చచ్చి బతికింది!
మెల్‌బోర్న్: ‘చచ్చి.. బతికాం’ అనేది ఏదో పెను ఆపద నుంచి బయటపడ్డామని చెప్పటానికి వాడే సామెత! కానీ.. ఒక మనిషి నిజంగా చనిపోయి మళ్లీ బతికితే? అదో అద్భుతం!! ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ మొనాషా హార్ట్ హాస్పిటల్ వైద్యులు ఈ అద్భుతాన్ని సాధించారు. గుండెపోటుతో చనిపోయిన ఒక మహిళను 42 నిమిషాల తర్వాత మళ్లీ బతికించారు. వెనెసా టనాసియో వయసు 41 సంవత్సరాలు. సేల్స్ రిప్రెజెంటేటివ్. ఆమెకు ఇద్దరు పిల్లలు. గత వారం ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది.
దమనులు మూసుకుపోవటంతో గుండె ఆగి, మెదడుకు రక్తప్రవాహం నిలిచిపోయి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. అయితే చికిత్స మాత్రం ఆపలేదు. లుకాస్-2 ప్రత్యేక పరికరంతో ఆమె గుండె నుంచి మెదడుకు రక్తప్రవాహం కొనసాగేలా చూశారు. ఆ తర్వాత.. గుండెలో మూసుకుపోయివున్న ధమనులను తెరిచారు. గుండెకు పలుమార్లు వైద్యపరమైన షాక్‌లు ఇచ్చి దానిని మళ్లీ పనిచేయించారు. మెదడుకు రక్తప్రవాహాన్ని పునరుద్ధరించారు. దీంతో 42 నిమిషాల పాటు చనిపోయిన వెనెసా మళ్లీ బతికారు. ఆమె పునరుజ్జీవనం అత్యంత ఆశ్చర్యకరమైనదిగా ఆస్పత్రి అధికారులు అభివర్ణించారు. వెనెసా కూడా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేశారు.