Stem cells
-
మూలకణాలతో పిండం అభివృద్ధి!
సృష్టికి ప్రతిసృష్టి చేయడంలో మనిషి ఇంకో అడుగు ముందుకేశాడు. శరీరంలోని ఏ కణంగా అయినా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలతో ఏకంగా ఓ పిండాన్ని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన థిస్సీ ల్యాబ్ అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిని మరింత అర్థం చేసుకుంటే.. భవిష్యత్తులో మనిషికి కావాల్సిన అవయవాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. క్రిస్టీన్, బెర్నార్డ్ థిస్సే అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మూలకణాలతో పిండం తయారు చేయడం ఎలా అన్న దానిపై పరిశోధనలు చేపట్టి పాక్షిక విజయం సాధించారు. చేపలతో మొదలుపెట్టి ఎదురైన వైఫల్యాలను అర్థం చేసుకుని సరిదిద్దుకోవడం ద్వారా ఈ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ముందడుగు వేశారు. ఎలుకల నుంచి సేకరించిన పలు మూలకణాలతో ప్రయోగాలు చేశామని క్రిస్టీన్ తెలిపారు. తామిచి్చన సూచనలకు అనుగుణంగా మూలకణాలు దశలవారీగా పిండం లాంటి నిర్మాణంగా ఎదిగాయని, ఈ క్రమంలో అవి పిండం అభివృద్ధి చెందే దశలు ఒక్కొక్కటీ దాటాయని వివరించారు. ఇలా అభివృద్ధి చెందిన నిర్మాణంలో ఎలుక పిండంలో మాదిరిగానే పలు రకాల కణజాలం కనిపించిందని తెలిపారు. అయితే ప్రస్తుతానికి తాము పూర్తిస్థాయిలో ఎదిగిన పిండాన్ని తయారు చేయలేకపోయామని చెప్పారు. మెదడును అభివృద్ధి చేయడం తమ ముందున్న అతిపెద్ద సవాల్ అని, ఈ సమస్యను అధిగమిస్తేనే పూర్తిస్థాయి పిండం తయారీ వీలవుతుందని వివరించారు. -
180 ఏళ్లు బతకాలని ఎముక మజ్జను తొలగించి..
వాషింగ్టన్: 47 ఏళ్ల వయసు ఇంకా ఎదో సాధించాలనే సంకల్పంతో ఓ వ్యక్తి 180 ఏళ్లు బతకాలని ఆశిస్తున్నాడు. ఇందుకోసం అతడు విచిత్రమైన పద్దతులను పాటిస్తున్నాడు. ఈ పద్దతులతో మనిషి 180 ఏళ్లు బతకడం సాధ్యమేనని చెబుతున్నాడు అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డేవ్ ఆస్ప్రే. డేవ్ బుల్లెట్‌ఫ్రూఫ్ అనే అమెరికా కాఫీ బ్రాండ్ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసున్న డేవ్ ఇంకా 133 ఏళ్లు బతకడానికి సైన్స్‌తో పాటు టెక్నాలజీని వాడుకుంటున్నాడు. అయితే అతడి తీరును చూసి చాలా మంది పిచ్చి వేషాలంటూ తీసిపారేస్తుంటే.. అతడు మాత్రం తనని తాను బయోహ్యాకర్గా పిలుచుకుంటున్నాడు. సైన్స్, టెక్నాలజీ సాయంతో జీవశాస్త్రాన్ని నియంత్రణలో తెచ్చుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే వ్యక్తిని ‘బయోహ్యాకర్’ అంటారు. కాగా డేవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇంకా సాధించేది చాలా ఉంది. అందుకే ఇంకా ఎక్కువ ఏళ్లు బతకాలనుకంటున్నాను. అందుకే 6 నెలలకు ఒకసారి ఎముక మజ్జ(బోన్ మ్యారో)లో కొంత భాగాన్ని తొలగించి దాని నుంచి మూలకణాలను(స్టెమ్ స్టెల్స్) తీసుకుని శరీరమంతా ఎక్కిస్తే నూతన ఉత్తేజం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంకా133 ఏళ్లు బతుకుతానని నా నమ్మకం. ఈ క్రమంలో తరచూ కోల్డ్ క్రియోథెరపీ చేయాలి. అంటే అత్యంత చల్లగా ఉండే చాంబర్లో కూర్చోడం వల్ల ద్రవరూప నైట్రోజన్‌ను నా శరీరాన్ని చల్లబరుస్తుంది. తలకు కూడా ఎలక్టోడ్లు అమర్చుకుని పరారుణ కాంతి కింద గడపాలి’ అంటూ వివరించాడు. అలాగే కొన్ని సార్లు ఉపవాసం కూడా ఉంటాడట. అతను నిత్యయవ్వనంగా కనిపించేందుకు కోసం నిద్ర సమయాన్ని, కఠిమైన ఆహారపు అలవాట్లను మార్చుకున్నట్లు చెప్పాడు. అయితే డేవ్ ఈ పద్దతులను పాటించేందుకు ఇప్పటి వరకు దాదాపు 13 కోట్లు పైగా వెచ్చించినట్లు తెలిపాడు. కాగా 2012లో అమెరికాలో బుల్లెట్ఫ్రూప్తో కాఫీ బ్రాండ్ ప్రారంభించాడు. ఈ కాఫీతో వెన్న(బట్టర్), కొబ్బరి నూనేతో తయారు చేస్తారు. అయితే అతడి కాఫీ బ్రాండ్‌పై అమెరికా వైద్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాఫీలో బట్టర్ కలపడం ఆరోగ్యకరం కాదని హెచ్చరిస్తుంటే డేవ్ మాత్రం ఈ కాఫీ అరుదైన రుచి అందిస్తుందని చెబుతున్నాడు. ఇది తాగితే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నాడు. 2004లో టిబెట్ పర్యటనకు వెళ్లినప్పుడు బుల్లెట్‌ఫ్రూఫ్ కాఫీ తయారి ఆలోచన వచ్చినట్లు డేవ్ వెల్లడించాడు. -
రక్త కణాలతోనే నాడీ మూలకణాలు
మెదడుకు రక్తసరఫరా ఆగిపోవడం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చేందుకు జర్మనీకి చెందిన హైడెల్‌బెర్గ్ యూనివర్సిటీ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మానవ రక్తకణాలనే నాడీ మూలకణాలుగా మార్చేయడం.. తద్వారా సరికొత్త మెదడు కణాలను వద్ధి చేయడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు. గుండెపోటుతోపాటు నాడీ సంబంధిత సమస్యలకు మరింత సమర్థమైన చికిత్స కల్పించేందుకు ఈ కొత్త పద్ధతి ఉపయోగపడుతుందని అంచనా. గతంలోనూ ఇలా సాధారణ కణాలను మూలకణాలుగా మార్చినప్పటికీ పరిశోధనశాలలో మూలకణాలు ఎక్కువ కాలం పాటు ఇతర కణాలుగా ఎదగడం మాత్రం ఇదే తొలిసారి. నాడీ మూలకణాలుగా మార్చగలగడం వల్ల నాడీ వ్యవస్థకు కీలకమైన న్యూరాన్లు, లేదా గ్లియల్ కణాలను తయారు చేయడం వీలవుతుందని గుండెపోటు తరువాత కోలుకుంటున్న వారికి వీటిని అందివ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. మూలకణ పరిశోధనల్లో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తులోనే వీటిని నేరుగా రోగుల్లో వాడేందుకు అవకాశముందని అంచనా. -
కండర మూలకణాల గుట్టు రట్టు!
సాక్షి, హైదరాబాద్: కండరాలు మెరుగ్గా పనిచేసేందుకు దోహదపడుతున్న కణాలపై సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కీలకమైన ఆవిష్కరణ చేశారు. కండరాల పోగుల్లోని మూలకణాలు శరీర అవసరాలకు తగ్గట్టుగా ఇతర పరమాణువులతో జట్టుకట్టి ఎలా పనిచేస్తున్నాయో గుర్తించారు. కండరాల క్షీణత మొదలుకొని అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఇది కీలకం కానుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ జ్యోత్సా్న ధవన్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోత్సా్న ధవన్ పరిశోధన వివరాలను వెల్లడించారు. ‘జీవితాంతం సక్రమంగా పనిచేసేందుకు వీలుగా ఈ కండరాల్లో కొన్ని మూలకణాలుంటాయి. కండరాల పోగులపై డిస్టోఫిన్, ల్యామినిన్ పరమాణు పొరల మధ్య నిద్రాణంగా ఉండే ఈ మూలకణాలు గాయమైనా.. ఒత్తిడి కారణంగా దెబ్బతిన్నా.. వెంటనే చైతన్యవంతమవుతాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగి గాయం మానేలా చేస్తాయి. ఇలా చైతన్యవంతమైన మూలకణాల్లో కొన్ని మళ్లీ నిద్రాణ స్థితికి చేరుకుని భవిష్యత్తు అవసరాల కోసం సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రక్రియలో ఏదైనా తేడా వస్తే.. కండరాల క్షీణత మొదలుకొని ఇతర జబ్బులు వచ్చే అవకాశముంటుంది. కండర మూలకణాలు అవసరమైనప్పుడు ఎలా చైతన్యవంతమవుతాయి.. ఎలా నిద్రాణ స్థితికి చేరుకుంటాయో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి’అని వివరించారు. చైతన్యంలో ఒకటి.. నిద్రాణంలో మరొకటి.. తాను అజయ్ అలియోసిస్ అనే శాస్త్రవేత్తతో కలసి పరిశోధనలు నిర్వహించినట్లు జ్యోత్సా్న ధవన్ తెలిపారు. మూలకణాలు ఆన్/ఆఫ్ అయ్యేందుకు ఎల్‌ఈఎఫ్1, ఎస్‌మ్యాడ్3 అనే రెండు ప్రొటీన్లు ఉపయోగపడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. చైతన్యవంతమైన స్థితి నుంచి నిద్రాణ స్థితికి చేరే క్రమంలో మూలకణాలు బీటీ–కేటనైన్ అనే మూలకాన్ని వదిలి ఎస్‌మ్యాడ్3తో జట్టు కడుతున్నట్లు ఈ పరిశోధనల్లో తెలిసింది. కండర మూలకణాలు చైతన్యవంతమైనప్పుడు ఒక ప్రొటీన్‌తో, నిద్రాణంగా ఉన్నప్పుడు మరోదానితో మూలకణాలు జత కడుతున్నట్లు తమ పరిశోధనలు చెబుతున్నాయని జ్యోత్సా్న తెలిపారు. కండర క్షీణత వ్యాధిలో మూలకణాలు నిత్యం చైతన్యవంతంగానే ఉంటాయి కాబట్టి వాటిని మళ్లీ నిద్రాణ స్థితికి తీసుకెళ్లగలిగితే కండరాల పునరుజ్జీవం సాధ్యం కావచ్చునని.. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టనున్నామని వివరించారు. -
కొత్తరకం మూలకణాల గుర్తింపు!
మన పేగుల్లో కొత్త రకం మూలకణాలు కొన్ని ఉన్నట్లు జూరిక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కణాలు తమ పరిసరాల్లోని మూలకణాలను చైతన్యవంతం చేసేందుకు ఉపయోగపడతాయని వీరు అంటున్నారు. పేగుల్లోపలి పొర ఎప్పటికప్పుడు కొత్తగా మారేందుకు కూడా ఈ కణాలే కారణం. ఈ కణాలు మూలకణాలను ప్రేరేపించకపోతే పొర నశించిపోతుంది. అవసరమైన దాని కంటే ఎక్కువసార్లు ప్రేరేపిస్తే పేగు కేన్సర్ లక్షణాలు కనిపిస్తాయి. కొత్తగా గుర్తించిన ఈ విషయాలన్నీ పేగు కేన్సర్, మంట/వాపు చికిత్సలకు ఉపయోగపడుతుందని అంచనా. మన పేగుల్లోపలి పొర నిర్దిష్ట కాలం తరువాత నశించిపోయి కొత్త పొర ఏర్పడుతూంటుందని మనం చదువుకుని ఉంటాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతిరోజూ దాదాపు వెయ్యి కోట్ల కొత్త కణాలు పాతవాటి స్థానంలో వచ్చి చేరుతూంటాయి. శరీరం పోషకాలను శోషించుకునేందుకు ఈ పొరే కారణం. పొర నశించిపోయింది, కొత్త పొర ఏర్పాటు చేయాలన్న సంకేతాలు మూలకణాల్లాంటి కణాలు అందిస్తాయని, ఇవి పేగుల్లో అక్కడక్కడ ఉండే చిన్న ముడుతల్లో ఉంటాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కోనార్డ్ బాస్లర్ అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాల్లో ఈ కణాలు ఏం చేస్తాయో తెలిసిందని, నిర్దిష్ట ప్రోటీన్ రూపంలో ఈ కణాల నుంచి అందే సంకేతాలు పేగుల్లోపలి పొరను పునరుజ్జీవింప చేస్తుందని వివరించారు. -
రేపటి తరం కోసం
బొడ్డుతాడు మూలకణాలను భద్రపరిచేందుకు తల్లిదండ్రుల ఆసక్తి నగరంలో స్టెమ్‌సెల్స్ బ్యాంకులకు పెరుగుతున్న ఆదరణ వాటితో అనేక వ్యాధులకు చికిత్స సాధ్యమంటున్న నిపుణులు బెంగళూరు: గుండె, కాలెయం, మూత్రపిండాల జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినా మనం భయపడకుండా ఉండగలమా..? అది ఇప్పుడు సాధ్యమే. మన బంగారు బిడ్డల భవిష్యత్ కోసం మనం వారి బొడ్డు తాడు తీసి భద్రపరిస్తే చాలు అంటున్నారు నిపుణులు. శిశువు పుట్టగానే బొడ్డుతాడు నుంచి సేకరించిన మూల కణాలను భద్రపరడచం వల్ల భవిష్యత్తులో పిల్లలు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని వైదులు పేర్కొంటున్నారు. ఇలా సేకరించే భద్రపరిచే వాటినే స్టెమ్‌సెల్స్ బ్యాంకులకు నగరంలో ఆదరణ పెరుగుతోంది. 70 రకాల బబ్బుల నుంచి కాపాడే మూల పదార్థం ఇందులో ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం సంపన్న వర్గాలు మాత్రమే వినియోగించుకుంటున్నట్లు సమాచారం. ముందుగానే ‘మందు’.... చిన్నారులకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఈ మూలకణాలు తిరిగి శరీరంలోని అవయవాలను పునరుజ్జీవింపజేయడానికి పనికొస్తాయి. ప్రసవ సమయంలో బిడ్డతో పాటు ఉండే బొడ్డుతాడు నుంచి ఈ స్టెమ్‌సెల్స్ సేకరణ జరుగుతుంది. ప్రతి బొడ్డుతాడులో 200 మిల్లీ లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం నుంచి సేకరించిన కణాల్నే వైద్యపరిభాషలో హెమటో పాయిటిక్ స్టెమ్సెల్స్గా వ్యవహరిస్తారు. ప్రసవ సమయంలో వీటిని భద్రపరిస్తే బ్లడ్‌క్యాన్సర్, గుండె, కాలేయం, మూత్రపిండాల్లో తలెత్తే సమస్యలు తదితర 70 వ్యాధులను వీటి సాయంతో నయం చేసేందుకు అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. బిడ్డ పుట్టిన రెండు నిమిషాల్లో... బిడ్డ పుట్టిన సమయంలో బొడ్డుతాడును అంటిపెట్టుకొని ఉండే రక్తంలో ఈ స్టెమ్‌సెల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బిడ్డ పుట్టిన రెండు నిమిషాల్లో బొడ్డుతాడు నుంచి ఈ స్టెమ్‌సెల్స్‌ను సేకరించి భద్రపరచాల్సి ఉంటుంది. అనంతరం ఈ కణజాలాలను ఆస్పత్రిలో ల్యాబొరేటరీకి తీసుకెళ్లి హెచ్ఐవీ ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించుకున్న తరువాత స్టెమ్‌సెల్స్‌ను ప్రత్యేక బాటిల్లో నింపి, ఆ బాటిల్‌పై సంబంధిత చిన్నారి వివరాలు (తల్లిదండ్రుల పేర్లు, చిరునామా తదితరాలు) నమోదు చేసి ఆ బాటిల్‌కి ఒక ప్రత్యేక కోడ్ కేటాయిస్తారు. ఈ బాటిల్‌ని మైనస్ 196 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. ఇలా భద్రపరిచిన మూలకణాలు సుమారు వందేళ్లపాటు నిల్వ ఉంటాయి. అయితే సాధారణంగా ప్రస్తుతం నగరంలో చిన్నారికి 21 ఏళ్ల వరకూ స్టెమ్‌సెల్స్ భద్రపరుస్తున్నారు. కొంతమంది మాత్రమే బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని 50 ఆ పై ఏళ్ల వరకూ తమ చిన్నారుల స్టెమ్‌సెల్స్‌ను భద్రపరుస్తున్నారు. ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తాం: చాలా స్టెమ్‌సెల్స్ బ్యాంకులు కణాలను భద్రపరిచి కావాలన్నప్పు అందించడం మాత్రమే చేస్తున్నాయి. మేము స్టెమ్‌సెల్స్‌ను భద్రపరచమే కాకుండా వాటితో వివిధ రోగాలకు చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ)ను కూడా అందిస్తాం. మా బ్యాంకులో 21 ఏళ్లపాటు స్టెమ్‌సెల్స్‌ను నిల్వ ఉంచడానికి రూ.80 వేలు వసూలు చేస్తాం. ఇందుకు ఈఎంఐ (నెలవారిగా కొంతమొత్తాన్ని చెల్లించడం) సదుపాయం కూడా కల్పిస్తున్నాం. - శ్రీనివాస్, లైఫ్సెల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధి -
మూలకణాలు... మేలుకణాలు!
ఒక కొత్తజీవి రూపుదిద్దుకున్నప్పుడు మొదటి కణం తర్వాత ఆవిర్భవించే మూలకణాలు తొలుత ఒకటిలాగే కనిపిస్తాయి. కానీ భవిష్యత్తులో అవి నిర్వహించాల్సిన వేర్వేరు కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని వివిధ రకాల కణాలుగానూ... ఆయా కణాలు మరింత విభజన చెంది కణజాలాలుగా రూపొందుతాయి. అలా చర్మం, వెంట్రుకలు, రక్తకణాలు, కడుపులోని లోపలి పొర కణాలు, మెదడు, కాలేయం వంటి అన్ని శరీర భాగాలు ఏర్పడతాయి. ఇవన్నీ కణాలే అయినా చేసే పనిని బట్టి కొద్దికొద్ది వైవిధ్యంతో ఉంటాయి. ఈ వేర్వేరు కణాల్లో దేనిగానైనా రూపొందే శక్తి ఒక్క మూలకణాలకు మాత్రమే ఉంటుంది. అలాంటి మూలకణాన్నే ఇంగ్లిష్‌లో స్టెమ్‌సెల్ అంటారు. ఈ స్టెమ్‌సెల్స్ సహాయంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనలు పేర్కొంటున్నాయి. కొన్ని వ్యాధులకు ఇప్పటికే చికిత్సలూ జరుగుతున్నాయి.ఆ మూలకణ చికిత్సలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. మూలకణాల్లో వివిధ రకాలు... మూలకణం అంటేనే ఏ రకమైన కణంగానైనా మారిపోగల మూలకణం కదా! మరి అలాంటి మూలకణాల్లోనూ వేర్వేరు రకాలుంటాయా అంటే ఉంటాయన్నదే సమాధానం. పురుషుడి వీర్యకణంతో మహిళలోని అండం ఫలదీకరణం చెందిన తర్వాత తొలుత ఏర్పడేదే... పిండం. తొలిదశలో ఇది ఒకే కణంగా ఉంటుంది. దీన్నే ‘ఫెర్టిలైజ్డ్ ఓవమ్’ అంటారు. ఆ తర్వాత ఏర్పడాల్సిన వేర్వేరు కణజాలాలకు అనుగుణంగా ఈ కణం విభజన చెంది కొన్ని వేర్వేరు రకాల మూలకణాలు ఏర్పడి... అవీ విభజితమై భవిష్యత్తులో రూపొందాల్సిన అవయవాలూ, వ్యవస్థలకు అనుగుణంగా వేర్వేరు రకాల కణాలుగా మారుతాయి. ఈ తొలిదశ కణాలనే మూలకణాలుగా పేర్కొనవచ్చు. సైంటిస్టులు రూపొందించిన మూలకణాలు! మూలకణాలు శరీరమంతా అక్కడో ఇక్కడో ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో లభ్యం కావాలంటే మాత్రం బొడ్డు తాడులోని రక్తంలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ తరానికంటే ముందు తరాల వారిలో బొడ్డు తాడు నుంచి మూలకణాలను వేరు చేసి భద్రపరచడం అనే అంశంపై ఆసక్తి లేదు. ఎందుకంటే మూలకణాలతో చాలా రకాల చికిత్సలు సాధ్యమవుతాయనే అంశంపై అప్పట్లో అంత అవగాహన లేకపోవడమే దీనికి కారణం. అయితే ప్రతి సందర్భంలోనూ ప్రతివారికీ అవసరమైనవీ, వారికి సరిపోలే మూలకణాలు దొరకకపోవడంతో శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ మార్గాలను శోధించి, కొంతమేరకు విజయం సాధించారు. ల్యాబరేటరీలో మూలకణాలను రూపొందించారు. వీటినే ‘ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్’ (ఐపీఎస్)గా పేర్కొంటుంటారు. ఇవి మూలకణాల్లాగే పనిచేసినా... పుట్టినప్పుడుగానీ లేదా జీవితకాలంలో గానీ శరీరంలో ఎక్కడ ఉండవు. మన శాస్త్రజ్ఞులు చర్మకణాల నుంచి కొన్నింటిని సేకరించి అచ్చం పిండం ఏర్పడినప్పుడు కనిపించే తొలి కణం (ఎం బ్రియోనిక్ స్టెమ్‌సెల్స్) లాంటివాటినే సృష్టించగలిగారు. ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్ (జ్కీ) అంటే...? అనంతరం జరిగిన పరిశోధనల్లో మానవ చర్మం నుంచి కొన్ని కణాలను సేకరించి వాటిని అచ్చం మూలకణాల్లాగే ఉండే కణాలను ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్ (ఐపీఎస్) రూపొందించడం జరిగింది. ఈ ప్రక్రియపైనా కొన్ని అభ్యంతరాలు వెలువడుతున్నప్పటికీ వీటిని ఉపయోగించి చికిత్స చేయడంతో ఉన్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని... వివిధ రుగ్మతలు/వ్యాధుల చికిత్సల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. ఎముక మజ్జ (బోన్ మ్యారో) నుంచి సేకరించిన కణాలతో కూడా మూలకణాలను రూపొందించి వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. స్ల్కీరోడెర్మా, ల్యూపస్ అండ్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ మన వ్యాధి నిరోధక కణాలే మనల్ని పరాయివారి గా గుర్తించి తిరగబడటం వల్ల ఏర్పడే ‘ఆటో ఇమ్యూన్ వ్యాధు’లివి. మనలోని ఆరోగ్యకణాలను పరాయి కణాలుగా అపోహపడి వాటిపై మన వ్యాధి నిరోధక కణాలు దాడి చేస్తాయి. ఇలాంటి వ్యాధుల్లో మన వ్యాధి నిరోధక శక్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించాల్సి వస్తుంటుంది. ఫలితంగా మన శరీరం తేలిగ్గా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కానీ మూలకణ చికిత్సతో ఇలా ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే వ్యాధినిరోధక కణాల తప్పుడు చర్యలను అరికట్టవచ్చు. మన శరీర వ్యాధి నిరోధక శక్తిని సాధారణంగా పనిచేసేలాగానూ చేయవచ్చు. మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అంటే...? మన శరీరంలోని కొన్ని కణాలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు అవి మళ్లీ పుట్టవు. అంటే శాశ్వతంగా నశించిపోతాయన్నమాట. దాంతో ఆ దెబ్బతిన్న అవయవం గానీ, దాని వల్ల ఆ వ్యవస్థలో గానీ శాశ్వత లోపం ఏర్పడుతుంది. కానీ స్టెమ్‌సెల్స్ ద్వారా చేసే చికిత్సలో ఆ దెబ్బతిన్న / చనిపోయిన కణాల స్థానాన్ని ఈ మూలకణాలు భర్తీ చేస్తాయి. అచ్చం ఆ అవయవానికి సంబంధించిన మునపటి కణాల్లాగే మారిపోతాయి. దాంతో ఇక ఆ అవయవం మునుపటిలాగే పనిచేస్తుంది. ఫలితంగా ఆ వ్యవస్థ కూడా ఎలాంటి లోపం లేకుండా తన కార్యకలాపాలు సాగిస్తుంటుంది. సాధారణంగా చేసే సంప్రదాయ వైద్య చికిత్స ప్రక్రియలైన మందులు ఇవ్వడం లేదా శస్త్రచికిత్స చేయడం వంటివి సత్ఫలితాలు ఇవ్వని సందర్భాల్లో, మూలకణాలను సేకరించి ఒక అవయవానికి అందేలా చేస్తుంటారు. అందుకే మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియను ‘రీజనరేటివ్ మెడిసిన్’ అని కూడా అంటారు. మూలకణ చికిత్స కోసం ఆ చికిత్సా విధానంలో నైపుణ్యం పొందిన, అధీకృతమైన చికిత్సకులు ఉంటారు. ఈ చికిత్సకులకు జాతీయ ఆరోగ్య అధికారుల నుంచి ప్రత్యేకమైన అనుమతి ఉంటుంది. మూలకణ చికిత్సలో ఆధునిక ప్రక్రియలు... మూలకణాలతో చేసే చికిత్స తొలి దశల్లో కొంత నత్తనడకలా సాగినా... ఇటీవల మాత్రం ఈ ప్రక్రియలో చాలా అభివృద్ధి చోటు చేసుకుంది. అయినప్పటికీ ఈ అభివృద్ధిని ఇంకా పూర్తిస్థాయి పురోగతిగా చెప్పలేం. గత పదేళ్ల వ్యవధిలో ఈ అభివృద్ధి... పరిశోధన శాలలను దాటి ఆసుపత్రులకు చేరిందని చెప్పుకోవచ్చు. అయినా దీన్ని మూలకణ చికిత్స తాలూకు ఆవిర్భావ దశగానే పేర్కొనవచ్చు. అంటే ఇంత అభివృద్ధి తర్వాత కూడా పూర్తిస్థాయి చికిత్సగా రూపొందాలంటే ఇంకా ఈ రంగం ఎంతగా అభివృద్ధి సాధించాలో అర్థం చేసుకోవచ్చు. అయితే అదృష్టకరమైన అంశం ఏమిటంటే... తొలిదశల్లోనూ, పరిశోధనాత్మక దశల్లో చేసిన పరిశీలనల్లోనూ ఈ ప్రక్రియ చాలా సురక్షితమైనదనీ, సునిశితమైనదనీ, పూర్తిగా నమ్మదగినదనే ఫలితాలు వచ్చాయి. గతంలో ఏదైనా అవయవం దెబ్బతింటే దాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు ఈ మూల కణాల ద్వారా అవయవంలో దెబ్బతిన్నమేరకు మూలకణాలను ప్రవేశపెట్టి, కొత్త కణాలను సృష్టించి అదే దెబ్బతిన్న అవయవాన్ని పూర్తి ఆరోగ్యవంతమైన అవయవంగా మార్చగలిగే అవకాశాలున్నట్లుగా తేలింది. అందుకే దీన్ని ‘రీజనరేటివ్ మెడిసిన్’గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఈ రీజనరేటివ్ మెడిసిన్‌లోని తొలిమెట్టుపై ఉన్నామని చెప్పవచ్చు. మూలకణాలతో చేస్తున్న /చేయనున్న చికిత్సలలో కొన్ని ఇవి... బ్లడ్ క్యాన్సర్లు, రక్తసంబంధమైన వ్యాధులకు చికిత్స... రక్తసంబంధమైన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన ఇతర వ్యాధులలో రక్తకణాలు పుట్టే మూల కేంద్రమైన ఎముక మజ్జను రోగి నుంచి పూర్తిగా తొలగించి... అక్కడ మరొకరి నుంచి స్వీకరించిన ఆరోగ్యవంతమైన మూలకణాలను ప్రవేశపెట్టి... కొత్తగా ఆరోగ్యకరమైన మజ్జను ఏర్పరచడం వల్ల... ఇకపై పుట్టే కణాలన్నీ ఆరోగ్యకరమైనవిగా చేసే చికిత్సతో బ్లడ్క్యాన్సర్లలోనూ, రక్తసంబంధమైన వ్యాధులలోనూ చికిత్స చేస్తారు. ఈ తరహా చికిత్స లుకేమియా, మల్టిపుల్ మైలోమా, లింఫోమా, రక్తసంబంధమైన ఇతర వ్యాధులైన అప్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియాలో సాధ్యమవుతుంది. వ్యాధిగ్రస్తుల అన్నదమ్ముల నుంచి కొన్ని మూలకణాలను సేకరించి... వాటిని రక్తమార్పిడి తరహాలోనే వ్యాధిగ్రస్తులలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. అప్పటికే వ్యాధిగ్రస్తమై ఉన్న కణాలను నిర్మూలించడానికి కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఒకసారి వ్యాధిగ్రస్త కణాలన్నీ శరీరం నుంచి తొలగిపోయాక... మూలకణాలతో మార్పిడి చేసిన మజ్జ నుంచి ఇకపై పూర్తిగా ఆరోగ్యకరమైన రక్తకణాలే ఆవిర్భవిస్తాయి. అయితే సంప్రదాయ చికిత్స ద్వారా సదరు వ్యాధి లొంగని సందర్భాల్లో మాత్రమే ఈ తరహా చికిత్సను ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ తరహా చికిత్సలో కీమోథెరపీ మోతాదు ఎక్కువైతే ఒక్కోసారి అది ఇన్ఫెక్షన్లకో లేదా కొన్నిసార్లు రక్తస్రావానికో దారితీసే ప్రమాదం (రిస్క్) ఉంటుంది. ప్రస్తుతం ఈ రిస్న్ తగ్గించేందుకు అవసరమైన పరిశోధనలు చురుగ్గా జరుగుతున్నాయి. ఎముక సంబంధ వ్యాధులు (ఆర్థోపెడిక్ కాంప్లికేషన్స్) ఎముక సంబంధ వ్యాధుల్లో అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకు పాదం, చీలమండ, తుంటిభాగం, మోకాలు నుంచి మొదలుకొని కీలకమైన వెన్నెముక వరకూ అనేక రకాల ఎముకలు ఉంటాయి. ఇవి రకరకాల సమస్యలకు గురవుతుంటాయి. విరిగినప్పుడు సరిగా అతుక్కోకపోవడం, వీటిపై ఉండే మృదులాస్థి (కార్టిలేజ్) దెబ్బతినడం, ఎముకకు సరిగా రక్తప్రసరణ లేక ఎముకలోని కొంతభాగం మృతిచెందడం (ఎవాస్క్యులార్ నెక్రోసిస్) వంటి సమస్యలు ఇందులో కొన్ని. ఎముకలకు సంబంధించిన ఇలాంటి ఎన్నో వ్యాధులకు గతంలో అంతగా ఫలితాలివ్వని ఎన్నో సందర్భాల్లో కూడా... మూలకణ చికిత్సలతో,... చనిపోయిన ఎముక భాగం తిరిగి పునరుజ్జీవనం పొందడం వంటి అద్భుత ఫలితాలు లభించాయి. పైగా ఎముకలోని కొంత భాగం పూర్తిగా మృతిచెందిన సందర్భాల్లోనూ 3 - 4 ఏళ్ల చికిత్స తర్వాత ఆ భాగం మళ్లీ జీవం పొంది సాధారణంగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అనేక అధ్యయనాల్లో మూలకణ చికిత్స చాలా ప్రభావపూర్వకమైనదనీ, సురక్షితమనీ తేలింది. గుండె, కాలేయ సంబంధ వ్యాధుల్లో... ఇప్పటికే స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా అనేక ప్రయోజనాలు పొందుతూనే... మున్ముందు మరింతగా ఈ చికిత్స ప్రక్రియ వల్ల ప్రయోజనాలు పొందవచ్చని అనేక గుండె, కాలేయ సంబంధ వ్యాధుల చికిత్సలో తేలింది. గుండె కండరాలు దెబ్బతిన్న ప్రాంతంలోని చనిపోయిన కణాలను పునరుజ్జీవించేలా చేసి, గుండె పనిచేయలేని పరిస్థితిని (హార్ట్ ఫెయిల్యూర్‌ను) రివర్స్ చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక కాలేయం విషయంలోనూ ఇంతే. మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతిని, అది పూర్తిగా చెడిపోయిన వారికి, స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... దెబ్బతిన్న భాగాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయవచ్చని తేలింది. అయితే వీటిలో కొన్ని ఇంకా ప్రాథమిక పరిశోధన దశల్లో ఉన్నప్పటికీ... కొన్నాళ్లలోనే అవి మానవ చికిత్స ప్రక్రియలుగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్న విషయం మాత్రంలో ఎలాంటి అనుమానాలూ లేవు. బట్టతలకు ఇకపై ఆస్కారమే ఉండదు! వెంట్రుక ఆవిర్భవించే కేశమూలంలోకి ఈ స్టెమ్‌సెల్స్ ప్రవేశపెట్టడం వల్ల హెయిర్ ఫాలికిల్ పునరుజ్జీవమవుతుంది. ఫలితంగా హెయిర్ ఫాలికిల్ నుంచి వెంట్రుక మొలిచి, అది మామూలుగా పెరగడం మొదలవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన పరిశోధనల వల్ల ఈ విషయంలో మంచి ఫలితాలు కనిపించాయి. ఇక త్వరలోనే ఈ పరిశోధన ఫలితాలు అందరికీ అందబాటులోకి రావడమే తరువాయి. పైన పేర్కొన్న చికిత్సల్లో కొన్నింటిని ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్‌లోని కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గల డిపార్ట్మెంట్ ఆఫ్ రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా జరుగుతున్నాయని ఇక్కడి సైంటిస్టులు/డాక్టర్లు వివరిస్తున్నారు. డాక్టర్ సయీదా సైంటిస్ట్, స్టెమ్‌సెల్ బయాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రీజనరేటివ్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్ (కేఎఫ్ఆర్సీ), సికింద్రాబాద్ డయాబెటిక్ ఫుట్ అండ్ న్యూరోపతి మధుమేహం ఉన్నవారిలో చాలా సాధారణంగా కనిపించే దుష్ర్పభావమిది. చాలా సందర్భాల్లో మధుమేహం ఉన్న వ్యక్తుల కాళ్లకు పుండ్లు పడతాయి. అవి ఎప్పటికీ మానని దశకు చేరుకుని కుళ్లడం ప్రారంభిస్తాయి. గ్యాంగ్రీన్గా పేర్కొనే ఈ దశకు చేరుకున్న కాలిని తొలగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని దశకు రోగులు చేరుకుంటారు. అయితే ఇటీవలి పరిశోధనల వల్ల ఈ తరహా సమస్యలను ఎదుర్కొనే వారిలో స్టెమ్‌సెల్స్ వల్ల డయాబెటిక్ ఫుట్నూ, డయాబెటిక్ న్యూరోపతిని తగ్గించే అవకాశాలు ఉన్నాయని తేలింది. క్రిటికల్ లింబ్ ఇస్కిమియా ఈ వ్యాధి ఉన్నవారి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డందు వల్ల కాళ్లకు సరైన మోతాదులో రక్తం అందదు. ఫలితంగా కాలిలోని ఒక ప్రాంతం పనికి రాకుండా పోతుంది. కొన్నిసందర్భాల్లో శస్త్రచికిత్స చేసి, అడ్డంకులు తొలగించలేని పరిస్థితి ఏర్పడితే... రోగి తన కాలిని కోల్పోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రోగికి మూలకణాలతో చికిత్స చేస్తారు. ఇలాంటి రోగులకు ప్రయోగాత్మకంగా చికిత్స చేసిన చాలా సందర్భాల్లో రోగి కాలును తొలగించకుండానే, దాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో పరిశోధకులు, డాక్టర్లు సఫలీకృతులయ్యారు. కార్నియా, రెటీనా సమస్యలకు... గతంలో కంటి నల్లగుడ్డు కార్నియాలోని కణాలు దెబ్బతిన్నప్పుడు గానీ... దృశ్యాన్ని తన తెరపై పట్టివేసే... రెటీనా కణాలు గాని దెబ్బతిన్నప్పుడు అవి మళ్లీ పునరుజ్జీవించేందుకు ఆస్కారం లేదు. కానీ, మృతిచెందిన కార్నియా, రెటీనా కణాలను పునరుజ్జీవింపజేసేందుకు మూలకణాలు తోడ్పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దాంతో కొద్దిరోజుల్లోనే ఈ మూలకణాల సహాయంతో కార్నియా, రెటీనా భాగాలను పునరుజ్జీవింపజేసి... అంధులకు మళ్లీ వెలుగు చూపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నది సైంటిస్టులు, డాక్టర్ల ఆశాభావం. బొల్లి (విటిలిగో) చర్మానికి రంగును ఇచ్చే మెలనోసైట్స్ అనే కణాలు పూర్తిగా దెబ్బతినడం వల్ల చర్మం తన స్వాభావికమైన రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. దీనివల్ల చర్మంపై తెల్లటి మచ్చలు, పొడలు కనిపిస్తుంటాయి. కానీ స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి వాటిని మామూలు రంగునిచ్చే కణాల్లాగే పెరిగేలా చేయడం వల్ల కొద్దిరోజుల్లోనే చర్మమంతా ఒకే రంగులోకి మారిపోతుంది. ఫలితంగా విటిలిగోకు నమ్మకంగా చికిత్స చేయవచ్చునన్నది స్టెమ్‌సెల్ బయాలజిస్టులు/మూలకణాలతో చికిత్స చేసే డాక్టర్ల అభిప్రాయం. -
మూలకణాలతో కంటిచూపు!
కార్నియా మార్పిడికి ప్రత్యామ్నాయ చికిత్స ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, అమెరికా వర్సిటీల ఘన విజయం 10 మంది రోగులపై పరిశోధన రెండు మూడేళ్లలో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: కంటిలోని కార్నియా(శుక్ల పటలం) దెబ్బతిని అంధత్వం బారినపడే వారికి ఇక కార్నియా మార్పిడి అవసరం లేకుండానే తిరిగి కంటిచూపును పునరుద్ధరించవచ్చు. కనుపాపపై పారదర్శక పొరలా ఉండే శుక్ల పటలాన్ని పునరుద్ధరించేందుకు తోడ్పడే మూలకణాలను శాస్త్రవేత్తలు కంటిలోనే కనుగొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ ఘనవిజయం సాధించారు. మూలకణాలతో కంటిచూపును పునరుద్ధరించేందుకు ఈ ఏడాది జనవ రి నుంచి జరుపుతున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయని, మరో రెండు మూడేళ్లలోనే ఈ చికిత్సా విధానం అందుబాటులోకి రానుందని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ కన్సల్టెంట్ సర్జన్, శాస్త్రవేత్త డాక్టర్ సయన్ బసు వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలను గురువారం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో డాక్టర్ బసు, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆప్తల్మాలజీ ప్రొఫెసర్ జేమ్స్ ఎల్.ఫండర్బర్గ్ స్కైప్ ద్వారా అమెరికా నుంచి జేమ్స్ విలేకరులకు తెలిపారు. ఈ మేరకు.. కనుగుడ్డులోని తెలుపు, నలుపు భాగాల మధ్య ఉండే లింబస్ ప్రాంతంలో కొత్త మూలకణాలను కనుగొన్నారు. దెబ్బతిన్న కార్నియా వద్దకు ఈ మూలకణాలను చేర్చగా, నాలుగు వారాలలోనే కొత్తకణాలతో కార్నియా తిరిగి మామూలు స్థితికి వచ్చింది. వీరి పరిశోధన ఫలితాలు ‘సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇక కార్నియా శస్త్రచికిత్సలు అవసరం లేదు.. కార్నియా వల్ల అంధత్వం బారినపడుతున్నవారికి ప్రస్తుతం చనిపోయిన వారి నుంచి సేకరించిన నేత్రాలలోని కార్నియా కణజాలాన్ని మార్పిడి చేసి దృష్టిని పునరుద్ధరిస్తున్నారు. కానీ ‘స్టెమ్‌సెల్స్ థెరపీ ఫర్ కార్నియల్ బ్లైండ్నెస్’ అనే ఈ మూలక ణ చికిత్స అందుబాటులోకి వస్తే ఇక కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలే అవసరం ఉండదు. రోగుల కంట్లోని మూలకణాలనే సేకరించి, ఆ మూలకణాలను జీవసంబంధ జిగురు ఫైబ్రిస్గ్లూ సాయంతో వారి కార్నియా వద్ద ప్రవేశపెట్టి కార్నియాను బాగుచేయవచ్చు. కార్నియా మార్పిడి వల్ల భవిష్యత్తులో మళ్లీ సమస్యలు రావచ్చు. జీవితాంతం మందులు వాడుతూ వైద్యుల సలహాలు పాటించాల్సి ఉంటుంది. కానీ మూలకణాల చికిత్సతో ఇక ఇలాంటి ఇబ్బందులేవీ ఉండబోవు. ఈ చికిత్స విఫలమవుతుందన్న భయమూ అక్కరలేదు. కార్నియా మార్పిడితో పోల్చితే ఈ పద్ధతి చాలా చౌక కూడా. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో 10 మంది రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి విజయవంతమైతే అంధత్వంతో బాధపడుతూ, కార్నియా మార్పిడి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఉపశమనం కలుగనుంది. -
స్టెమ్‌సెల్స్‌తో కొత్త రక్తనాళాలు
ప్రయోగాత్మకం లండన్‌లోని శాస్త్రవేత్తలు స్టెమ్‌సెల్స్‌తో ప్రయోగాత్మకంగా నిర్వహించిన శస్త్రచికిత్స సత్ఫలితాలనిచ్చింది. జీర్ణాశయం, పేగుల నుంచి కాలేయానికి రక్తాన్ని సరఫరా చేయాల్సిన నాళాలు లేకపోవడంతో స్టెమ్‌సెల్స్ ద్వారా సేకరించిన రక్తం ఆధారంగా దేహంలో రక్తనాళాలు ఆవిర్భవించేటట్లు చేశారు. కొత్తగా రూపొందిన రక్తనాళాలు కాలేయానికి, జీర్ణాశయానికి మధ్య చక్కగా పని చేస్తున్నాయని ఈ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మిఖాయిల్ ఓల్యూసన్ తెలియచేశారు. స్టెమ్సెల్స్ని భద్రపరుచుకుంటే ఇలాంటి అవసరాలకు ఎముకల నుంచి బోన్‌మ్యారో సేకరించాల్సిన అవసరం ఉండదని కూడా చెప్పారు. -
మూలకణాలతో మెదడు కేన్సర్ నిర్మూలన!
హూస్టన్: ప్రాణాంతక మెదడు కేన్సర్‌ను మూలకణాలతోనే నిర్మూలించేందుకు ఉపయోగపడే కొత్త విధానాన్ని భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఖలీద్ షా కనుగొన్నారు. హార్వార్డ్ స్టెమ్‌సెల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఖలీద్ షా ఎలుకలపై ప్రయోగం నిర్వహించి విజయం సాధించారు. ఎలుకల్లో మూలకణాలకు జన్యుపరంగా మార్పులు చేసిన ఆయన.. ఆ కణాలు కేన్సర్ కణాలను నిర్మూలించే విషాన్ని తట్టుకుంటూనే, ఆ విషాన్ని కేన్సర్ కణాల వద్ద మాత్రమే విడుదల చేసేలా అభివృద్ధిపర్చారు. జన్యుమార్పు చేసిన ఈ మూలకణాలు కేన్సర్ కణాలను మాత్రమే చంపుతూ, ఆరోగ్యకరణ కణాలకు ఎలాంటి హాని కలిగించకపోవడం విశేషం. -
మూలకణాలు పిల్లలకిచ్చే అమూల్య బహుమతి: ఐశ్వర్య
చెన్నై: బొడ్డుతాడు మూలకణాలను బ్యాంకుల్లో భద్రపరచుకోవడం ఎంత ముఖ్యమో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ మరోసారి చెప్పారు. లక్ష బొడ్డు తాడుల మూల కణాలను భద్రపరచిన మైలురాయిని చేరుకున్న సందర్భంగా ‘లైఫ్సెల్’ సంస్థ ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఐశ్వర్య పాల్గొన్నారు. మూల కణాల బ్యాకింగ్ చిన్నారులకు ఇచ్చే అమూల్యమైన బహుమతిగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు వీటి గురించి తెలుసుకోవాలన్నారు. -
ఈ జన్యువే ‘మూలం’!
వాషింగ్టన్: శరీరానికి సంబంధించి ఏ రకమైన కణాలుగా అయినా మారగల ‘మూల కణాలు’ అభివృద్ధి చెందేందుకు, అవి రూపొందేందుకు తోడ్పడే జన్యువును అమెరికాకు చెందిన మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికోసం మానవ అండం (ఊసైట్)లోని 5 వేలకుపైగా జన్యువులను విశ్లేషించారు. వీటిల్లో ‘ఏఎస్ఎఫ్1ఏ’ అనే జన్యువును కణాలు మరో రకమైన కణాలుగా మారేందుకు (రీప్రోగ్రామింగ్‌కు) తోడ్పడుతాయని గుర్తించారు. ‘ఏఎస్ఎఫ్1ఏ’ జన్యువు ‘ఓసీటీ4’ అనే మరో జన్యువు సహాయంతో కణాల రీప్రోగామింగ్కు కారణమవుతోందని, మూలకణాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే అంశాన్ని పరిశీలించడంలో ఇదో పెద్ద ముందడుగని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎలీనా గోంజాలెజ్-మునోజ్ తెలిపారు. దీని సాయంతో సాధారణ చర్మకణాలను మూలకణాలుగా ఎలా మార్పు చేయవచ్చనే దానిపై పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు. -
మూలకణాలతో గుండెకు చికిత్స
15 నిమిషాల్లో డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేసే పరిజ్ఞానం సీఎస్ఐ వార్షిక సదస్సులో సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: మూలకణాల (స్టెమ్‌సెల్స్) ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను నయం చేసే సరికొత్త పరిజ్ఞానం త్వరలోనే అందుబాటులోకి రానుందని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ మోహన్‌రావు స్పష్టం చేశారు. గుండెలో మూల కణాలు ఉండవనేది అపోహ మాత్రమేనని, ఇప్పటికే జరిగిన అనేక పరిశోధనలు ఇదే అంశాన్ని నిర్ధారించాయన్నారు. బంజారాహిల్స్‌లోని హోటల్ పార్క్‌హయత్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏపీ చాప్టర్) 19వ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హృద్రోగ బాధితుల్లో చాలామందికి ప్రస్తుతం ఓపెన్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు చేస్తున్నారని, ఖరీదైన స్టంట్స్‌ను అమర్చి మూసుకుపోయిన రక్తనాళాలను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి శస్త్రచికిత్సల అవసరం ఉండబోదన్నారు. స్టెమ్‌సెల్స్ పరిజ్ఞానం ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని చెప్పారు. గుండెనొప్పికి కారణాలను కనుగొనేందుకు చేసే డీఎన్ఏ పరీక్షలు 15 నిమిషాల్లోనే పూర్తిచేసే సరికొత్త పరిజ్ఞానాన్ని మరో మూడేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే ఫార్మికోజెనిటిక్స్ ఆధారంగా రోగి అవ సరానికి తగినట్లుగా మందులు తయారు చేసే పరిజ్ఞానం కూడా రాబోతుందన్నారు. సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 200 మంది హృద్రోగ నిపుణులు హాజరయ్యారు. -
మూలకణ చికిత్సతోవినికిడి శక్తి...
న్యూయార్క్: లోపలి చెవిలో సమస్య కారణంగా వినికిడి లోపంతో బాధపడుతున్న రోగులకు ఇకపై మూలకణ చికిత్సతో తిరిగి వినికిడి శక్తిని పునరుద్ధరించవచ్చు. చెవిలోని కాక్లియా నుంచి శబ్దాన్ని మెదడుకు చేరవేసే స్పైరల్ గాంగ్లియన్ అనే నాడీకణాల క్షీణత వల్ల చాలా మంది వినికిడి జ్ఞానాన్ని కోల్పోతుంటారు. పరిణతి చెందిన ఈ నాడీకణాలను తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాకపోవడంతో చాలామంది చెవిటివారిగానే మిగులుతున్నారు. అయితే మూలకణాల ద్వారా పరిణతి చెందిన గాంగ్లియన్ నాడీకణాలను సైతం తిరిగి ఉత్పత్తి చేయవచ్చని ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో తాజాగా స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని కృత్రిమంగా ప్రయోగశాలలో పునరుత్పత్తి చేయవచ్చని తేలిన నేపథ్యంలో భవిష్యత్తులో లోపలిచెవిలోని నాడీకణాల మార్పిడికి మార్గం సుగమం కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.