hearing ability
-
పిల్లలు.. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు! అయితే ఈ సామర్థ్యం..
పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలనే విషయాన్ని అర్జునుడు తన భార్య సుభద్రకు చెప్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు విని నేర్చుకున్నాడని మహాభారతంలో చదువుకున్నాం. అది నిజమేనని నమ్మేవాళ్లే ఎక్కువ. ఆ నమ్మకాన్ని వ్యాపారం చేసుకుంటూ, గర్భంలోని బిడ్డలకు కూడా పాఠాలు నేర్పిస్తున్నవారూ ఉన్నారు. అయితే అదంతా నిజమేనా? అనే సందేహం ఉంది. అందుకే తల్లిదండ్రులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచే శిశు సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. పిల్లలను మరింత బాగా అర్థం చేసుకుని పెంచేందుకు ఇవి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి.శిశువులకు అసాధారణ వినికిడి సామర్థ్యాలు ఉన్న మాట నిజం. పెద్దలు నిమిషానికి 14 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తే, పిల్లలు 20 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తారు. గర్భం దాల్చిన 24వ వారం నుంచి పిండాలు బాహ్య వాతావరణం నుంచి శబ్దాలను గుర్తించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు. అయితే ఈ సామర్థ్యం స్వరాన్ని గుర్తించడానికి మాత్రమే పరిమితం. పద్మవ్యూహాన్ని అర్థం చేసుకునేటంత తెలివితేటలు ఉండవు. ఇక పుట్టిన వారం రోజుల నుంచే తల్లి గొంతును, ఇతరుల గొంతు నుంచి వేరు చేస్తారని డికాస్పర్, ఫీఫెర్(1980) చేసిన పరిశోధనలో వెల్లడైంది.శిశువులు అమ్మభాషకు, వేరే భాషలకు మధ్య తేడాను గుర్తించగలరంటే మీరు నమ్మగలరా? కానీ పెదవి కదలికలు, ముఖ కవళికలను గమనించడం ద్వారా ఆ తేడాను గుర్తించగలరని వీకమ్ ఎటేల్ (2007) అధ్యయనంలో వెల్లడైంది. దీన్నిబట్టి పిల్లల చూపు ఎంత చురుగ్గా ఉంటుందో అర్థమైంది కదా!శిశువుల పరిశీలనా సామర్థ్యం కేవలం భాషాభివృద్ధికే పరిమితం కాదు. 18 నెలల వయసు గల పిల్లలు.. ఇతరులు మాట్లాడటానికంటే ముందే ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్‌ను గమనించి వారి ఉద్దేశాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోగలరని మెల్ట్జాఫ్ (1995) కనుగొన్నారు.పిల్లలు.. వాళ్లేం నేర్చుకుంటారని కొట్టిపడేయకండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి శిశువుల మెదళ్లు తయారుగా ఉంటాయని కుహ్ల్ (2004) నొక్కి చెప్పారు. భాషను నేర్చుకునే సామర్థ్యం.. బాల్యంలోనే గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఐదేళ్ల లోపు ఐదు భాషలు ఏకకాలంలో నేర్చుకోగలరు.అమ్మ పోలికా? నాన్న పోలికా? ఇకపై గొడవ పడకండి. నవజాత శిశువులు ఎక్కువగా తండ్రులను పోలి ఉంటారని సూచించే ఆధారాలు ఉన్నాయి. జన్యు పరీక్షలనేవి రాకముందే తండ్రెవరో గుర్తించడానికి ప్రకృతి పరంగా ఈ సారూప్యత ఏర్పడి ఉండవచ్చని బ్రెస్సన్, గ్రాస్సీ (2004) పేర్కొన్నారు.పుట్టుకతోనే పిల్లలకు సంఖ్యల పట్ల సహజమైన ఇన్ట్యూషన్ ఉంటుంది. అంతేకాదు వివిధ పరిణామాల మధ్య తేడాను గుర్తించగలరు. కూడిక, తీసివేతల మధ్య ప్రాథమిక అవగాహన కలిగి ఉంటారని గిynn (1992) అధ్యయనంలో వెల్లడైంది.శిశువులు మనిషి ముఖాలనే కాదు, జంతువుల ముఖాల మధ్య తేడానూ గుర్తించగలరు. అయితే వయసుతో పాటు మనుషులతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మనుషుల ముఖాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. జంతువుల ముఖాల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుందని పాస్కాలిస్తోపాటు ఇతరులూ (2002) కనుగొన్నారు.నవజాత శిశువులు తల్లి పాలనే కాదు, తల్లి వాసనకూ ప్రాధాన్యాన్నిస్తారు. తల్లి వాసన తగిలినవెంటనే శిశువులు ప్రశాంతంగా ఉంటారని మాక్ఫర్లేన్ (1975) కనుగొన్నారు. ఇది తల్లితో బంధం బలపడటంలో, ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.మనిషి మనుగడ సాగించాలంటే కమ్యూనికేషన్ అవసరం. అది పిల్లలు పుట్టుకతోనే నేర్చుకుంటారు. శిశువులు ముఖకవళికలను అనుకరించగలరని, ముఖ సంజ్ఞలను పునరావృతం చేయగలరని మెల్ట్జాఫ్, మూర్ (1977) గమనించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు మూలం బాల్యంలోనే ఉంది.శిశువులు తమ అనుభవాలను జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటారు. ఈ జ్ఞాపకాలు జీవితంలో తర్వాత స్పష్టంగా గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవి ప్రవర్తనను, ప్రాధాన్యాలను ప్రభావితం చేస్తాయి. అందుకే శిశువులకు అందమైన అనుభవాలను అందించడం తల్లిదండ్రుల బాధ్యత.– సైకాలజిస్ట్ విశేష్ -
దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..
భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా సన్నీ తాజాగా సుప్రీం కోర్టులో సైన్ లాంగ్వేజ్‌లో వాదన వినిపించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఇంటర్ప్రెటర్ సహాయంతో ఆమె తన వాదనలు వినిపించి ప్రశంసలు పొందింది. ‘ఇలాంటిది చాలా మునుపే జరగాలి. ఆలస్యం చేశాం’ అని జస్టిస్ చంద్రచూడ్ సారా సన్నీని ఉద్దేశించి అన్నారు.సారా పరిచయం. సెప్టెంబర్ 22 సుప్రీం కోర్టు కేసు నంబర్ పిలువగానే నల్లగౌనులో అడ్వకేట్ సారా సన్ని తన ఇంట్రప్రేటర్ సౌరవ్ రాయ్ చౌదరితో కోర్టు హాల్లోకి ప్రవేశించింది. ధర్మాసనంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం జావేద్ ఆబిది ఫౌండేషన్ వారు వేసిన ఆ కేసులో ఫౌండేషన్ తరఫున సారా వాదనలు మొదలెట్టింది. వెంటనే కోర్టు హాలు సైలెంట్ అయ్యింది. ఎందుకంటే సారా సైన్ లాంగ్వేజ్ ద్వారా తన వాదనలు వినిపిస్తుంటే వాటిని అంతే వేగంగా ఇంట్రప్రేటర్ కోర్టుకు విన్నవిస్తున్నాడు. అలాగే కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను సైన్ లాంగ్వేజ్ ద్వారా సారాకు తెలియచేసి బదులుగా సారా సమాధానాన్ని కోర్టుకు చెబుతున్నాడు. సుప్రీంకోర్టులో మొదటిసారిగా ఇలా ఒక ఒక బధిర అడ్వకేట్ మౌనవాదన వినిపించింది. దీనిని చూసిన జస్టిస్ చంద్రచూడ్ ‘ఇప్పటికైనా ఇది సాధ్యమైంది.. ఎప్పుడో జరగాల్సింది’ అన్నారు. కోర్టులో ఉన్న అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సారాను, ఇంట్రప్రెటర్ను మెచ్చుకున్నారు. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. ఒక గొప్ప అనుభూతితో సారా సన్ని కోర్టు బయటకు నడిచింది. ఇలాంటి ఘనతను సాధించిన మొదటి మహిళా బధిర అడ్వకేట్ కదా మరి. కేరళ అమ్మాయి సారా సన్ని స్వస్థలం కొట్టాయం. ఆమె తండ్రి సన్ని కురువిల్లా చార్టర్డ్ అకౌంటెంట్. తల్లి బెట్టి గృహిణి. ఈ దంపతులకు పుట్టిన అబ్బాయి ప్రతీక్ బధిరుడు. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు కవల ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరూ మళ్లీ బధిరులే. వారిలో ఒకరు సారా మరొకరు మారియా. ముగ్గురు సంతానం బధిరులే అయినా తల్లిదండ్రులు ఆ లోటు వారికి తెలియనివ్వకుండా పెంచారు. కొడుకు అమెరికాలో బధిరుల స్కూల్లో ఉపాధ్యాయుడిగా, మారియా చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడ్డారు. సారా మన దేశంలో మొదటి బధిర అడ్వకేట్ అయ్యింది. వాదనలు చేస్తూ... సారా బాల్యం నుంచి అందరితో తెగ వాదించేది. ఆమెకు చెవుడు ఉండటం వల్ల మాటలు రాలేదు. కాని సైన్ లాంగ్వేజ్‌తో అందరితో తెగ వాదనలు చేసేది. ‘పెద్దయ్యి లాయర్ అవుతుందేమో’ అని సరదాగా తల్లిదండ్రులు అనుకునేవారు. అన్నట్టుగానే జరిగింది. సారా, మారియా ఇద్దరూ బెంగళూరులో చదువుకున్నారు. అక్కడే బి.కాం. చేసి ఒకరు లా వైపు మరొకరు చార్టెర్డ్ అకౌంటెన్సీ వైపు వెళ్లారు. రెండేళ్ల క్రితం సారా లా పట్టా తీసుకుంది. అయితే కర్నాటక కోర్టుల్లో కేసులు వాదించాలంటే ఇంట్రప్రెటర్లకు అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం– కోర్టు పరిభాష ఇంట్రప్రెటర్లకు తెలియదని కోర్టు భావించడమే. అయితే సారా తన వాదనలను కాగితం మీద రాసి జడ్జికి ఇచ్చేది. ఈ విధానాన్ని జడ్జి ఆశ్చర్యంగా చూసేవారు. మెచ్చుకునేవారు కూడా. సుప్రీం కల ‘ఏ రోజైనా నేను సుప్రీం కోర్టులో వాదించాలని అనుకున్నాను’ అంటుంది సారా. ఆమె కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రతిభావంతంగా వాదనలు చేయగలిగింది. ‘దివ్యాంగులు దేనినీ వెలితిగా భావించకూడదు. సాధించాలి. నేను వారికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. బధిరులు అడ్వకేట్లుగా రాణించగలరు. కాకపోతే వారి కోసం ఇంట్రప్రెటర్ల వ్యవస్థను ప్రభుత్వం తయారు చేయాలి. అంతేకాదు ఇంట్రప్రెటర్ల ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తే బాగుంటుంది’ అని కోరుతోంది సారా. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
శబ్ధాలు, పరికరాలతో చెవిచిల్లు.. ఆధునిక జీవనశైలి చెవి‘నిల్లు’
ఇటీవలి కాలంలో వినికిడి సమస్యలతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వైద్యులు అంటున్నారు. వైద్యుల గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, ఒక బిలియన్ పైగా యువతకు వినికిడి లోపం ప్రమాదం పొంచి ఉంది. టీనేజర్లలో వినికిడి శైలిని విశ్లేషించి దాని ప్రకారం వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉన్న వారి సంఖ్యల గురించి పరిశోధకులు ఈ అంచనాను రూపొందించారు. కరోనా విజృంభణ సమయంలో, ఆన్లైన్ సమావేశాలు, స్నేహితులు కుటుంబ సభ్యులతో వీడియో కాల్లు లేదా అతిగా చూసే సెషన్ల కారణంగా, మనలో చాలా మంది గంటల తరబడి హెడ్ఫోన్లకు అతుక్కుపోయారు. ఇప్పుడు, కోవిడ్‌తో సంబంధం లేకుండా హెడ్ఫోన్లు రోజువారీ జీవితంలో భాగంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాల (పిఎల్డిలు) వాడకం తో పాటు పెద్ద ఎత్తున హైఓల్టేజ్‌తో ఉండే సంగీత వేడుకలకు హాజరుకావడం వంటివి వినికిడి పాలిట శాపాలుగా అధ్యయనం తేల్చింది. పరిమితి మించిన సంగీతధ్వని.. పెద్దలకు 80 డీబీ, పిల్లలకు 75 డీబీ మాత్రమే అనుమతించదగిన ధ్వని స్థాయి. వినియోగదారులు తరచుగా 105 డెసిబెల్ (డిబి) కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటున్నారని గతంలో ప్రచురించిన మరో పరిశోధన వెల్లడించింది, అయితే మ్యూజిక్ కన్సర్ట్స్, వినోద వేడుకల్లో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డిబి వరకు ఉంటాయి. ఇందుగలదందు లేదని సందేహంబు లేదు.. ఇతర శబ్ధాల సమస్య లేకుండా సంగీతాన్ని ఆస్వాదించడానికి స్ట్రీమ్ సిరీస్, సినిమాలను చూడడానికి ఇష్టపడే యువతరం పెరిగింది. వీరు తరచుగా ఇయర్‌బడ్‌లు లేదా హెడ్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. మెట్రో నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టుపక్కల వారి మాటలు, శబ్ధాలు.. వగైరా తప్పించుకోవడానికి ఇయర్ఫోన్లు పెట్టుకుని వినడం సర్వసాధారణం. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా ఉండడానికి తమ వాల్యూమ్లను పెంచుతారు. మరోవైపు ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లు వినోదం మాత్రమే కాకుండా చాలా మందికి వృత్తిరీత్యా కూడా అవసరంగా మారాయి. ఏతావాతా ఈ ఆడియో గాడ్జెట్ల పెరుగుతున్న వినియోగం జుట్టు కణాలు, పొరలు, నరాలు లేదా చెవిలోని ఇతర భాగాలకు హాని కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి నష్టం కలిగిస్తుంది. వైద్యుల సూచనలివే.. ► టీవీ లేదా స్పీకర్లను లేదా హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాల్యూమ్‌ను నియంత్రించండి. ► ఇయర్‌బడ్‌లు హెడ్ఫోన్లలో మీ పక్కన ఉన్న వ్యక్తి వినే స్థాయికి వాల్యూమ్ చేరకుండా జాగ్రత్తపడాలి. ► బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా తరచుగా వాల్యూమ్‌ను పెంచాల్సిన అవసరం రాకుండా బయటి నుంచి శబ్దం–రాకుండాచేసే ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లను కొనుగోలు చేయండి. ► ఇయర్‌బడ్‌లు ఇయర్లోబ్ను కవర్ చేస్తాయి చెవికి అతి దగ్గరగా ఉంటాయి. మరోవైపు, హెడ్ఫోన్లు సంగీతపు వైబ్రేషన్‌ను నేరుగా చెవులకు పంపవు. కాబట్టి, దీర్ఘకాలంలో ఇయర్ బడ్స్ కన్నా హెడ్ఫోన్లకు మారడం మంచిది. ► ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాల విరామం లేదా ప్రతి 60 నిమిషాలకు 10 నిమిషాల పాటు చెవులకు విరామం ఇవ్వాలి. ► స్మార్ట్ఫోన్ల సెట్టింగ్‌లలో అనుకూల వాల్యూమ్ పరిమితిని కూడా సెట్ చేయవచ్చు. జాగ్రత్తలు అవసరం.. చెవిలో సున్నితమైన చర్మం, పొర ఉంటుంది. చెవికి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంటుంది. అయితే అతిగా ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఈ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది. తద్వారా చర్మానికి ఇన్ఫెక్షన్స్ అవకాశాలు పెరుగుతాయి. వాక్స్ జిగిరీ అనే ఆ పొర పోయిదంటే... ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వీటిని అతిగా వినియోగించకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు వీలున్నంత వరకూ అసలు వాడకూడదు. ఇయర్ డ్రమ్ ముఖ ద్వారం కాస్త పెద్దగా ఉన్నవాళ్ల కన్నా సన్నగా ఉన్నవాళ్లకి ప్రమాదం మరింత ఎక్కువ. వీళ్లు వాడేటప్పుడు దాన్ని ఇంకా ఇంకా లోపలికి తోస్తారు. అలా మరీ లోపలికి పెట్టడం వల్ల ఇయర్ డ్రమ్‌కు నష్టం కలుగుతుంది. వీలున్నంత వరకూ అవసరాన్ని బట్టి తప్ప ఎడాపెడా ఉపయోగించడం మంచింది కాదు. అలాగే వినికిడి సామర్ధ్యానికి హెడ్ ఫోన్స్, హై ఓల్టేజ్ సంగీతం కూడా హానికరమే. –డా.ఎం.ప్రవీణ్ కుమార్, ఇఎన్టీ సర్జన్ అమోర్ హాస్పిటల్స్ -
మూలకణ చికిత్సతోవినికిడి శక్తి...
న్యూయార్క్: లోపలి చెవిలో సమస్య కారణంగా వినికిడి లోపంతో బాధపడుతున్న రోగులకు ఇకపై మూలకణ చికిత్సతో తిరిగి వినికిడి శక్తిని పునరుద్ధరించవచ్చు. చెవిలోని కాక్లియా నుంచి శబ్దాన్ని మెదడుకు చేరవేసే స్పైరల్ గాంగ్లియన్ అనే నాడీకణాల క్షీణత వల్ల చాలా మంది వినికిడి జ్ఞానాన్ని కోల్పోతుంటారు. పరిణతి చెందిన ఈ నాడీకణాలను తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాకపోవడంతో చాలామంది చెవిటివారిగానే మిగులుతున్నారు. అయితే మూలకణాల ద్వారా పరిణతి చెందిన గాంగ్లియన్ నాడీకణాలను సైతం తిరిగి ఉత్పత్తి చేయవచ్చని ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో తాజాగా స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని కృత్రిమంగా ప్రయోగశాలలో పునరుత్పత్తి చేయవచ్చని తేలిన నేపథ్యంలో భవిష్యత్తులో లోపలిచెవిలోని నాడీకణాల మార్పిడికి మార్గం సుగమం కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.