
హావేరిలో ప్రియురాలిని చంపిన ప్రియుడు
పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
హుబ్లీ: మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని యువతి ప్రాణాలను ప్రేమ పేరుతో ఓ యువకుడు పొట్టన బెట్టుకున్నాడు. హావేరి జిల్లా రాణిబెన్నూరు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతి హత్యకు గురి కాగా ఈ కేసులో ముగ్గురు నిందితులను అనుమానిస్తుండగా, ప్రధాన నిందితుడు నయాజ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గురైన యువతిని రత్తిహళ్లి మసూరు గ్రామానికి చెందిన స్వాతి రమేష్ బ్యాడగి(22)గా గుర్తించారు.
ఈ నెల 6న యువతి మృతదేహాన్ని రాణిబెన్నూరు తాలూకా పత్తెపుర గ్రామం వద్ద తుంగభద్ర నది సమీపంలో కనుగొన్నారు. ముందుగా గుర్తు తెలియని యువతి శవంగా భావించిన హలగేరి పోలీసులు వారసుదారులు లేని నేపథ్యంలో పోస్టుమార్టం నిర్వహించి చట్టప్రకారం స్వాతి శవాన్ని పూడ్చిపెట్టారు. పోస్టుమార్టంలో స్వాతి హత్యకు గురైనట్లు ధ్రువ పడింది.
దీంతో దర్యాప్తు చేపట్టిన హలగేరి పోలీసులు ఈ నెల 3న కనిపించకుండా పోయిన యువతి ఆచూకీని కనుగొన్నారు. ఈ క్రమంలో స్వాతి తల్లి హిరేకెరూరు పోలీస్ స్టేషన్‌లో తమ కుమార్తె కనిపించలేదని ఫిర్యాదు చేసినట్లుగా తెలుసుకున్నారు. స్వాతి తండ్రి మృతి చెందగా, తల్లితో పాటు యువతి నివసిస్తోంది. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా అనుమానిస్తున్నారు. దర్యాప్తు చురుగ్గా చేపట్టినట్లు హలగేరి పోలీసులు తెలిపారు. కాగా హిందూ సంఘాలు సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ స్వాతి అభియాన్‌ను ప్రారంభించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment