బొడ్డుతాడు మూలకణాలను భద్రపరిచేందుకు తల్లిదండ్రుల ఆసక్తి
నగరంలో స్టెమ్‌సెల్స్ బ్యాంకులకు పెరుగుతున్న ఆదరణ
వాటితో అనేక వ్యాధులకు చికిత్స సాధ్యమంటున్న నిపుణులు
బెంగళూరు: గుండె, కాలెయం, మూత్రపిండాల జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినా మనం భయపడకుండా ఉండగలమా..? అది ఇప్పుడు సాధ్యమే. మన బంగారు బిడ్డల భవిష్యత్ కోసం మనం వారి బొడ్డు తాడు తీసి భద్రపరిస్తే చాలు అంటున్నారు నిపుణులు. శిశువు పుట్టగానే బొడ్డుతాడు నుంచి సేకరించిన మూల కణాలను భద్రపరడచం వల్ల భవిష్యత్తులో పిల్లలు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని వైదులు పేర్కొంటున్నారు. ఇలా సేకరించే భద్రపరిచే వాటినే స్టెమ్‌సెల్స్ బ్యాంకులకు నగరంలో ఆదరణ పెరుగుతోంది. 70 రకాల బబ్బుల నుంచి కాపాడే మూల పదార్థం ఇందులో ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం సంపన్న వర్గాలు మాత్రమే వినియోగించుకుంటున్నట్లు సమాచారం.
ముందుగానే ‘మందు’....
చిన్నారులకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఈ మూలకణాలు తిరిగి శరీరంలోని అవయవాలను పునరుజ్జీవింపజేయడానికి పనికొస్తాయి. ప్రసవ సమయంలో బిడ్డతో పాటు ఉండే బొడ్డుతాడు నుంచి ఈ స్టెమ్‌సెల్స్ సేకరణ జరుగుతుంది. ప్రతి బొడ్డుతాడులో 200 మిల్లీ లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం నుంచి సేకరించిన కణాల్నే వైద్యపరిభాషలో హెమటో పాయిటిక్ స్టెమ్‌సెల్స్‌గా వ్యవహరిస్తారు. ప్రసవ సమయంలో వీటిని భద్రపరిస్తే బ్లడ్‌క్యాన్సర్, గుండె, కాలేయం, మూత్రపిండాల్లో తలెత్తే సమస్యలు తదితర 70 వ్యాధులను వీటి సాయంతో నయం చేసేందుకు అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
బిడ్డ పుట్టిన రెండు నిమిషాల్లో...
బిడ్డ పుట్టిన సమయంలో బొడ్డుతాడును అంటిపెట్టుకొని ఉండే రక్తంలో ఈ స్టెమ్‌సెల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బిడ్డ పుట్టిన రెండు నిమిషాల్లో బొడ్డుతాడు నుంచి ఈ స్టెమ్‌సెల్స్‌ను సేకరించి భద్రపరచాల్సి ఉంటుంది. అనంతరం ఈ కణజాలాలను ఆస్పత్రిలో ల్యాబొరేటరీకి తీసుకెళ్లి హెచ్‌ఐవీ ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో ఇన్‌ఫెక్షన్ లేదని నిర్ధారించుకున్న తరువాత స్టెమ్‌సెల్స్‌ను ప్రత్యేక బాటిల్‌లో నింపి, ఆ బాటిల్‌పై సంబంధిత చిన్నారి వివరాలు (తల్లిదండ్రుల పేర్లు, చిరునామా తదితరాలు) నమోదు చేసి ఆ బాటిల్‌కి ఒక ప్రత్యేక కోడ్ కేటాయిస్తారు. ఈ బాటిల్‌ని మైనస్ 196 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. ఇలా భద్రపరిచిన మూలకణాలు సుమారు వందేళ్లపాటు నిల్వ ఉంటాయి. అయితే సాధారణంగా ప్రస్తుతం నగరంలో చిన్నారికి 21 ఏళ్ల వరకూ స్టెమ్‌సెల్స్ భద్రపరుస్తున్నారు. కొంతమంది మాత్రమే బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని 50 ఆ పై ఏళ్ల వరకూ తమ చిన్నారుల స్టెమ్‌సెల్స్‌ను భద్రపరుస్తున్నారు.
ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తాం: చాలా స్టెమ్‌సెల్స్ బ్యాంకులు కణాలను భద్రపరిచి కావాలన్నప్పు అందించడం మాత్రమే చేస్తున్నాయి. మేము స్టెమ్‌సెల్స్‌ను భద్రపరచమే కాకుండా వాటితో వివిధ రోగాలకు చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ)ను కూడా అందిస్తాం. మా బ్యాంకులో 21 ఏళ్లపాటు స్టెమ్‌సెల్స్‌ను నిల్వ ఉంచడానికి రూ.80 వేలు వసూలు చేస్తాం. ఇందుకు ఈఎంఐ (నెలవారిగా కొంతమొత్తాన్ని చెల్లించడం) సదుపాయం కూడా కల్పిస్తున్నాం.
- శ్రీనివాస్, లైఫ్‌సెల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధి