల్సిన అవసరం రాకుండా బయటి నుంచి శబ్దం–రాకుండాచేసే ఇయర్‌ఫోన్‌లు హెడ్‌ఫోన్‌లను కొనుగోలు చేయండి.
► ఇయర్‌బడ్‌లు ఇయర్‌లోబ్‌ను కవర్ చేస్తాయి చెవికి అతి దగ్గరగా ఉంటాయి. మరోవైపు, హెడ్‌ఫోన్‌లు సంగీతపు వైబ్రేషన్‌ను నేరుగా చెవులకు పంపవు. కాబట్టి, దీర్ఘకాలంలో ఇయర్ బడ్స్ కన్నా హెడ్‌ఫోన్‌లకు మారడం మంచిది.
► ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాల విరామం లేదా ప్రతి 60 నిమిషాలకు 10 నిమిషాల పాటు చెవులకు విరామం ఇవ్వాలి.
► స్మార్ట్‌ఫోన్‌ల సెట్టింగ్‌లలో అనుకూల వాల్యూమ్ పరిమితిని కూడా సెట్ చేయవచ్చు.
జాగ్రత్తలు అవసరం..
చెవిలో సున్నితమైన చర్మం, పొర ఉంటుంది. చెవికి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంటుంది. అయితే అతిగా ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఈ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది. తద్వారా చర్మానికి ఇన్ఫెక్షన్స్ అవకాశాలు పెరుగుతాయి. వాక్స్ జిగిరీ అనే ఆ పొర పోయిదంటే... ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వీటిని అతిగా వినియోగించకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు వీలున్నంత వరకూ అసలు వాడకూడదు. ఇయర్ డ్రమ్ ముఖ ద్వారం కాస్త పెద్దగా ఉన్నవాళ్ల కన్నా సన్నగా ఉన్నవాళ్లకి ప్రమాదం మరింత ఎక్కువ. వీళ్లు వాడేటప్పుడు దాన్ని ఇంకా ఇంకా లోపలికి తోస్తారు. అలా మరీ లోపలికి పెట్టడం వల్ల ఇయర్ డ్రమ్‌కు నష్టం కలుగుతుంది. వీలున్నంత వరకూ అవసరాన్ని బట్టి తప్ప ఎడాపెడా ఉపయోగించడం మంచింది కాదు. అలాగే వినికిడి సామర్ధ్యానికి హెడ్ ఫోన్స్, హై ఓల్టేజ్ సంగీతం కూడా హానికరమే.
–డా.ఎం.ప్రవీణ్ కుమార్, ఇఎన్‌టీ సర్జన్ అమోర్ హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment