మూలకణాలు... మేలుకణాలు! | Good cells, stem cel | Sakshi
Sakshi News home page

మూలకణాలు... మేలుకణాలు!

Published Mon, Mar 9 2015 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

మూలకణాలు...  మేలుకణాలు!

మూలకణాలు... మేలుకణాలు!

ఒక కొత్తజీవి రూపుదిద్దుకున్నప్పుడు మొదటి కణం తర్వాత ఆవిర్భవించే మూలకణాలు తొలుత ఒకటిలాగే కనిపిస్తాయి. కానీ
 భవిష్యత్తులో అవి నిర్వహించాల్సిన వేర్వేరు కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని వివిధ రకాల కణాలుగానూ... ఆయా కణాలు మరింత విభజన చెంది కణజాలాలుగా రూపొందుతాయి. అలా చర్మం, వెంట్రుకలు, రక్తకణాలు, కడుపులోని లోపలి పొర కణాలు, మెదడు, కాలేయం వంటి అన్ని శరీర భాగాలు ఏర్పడతాయి. ఇవన్నీ కణాలే అయినా చేసే పనిని బట్టి కొద్దికొద్ది వైవిధ్యంతో ఉంటాయి. ఈ వేర్వేరు కణాల్లో దేనిగానైనా రూపొందే శక్తి ఒక్క మూలకణాలకు మాత్రమే ఉంటుంది. అలాంటి మూలకణాన్నే ఇంగ్లిష్‌లో స్టెమ్‌సెల్ అంటారు. ఈ స్టెమ్‌సెల్స్ సహాయంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనలు పేర్కొంటున్నాయి. కొన్ని వ్యాధులకు ఇప్పటికే చికిత్సలూ జరుగుతున్నాయి.ఆ మూలకణ చికిత్సలపై అవగాహన కోసమే  ఈ ప్రత్యేక కథనం.
 
మూలకణాల్లో వివిధ రకాలు...

మూలకణం అంటేనే ఏ రకమైన కణంగానైనా మారిపోగల మూలకణం కదా! మరి అలాంటి మూలకణాల్లోనూ వేర్వేరు రకాలుంటాయా అంటే ఉంటాయన్నదే సమాధానం. పురుషుడి వీర్యకణంతో మహిళలోని అండం ఫలదీకరణం చెందిన తర్వాత తొలుత ఏర్పడేదే... పిండం. తొలిదశలో ఇది ఒకే కణంగా ఉంటుంది. దీన్నే ‘ఫెర్టిలైజ్‌డ్ ఓవమ్’ అంటారు.  ఆ తర్వాత ఏర్పడాల్సిన వేర్వేరు కణజాలాలకు అనుగుణంగా ఈ కణం విభజన చెంది కొన్ని వేర్వేరు రకాల మూలకణాలు ఏర్పడి... అవీ విభజితమై భవిష్యత్తులో రూపొందాల్సిన అవయవాలూ, వ్యవస్థలకు అనుగుణంగా వేర్వేరు రకాల కణాలుగా మారుతాయి. ఈ తొలిదశ కణాలనే మూలకణాలుగా పేర్కొనవచ్చు.
 
సైంటిస్టులు రూపొందించిన మూలకణాలు!


మూలకణాలు శరీరమంతా అక్కడో ఇక్కడో ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో లభ్యం కావాలంటే మాత్రం బొడ్డు తాడులోని రక్తంలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ తరానికంటే ముందు తరాల వారిలో బొడ్డు తాడు నుంచి మూలకణాలను వేరు చేసి భద్రపరచడం అనే అంశంపై ఆసక్తి లేదు. ఎందుకంటే మూలకణాలతో చాలా రకాల చికిత్సలు సాధ్యమవుతాయనే అంశంపై అప్పట్లో అంత అవగాహన లేకపోవడమే దీనికి కారణం. అయితే ప్రతి సందర్భంలోనూ ప్రతివారికీ అవసరమైనవీ, వారికి సరిపోలే మూలకణాలు దొరకకపోవడంతో శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ మార్గాలను శోధించి, కొంతమేరకు విజయం సాధించారు. ల్యాబరేటరీలో మూలకణాలను రూపొందించారు. వీటినే ‘ఇండ్యూస్‌డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్’ (ఐపీఎస్)గా పేర్కొంటుంటారు.  ఇవి మూలకణాల్లాగే పనిచేసినా... పుట్టినప్పుడుగానీ లేదా జీవితకాలంలో గానీ శరీరంలో ఎక్కడ ఉండవు. మన శాస్త్రజ్ఞులు చర్మకణాల నుంచి కొన్నింటిని సేకరించి అచ్చం పిండం ఏర్పడినప్పుడు కనిపించే తొలి కణం (ఎం బ్రియోనిక్ స్టెమ్‌సెల్స్) లాంటివాటినే సృష్టించగలిగారు.
 
ఇండ్యూస్‌డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్ (జ్కీ) అంటే...?

అనంతరం జరిగిన పరిశోధనల్లో మానవ చర్మం నుంచి కొన్ని కణాలను సేకరించి వాటిని అచ్చం మూలకణాల్లాగే ఉండే కణాలను ఇండ్యూస్‌డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్ (ఐపీఎస్) రూపొందించడం జరిగింది. ఈ ప్రక్రియపైనా కొన్ని అభ్యంతరాలు వెలువడుతున్నప్పటికీ వీటిని ఉపయోగించి చికిత్స చేయడంతో ఉన్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని... వివిధ రుగ్మతలు/వ్యాధుల చికిత్సల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. ఎముక మజ్జ (బోన్ మ్యారో) నుంచి సేకరించిన కణాలతో కూడా మూలకణాలను రూపొందించి వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేస్తున్నారు.
 
స్ల్కీరోడెర్మా, ల్యూపస్ అండ్  రుమాటాయిడ్ ఆర్థరైటిస్


మన వ్యాధి నిరోధక కణాలే మనల్ని పరాయివారి గా గుర్తించి తిరగబడటం వల్ల ఏర్పడే ‘ఆటో ఇమ్యూన్ వ్యాధు’లివి. మనలోని ఆరోగ్యకణాలను పరాయి కణాలుగా అపోహపడి వాటిపై మన వ్యాధి నిరోధక కణాలు దాడి చేస్తాయి. ఇలాంటి వ్యాధుల్లో మన వ్యాధి నిరోధక శక్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించాల్సి వస్తుంటుంది. ఫలితంగా మన శరీరం తేలిగ్గా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కానీ మూలకణ చికిత్సతో ఇలా ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే వ్యాధినిరోధక కణాల తప్పుడు చర్యలను అరికట్టవచ్చు. మన శరీర వ్యాధి నిరోధక శక్తిని సాధారణంగా పనిచేసేలాగానూ చేయవచ్చు.
 
 మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అంటే...?

మన శరీరంలోని కొన్ని కణాలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు అవి మళ్లీ పుట్టవు. అంటే శాశ్వతంగా నశించిపోతాయన్నమాట. దాంతో ఆ దెబ్బతిన్న అవయవం గానీ, దాని వల్ల ఆ వ్యవస్థలో గానీ శాశ్వత లోపం ఏర్పడుతుంది. కానీ స్టెమ్‌సెల్స్ ద్వారా చేసే చికిత్సలో ఆ దెబ్బతిన్న / చనిపోయిన కణాల స్థానాన్ని ఈ మూలకణాలు భర్తీ చేస్తాయి. అచ్చం ఆ అవయవానికి సంబంధించిన మునపటి కణాల్లాగే మారిపోతాయి. దాంతో ఇక ఆ అవయవం మునుపటిలాగే పనిచేస్తుంది. ఫలితంగా ఆ వ్యవస్థ కూడా ఎలాంటి లోపం లేకుండా తన కార్యకలాపాలు సాగిస్తుంటుంది. సాధారణంగా చేసే సంప్రదాయ వైద్య చికిత్స ప్రక్రియలైన మందులు ఇవ్వడం లేదా శస్త్రచికిత్స చేయడం వంటివి సత్ఫలితాలు ఇవ్వని సందర్భాల్లో, మూలకణాలను సేకరించి ఒక అవయవానికి అందేలా చేస్తుంటారు. అందుకే మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియను ‘రీజనరేటివ్ మెడిసిన్’ అని కూడా అంటారు. మూలకణ చికిత్స కోసం ఆ చికిత్సా విధానంలో నైపుణ్యం పొందిన, అధీకృతమైన చికిత్సకులు ఉంటారు. ఈ చికిత్సకులకు జాతీయ ఆరోగ్య అధికారుల నుంచి ప్రత్యేకమైన అనుమతి ఉంటుంది.
 
మూలకణ చికిత్సలో ఆధునిక ప్రక్రియలు...

మూలకణాలతో చేసే చికిత్స తొలి దశల్లో కొంత నత్తనడకలా సాగినా... ఇటీవల మాత్రం ఈ ప్రక్రియలో చాలా అభివృద్ధి చోటు చేసుకుంది. అయినప్పటికీ ఈ అభివృద్ధిని ఇంకా పూర్తిస్థాయి పురోగతిగా చెప్పలేం. గత పదేళ్ల వ్యవధిలో ఈ అభివృద్ధి... పరిశోధన శాలలను దాటి ఆసుపత్రులకు చేరిందని చెప్పుకోవచ్చు. అయినా దీన్ని మూలకణ చికిత్స తాలూకు ఆవిర్భావ దశగానే పేర్కొనవచ్చు. అంటే ఇంత అభివృద్ధి తర్వాత కూడా పూర్తిస్థాయి చికిత్సగా రూపొందాలంటే ఇంకా ఈ రంగం ఎంతగా అభివృద్ధి సాధించాలో అర్థం చేసుకోవచ్చు. అయితే అదృష్టకరమైన అంశం ఏమిటంటే... తొలిదశల్లోనూ, పరిశోధనాత్మక దశల్లో చేసిన పరిశీలనల్లోనూ ఈ ప్రక్రియ చాలా సురక్షితమైనదనీ, సునిశితమైనదనీ, పూర్తిగా నమ్మదగినదనే ఫలితాలు వచ్చాయి. గతంలో ఏదైనా అవయవం దెబ్బతింటే దాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు ఈ మూల కణాల ద్వారా అవయవంలో దెబ్బతిన్నమేరకు మూలకణాలను ప్రవేశపెట్టి, కొత్త కణాలను సృష్టించి అదే దెబ్బతిన్న అవయవాన్ని పూర్తి ఆరోగ్యవంతమైన అవయవంగా మార్చగలిగే అవకాశాలున్నట్లుగా తేలింది. అందుకే దీన్ని ‘రీజనరేటివ్ మెడిసిన్’గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఈ రీజనరేటివ్ మెడిసిన్‌లోని తొలిమెట్టుపై ఉన్నామని చెప్పవచ్చు.
 
మూలకణాలతో చేస్తున్న /చేయనున్న చికిత్సలలో కొన్ని ఇవి...
బ్లడ్ క్యాన్సర్లు, రక్తసంబంధమైన వ్యాధులకు చికిత్స...


రక్తసంబంధమైన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన ఇతర వ్యాధులలో రక్తకణాలు పుట్టే మూల కేంద్రమైన ఎముక మజ్జను రోగి నుంచి పూర్తిగా తొలగించి... అక్కడ మరొకరి నుంచి స్వీకరించిన ఆరోగ్యవంతమైన  మూలకణాలను ప్రవేశపెట్టి... కొత్తగా ఆరోగ్యకరమైన మజ్జను ఏర్పరచడం వల్ల... ఇకపై పుట్టే కణాలన్నీ ఆరోగ్యకరమైనవిగా చేసే చికిత్సతో బ్లడ్‌క్యాన్సర్లలోనూ, రక్తసంబంధమైన వ్యాధులలోనూ చికిత్స చేస్తారు. ఈ తరహా చికిత్స లుకేమియా, మల్టిపుల్ మైలోమా, లింఫోమా, రక్తసంబంధమైన ఇతర వ్యాధులైన అప్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియాలో సాధ్యమవుతుంది.  వ్యాధిగ్రస్తుల అన్నదమ్ముల నుంచి కొన్ని మూలకణాలను సేకరించి... వాటిని రక్తమార్పిడి తరహాలోనే వ్యాధిగ్రస్తులలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. అప్పటికే వ్యాధిగ్రస్తమై ఉన్న కణాలను నిర్మూలించడానికి కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఒకసారి వ్యాధిగ్రస్త కణాలన్నీ శరీరం నుంచి తొలగిపోయాక... మూలకణాలతో మార్పిడి చేసిన మజ్జ నుంచి ఇకపై పూర్తిగా ఆరోగ్యకరమైన రక్తకణాలే ఆవిర్భవిస్తాయి. అయితే సంప్రదాయ చికిత్స ద్వారా సదరు వ్యాధి లొంగని సందర్భాల్లో మాత్రమే ఈ తరహా చికిత్సను ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ తరహా చికిత్సలో కీమోథెరపీ మోతాదు ఎక్కువైతే ఒక్కోసారి అది ఇన్ఫెక్షన్లకో లేదా కొన్నిసార్లు రక్తస్రావానికో దారితీసే ప్రమాదం (రిస్క్) ఉంటుంది. ప్రస్తుతం ఈ రిస్న్ తగ్గించేందుకు అవసరమైన పరిశోధనలు చురుగ్గా జరుగుతున్నాయి.
 
