వైఎస్‌ఆర్‌సీపీ - టీడీపీ
- ఇరుపార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ
- చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం
చిత్తూరు (కొంగారెడ్డిపల్లె), న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం చిత్తూరులో బంద్ నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. చంద్రబాబును విమర్శిస్తారా అంటూ టీడీపీ శ్రేణులు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు.
అక్కడే ఉన్న పోలీసులు ఇరుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను పక్కకులాగి పంపేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రచార వాహనంలో వైఎస్‌ఆర్‌సీపీ నగర ప్రచార కార్యదర్శి రమేష్‌ప్రసాద్, కార్యకర్తలు గాంధీ సర్కిల్ నుంచి గిరింపేట వైపు బయలుదేరారు. జనతా బజారు వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాఫిక్ సైన్ బోర్డును రమేష్‌ప్రసాద్ తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న టీడీపీ నేతలు దుర్భాషలాడుతూ రమేష్‌ప్రసాద్, జీపు డ్రైవర్ సురేష్, కార్యకర్తలపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు కర్రలు విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి రెండు పార్టీల వారిని చెదరగొట్టారు. దీంతో నగరంలో కొన్ని గంటల సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణపై వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నాయకులు వేర్వేరుగా డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, సీఐ సాధిక్ అలీకి ఫిర్యాదు చేశారు. ఈ గొడవలో తమపై టీడీపీ నాయకులు అనవసరంగా దాడి చేసి కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారని రమేష్ ప్రసాద్, సురేష్ ఫిర్యాదు చేశారు.