పాక్ బాలిక కంటికి శస్త్రచికిత్స విజయవంతం
జూబ్లీహిల్స్ (హైదరాబాద్): కంటి కేన్సర్తో బాధపడుతున్న ఓ పాకిస్తాన్ బాలికకు నగరంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. బుధవారం ఆ బాలికను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి కన్సల్టెంట్ ఆక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్వాతి మాట్లాడుతూ... గత దశాబ్ద కాలంలో 1,500కు పైగా రెటినో బ్లాస్టోమా (కంటి కేన్సర్ ) శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 8,000 కేసులు నమోదు అవుతుండగా మన దేశంలో దాదాపు 1,000 రెటీనా బ్లాస్టోమా కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు వారికి ఎక్కువగా వచ్చే ఈ వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చన్నారు.