 
ఎముక సంబంధ వ్యాధులు (ఆర్థోపెడిక్ కాంప్లికేషన్స్)

ఎముక సంబంధ వ్యాధుల్లో అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకు పాదం,  చీలమండ, తుంటిభాగం, మోకాలు నుంచి మొదలుకొని కీలకమైన వెన్నెముక వరకూ అనేక రకాల ఎముకలు ఉంటాయి. ఇవి రకరకాల సమస్యలకు గురవుతుంటాయి. విరిగినప్పుడు సరిగా అతుక్కోకపోవడం, వీటిపై ఉండే మృదులాస్థి (కార్టిలేజ్) దెబ్బతినడం, ఎముకకు సరిగా రక్తప్రసరణ లేక ఎముకలోని కొంతభాగం మృతిచెందడం (ఎవాస్క్యులార్ నెక్రోసిస్) వంటి సమస్యలు ఇందులో కొన్ని. ఎముకలకు సంబంధించిన ఇలాంటి ఎన్నో వ్యాధులకు గతంలో అంతగా ఫలితాలివ్వని ఎన్నో సందర్భాల్లో కూడా... మూలకణ చికిత్సలతో,... చనిపోయిన ఎముక భాగం తిరిగి పునరుజ్జీవనం పొందడం వంటి అద్భుత ఫలితాలు లభించాయి. పైగా ఎముకలోని కొంత భాగం పూర్తిగా మృతిచెందిన సందర్భాల్లోనూ 3 - 4 ఏళ్ల చికిత్స తర్వాత ఆ భాగం మళ్లీ జీవం పొంది సాధారణంగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అనేక అధ్యయనాల్లో మూలకణ చికిత్స చాలా ప్రభావపూర్వకమైనదనీ, సురక్షితమనీ తేలింది.

గుండె, కాలేయ సంబంధ వ్యాధుల్లో...

ఇప్పటికే స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా అనేక ప్రయోజనాలు పొందుతూనే... మున్ముందు మరింతగా ఈ చికిత్స ప్రక్రియ వల్ల ప్రయోజనాలు పొందవచ్చని అనేక గుండె, కాలేయ సంబంధ వ్యాధుల చికిత్సలో తేలింది. గుండె కండరాలు దెబ్బతిన్న ప్రాంతంలోని చనిపోయిన కణాలను పునరుజ్జీవించేలా చేసి, గుండె పనిచేయలేని పరిస్థితిని (హార్ట్ ఫెయిల్యూర్‌ను) రివర్స్ చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక కాలేయం విషయంలోనూ ఇంతే. మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతిని, అది పూర్తిగా చెడిపోయిన వారికి, స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... దెబ్బతిన్న భాగాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయవచ్చని తేలింది. అయితే వీటిలో కొన్ని ఇంకా ప్రాథమిక పరిశోధన దశల్లో ఉన్నప్పటికీ... కొన్నాళ్లలోనే అవి మానవ చికిత్స ప్రక్రియలుగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్న విషయం మాత్రంలో ఎలాంటి అనుమానాలూ లేవు.
 
బట్టతలకు ఇకపై ఆస్కారమే ఉండదు!

 వెంట్రుక ఆవిర్భవించే కేశమూలంలోకి ఈ స్టెమ్‌సెల్స్ ప్రవేశపెట్టడం వల్ల హెయిర్ ఫాలికిల్ పునరుజ్జీవమవుతుంది. ఫలితంగా హెయిర్ ఫాలికిల్ నుంచి వెంట్రుక మొలిచి, అది మామూలుగా పెరగడం మొదలవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన పరిశోధనల వల్ల ఈ విషయంలో మంచి ఫలితాలు కనిపించాయి. ఇక త్వరలోనే ఈ పరిశోధన ఫలితాలు అందరికీ అందబాటులోకి రావడమే తరువాయి.

పైన పేర్కొన్న చికిత్సల్లో కొన్నింటిని ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్‌లోని కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో గల డిపార్ట్‌మెంట్ ఆఫ్ రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా జరుగుతున్నాయని ఇక్కడి సైంటిస్టులు/డాక్టర్లు వివరిస్తున్నారు.
 
డాక్టర్ సయీదా
సైంటిస్ట్, స్టెమ్‌సెల్ బయాలజీ,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ రీజనరేటివ్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్ (కేఎఫ్‌ఆర్‌సీ), సికింద్రాబాద్
 
 
డయాబెటిక్ ఫుట్ అండ్ న్యూరోపతి

మధుమేహం ఉన్నవారిలో చాలా సాధారణంగా కనిపించే దుష్ర్పభావమిది. చాలా సందర్భాల్లో మధుమేహం ఉన్న వ్యక్తుల కాళ్లకు పుండ్లు పడతాయి. అవి ఎప్పటికీ మానని దశకు చేరుకుని కుళ్లడం ప్రారంభిస్తాయి. గ్యాంగ్రీన్‌గా పేర్కొనే ఈ దశకు చేరుకున్న కాలిని తొలగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని దశకు రోగులు చేరుకుంటారు. అయితే ఇటీవలి పరిశోధనల వల్ల ఈ తరహా సమస్యలను ఎదుర్కొనే వారిలో స్టెమ్‌సెల్స్ వల్ల డయాబెటిక్ ఫుట్‌నూ, డయాబెటిక్ న్యూరోపతిని తగ్గించే అవకాశాలు ఉన్నాయని తేలింది.
 
 క్రిటికల్ లింబ్ ఇస్కిమియా

ఈ వ్యాధి ఉన్నవారి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డందు వల్ల కాళ్లకు సరైన మోతాదులో రక్తం అందదు. ఫలితంగా కాలిలోని ఒక ప్రాంతం పనికి రాకుండా పోతుంది. కొన్నిసందర్భాల్లో శస్త్రచికిత్స చేసి, అడ్డంకులు తొలగించలేని పరిస్థితి ఏర్పడితే... రోగి తన కాలిని కోల్పోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రోగికి మూలకణాలతో చికిత్స చేస్తారు. ఇలాంటి రోగులకు ప్రయోగాత్మకంగా చికిత్స చేసిన చాలా సందర్భాల్లో రోగి కాలును తొలగించకుండానే, దాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో పరిశోధకులు, డాక్టర్లు సఫలీకృతులయ్యారు.
 
కార్నియా, రెటీనా సమస్యలకు...

 
గతంలో కంటి నల్లగుడ్డు కార్నియాలోని కణాలు దెబ్బతిన్నప్పుడు గానీ...  దృశ్యాన్ని తన తెరపై పట్టివేసే... రెటీనా కణాలు గాని దెబ్బతిన్నప్పుడు అవి మళ్లీ పునరుజ్జీవించేందుకు ఆస్కారం లేదు. కానీ, మృతిచెందిన కార్నియా, రెటీనా కణాలను పునరుజ్జీవింపజేసేందుకు మూలకణాలు తోడ్పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దాంతో కొద్దిరోజుల్లోనే ఈ మూలకణాల సహాయంతో కార్నియా, రెటీనా భాగాలను పునరుజ్జీవింపజేసి... అంధులకు మళ్లీ వెలుగు చూపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నది సైంటిస్టులు, డాక్టర్ల ఆశాభావం.  
 
బొల్లి (విటిలిగో)

చర్మానికి రంగును ఇచ్చే మెలనోసైట్స్ అనే కణాలు పూర్తిగా దెబ్బతినడం వల్ల చర్మం తన స్వాభావికమైన రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. దీనివల్ల చర్మంపై తెల్లటి మచ్చలు, పొడలు కనిపిస్తుంటాయి. కానీ స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి వాటిని మామూలు రంగునిచ్చే  కణాల్లాగే పెరిగేలా చేయడం వల్ల కొద్దిరోజుల్లోనే చర్మమంతా ఒకే రంగులోకి మారిపోతుంది. ఫలితంగా విటిలిగోకు నమ్మకంగా చికిత్స చేయవచ్చునన్నది స్టెమ్‌సెల్ బయాలజిస్టులు/మూలకణాలతో చికిత్స చేసే డాక్టర్ల అభిప్రాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement