Resuscitation
-
వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య
లక్నో: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. గతంతో పోలిస్తే ఈ సారి ఆక్సిజన్ వినియోగం భారీగా పెరిగింది. కానీ అవసరానికి సరిపడా ప్రాణవాయువు నిల్వలు లేక చాలా మంది మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేప్పే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కోవిడ్ బారిని పడిన భర్త శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అయితే బెడ్లు ఖాళీ లేవని వారిని ఏ ఆస్పత్రిలో కూడా చేర్చుకోలేదు. ఈ లోపు బాధితుడి పరిస్థితి విషమించసాగింది. దాంతో ప్రమాదం అని తెలిసి కూడా భార్య తన నోటి ద్వారా భర్తకు శ్వాస అందించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నం వృథా అయ్యింది. చివరకు ఆ వ్యక్తి భార్య ఒడిలోనే కన్నుమూశాడు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. ఆగ్రా వికాస్ సెక్టార్ 7కు చెందిన రవి సింఘాల్ కోవిడ్ బారిన పడ్డాడు. దాంతో అతడి భార్య రేణు సింఘాల్, రవి సింఘాల్‌ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. ఈలోపు రవి సింఘాల్‌కు ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తింది. దాంతో రేణు సింఘాల్ అతడిని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఆటోలో ఎక్కి ఆస్పత్రి వెళ్తుండగా అతడి పరిస్థితి చేయి దాటిపోసాగాంది. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడసాగాడు. దాంతో ప్రమాదం అని తెలిసి కూడా రేణు సింఘాల్ అతడికి నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసిది. కానీ అవేవి ఫలించలేదు. ఆస్పత్రికి చేరుకునేలోగానే అతడు ఆటోలోనే భార్య ఒడిలో కన్ను మూశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తనకు ప్రమాదం అని తెలిసి కూడా భర్త ప్రాణాల కోసం రేణు సింఘాల్ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆమె భర్త బతికి ఉంటే బాగుండు అని వాపోతున్నారు. ఇక ఆగ్రాలో చాలా ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో పలువురు మరణించారు. ఈ పరిస్థితులపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు ప్రజల కష్టాలు పట్టవా అని విమర్శిస్తున్నారు. ఇక భారతదేశంలో సోమవారం మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2,812 మంది కోవిడ్ పేషెంట్లు మృతి చెందారు. -
కండర మూలకణాల గుట్టు రట్టు!
సాక్షి, హైదరాబాద్: కండరాలు మెరుగ్గా పనిచేసేందుకు దోహదపడుతున్న కణాలపై సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కీలకమైన ఆవిష్కరణ చేశారు. కండరాల పోగుల్లోని మూలకణాలు శరీర అవసరాలకు తగ్గట్టుగా ఇతర పరమాణువులతో జట్టుకట్టి ఎలా పనిచేస్తున్నాయో గుర్తించారు. కండరాల క్షీణత మొదలుకొని అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఇది కీలకం కానుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ జ్యోత్సా్న ధవన్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోత్సా్న ధవన్ పరిశోధన వివరాలను వెల్లడించారు. ‘జీవితాంతం సక్రమంగా పనిచేసేందుకు వీలుగా ఈ కండరాల్లో కొన్ని మూలకణాలుంటాయి. కండరాల పోగులపై డిస్టోఫిన్, ల్యామినిన్ పరమాణు పొరల మధ్య నిద్రాణంగా ఉండే ఈ మూలకణాలు గాయమైనా.. ఒత్తిడి కారణంగా దెబ్బతిన్నా.. వెంటనే చైతన్యవంతమవుతాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగి గాయం మానేలా చేస్తాయి. ఇలా చైతన్యవంతమైన మూలకణాల్లో కొన్ని మళ్లీ నిద్రాణ స్థితికి చేరుకుని భవిష్యత్తు అవసరాల కోసం సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రక్రియలో ఏదైనా తేడా వస్తే.. కండరాల క్షీణత మొదలుకొని ఇతర జబ్బులు వచ్చే అవకాశముంటుంది. కండర మూలకణాలు అవసరమైనప్పుడు ఎలా చైతన్యవంతమవుతాయి.. ఎలా నిద్రాణ స్థితికి చేరుకుంటాయో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి’అని వివరించారు. చైతన్యంలో ఒకటి.. నిద్రాణంలో మరొకటి.. తాను అజయ్ అలియోసిస్ అనే శాస్త్రవేత్తతో కలసి పరిశోధనలు నిర్వహించినట్లు జ్యోత్సా్న ధవన్ తెలిపారు. మూలకణాలు ఆన్/ఆఫ్ అయ్యేందుకు ఎల్‌ఈఎఫ్1, ఎస్‌మ్యాడ్3 అనే రెండు ప్రొటీన్లు ఉపయోగపడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. చైతన్యవంతమైన స్థితి నుంచి నిద్రాణ స్థితికి చేరే క్రమంలో మూలకణాలు బీటీ–కేటనైన్ అనే మూలకాన్ని వదిలి ఎస్‌మ్యాడ్3తో జట్టు కడుతున్నట్లు ఈ పరిశోధనల్లో తెలిసింది. కండర మూలకణాలు చైతన్యవంతమైనప్పుడు ఒక ప్రొటీన్‌తో, నిద్రాణంగా ఉన్నప్పుడు మరోదానితో మూలకణాలు జత కడుతున్నట్లు తమ పరిశోధనలు చెబుతున్నాయని జ్యోత్సా్న తెలిపారు. కండర క్షీణత వ్యాధిలో మూలకణాలు నిత్యం చైతన్యవంతంగానే ఉంటాయి కాబట్టి వాటిని మళ్లీ నిద్రాణ స్థితికి తీసుకెళ్లగలిగితే కండరాల పునరుజ్జీవం సాధ్యం కావచ్చునని.. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టనున్నామని వివరించారు. -
చచ్చి బతికింది!
మెల్బోర్న్: ‘చచ్చి.. బతికాం’ అనేది ఏదో పెను ఆపద నుంచి బయటపడ్డామని చెప్పటానికి వాడే సామెత! కానీ.. ఒక మనిషి నిజంగా చనిపోయి మళ్లీ బతికితే? అదో అద్భుతం!! ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మొనాషా హార్ట్ హాస్పిటల్ వైద్యులు ఈ అద్భుతాన్ని సాధించారు. గుండెపోటుతో చనిపోయిన ఒక మహిళను 42 నిమిషాల తర్వాత మళ్లీ బతికించారు. వెనెసా టనాసియో వయసు 41 సంవత్సరాలు. సేల్స్ రిప్రెజెంటేటివ్. ఆమెకు ఇద్దరు పిల్లలు. గత వారం ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. దమనులు మూసుకుపోవటంతో గుండె ఆగి, మెదడుకు రక్తప్రవాహం నిలిచిపోయి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. అయితే చికిత్స మాత్రం ఆపలేదు. లుకాస్-2 ప్రత్యేక పరికరంతో ఆమె గుండె నుంచి మెదడుకు రక్తప్రవాహం కొనసాగేలా చూశారు. ఆ తర్వాత.. గుండెలో మూసుకుపోయివున్న ధమనులను తెరిచారు. గుండెకు పలుమార్లు వైద్యపరమైన షాక్‌లు ఇచ్చి దానిని మళ్లీ పనిచేయించారు. మెదడుకు రక్తప్రవాహాన్ని పునరుద్ధరించారు. దీంతో 42 నిమిషాల పాటు చనిపోయిన వెనెసా మళ్లీ బతికారు. ఆమె పునరుజ్జీవనం అత్యంత ఆశ్చర్యకరమైనదిగా ఆస్పత్రి అధికారులు అభివర్ణించారు. వెనెసా కూడా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేశారు.