రమేశ్ ప్రసాద్
తెలుగు సినిమా బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగు సినిమా స్థాయి పెరగడానికి కృషి చేసిన దర్శక– నిర్మాతల్లో ఎల్వీప్రసాద్ ప్రముఖులు. తెలుగు, హిందీ, తమిళ తొలి టాకీ సినిమాల్లో నటించిన అరుదైన రికార్డ్ ఆయనదే. దర్శకుడిగా ‘మన దేశం, సంసారం మిస్సమ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా ‘ఇలవేలుపు, ఇల్లాలు’ వంటి చిత్రాలు నిర్మించారు. నేడు ఎల్వీ ప్రసాద్ 111వ జయంతి. ఈ సందర్భంగా తండ్రికి ఎల్వీ ప్రసాద్ ప్రయాణాన్ని పంచుకున్నారు ఆయన తనయుడు, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత, నిర్మాత రమేశ్ ప్రసాద్.
‘‘మా నాన్నగారి ప్రయాణాన్ని తలచుకున్నప్పుడుల్లా నాకు గుర్తొచ్చేది నాలుగు విషయాలు. ప్రిసర్వెన్స్(పట్టుదల), ప్యూరిటీ ఆఫ్ థాట్స్ (కల్మషం లేని ఆలోచనలు), ప్యాషన్ (తపన), పేషన్స్ (ఓపిక). చదువు లేకపోయినా ఆయన అనుకున్నది సాధించారు. చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. వ్యవసాయంలో మా తాతగారికి ఊహించలేనంత నష్టం వాటిల్లింది. దాంతో మా నాన్నగారు ఎవరికీ చెప్పకుండా కేవలం 100 రూపాయిలతో ముంబై వెళ్లిపోయారు. అప్పు తీర్చలేక పారిపోయారని అందరూ అనుకున్నారట.
కానీ సినిమాల మీద ఆసక్తితో ముంబై చేరుకొని అక్కడ వాచ్‌మెన్‌గా ఉద్యోగం సంపాదించారు. హిందీ రాకపోయినా కేవలం సైగలతో సంభాషించేవారని తర్వాతి రోజుల్లో నాన్నగారు చెబితే మాకు తెలిసింది. ఓ టైలర్ షాప్‌ను శుభ్రం చేసే పని కూడా చేశారాయన. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే విషయానికి మా నాన్నగారు ఓ చక్కని ఉదాహరణ. నాన్నగారి తపనను గమనించిన టైలర్ ఆయన సినిమాల్లోకి వెళ్లడానికి తన వంతు సహాయం చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోయాక 16 నెలలకు ‘నేను బావున్నాను. సినిమాల్లో పని చేస్తున్నాను’ అంటూ ఇంటికి ఉత్తరం రాశారు.
వాచ్‌మేన్‌గా పనిచేసిన థియేటర్ మరమత్తులు జరిగి, మళ్లీ నాన్నగారి సినిమాతోనే ప్రారంభం అయింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కమల్ హాసన్‌తో ఈ విషయాన్ని పంచుకున్నారు నాన్నగారు. మా నాన్నగారు తీసిన సినిమాల్లో ‘బిదాయి’ అనే సినిమా అంటే నాకు ఇష్టం. వాస్తవానికి నాన్నగారి గురించి వినడం తప్పితే ఎక్కువగా ఆయనతో గడిపింది లేదు. ఆయన షూటింగ్స్‌తో అంత బిజీగా ఉండేవారు. తనను ఇంతవాణ్ని చేసిన ప్రేక్షకులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ స్థాపించారు.
సినిమాకు తిరిగివ్వాలని ప్రసాద్ ల్యాబ్స్ స్థాపించారు. కెమెరా అంటే నాకు కొంచెం ఇబ్బంది. అందుకే సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. ‘సంసారం’లో చిన్న పాత్రను పోషించాను. ‘మీ నాన్నగారి బయోపిక్ తీస్తారా?’ అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఏమీ అనుకోలేదు. మా ప్రొడక్షన్‌లో రెండు సినిమాలు తీశాం. అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. మరో సినిమా తీయాడానికి చర్చలు నడుస్తున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment