బుల్లెట్ లాంటి పాత్రలో బాలయ్య
బాలకృష్ణ... తన 98వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ అనే కొత్త దర్శకునికి ఆయన అవకాశం ఇవ్వడం విశేషం. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన తొలిసారి త్రిష కథానాయికగా నటించనుండటం మరో విశేషం. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. కె.రాఘవేంద్రరావు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి రమేశ్‌ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి క్లాప్ ఇచ్చారు. బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సత్యదేవ్ మాట్లాడుతూ - ‘‘బాలకృష్ణ గారి కోసమే తయారు చేసుకున్న కథ ఇది.
మూడేళ్ల క్రితమే ఈ కథను సిద్ధం చేసుకున్నాను. నా ఆకాంక్షను నిజం చేస్తూ ఈ కథకు ఆయనే నాయకుడు కావడం ఆనందంగా ఉంది. గన్ నుంచి బయటకొచ్చిన బుల్లెట్ ఎంత శక్తిమంతంగా, ఫోర్స్‌గా ఉంటుందో ఇందులో బాలయ్య పాత్ర అంత శక్తిమంతంగా ఉంటుంది. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకాడని పాత్ర అయనది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, కుటుంబ విలువలు అన్నీ సమపాళ్లలో ఉండే కథ ఇది. ‘లెజెండ్’ లాంటి సూపర్‌హిట్ తర్వాత, అందునా బాలయ్యగారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే.. నా సినిమానే చేయడం చాలా గర్వంగా ఉంది.
నన్ను, కథను నమ్మి ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ని భుజాలపై వేసుకున్న నిర్మాతకు ముఖ్యంగా నా కృతజ్ఞతలు. బాలకృష్ణగారు ఇప్పుడు ప్రజానాయకుడు కూడా కాబట్టి, ఆయన వెసులుబాటును బట్టే ఈ చిత్రం షెడ్యూల్స్ ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘బాలకృష్ణగారి సినిమాకు నిర్మాతను కావడం గర్వంగా ఉంది. బాలకృష్ణగారికి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. హిట్ ఆల్బమ్ ఇవ్వలేకపోతే... మ్యూజిక్ డెరైక్షన్ చేయడమే వదులుకుంటానని ఛాలెంజ్ చేసి మరీ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే అద్భుతమైన మూడు ట్యూన్స్‌ని రెడీ చేశారు కూడా. అలీ కామెడీ ఈ చిత్రానికి మరో హైలైట్’’ అని చెప్పారు. కేవలం కథను నమ్మి కొత్తవారైనా సత్యదేవ్‌కి బాలయ్య ఈ అవకాశం ఇచ్చారని, బాలకృష్ణగారి కెరీర్‌లో ఇదో కలికితురాయిలా నిలిచిపోవాలని అలీ ఆకాంక్షించారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.