పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలనే విషయాన్ని అర్జునుడు తన భార్య సుభద్రకు చెప్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు విని నేర్చుకున్నాడని మహాభారతంలో చదువుకున్నాం. అది నిజమేనని నమ్మేవాళ్లే ఎక్కువ. ఆ నమ్మకాన్ని వ్యాపారం చేసుకుంటూ, గర్భంలోని బిడ్డలకు కూడా పాఠాలు నేర్పిస్తున్నవారూ ఉన్నారు. అయితే అదంతా నిజమేనా? అనే సందేహం ఉంది. అందుకే తల్లిదండ్రులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచే శిశు సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. పిల్లలను మరింత బాగా అర్థం చేసుకుని పెంచేందుకు ఇవి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి.
శిశువులకు అసాధారణ వినికిడి సామర్థ్యాలు ఉన్న మాట నిజం. పెద్దలు నిమిషానికి 14 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తే, పిల్లలు 20 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తారు. గర్భం దాల్చిన 24వ వారం నుంచి పిండాలు బాహ్య వాతావరణం నుంచి శబ్దాలను గుర్తించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు. అయితే ఈ సామర్థ్యం స్వరాన్ని గుర్తించడానికి మాత్రమే పరిమితం. పద్మవ్యూహాన్ని అర్థం చేసుకునేటంత తెలివితేటలు ఉండవు. ఇక పుట్టిన వారం రోజుల నుంచే తల్లి గొంతును, ఇతరుల గొంతు నుంచి వేరు చేస్తారని డికాస్పర్, ఫీఫెర్(1980) చేసిన పరిశోధనలో వెల్లడైంది.
శిశువులు అమ్మభాషకు, వేరే భాషలకు మధ్య తేడాను గుర్తించగలరంటే మీరు నమ్మగలరా? కానీ పెదవి కదలికలు, ముఖ కవళికలను గమనించడం ద్వారా ఆ తేడాను గుర్తించగలరని వీకమ్ ఎటేల్ (2007) అధ్యయనంలో వెల్లడైంది. దీన్నిబట్టి పిల్లల చూపు ఎంత చురుగ్గా ఉంటుందో అర్థమైంది కదా!
శిశువుల పరిశీలనా సామర్థ్యం కేవలం భాషాభివృద్ధికే పరిమితం కాదు. 18 నెలల వయసు గల పిల్లలు.. ఇతరులు మాట్లాడటానికంటే ముందే ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్‌ను గమనించి వారి ఉద్దేశాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోగలరని మెల్ట్‌జాఫ్ (1995) కనుగొన్నారు.
పిల్లలు.. వాళ్లేం నేర్చుకుంటారని కొట్టిపడేయకండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి శిశువుల మెదళ్లు తయారుగా ఉంటాయని కుహ్ల్ (2004) నొక్కి చెప్పారు. భాషను నేర్చుకునే సామర్థ్యం.. బాల్యంలోనే గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఐదేళ్ల లోపు ఐదు భాషలు ఏకకాలంలో నేర్చుకోగలరు.
అమ్మ పోలికా? నాన్న పోలికా? ఇకపై గొడవ పడకండి. నవజాత శిశువులు ఎక్కువగా తండ్రులను పోలి ఉంటారని సూచించే ఆధారాలు ఉన్నాయి. జన్యు పరీక్షలనేవి రాకముందే తండ్రెవరో గుర్తించడానికి ప్రకృతి పరంగా ఈ సారూప్యత ఏర్పడి ఉండవచ్చని బ్రెస్సన్, గ్రాస్సీ (2004) పేర్కొన్నారు.
పుట్టుకతోనే పిల్లలకు సంఖ్యల పట్ల సహజమైన ఇన్‌ట్యూషన్ ఉంటుంది. అంతేకాదు వివిధ పరిణామాల మధ్య తేడాను గుర్తించగలరు. కూడిక, తీసివేతల మధ్య ప్రాథమిక అవగాహన కలిగి ఉంటారని గిynn (1992) అధ్యయనంలో వెల్లడైంది.
శిశువులు మనిషి ముఖాలనే కాదు, జంతువుల ముఖాల మధ్య తేడానూ గుర్తించగలరు. అయితే వయసుతో పాటు మనుషులతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మనుషుల ముఖాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. జంతువుల ముఖాల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుందని పాస్కాలిస్‌తోపాటు ఇతరులూ (2002) కనుగొన్నారు.
నవజాత శిశువులు తల్లి పాలనే కాదు, తల్లి వాసనకూ ప్రాధాన్యాన్నిస్తారు. తల్లి వాసన తగిలినవెంటనే శిశువులు ప్రశాంతంగా ఉంటారని మాక్‌ఫర్‌లేన్ (1975) కనుగొన్నారు. ఇది తల్లితో బంధం బలపడటంలో, ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.
మనిషి మనుగడ సాగించాలంటే కమ్యూనికేషన్ అవసరం. అది పిల్లలు పుట్టుకతోనే నేర్చుకుంటారు. శిశువులు ముఖకవళికలను అనుకరించగలరని, ముఖ సంజ్ఞలను పునరావృతం చేయగలరని మెల్ట్‌జాఫ్, మూర్ (1977) గమనించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు మూలం బాల్యంలోనే ఉంది.
శిశువులు తమ అనుభవాలను జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటారు. ఈ జ్ఞాపకాలు జీవితంలో తర్వాత స్పష్టంగా గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవి ప్రవర్తనను, ప్రాధాన్యాలను ప్రభావితం చేస్తాయి. అందుకే శిశువులకు అందమైన అనుభవాలను అందించడం తల్లిదండ్రుల బాధ్యత.
– సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment