- కార్నియా మార్పిడికి ప్రత్యామ్నాయ చికిత్స
- ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, అమెరికా వర్సిటీల ఘన విజయం
- 10 మంది రోగులపై పరిశోధన
- రెండు మూడేళ్లలో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: కంటిలోని కార్నియా(శుక్ల పటలం) దెబ్బతిని అంధత్వం బారినపడే వారికి ఇక కార్నియా మార్పిడి అవసరం లేకుండానే తిరిగి కంటిచూపును పునరుద్ధరించవచ్చు. కనుపాపపై పారదర్శక పొరలా ఉండే శుక్ల పటలాన్ని పునరుద్ధరించేందుకు తోడ్పడే మూలకణాలను శాస్త్రవేత్తలు కంటిలోనే కనుగొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ ఘనవిజయం సాధించారు.
మూలకణాలతో కంటిచూపును పునరుద్ధరించేందుకు ఈ ఏడాది జనవ రి నుంచి జరుపుతున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయని, మరో రెండు మూడేళ్లలోనే ఈ చికిత్సా విధానం అందుబాటులోకి రానుందని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ కన్సల్టెంట్ సర్జన్, శాస్త్రవేత్త డాక్టర్ సయన్ బసు వెల్లడించారు.
ఈ పరిశోధన వివరాలను గురువారం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో డాక్టర్ బసు, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆప్తల్మాలజీ ప్రొఫెసర్ జేమ్స్ ఎల్.ఫండర్బర్గ్ స్కైప్ ద్వారా అమెరికా నుంచి జేమ్స్ విలేకరులకు తెలిపారు. ఈ మేరకు.. కనుగుడ్డులోని తెలుపు, నలుపు భాగాల మధ్య ఉండే లింబస్ ప్రాంతంలో కొత్త మూలకణాలను కనుగొన్నారు. దెబ్బతిన్న కార్నియా వద్దకు ఈ మూలకణాలను చేర్చగా, నాలుగు వారాలలోనే కొత్తకణాలతో కార్నియా తిరిగి మామూలు స్థితికి వచ్చింది. వీరి పరిశోధన ఫలితాలు ‘సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఇక కార్నియా శస్త్రచికిత్సలు అవసరం లేదు..
కార్నియా వల్ల అంధత్వం బారినపడుతున్నవారికి ప్రస్తుతం చనిపోయిన వారి నుంచి సేకరించిన నేత్రాలలోని కార్నియా కణజాలాన్ని మార్పిడి చేసి దృష్టిని పునరుద్ధరిస్తున్నారు. కానీ ‘స్టెమ్‌సెల్స్ థెరపీ ఫర్ కార్నియల్ బ్లైండ్‌నెస్’ అనే ఈ మూలక ణ చికిత్స అందుబాటులోకి వస్తే ఇక కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలే అవసరం ఉండదు. రోగుల కంట్లోని మూలకణాలనే సేకరించి, ఆ మూలకణాలను జీవసంబంధ జిగురు ఫైబ్రిస్‌గ్లూ సాయంతో వారి కార్నియా వద్ద ప్రవేశపెట్టి కార్నియాను బాగుచేయవచ్చు.
కార్నియా మార్పిడి వల్ల భవిష్యత్తులో మళ్లీ సమస్యలు రావచ్చు. జీవితాంతం మందులు వాడుతూ వైద్యుల సలహాలు పాటించాల్సి ఉంటుంది. కానీ మూలకణాల చికిత్సతో ఇక ఇలాంటి ఇబ్బందులేవీ ఉండబోవు. ఈ చికిత్స విఫలమవుతుందన్న భయమూ అక్కరలేదు. కార్నియా మార్పిడితో పోల్చితే ఈ పద్ధతి చాలా చౌక కూడా. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో 10 మంది రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి విజయవంతమైతే అంధత్వంతో బాధపడుతూ, కార్నియా మార్పిడి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఉపశమనం కలుగనుంది.