Ramesh Prasad
-
ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు
ప్రముఖ నటుడు కృష్ణంరాజు గత ఆదివారం (11న) కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆయన సంతాప సభలో కృష్ణంరాజు కుమార్తె ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి పాల్గొన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజుగారు, నేను, చంద్ర మోహన్ ఆర్నెల్ల పాటు చెన్నైలో ఒకే రూమ్‌లో ఉన్నాం. మా అన్నయ్య కృష్ణగారితో ఎంత స్వంతంత్రంగా ఉండేవాణ్ణో కృష్ణంరాజుగారితో కూడా అలాగే ఉండేవాణ్ణి. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు’’ అన్నారు. నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజుగారు లేని బాధ ఆయన కుటుంబానికే కాదు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లకి కూడా ఉంటుంది. నన్ను తొలిసారి బెంజి కారులో ఎక్కించింది కృష్ణంరాజుగారు, ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు’’ అన్నారు. నిర్మాత రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చెన్నైలో ఉన్నప్పటి నుంచి నేను, కృష్ణంరాజు ఫ్రెండ్స్. మా తండ్రిగారికి (ఎల్వీ ప్రసాద్) కూడా కృష్ణంరాజు అంటే చాలా ఇష్టం’’ అన్నారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నిజం చెప్పాలంటే ఇక్కడ మాట్లాడటానికి సిగ్గు పడే పరిస్థితుల్లో ఉన్నాను. మూడేళ్ల క్రితం ఆయన మూవీ టవర్స్‌కి వచ్చి మార్కెట్ ధరకు ఫ్లాట్ కొనుక్కుంటానని అడిగారు.. కారణాలేవైనా ఫ్లాట్ ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇండస్ట్రీలో పెట్టే ఏ అసోసియేషన్స్ అయినా కూడా మన సభ్యుల మంచి కోసం పెడతాం.. కానీ వ్యాపారం చేయాలనుకుంటే అంతకంటే మనం సిగ్గుపడాల్సిన విషయం ఉండదు’’ అన్నారు. నటుడు బాబూమోహన్ మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజు అన్నగారి ‘పాపే నా ప్రాణం’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. 24క్రాఫ్ట్స్‌లో ఆయన గురించి ఎవరూ చెడ్డగా మాట్లాడలేదు’’ అన్నారు. ‘తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు బసిరెడ్డి, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘డైరెక్టర్స్ అసోసియేషన్’ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి.కల్యాణ్, నటి జీవితతో పాటు పలువురు దర్శక–నిర్మాతలు, నటీనటులు, టీఎఫ్జేఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
మూడు సినిమాలకు శ్రీకారం
‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేష¯Œ అండ్ గేమింగ్ కాలేజీ’ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి మూడు కొత్త చిత్రాలను ప్రకటించారు. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్ల లోపు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ కూడా నిర్వహిస్తున్న సురేష్‌రెడ్డి ‘పి19 ఎంటర్టై¯Œ మెంట్’ సంస్థను స్థాపించి, శుక్రవారం మూడు చిత్రాలను ప్రకటించారు. ఈ మూడు చిత్రాల ప్రీ లుక్స్, లోగోలను ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా తొలి చిత్రానికి ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’, ‘పేపర్ బోయ్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారు. రెండో సినిమాని ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ ఫేమ్ రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్ జామితో కలిసి నేను నిర్మిస్తాను. మూడో సినిమాకి దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తారు’’ అన్నారు. ఆర్థోపెడిక్స్ డాక్టర్ దశరథరామిరెడ్డి, నిర్మాతలు కె.ఎల్. దామోదర ప్రసాద్, రాజ్ కందుకూరి, జీ5 క్రియేటివ్ హెడ్ నిమ్మకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్వీ ప్రసాద్‌గారు ఎందరికో స్ఫూర్తి
‘‘ఎల్వీ ప్రసాద్‌గారి గురించి చెప్పడం అంటే సూరీడికి వెలుగు చూపించడమే. ఆయన ఒక వ్యవస్థ. సినిమా రంగంలో తనకు ఇష్టమైన అన్ని శాఖల్లోనూ ఆయన రాణించారు. ప్రసాద్ ల్యాబ్స్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అందుకే ఐ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. గతాన్ని ఎవరూ మర్చిపోకూడదు. భావి తరాలకు చెప్పాలి. ఎల్వీ ప్రసాద్‌గారి కలల్ని ఆయన తనయుడు సాకారం చేయడం ఆనందంగా ఉంది’’ అని హీరో బాలకృష్ణ అన్నారు. అక్కినేని లక్ష్మీ వరప్రసాద్(ఎల్వీ ప్రసాద్) 111వ జయంతిని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సీనియర్ నటి గీతాంజలి మాట్లాడుతూ– ‘‘నన్ను అందరూ సీతమ్మ అని పిలుస్తున్నారంటే కారణం పెద్దాయన ఎన్టీఆర్‌గారే. ‘సీతారామకల్యాణం’ తర్వాత నేను చేసిన సినిమా ‘ఇల్లాలు’. అప్పట్లో ఎల్వీ ప్రసాద్‌గారి మెప్పు పొందాను’’ అన్నారు. ఎల్వీ ప్రసాద్ తనయుడు రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నకి సినిమా తప్ప మరేమీ తెలియదు. నన్ను నటుణ్ని చేయాలన్నది ఆయన కోరిక. అయితే ఓ సారి ‘సంసారం’ సినిమా షూటింగ్లో అంత సేపు స్టూడియోలో కూర్చోవడం ఇష్టం లేక ఆయన్ని విసిగించాను. అప్పటి నుంచి నాకు యాక్టింగ్ మీద పెద్దగా ఆసక్తిలేదు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఈ రంగంలోకి వచ్చాను’’ అన్నారు. ‘‘ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్... ఇద్దరూ మహావృక్షాలు. తాము సంపాదించినదాన్ని సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టారు. వారి వారసత్వాన్ని వారి పిల్లలు కొనసాగిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్‌గారి మీద ఆయన తనయుడు రమేష్ ప్రసాద్‌గారు ఓ మంచి బయోపిక్ తీయాలి’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. -
‘ఆయన ఎంతో మందికి స్ఫూర్తి’
అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ 111వ జయంతి ఉత్సవం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వైవీయస్ చౌదరి మాట్లాడుతూ.. ‘ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్ ఇద్దరూ మహావృక్షాలు. సినిమా రంగం పట్ల వ్యామోహాన్ని పెంచుకున్నారు. సినిమా రంగంలోనే తాము సంపాదించినదాన్ని ఇన్వెస్ట్ చేశారు. వారి వారసత్వాన్ని వారి పిల్లలు కొనసాగిస్తున్నారు. నా లాహిరిలాహిరి లాహిరిలో సినిమా సమయంలో నేను ప్రసాద్ ల్యాబ్స్ కు 8.75లక్షలు కట్టాల్సి ఉన్నప్పటికీ నాకు రమేష్ ప్రసాద్‌గారు సాయం చేశారు. అలాగే `రేయ్` కూడా ఆయన ఆశీస్సులతోనే విడుదలైంది. ఇక.. నందమూరి బాలకృష్ణ తండ్రి మీద బయోపిక్ తీసి అందరి మెప్పు పొందారు. అదేవిధంగా ఎల్వీ ప్రసాద్‌గారి మీద ఆయన తనయుడు ఓ మంచి బయోపిక్ తీయాల’న్నారు. ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ప్రతినిధి సురేష్ కొవ్వూరి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. త్వరలోనే ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నాం. ఎల్వీ ప్రసాద్‌గారి జీవితంలోని విషయాలను ప్రతి ఒక్కరూ తలా రెండు పేజీలు చదివి ఆచరించినా చాలు’ అని చెప్పారు. రమేష్ ప్రసాద్ తనయ రాధాప్రసాద్ మాట్లాడుతూ ‘మా తాతగారి గురించి ఏవీ చూసి థ్రిల్ అయ్యాను. మా పూర్వీకుల విలువలని, వాళ్ల ఆలోచనలని గౌరవించి, కొనసాగిస్తాం. మా నాన్నగారు ముందుండి తాతగారి బయోపిక్ తీయాలని ఆలోచిస్తున్నాం’ అని అన్నారు. రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ‘మా నాన్న సినిమా వ్యక్తి. ఆయనకు సినిమా తప్ప మరేమీ తెలియదు. ఇంట్లో వాళ్లని కూడా ఎక్కువగా కలిసేవారు కాదు. ఒక స్టూడియో నుంచి మరో స్టూడియోకి వెళ్లే దారిలో ఆయన రెస్ట్ తీసుకునేవారు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఈ రంగంలోకి వచ్చాను. మా ప్రసాద్ ప్రాసెసింగ్ ల్యాబ్‌కి 17 సార్లు జాతీయ పురస్కారం దక్కింది. మా నాన్నకు పృథ్విరాజ్‌కపూర్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్లలాగా మా కుటుంబం కూడా సినిమాల్లోనే ఉండాలని కోరుకునేవార’ని తెలిపారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘భారత సినీ రంగంలో ఎల్వీ ప్రసాద్‌గారి గురించి చెప్పడం అంటే సూరీడికి వెలుగు చూపించడమే. ఆయన ఒక వ్యవస్థ. నటుడు కావాలనుకున్నారు. అలాగే నటించారు. దర్శకుడిగా మారారు. ఆయన సినిమా రంగంలో తనకు ఇష్టమైన అన్ని శాఖల్లోనూ కృషి చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఐ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఎల్వీ ప్రసాద్‌గారి కలల్ని ఆయన తనయుడు సాకారం చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
నాన్న జర్నీ నుంచి ఆ నాలుగు విషయాలు నేర్చుకోవాలి
తెలుగు సినిమా బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగు సినిమా స్థాయి పెరగడానికి కృషి చేసిన దర్శక– నిర్మాతల్లో ఎల్వీప్రసాద్ ప్రముఖులు. తెలుగు, హిందీ, తమిళ తొలి టాకీ సినిమాల్లో నటించిన అరుదైన రికార్డ్ ఆయనదే. దర్శకుడిగా ‘మన దేశం, సంసారం మిస్సమ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా ‘ఇలవేలుపు, ఇల్లాలు’ వంటి చిత్రాలు నిర్మించారు. నేడు ఎల్వీ ప్రసాద్ 111వ జయంతి. ఈ సందర్భంగా తండ్రికి ఎల్వీ ప్రసాద్ ప్రయాణాన్ని పంచుకున్నారు ఆయన తనయుడు, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత, నిర్మాత రమేశ్ ప్రసాద్. ‘‘మా నాన్నగారి ప్రయాణాన్ని తలచుకున్నప్పుడుల్లా నాకు గుర్తొచ్చేది నాలుగు విషయాలు. ప్రిసర్వెన్స్(పట్టుదల), ప్యూరిటీ ఆఫ్ థాట్స్ (కల్మషం లేని ఆలోచనలు), ప్యాషన్ (తపన), పేషన్స్ (ఓపిక). చదువు లేకపోయినా ఆయన అనుకున్నది సాధించారు. చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. వ్యవసాయంలో మా తాతగారికి ఊహించలేనంత నష్టం వాటిల్లింది. దాంతో మా నాన్నగారు ఎవరికీ చెప్పకుండా కేవలం 100 రూపాయిలతో ముంబై వెళ్లిపోయారు. అప్పు తీర్చలేక పారిపోయారని అందరూ అనుకున్నారట. కానీ సినిమాల మీద ఆసక్తితో ముంబై చేరుకొని అక్కడ వాచ్‌మెన్‌గా ఉద్యోగం సంపాదించారు. హిందీ రాకపోయినా కేవలం సైగలతో సంభాషించేవారని తర్వాతి రోజుల్లో నాన్నగారు చెబితే మాకు తెలిసింది. ఓ టైలర్ షాప్‌ను శుభ్రం చేసే పని కూడా చేశారాయన. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే విషయానికి మా నాన్నగారు ఓ చక్కని ఉదాహరణ. నాన్నగారి తపనను గమనించిన టైలర్ ఆయన సినిమాల్లోకి వెళ్లడానికి తన వంతు సహాయం చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోయాక 16 నెలలకు ‘నేను బావున్నాను. సినిమాల్లో పని చేస్తున్నాను’ అంటూ ఇంటికి ఉత్తరం రాశారు. వాచ్‌మేన్‌గా పనిచేసిన థియేటర్ మరమత్తులు జరిగి, మళ్లీ నాన్నగారి సినిమాతోనే ప్రారంభం అయింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కమల్ హాసన్‌తో ఈ విషయాన్ని పంచుకున్నారు నాన్నగారు. మా నాన్నగారు తీసిన సినిమాల్లో ‘బిదాయి’ అనే సినిమా అంటే నాకు ఇష్టం. వాస్తవానికి నాన్నగారి గురించి వినడం తప్పితే ఎక్కువగా ఆయనతో గడిపింది లేదు. ఆయన షూటింగ్స్‌తో అంత బిజీగా ఉండేవారు. తనను ఇంతవాణ్ని చేసిన ప్రేక్షకులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. సినిమాకు తిరిగివ్వాలని ప్రసాద్ ల్యాబ్స్ స్థాపించారు. కెమెరా అంటే నాకు కొంచెం ఇబ్బంది. అందుకే సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. ‘సంసారం’లో చిన్న పాత్రను పోషించాను. ‘మీ నాన్నగారి బయోపిక్ తీస్తారా?’ అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఏమీ అనుకోలేదు. మా ప్రొడక్షన్లో రెండు సినిమాలు తీశాం. అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. మరో సినిమా తీయాడానికి చర్చలు నడుస్తున్నాయి’’ అన్నారు. -
వినోదమే వినోదం
‘‘మా నాన్న (ఎల్వీ ప్రసాద్) పెద్ద భూస్వామి అయినా సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయారు. నెమ్మదిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. దర్శకుడిగా ఎదిగారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సిల్వర్ జూబ్లీ సినిమాలు చాలా తీసింది. సకుటుంబంగా చూడదగ్గ కుటుంబ విలువలున్న సినిమాలు చాలా తీశాం’’ అన్నారు రమేశ్ ప్రసాద్. ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో వరం జయత్ కుమార్ నిర్మించారు. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్న సినిమాలపై తప్ప దేనిపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చేవారు కాదు. అందరికీ మా ప్రసాద్ ప్రొడక్షన్స్ గురించి తెలుసు. మా ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’లో 50 శాతం మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఐశ్వర్యాభిమస్తు’ సినిమాను దసరాకు విడుదల చేస్తు న్నాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరం జయత్ కుమార్. ‘‘నిర్మాత జయంత్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చి పెడుతుంది’’ అన్నారు కె.ఇ. జ్ఞానవేల్ రాజా. ‘‘చక్కని హిలేరియస్ ఎంటర్టైనర్. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని ఆర్య అన్నారు. -
బుల్లెట్ లాంటి పాత్రలో బాలయ్య
బాలకృష్ణ... తన 98వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ అనే కొత్త దర్శకునికి ఆయన అవకాశం ఇవ్వడం విశేషం. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన తొలిసారి త్రిష కథానాయికగా నటించనుండటం మరో విశేషం. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. కె.రాఘవేంద్రరావు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి రమేశ్‌ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి క్లాప్ ఇచ్చారు. బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సత్యదేవ్ మాట్లాడుతూ - ‘‘బాలకృష్ణ గారి కోసమే తయారు చేసుకున్న కథ ఇది. మూడేళ్ల క్రితమే ఈ కథను సిద్ధం చేసుకున్నాను. నా ఆకాంక్షను నిజం చేస్తూ ఈ కథకు ఆయనే నాయకుడు కావడం ఆనందంగా ఉంది. గన్ నుంచి బయటకొచ్చిన బుల్లెట్ ఎంత శక్తిమంతంగా, ఫోర్స్‌గా ఉంటుందో ఇందులో బాలయ్య పాత్ర అంత శక్తిమంతంగా ఉంటుంది. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకాడని పాత్ర అయనది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, కుటుంబ విలువలు అన్నీ సమపాళ్లలో ఉండే కథ ఇది. ‘లెజెండ్’ లాంటి సూపర్‌హిట్ తర్వాత, అందునా బాలయ్యగారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే.. నా సినిమానే చేయడం చాలా గర్వంగా ఉంది. నన్ను, కథను నమ్మి ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ని భుజాలపై వేసుకున్న నిర్మాతకు ముఖ్యంగా నా కృతజ్ఞతలు. బాలకృష్ణగారు ఇప్పుడు ప్రజానాయకుడు కూడా కాబట్టి, ఆయన వెసులుబాటును బట్టే ఈ చిత్రం షెడ్యూల్స్ ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘బాలకృష్ణగారి సినిమాకు నిర్మాతను కావడం గర్వంగా ఉంది. బాలకృష్ణగారికి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. హిట్ ఆల్బమ్ ఇవ్వలేకపోతే... మ్యూజిక్ డెరైక్షన్ చేయడమే వదులుకుంటానని ఛాలెంజ్ చేసి మరీ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అద్భుతమైన మూడు ట్యూన్స్‌ని రెడీ చేశారు కూడా. అలీ కామెడీ ఈ చిత్రానికి మరో హైలైట్’’ అని చెప్పారు. కేవలం కథను నమ్మి కొత్తవారైనా సత్యదేవ్‌కి బాలయ్య ఈ అవకాశం ఇచ్చారని, బాలకృష్ణగారి కెరీర్లో ఇదో కలికితురాయిలా నిలిచిపోవాలని అలీ ఆకాంక్షించారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత. -
వైఎస్ఆర్సీపీ - టీడీపీ
ఇరుపార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం చిత్తూరు (కొంగారెడ్డిపల్లె), న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం చిత్తూరులో బంద్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. చంద్రబాబును విమర్శిస్తారా అంటూ టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను పక్కకులాగి పంపేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రచార వాహనంలో వైఎస్ఆర్సీపీ నగర ప్రచార కార్యదర్శి రమేష్‌ప్రసాద్, కార్యకర్తలు గాంధీ సర్కిల్ నుంచి గిరింపేట వైపు బయలుదేరారు. జనతా బజారు వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాఫిక్ సైన్ బోర్డును రమేష్‌ప్రసాద్ తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న టీడీపీ నేతలు దుర్భాషలాడుతూ రమేష్‌ప్రసాద్, జీపు డ్రైవర్ సురేష్, కార్యకర్తలపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు కర్రలు విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి రెండు పార్టీల వారిని చెదరగొట్టారు. దీంతో నగరంలో కొన్ని గంటల సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణపై వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులు వేర్వేరుగా డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, సీఐ సాధిక్ అలీకి ఫిర్యాదు చేశారు. ఈ గొడవలో తమపై టీడీపీ నాయకులు అనవసరంగా దాడి చేసి కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారని రమేష్ ప్రసాద్, సురేష్ ఫిర్యాదు చేశారు.