
సాక్షి, హైదరాబాద్: కండరాలు మెరుగ్గా పనిచేసేందుకు దోహదపడుతున్న కణాలపై సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కీలకమైన ఆవిష్కరణ చేశారు. కండరాల పోగుల్లోని మూలకణాలు శరీర అవసరాలకు తగ్గట్టుగా ఇతర పరమాణువులతో జట్టుకట్టి ఎలా పనిచేస్తున్నాయో గుర్తించారు. కండరాల క్షీణత మొదలుకొని అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఇది కీలకం కానుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ జ్యోత్సా్న ధవన్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోత్సా్న ధవన్ పరిశోధన వివరాలను వెల్లడించారు. ‘జీవితాంతం సక్రమంగా పనిచేసేందుకు వీలుగా ఈ కండరాల్లో కొన్ని మూలకణాలుంటాయి.
కండరాల పోగులపై డిస్టోఫిన్, ల్యామినిన్ పరమాణు పొరల మధ్య నిద్రాణంగా ఉండే ఈ మూలకణాలు గాయమైనా.. ఒత్తిడి కారణంగా దెబ్బతిన్నా.. వెంటనే చైతన్యవంతమవుతాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగి గాయం మానేలా చేస్తాయి. ఇలా చైతన్యవంతమైన మూలకణాల్లో కొన్ని మళ్లీ నిద్రాణ స్థితికి చేరుకుని భవిష్యత్తు అవసరాల కోసం సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రక్రియలో ఏదైనా తేడా వస్తే.. కండరాల క్షీణత మొదలుకొని ఇతర జబ్బులు వచ్చే అవకాశముంటుంది. కండర మూలకణాలు అవసరమైనప్పుడు ఎలా చైతన్యవంతమవుతాయి.. ఎలా నిద్రాణ స్థితికి చేరుకుంటాయో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి’అని వివరించారు.
చైతన్యంలో ఒకటి.. నిద్రాణంలో మరొకటి..
తాను అజయ్ అలియోసిస్ అనే శాస్త్రవేత్తతో కలసి పరిశోధనలు నిర్వహించినట్లు జ్యోత్సా్న ధవన్ తెలిపారు. మూలకణాలు ఆన్/ఆఫ్ అయ్యేందుకు ఎల్‌ఈఎఫ్1, ఎస్‌మ్యాడ్3 అనే రెండు ప్రొటీన్లు ఉపయోగపడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. చైతన్యవంతమైన స్థితి నుంచి నిద్రాణ స్థితికి చేరే క్రమంలో మూలకణాలు బీటీ–కేటనైన్ అనే మూలకాన్ని వదిలి ఎస్‌మ్యాడ్3తో జట్టు కడుతున్నట్లు ఈ పరిశోధనల్లో తెలిసింది.
కండర మూలకణాలు చైతన్యవంతమైనప్పుడు ఒక ప్రొటీన్‌తో, నిద్రాణంగా ఉన్నప్పుడు మరోదానితో మూలకణాలు జత కడుతున్నట్లు తమ పరిశోధనలు చెబుతున్నాయని జ్యోత్సా్న తెలిపారు. కండర క్షీణత వ్యాధిలో మూలకణాలు నిత్యం చైతన్యవంతంగానే ఉంటాయి కాబట్టి వాటిని మళ్లీ నిద్రాణ స్థితికి తీసుకెళ్లగలిగితే కండరాల పునరుజ్జీవం సాధ్యం కావచ్చునని.. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టనున్నామని వివరించారు.