దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్‌ సారా! చివరికి సుప్రీం కోర్టు.. | Indias First Practising Lawyer With Hearing Impairment | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్‌ సారా! చివరికి సుప్రీం కోర్టు..

Published Wed, Oct 4 2023 9:24 AM | Last Updated on Wed, Oct 4 2023 9:32 AM

Indias First Practising Lawyer With Hearing Impairment - Sakshi

భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్‌ సారా సన్నీ తాజాగా సుప్రీం కోర్టులో సైన్‌ లాంగ్వేజ్‌లో వాదన వినిపించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఇంటర్‌ప్రెటర్‌ సహాయంతో ఆమె తన వాదనలు వినిపించి ప్రశంసలు పొందింది. ‘ఇలాంటిది చాలా మునుపే జరగాలి. ఆలస్యం చేశాం’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ సారా సన్నీని ఉద్దేశించి అన్నారు.సారా పరిచయం.

సెప్టెంబర్‌ 22 సుప్రీం కోర్టు కేసు నంబర్‌ పిలువగానే నల్లగౌనులో అడ్వకేట్‌ సారా సన్ని తన ఇంట్రప్రేటర్‌ సౌరవ్‌ రాయ్‌ చౌదరితో కోర్టు హాల్లోకి ప్రవేశించింది. ధర్మాసనంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఉన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం జావేద్‌ ఆబిది ఫౌండేషన్‌ వారు వేసిన ఆ కేసులో ఫౌండేషన్‌ తరఫున సారా వాదనలు మొదలెట్టింది. వెంటనే కోర్టు హాలు సైలెంట్‌ అయ్యింది. ఎందుకంటే సారా సైన్‌ లాంగ్వేజ్‌ ద్వారా తన వాదనలు వినిపిస్తుంటే వాటిని అంతే వేగంగా ఇంట్రప్రేటర్‌ కోర్టుకు విన్నవిస్తున్నాడు.

అలాగే కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను  సైన్‌ లాంగ్వేజ్‌ ద్వారా సారాకు తెలియచేసి బదులుగా సారా సమాధానాన్ని  కోర్టుకు చెబుతున్నాడు. సుప్రీంకోర్టులో మొదటిసారిగా ఇలా ఒక ఒక బధిర అడ్వకేట్‌ మౌనవాదన వినిపించింది. దీనిని చూసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ ‘ఇప్పటికైనా ఇది సాధ్యమైంది.. ఎప్పుడో జరగాల్సింది’ అన్నారు. కోర్టులో ఉన్న అడ్వకేట్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సారాను, ఇంట్రప్రెటర్‌ను మెచ్చుకున్నారు. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. ఒక గొప్ప అనుభూతితో సారా సన్ని కోర్టు బయటకు నడిచింది. ఇలాంటి ఘనతను సాధించిన మొదటి మహిళా బధిర అడ్వకేట్‌ కదా మరి.

కేరళ అమ్మాయి
సారా సన్ని స్వస్థలం కొట్టాయం. ఆమె తండ్రి సన్ని కురువిల్లా చార్టర్డ్‌ అకౌంటెంట్‌. తల్లి బెట్టి గృహిణి. ఈ దంపతులకు పుట్టిన అబ్బాయి ప్రతీక్‌ బధిరుడు. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు కవల ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరూ మళ్లీ బధిరులే. వారిలో ఒకరు సారా మరొకరు మారియా. ముగ్గురు సంతానం బధిరులే అయినా తల్లిదండ్రులు ఆ లోటు వారికి తెలియనివ్వకుండా పెంచారు. కొడుకు అమెరికాలో బధిరుల స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా, మారియా చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా స్థిరపడ్డారు. సారా మన దేశంలో మొదటి బధిర అడ్వకేట్‌ అయ్యింది.

వాదనలు చేస్తూ...
సారా బాల్యం నుంచి అందరితో తెగ వాదించేది. ఆమెకు చెవుడు ఉండటం వల్ల మాటలు రాలేదు. కాని సైన్‌ లాంగ్వేజ్‌తో అందరితో తెగ వాదనలు చేసేది. ‘పెద్దయ్యి లాయర్‌ అవుతుందేమో’ అని సరదాగా తల్లిదండ్రులు అనుకునేవారు. అన్నట్టుగానే జరిగింది. సారా, మారియా ఇద్దరూ బెంగళూరులో చదువుకున్నారు. అక్కడే బి.కాం. చేసి ఒకరు లా వైపు మరొకరు చార్టెర్డ్‌ అకౌంటెన్సీ వైపు వెళ్లారు. రెండేళ్ల క్రితం సారా లా పట్టా తీసుకుంది. అయితే కర్నాటక కోర్టుల్లో కేసులు వాదించాలంటే ఇంట్రప్రెటర్‌లకు అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం– కోర్టు పరిభాష ఇంట్రప్రెటర్‌లకు తెలియదని కోర్టు భావించడమే. అయితే సారా తన వాదనలను కాగితం మీద రాసి జడ్జికి ఇచ్చేది. ఈ విధానాన్ని జడ్జి ఆశ్చర్యంగా చూసేవారు. మెచ్చుకునేవారు కూడా.

సుప్రీం కల
‘ఏ రోజైనా నేను సుప్రీం కోర్టులో వాదించాలని అనుకున్నాను’ అంటుంది సారా. ఆమె కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రతిభావంతంగా వాదనలు చేయగలిగింది. ‘దివ్యాంగులు దేనినీ వెలితిగా భావించకూడదు. సాధించాలి. నేను వారికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. బధిరులు అడ్వకేట్‌లుగా రాణించగలరు. కాకపోతే వారి కోసం ఇంట్రప్రెటర్‌ల వ్యవస్థను ప్రభుత్వం తయారు చేయాలి. అంతేకాదు ఇంట్రప్రెటర్‌ల ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తే బాగుంటుంది’ అని కోరుతోంది సారా.

(చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..)
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement