
పాలస్తీనా అనుకూలురపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యలు
న్యూయార్క్: అమెరికా యూనివర్సిటీల్లో చదువుకొనసాగిస్తూ పాలస్తీనా అనుకూల నిరసనలకు మద్దతు పలుకుతున్న వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వీరు పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్‌తోపాటు అధికారులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, గాజాలో ని హమాస్‌పై ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే తాము మాట్లాడుతున్నామన్నది నిరసనల్లో పాల్గొంటున్న వారి వాదనగా ఉంది. ఇటీవలి కాలంలో యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏడెనిమిది మంది పాలస్తీనా అనుకూల విద్యార్థి నేతలను నిర్బంధంలోకి తీసుకోవడమో లేదా బలవంతంగా సొంతదేశాలకు పంపించడమో చేశారు. వీరిలో కొందరిని గురించి పరిశీలిద్దాం..
రుమేసా ఒజ్‌టుర్క్
తుర్కియేకు చెందిన 30 ఏళ్ల రుమేసా ఒజ్‌టుర్క్ మంగళవారం బోస్టన్‌లోని ఓ వీధిలో నడిచి వెళ్తుండగా ఫెడరల్ అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. టఫ్టŠస్ వర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న ఈమె హమాస్‌కు మద్దతుగా జరిగే కార్యకలాపాల్లో పాల్గొంటోందని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. ఆధారాలను మాత్రం చూపలేదు. అయితే, ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేసే వర్సిటీ వార్తాపత్రికకు రమేసా వ్యాసాలు రాస్తుంటారని స్నేహితులు తెలిపారు. ప్రస్తుతం లూసియానాలో డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. రుమేసా నిర్బంధానికి తగు కారణాలు తెలపాలని జిల్లా జడ్జి ఒకరు అధికారులను ఆదేశించారు.
మహ్మూద్ ఖలీల్
అమెరికాలో నివాసానికి అర్హత పొందిన పాలస్తీనా అనుకూల ఉద్యమకారుడు మహ్మూద్ ఖలీల్‌ను మార్చిలో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి, నిర్బంధంలో ఉంచారు. కొలంబియా వర్సిటీలో గతేడాది జరిగిన ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలను నడిపిన వారిలో ఇతడూ ఉన్నాడు. అనంతరం వర్సిటీ అధికారులు, ఆందోళనకారులకు మధ్యవర్తిగా ఉండి ఆందోళనలను విరమింపజేశాడు. అయితే, ఇతడు హమాస్‌కు మద్దతు తెలుపుతున్నాడనే ఆరోపణలపై ఖలీల్‌కున్న గ్రీన్‌కార్డును యంత్రాంగం రద్దు చేసింది. బలవంతంగా సొంతదేశం సిరియాకు పంపించేందుకు జరిగే ప్రయత్నాలను ఇతడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇతడు అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నాడు.
యున్‌సియో చుంగ్
దక్షిణ కొరియా నుంచి చిన్నతనంలోనే అమెరికాకు వచ్చిన యున్‌సియో చుంగ్ నివాసార్హత పొందింది. ఈమె కొలంబియా వర్సిటీ విద్యార్థి. పాలస్తీనా అనుకూల విద్యార్థులపై ప్రభుత్వం బహిష్కరాస్త్రాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఇటీవల బర్నార్డ్ కాలేజీలో జరిగిన నిరసనల్లో పాల్గొనడమే ఈమె చేసిన నేరం. ఈమెను సొంతదేశం కొరియాకు పంపించాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ఈమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు యున్‌సియోను నిర్బంధించవద్దని జడ్జి ఒకరు ఆదేశించారు.
బాదర్ ఖాన్ సురి
భారత్‌కు చెందిన బాదర్ ఖాన్ సురి జార్జిటౌన్ వర్సిటీ విద్యార్థి. వర్జీనియాలోని తన నివాసం వద్ద ముసుగు ధరించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. హ మాస్ సిద్ధాంతాలను ఇతడు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. సురి సోషల్ మీడియా పోస్టులు, ఇతడి భార్య పాలస్తీనా వాసి కావడమే ఇందుకు కారణమని ఇతడి లాయర్ కోర్టుకు తెలిపారు. విజిటింగ్ స్కాలర్‌గా అమెరికాలో ఉండేందుకు సురికి అనుమతి ఉందని, ఇత డి భార్య అమెరికా పౌరు రాలని అ న్నారు. లూసియానాలోని డి టెన్షన్ సెంటర్‌లో సురిని ఉంచారు. సురి ని వెంటనే విడుదల చేయాలని, భారత్‌కు బలవంతంగా పంపించరాదని వాదిస్తున్నారు.
లెకా కొర్డియా
వెస్ట్ బ్యాంకుకు చెందిన పాలస్తీనా వాసి లెకా కొర్డియా. ప్రస్తుతం న్యూయార్క్‌లోని నెవార్క్‌లో ఉంటోంది. విద్యార్థి వీసా పరిమితి ముగిసిన తర్వాత కూడా అమెరికాను వీడి వెళ్లలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. కొర్డియా తమ విద్యార్థి కానేకాదని కొలంబియా యూనివర్సిటీ అంటోంది. టెక్సాస్‌లోని అల్వరాడో డిటెన్షన్ సెంటర్‌లో ఈమెను ఉంచారు.
రంజనీ శ్రీనివాసన్
భారత పౌరురాలైన రంజనీ శ్రీనివాసన్ కొలంబియా వర్సిటీలో డాక్టరేట్ చేస్తోంది. యూనివర్సిటీ హాస్టల్‌లో ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు ఈమెను సోదా చేయడంతో ఈమె భారత్‌కు తిరిగి వచ్చింది. హింసను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున ఈమె వీసాను రద్దు చేసినట్లు యంత్రాంగం తెలిపింది. ఇందుకు గల ఆధారాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఆరోపణలను ఈమె ఖండించింది. నిరసనల్లో తనకెలాంటి పాత్ర లేదని తెలిపింది. ‘సెల్ఫ్ డిపోర్ట్’ఆప్షన్‌ను ఎన్నుకుని, స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది.
అలిరెజా డొరౌడి
అలబామా యూనివర్సిటీ డాక్టొరల్ విద్యార్థి అలిరెజా డొరౌడి సొంత దేశం ఇరాన్. మంగళవారం ఇతడిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకుని, లూసియానాలోని జెనా ఇమిగ్రేషన్ ఫెసిలిటీకి తరలించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఇతడి వీసాను అధికారులు 2023లోనే రద్దు చేశారని లాయర్ డేవిడ్ రొజాస్ తెలిపారు. అయితే, విద్యార్థి హోదాలో ఉన్నంత కాలం ఇతడు అమెరికాలో ఉండేందుకు అర్హత ఉంటుందన్నారు. జాతీయ భద్రతకు ప్రమాదమనే ఆరోపణలపై ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు. అయితే, ఇతడికి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలతో సంబంధం లేదని లాయర్ డేవిడ్ తెలిపారు.
డాక్టర్ రషా అలావీహ్
లెబనాన్‌కు చెందిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రషా అలావీహ్(34). రోడ్ ఐల్యాండ్‌లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉన్న ఈమెను ఇటీవలే సొంత దేశానికి బలవంతంగా పంపించివేశారు. ఈమె పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు నిర్బంధించరాదన్న జడ్జి ఆదేశాలను సైతం ఇమిగ్రేషన్ అధికారులు పక్కనబెట్టడం గమనార్హం. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సాయుధ సంస్థకు ఈమె బహిరంగంగా మద్దతు పలికారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే, హెజ్»ొల్లా నేత హసన్ నస్రుల్లా మత, ఆధ్యాతి్మక బోధనలకే తప్ప రాజకీయ సిద్ధాంతాలకు మద్దతు తెలపలేదని రషా అంటున్నారు.
మొమొడౌ తాల్
కార్నెల్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న మొ మొడౌ తాల్(31) వీసాను ఇటీవలే అధికారులు రద్దు చేశారు. క్యాంపస్‌లో జరిగిన పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొనడమే ఇతడి తప్పు. యూకే, గాంబియా పౌరసత్వాలున్న మొమొడౌ తనను అక్రమంగా నిర్బంధించారంటూ కోర్టులో సవాల్ చేశాడు. ప్రభుత్వ చర్యలు చట్టబద్ధమేనని కోర్టు ప్రకటిస్తే ఇమిగ్రేషన్ అధికారుల ఎదుట లొంగిపోతానని ఇతడు అంటున్నాడు.