LV Prasad
-
దృష్టి లోపంతో మేధా క్షీణత
సాక్షి, హైదరాబాద్: మతిభ్రమణం, మేధా క్షీణత వంటి సమస్యల పరిష్కారానికి దృష్టి లోపాన్ని సవరించడం కీలక మార్గమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించి నగరానికి చెందిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిపుణుల సహకారంతో బీఎంజే ఓపెన్ యాక్సెస్ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురించిన విశ్లేషణ దృష్టి లోపం ఉన్న వృద్ధుల్లో మేధో సామర్థ్యాల వైకల్యం అధిక ప్రాబల్యాన్ని సూచిస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగా నలుగురు వృద్ధుల్లో ఒకరు మేధో సామర్థ్యాల వైకల్యంతో జీవిస్తున్నారని తేలింది. వాస్తవానికి దృష్టి లోపం లేనివారితో పోలిస్తే దృష్టిలోపం ఉన్నవారికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉండే అవకాశం 4 రేట్లు ఉంది. సమీప దృష్టి వైకల్యం (కళ్లద్దాలు లేకుండా ఫోన్, పుస్తకాలు చదవలేని స్థితి) కూడా మేధో సామర్థ్యాల వైకల్యానికి సంబంధం ఉంది. మహిళల్లో మేధో వైకల్యం అధికం.. నగరంలోని వృద్ధాశ్రమాల్లో ఉంటున్న 1,500 మందికి పైగా వృద్ధులపై జరిపిన ఈ అధ్యయనంలో 965 మందిని ఇందులో చేర్చారు. ఇందులో దాదాపు 27% మందికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉందని వెల్లడైంది. తేలికపాటి దృష్టి లోపం ఉన్న వృద్ధుల్లో 30% కంటే తక్కువ మందికి మేధో సామర్థ్యాల వైకల్యం ఉండగా, దృష్టి వైకల్యం మరింత దిగజారుతున్న కొద్దీ ఈ శాతం క్రమంగా పెరుగుతుంది. అధ్యయనంలో అంధత్వం ఉన్నవారు 15 మంది ఉన్నారు. అందులో 60% మేధో సామర్థ్యాల క్షీణతను ప్రదర్శించారు. మహిళల్లో మేధో సామర్థ్యాల వైకల్య ప్రాబల్యం అధికంగా ఉంటుంది. పురుషులకంటే మేధో సామర్థ్యాల వైకల్యం మహిళలకు 2 రేట్లు ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం కనుగొంది. ఈ సందర్భంగా మేధో సామర్థ్యాల వైకల్యం తీవ్రరూపాలు మతిభ్రమణానికి (డిమెన్షియా) దారితీస్తాయని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ పరిశోధకులు డా.శ్రీనివాస్ మర్మముల పేర్కొన్నారు. ఈ పరిశోధనా పత్రం హైదరాబాద్ ఆక్యులర్ మోర్బిడిటీ ఇన్ ది ఎల్డర్లీ స్టడీ(హోమ్స్)లో భాగంగా ప్రచురించిన 16 పేపర్లలో ఒక భాగమని తెలిపారు. -
ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్న కృష్ణంరాజు.. కానీ!
కథానాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో కృష్ణంరాజుది సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్. అయితే ఇంత ప్రతిభావంతుడైన కృష్ణంరాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముఖ్యకారణం ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్. వెండితెరపై కృష్ణంరాజు తొలి సినిమా ‘చిలకా గోరింకా’. ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు వచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త దిగాలు పడ్డారు కృష్ణంరాజు. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో కాస్త ప్రతినాయకుడి ఛాయలు ఉండే రోల్లో నటించే అవకాశం వచ్చింది కృష్ణంరాజుకు. దీంతో మరింత కలత చెందిన ఆయన సినీ పరిశ్రమకు వీడ్కోలు చెబుదాం అనుకున్నారట. కానీ పాత్ర ఏదైనా ప్రేక్షకులకు దగ్గర కావడం ముఖ్యమని, ఈ విషయంపై దృష్టి పెట్టమని కృష్ణంరాజుకు ఎల్వీ ప్రసాద్ హితబోధ చేశారు. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణంరాజు నూతనోత్సాహంతో మళ్లీ యాక్టర్‌గా మేకప్ వేసుకున్నారు. ‘నేనంటే నేనే’లో కృష్ణంరాజు పోషించిన ఆనంద్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో నటుడిగా తిరుగులేని సక్సెస్ఫుల్ ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణంరాజు. -
ఏపీ దిశ యాప్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది
‘‘భారతదేశంలో సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో విధానంలో అనుమతి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఏపీలోని ఏ ప్రాంతంలోనైనా షూటింగ్ చేసుకునే అనుమతులు వచ్చే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు కల్పించారు. మా ఎగ్జిబిటర్స్ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళితే తప్పకుండా పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఎన్వీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. థియేటర్లో సినిమా చూస్తే వచ్చే థ్రిల్ ఓటీటీలో రాదు. లాక్డౌన్ వల్ల థియేటర్ల వ్యవస్థ బాగా దెబ్బతింది. థియేటర్స్ మూత పడ్డా కూడా జీతాలు చెల్లించాలి. కరెంటు అనేది ప్రతి థియేటర్‌కి మినిమం లక్ష రూపాయలు చెల్లించాల్సిందే. మా అగ్రిమెంట్ ప్రకారమే చెల్లిస్తున్నాం. ఒకప్పుడు సినిమా వాళ్లకి ఐడీబీఎల్ లోన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎవరూ లోన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం ఇస్తున్న సినిమా ఇండస్ట్రీని నాన్ ప్రియారిటీ సెక్షన్లో పెట్టడం ఎంత వరకు సమంజసం? థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ప్రేమకథలోనే థ్రిల్లింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ‘ఇష్క్’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాలు డబ్ అవుతుండటం సంతోషం. థియేటర్లు ప్రారంభం అవుతున్నాయి కాబట్టే ఓటీటీ వాళ్లు ఇప్పుడు మరింత డబ్బు ఇచ్చి, సినిమాలు కొనేందుకు వస్తారు.. నిర్మాతలు జాగ్రత్తపడాలి. చిరంజీవిగారితో మేము నిర్మించనున్న సినిమా ఆగస్టు 13న ప్రారంభం అవుతుంది. -
తెలుగు సినిమాకు 89 వసంతాలు
వెండితెర పూర్తి స్థాయిలో తెలుగు మాటలు నేర్చుకొని, ఈ రోజుతో 89 వసంతాలు నిండాయి. మూగ సినిమాలైన ‘మూకీ’లకు మాటొచ్చి, పూర్తి తెలుగు ‘టాకీ’లుగా మారింది సరిగ్గా 89 ఏళ్ళ క్రితం ఇదే రోజున! మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ 1932లో ఫిబ్రవరి 6న థియేటర్లో తొలిసారిగా రిలీజైంది. అలా ఆ నాటి నుంచి పూర్తి స్థాయి తెలుగు చిత్రాలు ప్రేక్షకులను వెండితెరపై పలకరించడం ప్రారంభమైంది. ఆ లెక్కన మన తెలుగు సినిమాకు ఇవాళ హ్యాపీ బర్త్ డే! మన తెలుగు సినిమా పరిశ్రమ 89 ఏళ్ళు నిండి, 90వ ఏట ప్రవేశిస్తున్నందున సినిమాను ప్రేమించేవారికీ, సినిమా రంగం మీద ఆధారపడినవారికీ ఇదో మెమరబుల్ డే!! దేశంలో ఇవాళ ప్రధాన సినీ పరిశ్రమలలో ఒకటిగా ఉన్నత స్థానానికి చేరుకున్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేసిన తొలి అడుగు అది. అయితే, తెలుగు సినిమా పెద్దలు, ప్రభుత్వాలు మాత్రం మన సంపూర్ణ తెలుగు టాకీ పుట్టినరోజును మర్చిపోయినట్లుంది. పరిశ్రమకు పండుగగా జరుపుకొనే ఈ సందర్భాన్ని విస్మరించి, నిర్లక్ష్యం చూపుతున్నట్టున్నాయి. మన తెలుగు టాకీ అలా తయారైంది! తొలి దక్షిణ భారతీయ టాకీ ‘కాళిదాస్’ రిలీజై, సక్సెసయ్యాక పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే తొలి భారతీయ టాకీ, తొలి దక్షిణాది టాకీలతో అనుభవం గడించిన హెచ్.ఎం. రెడ్డికే దర్శకత్వ బాధ్యత ఇచ్చారు. అప్పుడు పూర్తి తెలుగు మాటలు, పాటల ‘భక్త ప్రహ్లాద’ తయారైంది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, ఫస్ట్ రిలీజ్ కూడా బొంబాయిలోనే జరగడం గమనార్హం. ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ప్రసిద్ధ ’ప్రహ్లాద’ నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటులతో ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె వి. సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి బిడ్డ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రధారులు. ఇందులో టైటిల్ రోల్ చేసిన మాస్టర్ కృష్ణారావునే మన తొలి తెలుగు కథానాయకునిగా చెప్పుకోవాలి. ఇక, ‘ఆలమ్ ఆరా’, ‘కాళిదాస్’ చిత్రాలలో కూడా పనిచేసిన తరువాతి కాలపు ప్రసిద్ధ దర్శక, నిర్మాత ఎల్వీప్రసాద్ ‘భక్త ప్రహ్లాద’లో మొద్దబ్బాయిగా నటించారు. ఈ సినిమాకు చందాల కేశవదాసు సాహిత్యం సమకూర్చారు. అలా ఆయన తొలి తెలుగు సినీ కవి అయ్యారు. పరిశోధనలో బయటపడ్డ మన సినిమా పుట్టినరోజు! నిజానికి, ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లద’ – ఏకంగా ‘కాళిదాస్’ కన్నా ముందే – 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొన్నేళ్ళ పాటు ఆధారాలు లేని వినికిడి ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళు శ్రమించి, సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. 100% సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెల్లడించారు. అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే మాట్లాడడం మొదలై, నేటితో 89ఏళ్ళు పూర్తయ్యాయి. మన మాటలు రికార్డ్ చేసింది హాలీవుడ్ వాడే! పెట్టుబడి, సాంకేతిక సౌకర్యాలు, ఖర్చు – అన్నీ అతి తక్కువగా ఉన్న రోజులవి. ‘ఆలమ్ ఆరా’ కోసం ఆ రోజుల్లోనే హాలీవుడ్ నుంచి విల్ఫోర్డ్ డెమింగ్ అనే అమెరికన్ సౌండ్ ఇంజనీర్‌ను ఇండియాకు రప్పించారు దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. సౌండ్ ప్రూఫ్ స్టేజీలు లేని ఆ రోజుల్లో కేవలం స్టూడియోల్లో, అదీ బయటి శబ్దాలు ఉండని రాత్రి పూట షూటింగ్ చేశారు. అప్పట్లో పిక్చర్కీ, సౌండ్‌కీ వేర్వేరు నెగటివ్‌లు కూడా ఉండేవి కావు. కేవలం సింగిల్ సిస్టమ్‌లో ‘తానార్ రికార్డింగ్ ఎక్విప్మెంట్’తో మాటలు రికార్డు చేసేవారు. చివరకు షూటింగ్ స్పాట్లోనే ఏకకాలంలో యాక్టింగ్‌తో పాటు, మాటలు చెబుతూ, పాటలు పాడుతుంటే రికార్డింగ్ చేసేయాల్సిందే! అప్పట్లో చివరకు ఇవాళ్టిలా మాటలు రికార్డు చేసే బూమ్ లు కూడా ఉండేవి కావు. కెమేరా కంట్లో పడకుండా మైకులు రకరకాల చోట్ల దాచిపెట్టి, ఈ తొలి టాకీల్లో డైలాగ్స్, సాంగ్స్ రికార్డ్ చేసేవారు. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన జనానికి... తెర మీద బొమ్మలు మాట్లాడడం, పాటలు పాడడం ఓ వింత. అదీ మన సొంత తెలుగు భాషలోనే పూర్తిగా మాట్లాడడం మరీ విడ్డూరం. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ దేశమంతటా, మరీ ముఖ్యంగా మన తెలుగునాట విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. కానీ, మన తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలూ చాలానే ఉన్నాయి. ఈ తొమ్మిది దశాబ్దాల కాలంలో తెలుగు సినిమా చాలానే పురోగమించింది. బాక్సాఫీస్ వేటలో పేటలు దాటి, దేశాల కోటలు దాటి ముందుకు ఉరికింది. అప్పటి ‘భక్త ప్రహ్లాద’ రోజుల నుంచి ఇప్పటి ‘బాహుబలి’ కాలం దాకా మన తెలుగు సినిమా చాలా దూరమే ప్రయాణించింది. కేవలం కొన్ని వేల రూపాయల ఖర్చుతో తయారై, ఆ మాత్రం ఖర్చు వస్తేనే మహాద్భుతం అనుకొనే పరిస్థితి నుంచి ఇవాళ అనేక పదుల కోట్ల రూపాయల బడ్జెట్, వందల కోట్లల్లో వ్యాపారం, వసూళ్ళు, ప్రపంచవ్యాప్తంగా చూసే కోట్లమంది జనంతో తెలుగు సినిమా అంకెల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. కానీ, ఇప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాల దగ్గర తడబడుతోంది. ఈ ప్రశ్నకు బదులేది? ఓ తెలుగు సినీ కవి అన్నట్టుగా... ‘పుట్టినరోజు పండగే అందరికీ! మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ మన సినిమా చరిత్రను భద్రపరిచే విషయంలో పరిశ్రమ పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్లు, ప్రభు త్వాలు చేస్తున్నది చాలా తక్కువే. మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఇప్పుడు మన తొలి తెలుగు సినిమా ప్రింటే లేకుండా పోయింది. టాకీలకే దిక్కు లేదు... ఇక మూకీల చరిత్ర మాట చెప్పనే అక్కర్లేదు. మన తొలి తెలుగు సినిమాల్లో మిగిలిన కొన్నింటి ప్రింట్లు పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల ఉన్నాయి. కానీ, మిగిలిన ఆ కొద్ది 1930 – 40ల నాటి తెలుగు చిత్రాల ప్రింట్లను డిజిటలైజ్ చేయించడానికి సినీపెద్దలు, ప్రభుత్వాలు చేçపడు తున్న చర్యలు శూన్యం. చరిత్రపై తమిళ, మల యాళ, బెంగాలీ చిత్రసీమలకున్న శ్రద్ధ మనకేది? మరోపక్క కొత్త కథాంశాలతో సినిమా తీయడానికి మలయాళ, తమిళ చిత్రసీమలలా మనమెందుకు ముందుకు రాలేకపోతున్నాం? ఒకప్పుడు థియేటర్ల సంఖ్యలో దేశంలో రెండో స్థానంలో ఉన్న మనం ఇప్పుడు తెలుగు రాష్టాలు రెండూ కలిపినా 1600 హాళ్ళు కూడా లేని పరిస్థితిలో పడ్డామెందుకు? భారీ రెమ్యూనరేషన్లు, భారీ బడ్జెట్ల విషవలయంలో పడి ప్రేక్షకుడి నడ్డి విరిచేలా పన్ను పెంచుదాం, టికెట్ రేట్లు పెంచుదాం లాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నాం? ఇలా పరిశ్రమ వేసుకోవాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఏది ఏమైనా, ఒకప్పుడు వీధి దీపాల మధ్య టెంట్లో టూరింగ్ టాకీసుల్లో నడిచిన సినిమా ఇవాళ ఏసీ హాళ్ళు, మల్టీప్లెక్సుల మీదుగా ఓటీటీ దాకా వచ్చేసింది. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుడు టీవీలు, కంప్యూటర్ల మీదుగా ఇప్పుడు అరచేతిలోని స్మార్ట్ఫోన్లలో ఓటీటీలో వినోదాన్ని వెతుక్కుంటున్నాడు. కరోనా వచ్చింది... మనల్ని విడిచి వెళ్ళకుండా ఇంకా ఉంది. ఏడు నెలల పైచిలుకు తరువాత థియేటర్లు తెరిచారు. మరో మూడున్నర నెలల తరువాత ఇప్పుడు హాళ్ళలో అన్ని సీట్లలో ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. హాలులో జనం తగ్గారేమో కానీ, సినిమా పట్ల మన మనసుల్లో ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడికి సినిమా ఒక మోహం. తెరపై కొత్త బొమ్మ చూడడం తీరని దాహం. ఆ దప్పిక తీర్చడానికి హాలైనా, మరొకటైనా మనకొకటే. అందుకే కాలంతో పాటు మారుతున్న వెండితెర మాయాజాలానికి జేజేలు. లాంగ్ లివ్ సినిమా! మన తెలుగు సినిమా!! ఫస్ట్ ఇండియన్ టాకీ ‘ఆలమ్ ఆరా’ తొలి రోజుల్లో సినిమా అంటే... భాషతో సంబంధం లేని మూగచిత్రాలు (మూకీలు). తర్వాత కాలంలో మూగకు మాటొచ్చింది. వెండితెర మాటలు నేర్చింది. పాటలు పాడసాగింది. మన తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలైంది. మాస్టర్ విఠల్, మిస్ జుబేదా నటించిన ఆ చిత్రానికి దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. తెలుగువాడైన హెచ్.ఎం. రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశారు. అక్కడి నుంచి మన దేశంలోని విభిన్న ప్రాంతాలు, వివిధ భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మొదలైంది. తొలి భారతీయ టాకీ నిర్మించిన ‘ఇంపీరియల్ మూవీటోన్’ సంస్థే ఆ తరువాత తొలిసారిగా దక్షిణాది భాషల్లో టాకీల రూపకల్పన మొదలుపెట్టింది. ఫస్ట్ సౌతిండియన్ టాకీ ‘కాళిదాస్’ ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పనిచేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. బొంబాయిలోనే ‘ఆలమ్ ఆరా’కు వేసిన సెట్స్ ఉపయోగించుకుంటూ ఆ సినిమా తీశారు. ప్రధానంగా తమిళ మాటలు – పాటలు, కొంత తెలుగు డైలాగులు – కొన్ని త్యాగరాయ కీర్తనలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో ఆ ‘కాళిదాస్’ తయారైంది. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న తొలిసారిగా మద్రాసులోని సినిమా థియేటర్ ‘కినిమా సెంట్రల్’ (తర్వాత ‘మురుగన్ టాకీస్’గా మారింది)లో రిలీజైంది. ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ’’ అంటూ ఆ దర్శక, నిర్మాతలే ప్రకటించిన ఆ సినిమా – మన దక్షిణాది భాషల్లో వచ్చిన ఫస్ట్ టాకీ! టాలీవుడ్ అంటే తెలుగు కాదు... బెంగాలీ! మొదట్లో బొంబాయి ఇంపీరియల్ స్టూడియోలో పనిచేసిన హాలీవుడ్ సౌండ్ ఇంజనీర్ విల్ఫోర్డ్ డెమింగ్ అక్కడ సౌండ్ రికార్డింగ్ మిషన్ పెట్టి, శబ్దగ్రహణమంతా తానే చూసేవారు. ‘ఆలమ్ ఆరా’ సహా బొంబాయిలో 5 చిత్రాలకు ఆయనే వర్క్ చేశారు. ఇంపీరియల్ స్టూడియోలో తయారైన ఫస్ట్ సౌతిండి యన్ టాకీ ‘కాళిదాస్’కు కూడా బహుశా ఆయనే సౌండ్ ఇంజనీర్. అంటే మన తెలుగు మాటల్ని, త్యాగరాయ కీర్తనల్నీ తెరపై వినిపించిన సౌండ్ ఇంజనీర్ ఎనిమిదేళ్ళ అనుభవం ఉన్న ఆ హాలీవుడ్ టెక్నీషియనే కావచ్చు. ఆ తరువాతి కాలంలో ఆయన కలకత్తాకు మకాం మార్చి, బి.ఎన్. సర్కార్ ‘న్యూ థియేటర్స్’ సంస్థలో 2 చిత్రాలకు పని చేశారు. కలకత్తాలోని టాలీగంజ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన బెంగాలీ చిత్రసీమకు ‘టాలీవుడ్’ అని పేరు పెట్టిందీ ఆయనే! 1932లో ‘అమెరికన్ సినిమాటోగ్రాఫర్’ పత్రికకు కలకత్తా సినీ పరిశ్రమ గురించి రాసిన వ్యాసంలో ఆయనే మొదట ఆ పేరు వాడారు. అంటే తెలుగు చిత్రసీమను మనోళ్ళు ‘టాలీవుడ్’ అనడమే పెద్ద తప్పు అన్న మాట! మన తొలి సినిమా విశేషాలు తొలి పూర్తి తెలుగు టాకీ: ‘భక్త ప్రహ్లాద’ దర్శకుడు: హెచ్.ఎం. రెడ్డి చిత్ర నిర్మాణం జరిగింది: 18 రోజుల్లో, రూ. 18 వేల పెట్టుబడితో సినిమా నిడివి: 9,762 అడుగులు సెన్సారైంది: 1932 జనవరి 22న, సెన్సార్ సర్టిఫికెట్ నంబర్: 11032. తొలి రిలీజ్: 1932 ఫిబ్రవరి 6న, బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి; తొలి 3 టాకీల్లో దర్శక నిపుణుడు చందాల కేశవదాసు, తొలి తెలుగు సినీ కవి దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ తొలి 3 టాకీల్లో పని చేసిన వ్యక్తి – రెంటాల జయదేవ -
చెన్నై: ఇళయరాజా, ఎల్వీప్రసాద్ స్టూడియో వివాదం
-
ఎల్వీ ప్రసాద్ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను – కృష్ణంరాజు
‘‘ఎల్వీ ప్రసాద్‌గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపాదించిన ప్రతి పైసా సినిమా పరిశ్రమ ఎదుగుదలకి, సినిమా ఇండస్ట్రీపై గౌరవం రావడానికి ఖర్చు చేశారు. ఆయనతో నాకు ఉన్న అనుబంధమే నన్ను ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది’’ అన్నారు ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు ఎల్వీ ప్రసాద్ 112వ జయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘అప్పట్లో నేను నటించిన ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఆ సమయంలో సినీ పరిశ్రమ వదిలేసి వెళ్లిపోదామనుకున్నాను. అప్పుడే ‘నేనంటే నేనే’ అనే సినిమా కోసం డూండీగారు నన్ను సంప్రదించారు. ఈ సినిమాలో ఉన్న మూడు పాత్రల్లో ఒకటి కృష్ణగారు, మరొకటి నాగభూషణంగారు చేస్తున్నారని చెప్పారు. ఇంకో పాత్ర కోసం నన్ను అడిగారు. అయితే ఆ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్న కారణంగా ఆ సినిమా చేయకూడదనుకున్నాను.ఓ సందర్భంగా ఎల్వీ ప్రసాద్‌గారిని కలిసినప్పుడు ఆయనకు ఈ విషయం చెప్పాను. ‘సినిమాలో నువ్వు హీరోవా? విలన్‌వా? అని కాదు. ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఎంత చేరువ అవుతావు అన్నదే ముఖ్యం’ అని ఆయన నాకు హితబోధ చేశారు. దాంతో నేను ‘నేనంటే నేనే’ చిత్రంలో నటించాను. ఆ చిత్రం విజయవంతమైంది. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు దోహదపడిన ఎల్వీ ప్రసాద్ గారికి రుణపడి ఉంటాను. వారి కుటుంబంతో కూడా నాకు మంచి సాన్నిహిత్యం ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ‘‘నా జీవితంలో మా నాన్నగారితో నేను గడిపిన క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలే. ఆయన అంతగా చదువుకోలేదు. ఎంతో కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన అంకితభావం చాలా గొప్పది. ఆ అంకితభావంతోనే అన్ని భాషలు మాట్లాడటం నేర్చుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నేను టెక్నికల్వైపు మారాను. ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటేడ్ బ్యానర్‌పై మా నాన్నగారు ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. తన సినిమాలు చూసి తనను గొప్పవాడిని చేసిన ప్రజలకు మంచి చేయాలని ఓ ట్రస్ట్‌ను స్థాపించారు. సినిమాల ద్వారా వచి్చన కోటి రూపాయలను డొనేషన్‌గా ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఎలీ్వప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమాలు రావడానికి మా సపోర్ట్‌ను కంటిన్యూ చేస్తాం’’ అన్నారు ఎలీ్వ ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్. ‘‘ఎల్వీ ప్రసాద్‌గారి జయంతి సందర్భంగా ప్రసాద్ సురేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్లో శిక్షణ పొందినవారికి గోల్డ్ మెడల్స్‌తో ప్రీ కాన్వకేషన్ ప్రదానం చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రసాద్ సురేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి. ‘‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో మహామహా నటులు ఎల్వీ ప్రసాద్‌గారి సినిమాల ద్వారా పరిచయమయ్యారు. అటువంటి ఆయనకు చెందిన ఈ ఫంక్షన్‌కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. ఈ వేడుకలో కృష్ణంరాజు సతీమణి శ్యామల, రమేష్ ప్రసాద్ కుమార్తె రాధ పాల్గొన్నారు. -
‘ఆయన ఎంతో మందికి స్ఫూర్తి’
అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ 111వ జయంతి ఉత్సవం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వైవీయస్ చౌదరి మాట్లాడుతూ.. ‘ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్ ఇద్దరూ మహావృక్షాలు. సినిమా రంగం పట్ల వ్యామోహాన్ని పెంచుకున్నారు. సినిమా రంగంలోనే తాము సంపాదించినదాన్ని ఇన్వెస్ట్ చేశారు. వారి వారసత్వాన్ని వారి పిల్లలు కొనసాగిస్తున్నారు. నా లాహిరిలాహిరి లాహిరిలో సినిమా సమయంలో నేను ప్రసాద్ ల్యాబ్స్ కు 8.75లక్షలు కట్టాల్సి ఉన్నప్పటికీ నాకు రమేష్ ప్రసాద్‌గారు సాయం చేశారు. అలాగే `రేయ్` కూడా ఆయన ఆశీస్సులతోనే విడుదలైంది. ఇక.. నందమూరి బాలకృష్ణ తండ్రి మీద బయోపిక్ తీసి అందరి మెప్పు పొందారు. అదేవిధంగా ఎల్వీ ప్రసాద్‌గారి మీద ఆయన తనయుడు ఓ మంచి బయోపిక్ తీయాల’న్నారు. ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ప్రతినిధి సురేష్ కొవ్వూరి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. త్వరలోనే ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నాం. ఎల్వీ ప్రసాద్‌గారి జీవితంలోని విషయాలను ప్రతి ఒక్కరూ తలా రెండు పేజీలు చదివి ఆచరించినా చాలు’ అని చెప్పారు. రమేష్ ప్రసాద్ తనయ రాధాప్రసాద్ మాట్లాడుతూ ‘మా తాతగారి గురించి ఏవీ చూసి థ్రిల్ అయ్యాను. మా పూర్వీకుల విలువలని, వాళ్ల ఆలోచనలని గౌరవించి, కొనసాగిస్తాం. మా నాన్నగారు ముందుండి తాతగారి బయోపిక్ తీయాలని ఆలోచిస్తున్నాం’ అని అన్నారు. రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ‘మా నాన్న సినిమా వ్యక్తి. ఆయనకు సినిమా తప్ప మరేమీ తెలియదు. ఇంట్లో వాళ్లని కూడా ఎక్కువగా కలిసేవారు కాదు. ఒక స్టూడియో నుంచి మరో స్టూడియోకి వెళ్లే దారిలో ఆయన రెస్ట్ తీసుకునేవారు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఈ రంగంలోకి వచ్చాను. మా ప్రసాద్ ప్రాసెసింగ్ ల్యాబ్‌కి 17 సార్లు జాతీయ పురస్కారం దక్కింది. మా నాన్నకు పృథ్విరాజ్‌కపూర్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్లలాగా మా కుటుంబం కూడా సినిమాల్లోనే ఉండాలని కోరుకునేవార’ని తెలిపారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘భారత సినీ రంగంలో ఎల్వీ ప్రసాద్‌గారి గురించి చెప్పడం అంటే సూరీడికి వెలుగు చూపించడమే. ఆయన ఒక వ్యవస్థ. నటుడు కావాలనుకున్నారు. అలాగే నటించారు. దర్శకుడిగా మారారు. ఆయన సినిమా రంగంలో తనకు ఇష్టమైన అన్ని శాఖల్లోనూ కృషి చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఐ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఎల్వీ ప్రసాద్‌గారి కలల్ని ఆయన తనయుడు సాకారం చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
నాన్న జర్నీ నుంచి ఆ నాలుగు విషయాలు నేర్చుకోవాలి
తెలుగు సినిమా బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగు సినిమా స్థాయి పెరగడానికి కృషి చేసిన దర్శక– నిర్మాతల్లో ఎల్వీప్రసాద్ ప్రముఖులు. తెలుగు, హిందీ, తమిళ తొలి టాకీ సినిమాల్లో నటించిన అరుదైన రికార్డ్ ఆయనదే. దర్శకుడిగా ‘మన దేశం, సంసారం మిస్సమ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా ‘ఇలవేలుపు, ఇల్లాలు’ వంటి చిత్రాలు నిర్మించారు. నేడు ఎల్వీ ప్రసాద్ 111వ జయంతి. ఈ సందర్భంగా తండ్రికి ఎల్వీ ప్రసాద్ ప్రయాణాన్ని పంచుకున్నారు ఆయన తనయుడు, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత, నిర్మాత రమేశ్ ప్రసాద్. ‘‘మా నాన్నగారి ప్రయాణాన్ని తలచుకున్నప్పుడుల్లా నాకు గుర్తొచ్చేది నాలుగు విషయాలు. ప్రిసర్వెన్స్(పట్టుదల), ప్యూరిటీ ఆఫ్ థాట్స్ (కల్మషం లేని ఆలోచనలు), ప్యాషన్ (తపన), పేషన్స్ (ఓపిక). చదువు లేకపోయినా ఆయన అనుకున్నది సాధించారు. చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. వ్యవసాయంలో మా తాతగారికి ఊహించలేనంత నష్టం వాటిల్లింది. దాంతో మా నాన్నగారు ఎవరికీ చెప్పకుండా కేవలం 100 రూపాయిలతో ముంబై వెళ్లిపోయారు. అప్పు తీర్చలేక పారిపోయారని అందరూ అనుకున్నారట. కానీ సినిమాల మీద ఆసక్తితో ముంబై చేరుకొని అక్కడ వాచ్‌మెన్‌గా ఉద్యోగం సంపాదించారు. హిందీ రాకపోయినా కేవలం సైగలతో సంభాషించేవారని తర్వాతి రోజుల్లో నాన్నగారు చెబితే మాకు తెలిసింది. ఓ టైలర్ షాప్‌ను శుభ్రం చేసే పని కూడా చేశారాయన. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే విషయానికి మా నాన్నగారు ఓ చక్కని ఉదాహరణ. నాన్నగారి తపనను గమనించిన టైలర్ ఆయన సినిమాల్లోకి వెళ్లడానికి తన వంతు సహాయం చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోయాక 16 నెలలకు ‘నేను బావున్నాను. సినిమాల్లో పని చేస్తున్నాను’ అంటూ ఇంటికి ఉత్తరం రాశారు. వాచ్‌మేన్‌గా పనిచేసిన థియేటర్ మరమత్తులు జరిగి, మళ్లీ నాన్నగారి సినిమాతోనే ప్రారంభం అయింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కమల్ హాసన్‌తో ఈ విషయాన్ని పంచుకున్నారు నాన్నగారు. మా నాన్నగారు తీసిన సినిమాల్లో ‘బిదాయి’ అనే సినిమా అంటే నాకు ఇష్టం. వాస్తవానికి నాన్నగారి గురించి వినడం తప్పితే ఎక్కువగా ఆయనతో గడిపింది లేదు. ఆయన షూటింగ్స్‌తో అంత బిజీగా ఉండేవారు. తనను ఇంతవాణ్ని చేసిన ప్రేక్షకులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. సినిమాకు తిరిగివ్వాలని ప్రసాద్ ల్యాబ్స్ స్థాపించారు. కెమెరా అంటే నాకు కొంచెం ఇబ్బంది. అందుకే సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. ‘సంసారం’లో చిన్న పాత్రను పోషించాను. ‘మీ నాన్నగారి బయోపిక్ తీస్తారా?’ అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఏమీ అనుకోలేదు. మా ప్రొడక్షన్లో రెండు సినిమాలు తీశాం. అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. మరో సినిమా తీయాడానికి చర్చలు నడుస్తున్నాయి’’ అన్నారు. -
సినిమా సాహెబ్‌లు
భారతీయ చలన చిత్రసీమలో బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి. నాగిరెడ్డి), అక్కినేని లక్ష్మీ వరప్రసాద రావు (ఎల్వీ ప్రసాద్)లది చెరిగిపోని చరిత్ర. ‘పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్’ వంటి అద్భుత చిత్రాలను నిర్మించిన ఘనత నాగిరెడ్డిది. చక్రపాణితో కలసి నాగిరెడ్డి తీసిన ‘షావుకారు, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు’ వంటి పలు చిత్రాలతో పాటు ఇతర బేనర్లలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన ఘనత ఎల్వీ ప్రసాద్‌ది. ‘రామ్ ఔర్ శ్యామ్, ప్రేమ్‌నగర్, స్వర్గ్ నరక్’ వంటి పలు హిందీ చిత్రాలకు బి. నాగిరెడ్డి సమర్పకుడు. ‘శారద, షాదీ కే బాద్, బిదాయి’ వంటి పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు ‘ససురాల్, ఏక్ దూజే కేలియే’ వంటి చిత్రాలను నిర్మించారు ఎల్వీ ప్రసాద్. సమాజానికి ఉపయోగపడే చిత్రాలు అందించిన ఇద్దరూ వైద్య రంగంలోనూ సక్సెస్ఫుల్. నాగిరెడ్డి ‘విజయా హాస్పిటల్స్’ ద్వారా మెరుగైన వైద్యం అందేలా చేస్తే, ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’ ద్వారా నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేశారు ఎల్వీ ప్రసాద్. తొలి ఇండియన్ టాకీ ‘ఆలమ్ ఆరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ తదితర చిత్రాల్లో నటుడిగానూ చేశారు ఎల్వీ ప్రసాద్. చెప్పుకుంటూ పోతే ఇద్దరి గురించి చాలా ఉంది. రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రస్తుత తరానికి ఇద్దరి జీవితం ఆదర్శం. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా బి. నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డి, ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేశ్ ప్రసాద్ పలు విశేషాలు పంచుకున్నారు. ఆ లక్షణాలు నాన్నగారి ఎదుగుదలకు కారణం – రమేశ్ ప్రసాద్ (తండ్రి ఎల్వీ ప్రసాద్, తనయుడు సాయిప్రసాద్‌తో రమేశ్ ప్రసాద్ ) మా నాన్నగారు గొప్ప పేరు, ప్రఖ్యాతులు సంపాదించడానికి కారణం నాలుగు విషయాలు. ప్యాషన్ (అభిరుచి), పేషెన్స్ (సహనం), పెర్సివరెన్స్ (పట్టుదల), ప్యూరిటీ ఇన్ థాట్స్ (ఆలోచనల్లో నిజాయితీ). జీవితంలో ఈ నాలుగూ పాటించారాయన. నాన్నగారి లక్షణాలు మాకూ వచ్చాయి. ఆయన వెరీ సింపుల్ మేన్. విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి. ఆయనెప్పుడూ స్కూల్‌కి వెళ్లలేదు. నాన్నగారు పుట్టింది ఏలూరులోని సోమవరప్పాడులో. పెదవేగి వెళ్లి డ్రామాలు వేస్తుండేవారు. యాక్టింగ్ అంటే ఆయనకు ఇష్టం. మా తాతగారు పెద్ద భూస్వామి. సుమారు 100 ఎకరాల భూమి కలిగిన వ్యక్తి. ఆయనకెంతో పలుకుబడి ఉండేది. అప్పట్లో సిల్క్ వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఆంధ్రా వాతావరణం సిల్క్ వ్యాపారానికి అంతగా సహకరించలేదు. విపరీతమైన లాస్ వచ్చింది. దాంట్లో నుంచి బయటపడటానికి వేరు శెనగ వేశారు. అప్పట్లో ఎవరైనా ఏదైనా పంట వేస్తున్నారంటే అందరూ అదే వేసేసేవాళ్లు. దాంతో శెనగ రేట్ పడిపోయింది. బస్తా 25పైసలు కూడా పలకలేదు. అప్పులు తిరిగి కట్టలేని పరిస్థితి. అది నాన్నగారికి అవమానంగా అని పించింది. మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యారు. దాంతో ఎవ్వరికీ చెప్పకుండా డిసెంబర్ 31 రాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అప్పులు తిరిగి కట్టలేకపోయామనే అవమానంతో నాన్నగారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అందరూ అనుకున్నారట. అప్పటికే నాన్నగారికి పెళ్లయింది. ఒక పాప కూడా. నేనింకా పుట్టలేదు. 16 నెలల తర్వాత ‘నేను క్షేమం. సినిమా కోసం బొంబాయి వచ్చాను. తిరిగొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను’ అని అమ్మకు ఉత్తరం రాశారట. టైలర్ షాప్ క్లీనర్‌గా... బొంబాయిలో నడియాడ్వాలా స్టూడియోస్, ఇంకా వేరే స్టూడియోస్ బయట తిరిగేవారట. సెక్యూరిటీ వాళ్లు ఆయన్ను లోపలికి పోనివ్వలేదు. అయితే బయట ఉన్న జింక్ షీట్స్ దగ్గర నిలబడి, లోపల జరిగేదంతా గమనించేవారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అలా చూస్తూ, రాత్రి అక్కడే ఫుట్‌పాత్ మీద నిద్రపోయేవారు. అక్కడి టైలర్‌షాప్ ఓనర్ నాన్నని గమనించి, ‘ఎందుకు రోజంతా ఇక్కడే ఉంటున్నావు’? అని అడిగారు. అతనితో మాట్లాడాలంటే నాన్నగారికి హిందీ, ఇంగ్లీష్ రావు. సైగలతోనే విషయం చెప్పారు. టైలర్‌షాప్ ఓనర్ జాలిపడి నాన్నగారిని తన షాప్‌లో పనికి కుదుర్చుకున్నారు. ఉదయం ఓనర్ వచ్చేసరికి ఆ షాప్ క్లీన్ చేసి, హుక్కా అరేంజ్ చేసిపెట్టాలి. ఉండటానికి చోటే లేని సమయంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. నాన్నలో ఉన్న గొప్ప లక్షణం అది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ని నమ్ముతారు. ‘మా నాన్న 100 ఎకరాల భూస్వామి, నేను చీపురు పట్టుకోవడం ఏంటీ’ అనుకోలేదు. ఆ పనిని చాలా శ్రద్ధగా చేశారు. ఆ టైలర్ షాప్‌లో కొంతమంది యాక్టర్లు బట్టలు కుట్టించుకునేవారు. ఆ ఓనర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఆఫీస్ బాయ్‌గా నాన్నని చేర్పించారు. అక్కడి నుంచి నాన్నగారు సెల్ఫ్ టీచింగ్ (అన్నీ స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు). అలా ఆఫీస్‌బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా ఎదిగారు. సరిగ్గా గాలి కూడా లేని ఇంట్లో... అన్నయ్య, నేను బొంబాయిలోనే పుట్టాం. అన్నయ్య పుట్టినప్పుడు ఉన్న ఇంట్లో గాలి, వెలుతురు సరిగ్గా ఉండేవి కావట. దాంతో బాగా ఏడ్చేవాడట. అప్పుడు నాన్నగారు అన్నయ్యని ఎత్తుకొని హ్యాంగింగ్ గార్డెన్స్‌కు తీసుకెళ్లి నిద్రపుచ్చేవారట. రాజ్‌కపూర్ (హిందీ నటుడు, దర్శక–నిర్మాత)గారి కుటుంబంతో, నాన్నగారికి మంచి అనుబంధం ఉండేది. వాళ్ల ఇంట్లో ఉన్న పాత ఊయల అన్నయ్య కోసం పంపారట. ఆ స్థాయిలో ఉన్నప్పుడు రాజ్‌కపూర్ కుటుంబంతో ఏర్పడిన పరిచయం నాన్నగారు గొప్ప స్థాయికి ఎదిగే వరకూ అలానే ఉంది. నాన్నని ఎంతగానో గౌరవించేవారు. ఇక్కడ తీసిన ‘ఇలవేల్పు’ సినిమాను ‘శారదా’ పేరుతో రాజ్ కపూర్, మీనాకుమారీలతో హిందీలో తీశారు. గేట్ కీపర్‌గా చేసిన థియేటర్లో శతదినోత్సవం బొంబాయిలో డ్రీమ్‌ల్యాండ్ థియేటర్‌కి కొన్ని రోజులు గేట్ కీపర్‌గా పని చేశారు నాన్నగారు. డైరెక్టర్‌గా ఆయన తీసిన ‘కిలోనా’ సినిమా వందరోజుల ఫంక్షన్ డ్రీమ్‌ల్యాండ్ థియేటర్లోనే జరిగింది. ఏ థియేటర్లో అయితే గేట్ కీపర్‌గా చేశారో ఆ థియేటర్లో దర్శకుడిగా ఆయన పేరు పడటం, ఆ సినిమా వంద రోజులాడటం.. అది చాలు ఆయన అచీవ్‌మెంట్‌కి. ఆయన కెరీర్ గ్రాఫ్ గమనిస్తే గేట్ కీపర్ టు దాదా సాహెబ్ ఫాల్కేగా ఎదిగారు. ఆ రోజు నాన్న చెంప ఛెళ్లుమనిపించారు నాన్నగారు రోజుకు 20గంటలు పనిచేసేవారు. మేం నిద్రలేచే సరికి షూటింగ్‌కు వెళ్లిపోయేవారు. మేం నిద్రపోయాక ఇంటికొచ్చేవారు. ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించలేని ఫీల్డ్ కాబట్టి నాకు సినిమాలవైపు ఇంట్రెస్ట్ కలగలేదు. అయితే ‘సంసారం’ సినిమాలో నాతో ఒక క్యారెక్టర్ చేయించాలని నాన్నగారు అనుకున్నారు. కానీ నాకు ఇష్టం లేదు. ఒకసారి ఆదివారం కూడా షూటింగ్ చేశారు. కరెక్ట్‌గా ఆ రోజు మ్యాచ్ ఉంది. నాన్నగారి దగ్గరికెళ్లి కాసేపటికోసారి ‘వెళ్లొచ్చా?’ అని అడిగాను. ‘కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. వెళ్లిపోతే నిర్మాతకు నష్టం వస్తుంది’ అని అన్నారు. ఇంకోసారి అడిగితే చెంప ఛెళ్లుమనిపించారు. ఆ తర్వాత నాన్నగారు యాక్ట్ చేయమని మా ఇంట్లో ఎవ్వర్నీ ఫోర్స్ చేయలేదు. ఇప్పటికీ ‘సంసారం’ చూస్తే ఎన్టీఆర్‌గారు, ఏయన్నార్‌గారు ఉన్న ఫ్రేమ్‌లో నేనొక్కడినే మిస్ఫిట్లాగా అనిపిస్తుంది. కెమెరా, మైక్ అంటే నాకు చాలా ఇబ్బంది. మాట మీద నిలబడ్డ వ్యక్తి గొప్ప దర్శకుడు అనే పేరుతో పాటు నాన్నగారు ‘మాట మీద నిలబడే మనిషి’ అనే పేరూ సంపాదించుకున్నారు. నాన్నగారు తమిళంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలకు కరుణానిధి (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)గారు డైలాగ్స్ రాశారు. ఓ సినిమా విషయంలో ‘పదివేలు ఇస్తేనే రాస్తా’ అన్నారట. ‘సినిమా బాగా ఆడితే ఇస్తా’ అన్నారట. సినిమా సూపర్ హిట్ అయింది. అన్న ప్రకారం పది వేలు ఇచ్చారట ‘‘ప్రసాద్ గొప్ప వ్యక్తి. చెప్పిన మాట మీద నిలబడే కొద్దిమందిలో ప్రసాద్ ఒకరు’’ అని కరుణానిధిగారు అన్నారు. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు డబ్బులు అవసరం ఉండి నిర్మాత గోగినేనిని అడిగారు. కొన్ని రోజులకు ఆ డబ్బు ఇచ్చేశారు. ‘ఇండస్ట్రీలో తీసుకున్న డబ్బు తిరిగిచ్చింది నువ్వే’ అన్నారట గోగినేనిగారు. అందుకే ‘ఎల్వీ ప్రసాద్ ఐ’ హాస్పిటల్ ప్రేక్షకులు తన సినిమాలు ‘చూడడం’ వల్లే గొప్ప స్థాయికి ఎదిగానని నాన్నగారు అనేవారు. మరి.. చూపు లేనివాళ్ల పరిస్థితి ఏంటి? అనుకున్నారు. ఆ ఆలోచన వచ్చాక ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’ ఏర్పాటు చేశారు. ఇలాంటి ట్రస్ట్ నడపాలంటే ఎవరు కరెక్ట్ అనుకుంటున్న సమయంలో నా ఫ్రెండ్, డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు గుర్తొచ్చారు. అమెరికాలో బాగా సంపాదించి, స్వదేశం కోసం ఏదోటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘ఐ’ ఇన్స్టిట్యూట్ కోసం కోటి రూపాయలతో ట్రస్ట్ స్టార్ట్ చేశాం. హాస్పిటల్ నిర్వహణ కోసం నాగేశ్వరరావుగారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేశారు. ‘వైట్ కార్డ్’ ఉన్నవారికి ఇక్కడ ఉచితంగా చికిత్స చేస్తాం. మా అమ్మగారు గ్రేట్ లేడీ పుట్టినప్పటి నుంచి నేనైతే కష్టాలు ఎప్పుడూ చూడలేదు. అప్పటికి నాన్నగారు మంచి పొజిషన్లోనే ఉన్నారు. పిల్లల్ని బాగా చదివించారు. నేను అమెరికాలో ఇంజనీరింగ్ చేశాను. నాన్నగారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కుటుంబం ఆనందంగా ఉందంటే దానికి కారణం మా అమ్మగారే. కేవలం మమ్మల్ని చూసుకోవడమే కాదు. మా పనివాళ్లని, డ్రైవర్స్‌ని కూడా బాగా చూసుకున్నారు. చాలా మంది పెళ్లిళ్లు కూడా అమ్మగారే దగ్గరుండి చేశారు. మా నాన్నగారి ఊరిలో తాగునీటి సమస్య ఉండేది. దాంతో ఊరు మొత్తం తాగు నీటిని ఏర్పాటు చేశారు. అలాంటివి చాలా చేశాం. నాన్నగారి ముందు మేం తక్కువే నాన్నగారి చివరి రోజుల వరకూ కూడా సినిమానే శ్వాసగా బతికారు. ఆదివారాలు కూడా పనిచేశారు. ఇండస్ట్రీలో నాన్నగారు సంపాదించిన గుడ్ విల్ వెలకట్టలేనిది. మేం ఎంత సంపాదించినా ఆయన తెచ్చుకున్న పేరు ముందు చాలా తక్కువే. 100 రూపాయలతో ప్రయాణం స్టార్ట్ చేసిన ఎల్వీ ప్రసాద్ అనే వ్యక్తి ఆలోచనల్ని, ఆశయాల్ని ఇప్పుడు సుమారు 1500 మంది ఉద్యోగులంతా కలసి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన లైఫే మా అందరికీ ఇన్స్పిరేషన్. నాన్నగారు ఎప్పుడూ మాతోనే ఉంటారు – విశ్వనాథరెడ్డి (తండ్రి నాగిరెడ్డితో విశ్వనాథరెడ్డి) అందరికీ తెలిసిన మా నాన్నగారి గురించి ఏం చెప్పను? నిజానికి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన్నుంచి నేర్చుకున్నవి, చిన్ననాటి జ్ఞాపకాలు ఇలా ఒక కొడుకుగా జీవితాంతం ఆయన గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. అందుకే ఈ ‘నాన్నతో నేను’ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పదలిచాను. ‘పుట్టాం–పెరిగాం–జీవించాం’ అనికాక ‘ఇతరుల కోసం జీవించేదే జీవితం’ అని నిరూపించిన సాధకుడాయన. స్వాతంత్య్రోద్యమంలో... పొట్టిపాడు అనే చిన్న గ్రామంలో, వ్యవసాయ కుటుంబంలో పుట్టారు నాన్నగారు. మా తాతగారు ‘ఎక్స్పోర్ట్’ బిజినెస్ చేసేవారు. ఉల్లిపాయల వ్యాపారం. నాన్నగారిని ఆయన 14వ ఏట మదరాసు తీసుకెళ్లారు. అక్కడ స్కూల్లో చేర్చితే చదువు మీద ఆసక్తి లేని కారణంగా నాన్నగారు చదువుకోలేదు. స్వాతంత్య్రోద్యమాల్లో పాల్గొన్నారు. ఇలా అయితే లాభం లేదనుకుని నాన్నగారిని సొంతూరికి పంపించేశారు. అక్కడ ‘ఖాదీ మూమెంట్’లో పాల్గొన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల నాన్నగారిని మళ్లీ మదరాసు తీసుకెళ్లారు. చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడంతో ఎక్స్పోర్ట్ బిజినెస్ నిమిత్తం నాన్నగారిని తాతగారు రంగూన్ పంపారు. అప్పుడు మదరాసులో ‘బీఎన్కే’ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. అప్పటికి మా పెదనాన్న (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి – బీఎన్ రెడ్డి) మూడు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన ‘స్వర్గసీమ’ సినిమాకి డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ చిత్రనిర్మాత చక్రపాణిగారితో నాన్నగారికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలసి ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. వాహినీ.. విజయా వాహినీ అయింది అప్పట్లో ‘వాహినీ స్టూడియోస్’కి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. మూల నారాయణస్వామి మేజర్ పార్టనర్. స్టూడియోస్కి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ వస్తే.. ‘సేవ్’ చేయడం కోసం నాన్నగారు స్టెప్ ఇన్ అయ్యారు. మా అక్క పేరు జయ. ఆ పేరు, ఆంజనేయుడు, అర్జునుడు పేర్లు కలిసొచ్చేట్లుగా ‘విజయా వాహిని’ పెట్టారు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్‌ని ఆ స్టూడియో బేనర్ మీద తీశారు. వ్యాపారం, పత్రిక, చిత్రరంగం, వైద్యరంగాల్లో నాన్నగారు పేరుప్రఖ్యాతులు సంపాదించారు. దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు. చెన్నై వదిలేది లేదన్నారు సినిమాల్లోకి రాకముందు నాన్నగారు ‘చందమామ’ పత్రిక నడిపేవారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌గారు ‘చందమామ’ పత్రికకు అభిమాని. ఆయన నాన్నగారితో ‘చందమామ పబ్లికేషన్స్’ను ఢిల్లీకి మార్చమని అక్కడ తగిన స్థలం కేటాయిస్తానని చెప్పారు. అప్పుడు నాన్నగారు ‘‘చెన్నై నా సొంత ఇల్లు. దాన్ని వదిలి నేనెక్కడా ఉండలేను’’ అన్నారు. ఉమ్మడి కుటుంబాన్ని ఇష్టపడేవారు మేం ఉమ్మడి కుటుంబంగా ఉండడాన్నే మా నాన్నగారు ఇష్టపడేవారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డిగారున్న రోజుల్లో ఆయన హిందీ, ఇంగ్లిష్, తెలుగు, ఇతర ఉత్తరాది భాషల్లో వస్తున్న ‘చందమామ’ను హైదరాబాద్ నుంచే తీసుకురావచ్చునని అభిప్రాయపడ్డారు. అందుకు తగిన స్థలాన్ని హైదరాబాద్‌లో ఇస్తానని కూడా చెప్పారు. మేం కూడా వెళ్ళి ఆ స్థలాన్ని చూసి వచ్చాం. ఇది విన్న నాన్నగారు బాధపడ్డారు. పత్రికా సంస్థలో ఒక భాగం హైదరాబాద్ నుంచి పని చేస్తే, అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. వృత్తిరీత్యా కూడా మా అన్నదమ్ములు విడిగా ఉండటం ఆయనకు ఇష్టంలేదు. అందువల్ల ఆ విషయాన్ని అంతటితో వదిలేశాం. వాస్తవంగా చెన్నై, వడపళని ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్లడానికి ఆయన ఇష్టపడలేదు. గెలుపు–ఓటములు గురువులాంటివి ఏ పనిచేసినా సంపూర్ణ భక్తి శ్రద్ధలతో, నిబద్ధతతో చేయాలనేది ఆయన సంకల్పం. ‘సుఖదుఃఖాలకు మనసులో సమస్థితి కల్పించండి’ అనేవారు. ‘గెలుపు–ఓటములు రెండూ గురువు లాంటివి’ అని, జీవితంలో ఆ రెంటినీ సమంగా స్వీకరించారు. ‘సింహానికి సకల వసతులూ కల్పించినా, అది వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవాలి. కఠినంగా శ్రమిస్తేనే ఫలితం లభిస్తుంది’ అనేవారాయన. గతాన్ని ఎప్పుడూ మరచిపోలేదు వృత్తిలో ఎంత పోటీ ఉన్నా కొందరితో చేతులు కలపడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. నీతీ నిజాయితీగా ఉండేవాళ్లతోనే చేతులు కలిపేవారు. అవి లేనివాళ్లతో చేతులు కలిపితే మనసులో ప్రశాంతత కొరవడుతుంది అనేవారాయన. ‘నీకు నెలకు వెయ్యి రూపాయలు జీతం వస్తున్నప్పుడు నెలకు పదివేలు సంపాదించే వారితో పోల్చుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు. ఐదొందలు సంపాదించేవారితో పోల్చుకుంటే ప్రశాంతత లభిస్తుంది’ అంటుండేవారు.ఆయన గతాన్నెప్పుడూ మరిచిపోయేవారు కాదు. చిన్న వయసులో చదివిన, నేర్చుకున్న పురాణాలు, ఇతిహాసాలలోని మంచిని ఆయన తరచూ గుర్తుంచుకునేవారు. నాన్నగారు గుప్తదానాలు చేసినా బయటకు చెప్పుకోలేదు. ఆయన వద్ద సాయం పొందినవారు చెబితే ఆయన దానగుణం తెలిసేది. నా జీవితంలో ఎన్నో పదవులు నిర్వహించాను. వాటికి మూలకారణం – ‘నాగిరెడ్డిగారి కుమారుడు’ అవడం. రెండవ కారణం– తల్లిదండ్రులను గురువులుగా భావించి వారినుంచి గ్రహించిన అనుభవపాఠాలు. నాన్నగారు భౌతికంగా లేకపోవచ్చు. మానసికంగా ఎప్పుడూ మాతోనే ఉంటారు. నా గురువు, మార్గదర్శి ఆయనే. వీల్ ఛైర్లో కూర్చుని... మా నాన్నగారు 1997లో జబ్బుపడటంతో ఇక ఎప్పటిలా అన్ని పనులూ నిర్వహించలేనని గ్రహించారు. అయితే ఆ విషయం బహిర్గతం కాకుండా – ఆస్పత్రుల నిర్వహణకు ఓ కమిటీని ఏర్పరచారు. ఆస్పత్రులకు సంబంధించిన చిన్న పనైనా, పెద్ద పనైనా – ఆ కమిటీ చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆ నిర్ణయాన్ని నాన్నగారికి తెలియచేసి, ఆయన అంగీకారంతోనే దాన్ని ఆచరణలో పెట్టాలి. నాన్నగారు వీల్‌ఛైర్‌లో కూర్చుని ఆస్పత్రి పనులను పర్యవేక్షిస్తున్న కాలంలో– ఆయన్ను కలుసుకోవడానికి చాలామంది వస్తుండేవారు. వాళ్లల్లో చిత్రసీమకు చెందినవాళ్లతో మాట్లాడినప్పుడు నాన్నగారికి మళ్లీ సినిమాలు తీయాలనే ఆలోచన తలెత్తేది. నాన్నగారి చివరి కథ ధనమా? గుణమా? సినిమాలు తీయాలని నాన్నగారు తయారు చేసుకున్న కథల్లో ‘ధనమా గుణమా?’ ఒకటి. అయితే ఆరోగ్యం సహకరించదు కదా. ఆ పరిస్థితుల్లో... అప్పట్లో 2000 సంవత్సరానికి మిలీనియం కార్నివాల్‌ను నిర్వహించాం. ఆ కార్యక్రమాల నిర్వహణలో మీడియా పార్టనర్‌గా జయా టీవీవారు మాకెంతగానో సహకరించారు. దాంతో ‘ధనమా? గుణమా?’ కథను ‘ఎంగవీట్టు పెణ్’ పేరుతో నేను టెలీ సీరియల్‌గా నిర్మించి – జయా టీవీలో టెలికాస్ట్ చేయిస్తానంటే నాన్నగారు అంగీకరించారు. ఆ సీరియల్ కోసం వెయిట్ చేసేవారు నాన్నగారు చివరిగా ఓ కథారచయితగా పాల్గొన్న ఆ టెలీ సీరియల్ 2001, సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. 45 వారాల పాటు ప్రతి సోమవారం రాత్రి 8.30 గుంటలకు ప్రసారమయ్యేది. ఎపిసోడ్ ప్రసారమయ్యే ముందు రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ వివరాలు అడిగేవారు. సోమవారం రాత్రి 8.30 గుంటలకు టీవీ దగ్గర కూర్చునేవారు. చూసిన ఎపిసోడ్‌కు సంబంధించిన పాత్రధారుల వస్త్రధారణ, మేకప్ వంటివి.. ఇంకా ఎంత బాగా ఉండొచ్చో చెప్పేవారు. 90 యేళ్ల వయసులోనూ ఆయనకు ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి, ఉత్సాహం ఇప్పుడు తలచుకున్నా ఆశ్చర్యంగా ఉంటుంది. అనారోగ్యంతో మంచంపట్టిన మా నాన్నగారికి సేవచేసే భాగ్యాన్ని నాకు కరుణించిన ఆ భగవంతునికి నేను ఋణపడి ఉన్నాను. ఇది నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తాను. ఎన్ని జన్మలెత్తినా నాగిరెడ్డిగారు, శేషమ్మ దంపతులకు కుమారుడుగానే జన్మించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ‘‘ఒకరు చేసిన మంచిని మరవడం తప్పు. అలాగే ఒకరు చేసిన అపకారాన్ని అప్పటికప్పుడు మరవకపోవడం కూడా తప్పు’’ అనే సూక్తి ఇక్కడ ప్రస్తావించడం అవసరం అనుకుంటాను. నాగిరెడ్డిగారంటే నాన్నకు చాలా గౌరవం నాగిరెడ్డి–చక్రపాణిగార్లంటే నాన్నగారికి చాలా గౌరవం. నాగిరెడ్డి గారితో మంచి అనుబంధం ఉండేది. విజయా సంస్థలో సినిమాలు చేసినప్పుడు నాన్నగారికి నెల జీతం ఇచ్చేవారు. అప్పట్లో అంతే. నాగిరెడ్డిగారి భార్య చాలా మంచివారు. మేం పిల్లలం వాళ్లింటికి వెళ్లేవాళ్లం. వాళ్ల పిల్లలు విశ్వనాథరెడ్డి వాళ్లు మా ఇంటికి వచ్చేవారు. నేను చాలాసార్లు వాళ్ల ఇంట్లో భోజనం చేశాను. అందుకే ప్రసాద్ ల్యాబ్స్ స్టార్ట్ చేశాం ఎన్టీఆర్‌తో తీసిన ‘తల్లా? పెళ్లామా?’ సినిమా నాకు బాగా నచ్చింది. దాన్ని హిందీలో తీయాలనిపించింది. నాన్నగారి ద్వారా ఎన్టీఆర్‌గారి దగ్గర రైట్స్ తీసుకుని హిందీలో తీశాం. ఆ సమయంలో ఫిల్మ్ నెగటివ్స్కి గీతలు పడ్డాయి. వెళ్ళి ప్రింట్ చేసేవాళ్లను అడిగాను. రెండు మూడు సార్లు అడిగినా వాళ్లేం మాట్లాడలేదు. నచ్చకపోతే తీసుకెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడారు. ఆ రోజే నిర్ణయించుకున్నా.. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే ల్యాబ్ పెట్టాలని. అనుకున్నట్టుగానే సినిమా సూపర్ హిట్. అప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ మొదలుపెట్టాం. సంపాదించినదాన్ని మళ్లీ సినిమాల్లోనే పెట్టాలనేవారు నాన్నగారు. ఓ సందర్భంలో ఉంటున్న ఫ్లాట్ చిన్నగా ఉంది.. వేరే ఫ్లాట్ తీసుకుందాం అని మేం అనుకుంటుంటే.. ‘వద్దు. ఏదో కెమెరా అమ్మకానికి వచ్చింది. అది తీసుకుందాం’ అన్నారు. ఇప్పుడు మాకున్న ఇంత ఎక్విప్‌మెంట్‌కి కారణం నాన్నగారే. సినిమాను క్రియేటివ్‌గానే చూశారు తప్పితే వ్యాపార కోణంలో చూడలేదు. నాన్నగారు క్రియేటివ్ సైడ్ ఉంటే నేను టెక్నికల్ సైడ్. ఓసారి వాషింగ్టన్ డీసీ స్మిత్సోనియన్ మ్యూజియమ్‌లో ‘టు ఫ్లై’ ఐమాక్స్ సినిమా చూసి థ్రిల్ అయ్యాను. ఎలా అయినా ఐమాక్స్ని ఇండియా తీసుకురావాలనుకున్నాను. సాధించగలిగాను. నాన్నగారి తర్వాత రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశాం. అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో ప్రొడక్షన్‌కి దూరంగా ఉన్నాం. మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఓ సారి ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లాను. ఎప్పటికైనా ఆస్కార్ తీసుకు వచ్చే సినిమా చేయాలని ఆశ. మరి నెరవేరుతుందో? లేదో చూడాలి. ఎల్వీ ప్రసాద్‌గారు మంచి వ్యక్తి ఎల్వీ ప్రసాద్‌గారితో నాన్నగారికి మంచి అనుబంధం ఉంది. ప్రసాద్‌గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఫుడ్ లవర్. మేం వడపళనిలో ఉండేవాళ్లం. ఆయన కుటుంబం అడయార్‌లో ఉండేది. వడపళని నుంచి నన్ను అడయార్ తీసుకెళ్లేవారు. వెళ్లే దారిలో కొబ్బరినీళ్లు ఇప్పించేవారు. ఎల్వీ ప్రసాద్‌గారి కూతురు గృహలక్ష్మీ నాకన్నా పెద్ద. ఆమె నన్ను రైటింగ్, పెయింటింగ్ సైడ్ బాగా ఎంకరేజ్ చేశారు. మేమంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లం. నేను చేసుకున్న పుణ్యం అది మేం బడిలో చదివే రోజుల్లో మా తల్లిదండ్రులతో కుట్రాలం వెళ్ళాం. రోజూ ఉదయం అక్కడ నాన్నగారితో వాకింగ్ వెళ్ళేవాళ్లం. ఆ సమయంలో ఆయన నాకు వివేకానందుడు, బాపూజీ వంటి మహనీయుల గురించి, ఆత్మవిశ్వాసం, సహనం, కృషి, సాహసం లాంటి విషయాల గురించీ చెబుతుండేవారు. మనుషులు పొరబాట్లు చేయడం సహజం. అయితే వాటిని అంగీకరించే పరిపక్వత, ధైర్యం కావాలి. సరళత, దోషాలు అంగీకరించడం, పెద్దలను గౌరవించడం లాంటివి నేర్చుకోవడం గురించి చెప్పేవారు. నేను ఇప్పుడు కొద్దో గొప్పో ఉన్నత స్థానంలో ఉన్నానంటే నాకు ఆయన నూరిపోసిన విషయాలే కారణం. ఆయన పుత్రుడిగా జన్మించడం నేను చేసుకున్న పుణ్యం. చందమామ లోగో వెనక స్టోరీ అదే 80వ ఏట నాన్నగారు అనారోగ్యంపాలై, కంటిచూపు మందగించినప్పుడు నాతో ఎక్కువ సమయం గడిపేవారు. ఆయన నాతో ‘నువ్వు ఆగర్భశ్రీమంతుడివి కావు. కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు వెళ్లొచ్చు’ అన్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఒకనాడాయన ‘చందమామ’ లోగో ఎలా వచ్చిందో చెప్పారు. ‘బౌద్ధ జాతక కథలలో వచ్చే ఒక సంఘటనే ‘చందమామ’ లోగోగా ఎంపిక చేశాం. చంద్రునికి ఆహారంగా తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న కుందేలు త్యాగమే ఆ సంకేతం. ఇతరులకు సాయపడటానికి తమను తాము త్యాగం చేసుకోవడానికి సంసిద్ధులం కావాలి, సంకోచపడకూడదు’ అనేవారాయన. ‘కృతజ్ఞతను మరవని మనసు కావాలి. అదే నా మూలధనం’ అంటుండేవారు నాన్నగారు. -
మహానటి : కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్‌ల ప్రోమోలు విడుదల
-
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన పోకిరీలు
రఘునాథ్ అనే యువకుడి కంటికి గాయాలు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స హైదరాబాద్: ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై శుక్రవారం రాత్రి పోకిరీలు రాళ్లు రువ్వడంతో ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యారుు. ఈ ఘటనలో గద్వాల ప్రాంతానికి చెందిన రఘునాథ్ (25) అనే యువకుడికి ఎడమ కంటికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం రఘునాథ్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో గద్వాల నుంచి కాచిగూడకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. రఘునాథ్ తండ్రి బాలరాజు కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశోధనలకు పెద్దపీట
సాక్షి, సిటీబ్యూరో: పరిశోధనా రంగాన్ని మరింత బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తోందని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్వీపీఇఐ)లో కొత్తగా ఏర్పాటు చేసిన “ది సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్’ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో పరిశోధన శాల ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. దీనికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ప్రపంచంలోనే ఈ ఆస్పత్రి కార్నియా మార్పిడి శస్త్రచికిత్సల్లో ఐదో స్థానంలో ఉండటం మనకు గర్వ కారణమన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ జీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సృజన ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. ఎల్వీప్రసాద్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్‌రావు మాట్లాడుతూ 2030 నాటికి అంధత్వం లేని తెలంగాణను తీర్చి దిద్దడమే లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో సృజన ఇ న్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వీరేందర్ సాంగ్వాన్ పాల్గొన్నారు. -
పాక్ బాలిక కంటికి శస్త్రచికిత్స విజయవంతం
జూబ్లీహిల్స్ (హైదరాబాద్): కంటి కేన్సర్‌తో బాధపడుతున్న ఓ పాకిస్తాన్ బాలికకు నగరంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. బుధవారం ఆ బాలికను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి కన్సల్టెంట్ ఆక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్వాతి మాట్లాడుతూ... గత దశాబ్ద కాలంలో 1,500కు పైగా రెటినో బ్లాస్టోమా (కంటి కేన్సర్ ) శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 8,000 కేసులు నమోదు అవుతుండగా మన దేశంలో దాదాపు 1,000 రెటీనా బ్లాస్టోమా కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు వారికి ఎక్కువగా వచ్చే ఈ వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చన్నారు. -
ప్రకృతిని చదివిన విద్యార్థులు
‘మొబైల్ యాప్స్ ఫర్ కై ్లమేట్ చేంజ్’.. విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌తో కలిసి వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రూపొందించిన ప్రాజెక్ట్! ఈ పర్యావరణ అధ్యయనాన్ని ‘అర్బన్ ఐ నేచర్‌వాచ్ చాలెంజ్’ పేరుతో విద్యార్థుల ప్రాజెక్టు వర్క్‌లో భాగం చేశారు. డిసెంబర్లో లాంఛ్ చేసిన ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్న తీరును తెలుసుకునే కార్యక్రమాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంస్థ శుక్రవారం ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లోని పటోడియా ఆడిటోరియంలో నిర్వహించింది. ఇందులో భాగంగా మెరిడియన్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, భారతీయ విద్యాభవన్, చిరక్ ఇంటర్నేషనల్, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, ఇక్బాలియా ఇంటర్నేషనల్ తదితర 8 స్కూల్స్‌కు చెందిన 500 మంది విద్యార్థుల నుంచి తమ అర్బన్ ఐ నేచర్ వాచ్ చాలెంజ్‌కు మంచి స్పందన వచ్చిందని, మెరిడియన్ స్కూల్ విద్యార్థి ధృవ్.. ఈ చాలెంజ్‌ను స్వీకరించి, ఈ విషయంలో తాను తన స్కూల్‌కు సారథ్యం వహిస్తానని ప్రారంభంలోనే తెలిపి తన స్కూల్ విజయానికి కారణమయ్యాడని నిర్వాహకులు ప్రకటించారు. విద్యార్థులు.. ఈ ఛాలెంజ్ సందర్భంగా తమకు ఎదురైన అనుభవాలను, ప్రకృతిలో తాము పరిశీలించిన అంశాలను పంచుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్థానిక ప్రతినిధి ఫరీదా, ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్ డాక్టర్ తారాప్రసాద్దాస్ పాల్గొని మాట్లాడారు. ..:: సిటీప్లస్ -
యాప్స్ ఫర్ క్లైమేట్ చేంజ్
‘మొబైల్ యాప్స్ ఫర్ క్లైమేట్ చేంజ్’... విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌తో కలిసి వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రూపొందించిన ప్రాజెక్ట్! ఈ పర్యావరణ అధ్యయనాన్ని ‘అర్బన్ ఐనేచర్వాచ్ చాలెంజ్’ పేరుతో విద్యార్థుల ప్రాజెక్టు వర్క్‌లో భాగం చేశారు. డిసెంబర్లో లాంచ్ చేసిన ఈ యాప్స్ ఉపయోగిస్తున్న తీరును తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టింది డబ్ల్యూడబ్ల్యూఎఫ్. ఇందులో మెరిడియన్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, భారతీయవిద్యాభవన్, చిరాక్ ఇంటర్నేషనల్, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, ఇక్బాలియా ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులు పాల్గొని.. యాప్ వినియోగాన్ని వివరిస్తారు. సమయం: ఉదయం 9:30 గంటలకు వేదిక : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, బంజారాహిల్స్ -
20 వేల కార్నియాల మార్పిడితో ప్రపంచ రికార్డు
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యుల అరుదైన ఘనత వైద్య సిబ్బందిని సన్మానించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గ్రామీణ ప్రాంతాలకు వైద్యసేవలు విస్తరించాలని సూచన కొత్త కార్పొరేట్ ఆస్పత్రులకునగరంలో స్థలమే కాదు, స్థానం కూడా లేదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘కార్పొరేట్ ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌కే పరిమితమవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ అవసరానికి మించి ఆస్పత్రులున్నాయి. కొత్తవాటికి ఇక్కడ స్థలమే కాదు.. స్థానం కూడా లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి పేద, మధ్యతరగతి ప్రజలను అనారోగ్యాల నుంచి కాపాడాలి’ అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ ఇప్పటి వరకూ 20 వేల కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన నరసింహన్.. కార్నియా మార్పిడి శస్త్రచికిత్సల్లో పాల్గొన్న వైద్యులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో వైద్యసేవలు ఖరీదైన వస్తువుగా మారాయన్నారు. జబ్బు చేసి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే ముందు రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలని సూచిస్తున్నారని, లేదంటే మృతదేహాన్ని అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యసేవలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నా.. అవి కొందరికే అందుతుండటం బాధగా ఉందన్నారు. ఈ పరిస్థితి పూర్తిగా మారాలని, వైద్యసేవలు, ఫీజు వసూళ్లపై మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాలకు సూచించారు. అతితక్కువ ఖర్చుతో కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు చేసి రికార్డు సృష్టించిన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి.. ప్రపంచ కార్పొరేట్ వైద్య సంస్థలకే ఆదర్శంగా నిలిచిందని నరసింహన్ కొనియాడారు. కార్పొరేట్ ఆస్పత్రలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలకు సేవల విస్తరణ, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యసేవ లు అందించే అంశంపై చర్చించి, వాటిని ఆ దిశగా ప్రోత్సహించాల్సిందిగా ఏపీ, తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రులకు ఈ సందర్భంగా సూచించారు. ఇందుకు ఎల్వీ ప్రసాద్ వైద్యులు చొరవ తీసుకోవాలని కోరారు. మన కార్నియాలు మార్పిడికి పనికిరావు ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఐ బ్యాంక్ ఏర్పాటు చేయాలని తాము భావించినప్పుడు చాలామంది వద్దని వారించారని, కొంతమందైతే భారతీయుల కార్నియాలు మార్పిడికి పనికిరావని చెప్పారన్నారు. అయినా అధైర్యపడకుండా 1989లో తొలి నేత్రనిధిని ప్రారంభించానని, ఇప్పటి వరకు 20 వేల కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు చేశామని చెప్పారు. వీటిలో 55 శాతం శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, డాక్టర్ మనోజ్ గుల్లాటి తదితరులు పాల్గొన్నారు. -
మూలకణాలతో కంటిచూపు!
కార్నియా మార్పిడికి ప్రత్యామ్నాయ చికిత్స ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, అమెరికా వర్సిటీల ఘన విజయం 10 మంది రోగులపై పరిశోధన రెండు మూడేళ్లలో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: కంటిలోని కార్నియా(శుక్ల పటలం) దెబ్బతిని అంధత్వం బారినపడే వారికి ఇక కార్నియా మార్పిడి అవసరం లేకుండానే తిరిగి కంటిచూపును పునరుద్ధరించవచ్చు. కనుపాపపై పారదర్శక పొరలా ఉండే శుక్ల పటలాన్ని పునరుద్ధరించేందుకు తోడ్పడే మూలకణాలను శాస్త్రవేత్తలు కంటిలోనే కనుగొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ ఘనవిజయం సాధించారు. మూలకణాలతో కంటిచూపును పునరుద్ధరించేందుకు ఈ ఏడాది జనవ రి నుంచి జరుపుతున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయని, మరో రెండు మూడేళ్లలోనే ఈ చికిత్సా విధానం అందుబాటులోకి రానుందని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ కన్సల్టెంట్ సర్జన్, శాస్త్రవేత్త డాక్టర్ సయన్ బసు వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలను గురువారం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో డాక్టర్ బసు, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆప్తల్మాలజీ ప్రొఫెసర్ జేమ్స్ ఎల్.ఫండర్బర్గ్ స్కైప్ ద్వారా అమెరికా నుంచి జేమ్స్ విలేకరులకు తెలిపారు. ఈ మేరకు.. కనుగుడ్డులోని తెలుపు, నలుపు భాగాల మధ్య ఉండే లింబస్ ప్రాంతంలో కొత్త మూలకణాలను కనుగొన్నారు. దెబ్బతిన్న కార్నియా వద్దకు ఈ మూలకణాలను చేర్చగా, నాలుగు వారాలలోనే కొత్తకణాలతో కార్నియా తిరిగి మామూలు స్థితికి వచ్చింది. వీరి పరిశోధన ఫలితాలు ‘సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇక కార్నియా శస్త్రచికిత్సలు అవసరం లేదు.. కార్నియా వల్ల అంధత్వం బారినపడుతున్నవారికి ప్రస్తుతం చనిపోయిన వారి నుంచి సేకరించిన నేత్రాలలోని కార్నియా కణజాలాన్ని మార్పిడి చేసి దృష్టిని పునరుద్ధరిస్తున్నారు. కానీ ‘స్టెమ్‌సెల్స్ థెరపీ ఫర్ కార్నియల్ బ్లైండ్నెస్’ అనే ఈ మూలక ణ చికిత్స అందుబాటులోకి వస్తే ఇక కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలే అవసరం ఉండదు. రోగుల కంట్లోని మూలకణాలనే సేకరించి, ఆ మూలకణాలను జీవసంబంధ జిగురు ఫైబ్రిస్గ్లూ సాయంతో వారి కార్నియా వద్ద ప్రవేశపెట్టి కార్నియాను బాగుచేయవచ్చు. కార్నియా మార్పిడి వల్ల భవిష్యత్తులో మళ్లీ సమస్యలు రావచ్చు. జీవితాంతం మందులు వాడుతూ వైద్యుల సలహాలు పాటించాల్సి ఉంటుంది. కానీ మూలకణాల చికిత్సతో ఇక ఇలాంటి ఇబ్బందులేవీ ఉండబోవు. ఈ చికిత్స విఫలమవుతుందన్న భయమూ అక్కరలేదు. కార్నియా మార్పిడితో పోల్చితే ఈ పద్ధతి చాలా చౌక కూడా. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో 10 మంది రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి విజయవంతమైతే అంధత్వంతో బాధపడుతూ, కార్నియా మార్పిడి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఉపశమనం కలుగనుంది. -
ఏజెన్సీలో లక్ష మంది పేదలకు ఉచిత నేత్ర వైద్యం
ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు అరకులోయ,న్యూస్‌లైన్: ఏజెన్సీ ప్రాంతంలో లక్ష మంది పేదలకు ఉచితంగా కంటి వైద్యం అందించేందుకు నిర్ణయించినట్టు ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ చైర్మన్ జి.నాగేశ్వరరావు తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అరకులోయలో ఏర్పాటు చేసిన 100వ దృష్టి కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. వైద్యపరీక్షల అనంతరం విశాఖలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయిస్తే నూతన భవనం నిర్మిస్తామన్నారు. 500మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామని చెప్పార -
వెండితెర ‘బంగారాలు’
‘ఈ పని నాన్నగారు చనిపోవడానికి ఐదేళ్ల క్రితమే మేము చేయాల్సింది. అన్నీ ఉన్నా రికార్డ్ చేయలేకపోయాం!’ అన్నారు ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్. త్రిపురనేని సాయిచంద్ 20 ఏళ్ల క్రితం తాను రూపొందించిన 25 డాక్యుమెంటరీ చిత్రాలను వందేళ్ల భారతీయ-తెలుగు సినిమా ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించాలని సంకల్పించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దివంగత ఎల్.వి. ప్రసాద్‌పై రూపొందించిన చిత్రంతో మొన్న ఆదివారం లామకాన్ (హైదరాబాద్)లో ఈ ప్రదర్శనలను ప్రారంభించారు. తండ్రిపై సాయిచంద్ రూపొందించిన డాక్యుమెంటరీని చూసి, ప్రపంచస్థాయి సినీ ఎక్విప్మెంట్, థియేటర్స్ అధినేత, ఎల్.వి.ప్రసాద్ కుమారుడు అయిన రమేష్ ప్రసాద్ పైవ్యాఖ్యను చేశారు. సాయిచంద్‌ను మనస్పూర్తిగా అభినందించారు. ఈ నేపథ్యంలో సాయిచంద్‌తో జరిపిన ఇంటర్వ్యూ సారాంశం, ఆయన మాటల్లోనే... గౌతమ్ ప్రేరణ-ఇంటి వాతావరణం అనుకూలత తెలుగు సినిమాలో తొలి తరానికి చెందిన కుటుంబ వారసత్వం నాకు సంక్రమించింది. 1939లో విడుదలైన ‘రైతుబిడ్డ’ సినిమాకు నాన్నగారు త్రిపురనేని గోపీచంద్ సంభాషణల రచయిత. సాహితీపరులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఎప్పుడూ ఇంటికి వచ్చేవారు. ఆ వాతావరణం నుంచి అనుకోకుండా గౌతమ్‌ఘోష్ దర్శకత్వం వహించిన ‘మాభూమి’ ద్వారా సినీనటుడినయ్యా. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, సత్యజిత్‌రాయ్ వంటి ప్రముఖులపై గౌతమ్ డాక్యుమెంటరీలు తీశారు. అతని స్ఫూర్తితో తెలుగు ప్రముఖులపై డాక్యుమెంటరీలు తీయాలనే అభిప్రాయం ఏర్పడింది. సిమీగెర్వాల్ రాజ్‌కపూర్‌పై తీసిన డాక్యుమెంటరీ ఉత్తేజితం చేసింది. మనం, మనవాళ్ల మీద ఎందుకు డాక్యుమెంటరీలు తీయకూడదు? అనిపించింది. ఎవరెవరిపై డాక్యుమెంటరీలు తీయాలి? ఒక జాబితాను రూపొందించుకున్నాను. 1989 నుంచి 1991 వరకూ డాక్యుమెంటరీలు తీశాను. డాక్యుమెంటరీల క్రమం ఎల్.వి.ప్రసాద్, బి.నాగిరెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఎ.ఎస్.ప్రకాశరావు, సి.ఎస్.రావు, విఠలాచార్య, మార్కస్ బార్ట్లే, రెహమాన్ , బాపు, రమణ, సినారె, ఆరుద్ర, వేటూరి సుందరరామమూర్తి, జిక్కి, సంజీవి (ఎడిటర్), సూర్యకాంతం, సుసర్ల దక్షిణామూర్తి, కె.వి.మహదేవన్, తరణి (కళ), జెమిని కోటేశ్వరరావు వంటి వివిధ రంగాల సినీ ప్రముఖులపై తీసిన డాక్యుమెంటరీలు ప్రతి ఆదివారం సాయంత్రం లామకాన్‌లో ప్రదర్శిస్తున్నాం. బంగారం పాతదైనా కొత్త అవసరాలకు పనికొస్తుంది మన సినిమాల్లో వాణిజ్య చిత్రాలు, కళాత్మక చిత్రాలు అనే రెండు పాయలున్నాయి. తొలితరం చిత్రాలు వాణిజ్య చిత్రాలే అయినప్పటికీ సామాజిక బాధ్యతకు, కళలకు, సాహిత్యానికి పెద్దపీట వేశాయి. వినోదాన్ని విస్మరించకుండా ఆరోగ్యకరమైన అనుభూతులను పంచాయి. ఆ చిత్రాల రూపకర్తలను, వారి చిత్రాలలోని ఎంపిక చేసిన భాగాలను ఈ డాక్యుమెంటరీల ద్వారా చూడడం వలన ఆనాటి కట్టూ, బొట్టూ, భాష, ఆహార్యం, సాహిత్యం... తదితర అంశాలు పునశ్చరణ చేసుకునే వీలుంటుందని భావిస్తున్నాను. బంగారం పాతదయినా కొత్తతరానికీ ఎప్పుడంటే అప్పుడు ఉపయోగపడుతుంది కదా! ప్రేక్షకులకు ఇవి మంచి ఫ్లాష్‌బాక్‌లు. డాక్యుమెంటరీలన్నిటినీ ఒక డీవీడీగా, పుస్తకంగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. మార్కస్‌బార్‌ట్లే రియల్ జెంటిల్‌మ్యాన్! డాక్యుమెంటరీలు తీసే క్రమంలో కొన్ని ముచ్చట్లున్నాయి. మూకీల్లో టాకీల్లో పనిచేసిన ఎల్.వి.ప్రసాద్ దగ్గరికి కెమెరాతో వెళ్లగానే ‘రా డెరైక్టరూ’ అని ఉబ్బించేవారు. బహుశా వాస్తురీత్యానేమో విజయాప్రొడక్షన్స్ అధినేత బి.నాగిరెడ్డి స్టూడియోలో నిరంతరం కొన్ని గోడలను, గదులను కూల్చివేయించేవారు. కొత్తగా కట్టించడం, మళ్లీ కూల్చివేయించడం బహుశా ఆయనకు హాబీ. ఆయన వింతైన అలవాటు కారణంగా కెమెరాతో నేనూ ఆయన వెంట తిరుగుతూ మాట్లాడాల్సి వచ్చేది. సూర్యకాంతం గారు ఎంత హాయైన మనిషో! తాను షూటింగులకు వెళ్లినపుడల్లా సెట్‌పై ఉండే వారందరికీ చక్కటి భోజన పదార్ధాలు తీసుకువెళ్లేవారట. ఆ విషయాలు గుర్తుచేస్తూ కడుపునూ మనస్సునూ నింపేవారు. సూర్యకాంతం నటించేవారు కాదు. సాటిలేని సహజనటి! అంజలిగారు నిండుగా, అందంగా అలంకరించుకోవడంలో సాటి. ‘మామ’ పాటలు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. కె.వి.మహదేవన్ ఆరోగ్యం సహకరించకపోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆయనపై కొంతసేపైనా డాక్యుమెంటరీ చేయగలిగాను. అందరిలోకి ప్రత్యేకమైన వ్యక్తి మార్కస్‌బార్‌ట్లే. ప్రతి పలుకులో, కదలికలో హుందాతనం తొణికిసలాడుతుంది. రియల్ జంటిల్మాన్. బార్ట్లే ఇంటర్వ్యూకు వి.ఎస్.ఆర్.స్వామి సహకరించారు. సెల్ కెమెరాతో ‘డాక్యుమెంటేషన్’ చేసినా సక్సెస్ అయినట్లే! నా డాక్యుమెంటరీల సారాంశం ఒక్కటే. నిన్నే నేడు. నేడే రేపు. నేడు మన మధ్య మిగిలిన వారిని మరచిపోతే రేపు లేదు. సినిమా రంగానికి చెందినవారనే కాదు, వివిధ రంగాల ప్రముఖులు ఎందరో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఉంటారు. ఆయా ప్రాంతాల యువకులు తమకు అందుబాటులో ఉన్న కెమెరాల ద్వారానైనా వారి రూపాన్ని, మాటను, హితవును రికార్డు చేస్తే నా శ్రమ ఫలించినట్లే! - పున్నా కృష్ణమూర్తి ఫొటో: అనిల్