Eye cancer
-
ఫోన్ కెమెరా ఫ్లాష్‌తో కొడుకుని కాపాడుకున్న తల్లి!
ఓ మహిళ ముక్కు పచ్చలారని మూడు నెలల శిశువుని ఫోన్ కెమెరా ఫ్లాష్‌తో ఫోటో తీసింది. ఏమైందో ఏమో ఏదో అర్థం కానిమెరుపు శిశువు కంటిలో కనపించింది. ఏంటిదీ అని ఆశ్చర్యపోయింది. లాభం లేదనుకుని పలు రకాలుగా ఫోటోలు తీసి ప్రయత్నించింది. అయితే ఏదో తెల్లటి వెలుగులా కనిపిస్తుంది ఫోటోలా. చెప్పాలంటే పిల్లి కన్ను మాదిరిగా ఉంది. ఏం చేయాలో తోచక గూగుల్‌లో సర్చ్ చేసింది. ఏదో తెలియన ఆందోళనతో వైద్యులను కూడా కలిసింది. అప్పుడే పిడుగలాంటి ఈ విషయం విని హుతాశురాలయ్యింది ఆ తల్లి. ఏమయ్యిందంటే.. లండన్‌లోని ఓ మహిళ తన ఫోన్లోని కెమెరాలోని ఫ్లాష్‌ని ఉపయోగించి తన మూడు నెలల బిడ్డను పోటోలు తీసింది. ఆ ఫోటోల్లో బిడ్డ కంటిలో ఏదో మెరుపు కనిపించేది. ఏంటిదీ అని ఆమె వేర్వేరు వెలుగుల్లో ఉంచి పలు రకాలుగా పోటోలు తీసిన అలాంటి వెలుగు కనిపించేది. అది పిల్లి కన్నులా ప్రతిబింబించేది.ఇదేంటన్నది అర్థం గాక గూగుల్ సెర్చ్‌లో వెదికింది. తీరా అక్కడ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చన్న సంకేతాలు చూపింది. దీంతో ఆందోళనకు గురయ్యిన ఆమె వెంటనే మెడ్వే ఆస్పత్రిని సంప్రదించింది. అక్కడ వైద్యులు ఆ శిశువు పలు వైద్య పరీక్షల చేసి..ఆ చిన్నారి అరుదైన కంటి కేన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీంతో హుతాశురాలైన ఆమె తన బిడ్డ థామస్‌ను రాయల్ లండన్ ఆసుపత్రికి తరలించి తక్షణమే చికిత్స అందించింది. అతను నవంబర్ 2022 నుంచి ఆరు రౌండ్ల కీమోథెరపీని చేయించుకున్నాడు. చివరికి సెప్సిస్‌తో పోరాడిన తదనంతరం మరో చివరి రౌండ్ కీమోథెరపీని ఏప్రిల్ 2023లో ముగించాడు. మేలో క్యాన్సర్ రహితంమని ప్రకటించడంతో ఆ తల్లి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. కంటి కేన్సర్ అంటే.. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం, రెటినోబ్లాస్టోమా అనేది అరుదైన కంటి క్యాన్సర్. ఇది చిన్న పిల్లలను ప్రభావితం చేసే వ్యాధి. ఎక్కువగా మూడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఒకటి లేదా రెండు కళ్లలో ఉండొచ్చు లేదా కంటి వెనుక భాగాన్ని (రెటీనా) ప్రభావితం చేస్తుంది. రెటినోబ్లాస్టోమా సాధారణ సంకేతమే ఈ తెల్లటి మెరుపు. ఇది కొన్ని లైట్లలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఇది మెల్లకన్ను, కంటి రూపాన్ని మార్చడం లేదా వాపు వంటి లక్షణాలను కూడా చూపిస్తుంది. వీటిలో ఏదో ఒక లక్షణం మాత్రం కచ్చితంగా ఉంటుంది. దాన్ని గమనించి త్వరితగతిన వైద్యులను సంప్రదిస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉండదు. (చదవండి: 50 నిమిషాల పాటు చనిపోయాడు..ఏకంగా 17 సార్లు షాక్, అంతా అయిపోయిందనేలోపు..) -
చిన్నారి కుటుంబానికి సీఎం జగన్ ధైర్యం.. తక్షణ సాయం
సాక్షి, కృష్ణా: సాయం కోరితే చాలూ.. అప్పటికప్పుడే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలిగే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆ విషయంలో ఆయన మంచి మనసుకు అద్దం పట్టే సందర్భాలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా విజయవాడలోనూ ఓ నిరుపేద కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. ఆ ఇంటి బిడ్డకు చికిత్స కోసం తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. శ్రీనివాసరావు-కల్లగుంట శ్యామలాదేవి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు ఓ పాప ఉంది. అయితే 14 నెలల ఆ చిన్నారినిక కంటి క్యాన్సర్ సోకింది. దీంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక భారం ఎక్కువైపోతుండడంతో సీఎంను కలిసి తమ వ్యథను వినిపించాలనుకున్నారు. ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతున్న సంగతి తెలిసి.. ఏ కన్వెన్షన్ హాల్‌కు వెళ్లారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో.. ఆయన దగ్గరుండి వాళ్లను సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. చిన్నారి స్థితి గురించి తెలుసుకున్న సీఎం జగన్ అధైర్య పడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన ప్రక్కనే వున్న ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టరు డా. పి సంపత్ కుమార్ కుమార్ ను తక్షణ ఆర్ధిక సహాయానికి ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో.. జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకుని రూ. లక్ష చెక్కును తక్షణ సాయం రూపంలో అందజేశారు. చిన్నారి చికిత్సకు ప్రభుత్వం తరపు నుంచి అవసరమైన సాయం అన్నివిధాల అందజేస్తామని హామీ ఇచ్చారు. -
ఆవు కంటికి క్యాన్సర్... శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
పెద్దతిప్పసముద్రం: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరుకు చెందిన బుడ్డాబాబు అనే రైతుకు చెందిన పాడి ఆవు కంటికి క్యాన్సర్ సోకడంతో పశువైద్య నిపుణులు గురువారం శస్త్రచికిత్స చేశారు. తన ఆవుకు మూడు నెలల కిందట కంటి భాగంలో గాయం కావడంతో స్థానిక పశు వైద్యశాలలో బుడ్డా బాబు పరీక్షలు చేయించాడు. కంటికి గ్రోత్ క్యాన్సర్ సోకినట్లు డాక్టర్ రమేష్ నిర్ధారించారు. ఆ తర్వాత ఆవు కంట్లోని గాయం గడ్డలా మారి చూపు పూర్తిగా మందగించింది. క్యాన్సర్ మెదడుకు సోకకుండా ఉండేందుకు డాక్టర్ రమేష్ ప్రత్యేక చొరవ తీసుకుని పెద్దమండ్యం మండలంలో పని చేసే వెటర్నరీ డాక్టర్ విక్రంరెడ్డి, మదనపల్లిలో పని చేస్తున్న ట్రైనీ డాక్టర్ లోకేష్‌లతో కలిసి ఆవుకు శస్త్ర చికిత్స నిర్వహించి కంటిలోని క్యాన్సర్ కణజాలాన్ని తొలగించారు. -
ముఖ్యమంత్రి చొరవ.. ఈ చిన్నారి హ్యాపీ..
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): కేరళలోని సాధారణ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి ముఖంలో వెలుగులు నింపేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయన్‌తో పాటు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శైలజ స్పందించిన తీరు కదిలించింది. కేరళనుంచి అంబులెన్స్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు వెళ్ళేందుకు అనుమతి పత్రాలు ఇప్పించడమే కాకుండా ఆ పాప ఆపరేషన్ అయ్యేంత వరకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులకు తగిన సూచనలు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే... కేరళ అలప్పుజకు చెందిన ఎలక్ట్రీషియన్ వినీత్ విజయన్–గోపిక దంపతుల కూతురు అన్విత(21నెలలు) కంటి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెటీనో బ్లాస్టోమా కీమో థెరపీ చికిత్స చేయించుకుంటోంది. చికిత్సలో భాగంగా బుధవారం ఆమెకు కీలకమైన ఇంట్రా ఆర్టీరియల్ కీమో థెరపి సైకిల్ చేయాల్సి ఉంది. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేరళ నుంచి హైదరాబాద్‌కు రావడం ఎంత కష్టమో తండ్రి వినీత్ సోషల్ మీడియాలో తన ఆవేదన వెల్లడించాడు. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖామంత్రి స్పందించారు. ఫేస్బుక్లో చిన్నారి ఎదుర్కొంటున్న బాధను చూసిన కేరళ సమాజం మొత్తం స్పందించింది. ప్రభుత్వం అంబులెన్స్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసి హైదరాబాద్ వెళ్ళేందుకు అనుమతిచ్చారు. బుధవారం చిన్నారికి ఈ వైద్య చికిత్స పూర్తి చేశారు. ఒక వేళ అనుకున్న సమయానికి పాపను తీసుకురాకపోతే ఇప్పటి వరకు తీసుకున్న చికిత్స మొత్తం వృథా అయ్యేదని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి కేన్సర్ సేవల అధిపతి డాక్టర్ స్వాతి కలిగి అన్నారు. (పిల్లలూ.. ఇంటర్నెట్తో జాగ్రత్త) -
కంటి కాన్సర్‌ను స్మార్ట్‌ఫోన్ పట్టిస్తుందట...
లండన్: చిన్న పిల్లల్లో వచ్చే అతి ప్రమాదకరమైన రెటినో బ్లాస్టోమా (కంటి క్యాన్సర్)ను స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా ఫ్లాష్ ద్వారా గుర్తు పట్టవచ్చట. ఐదేళ్లలోపు పిల్లల్లో వచ్చే అరుదైన, తీవ్రమైన క్యాన్సర్‌ను స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫ్లాష్ ద్వారా ఫోటో తీసినపుడు చాలా సులభంగా గుర్తించవచ్చని పిల్లల కంటి క్యాన్సర్ నివారణ కోసం పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో పేర్కొంది. బ్రిటిష్‌లోని చైల్డ్ ఐ క్యాన్సర్ ట్రస్ట్ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సంస్థ చీఫ్ జోయ్ ఫ్లెగేట్ తెలిపిన వివరాల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాతో ఫోటో తీసినపుడు, వ్యాధి సోకిన పిల్లల కంటిపాప చుట్టూ వెలుగుతో కూడిన తెల్లటి వలయం ఫోటోలో స్పష్టంగా కనపడుతుందన్నారు. కెమెరాలోని ఫ్లాష్ వ్యాధి సోకిన కంటిపాపపై పడినపుడు తరచుగా ఇలా కనపడుతుందన్నారు. అయితే ఇలా ఫ్లాష్ వచ్చిన అన్నిటినీ రెటినో బ్లాస్టోమా కేసులుగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు. ఈ సంస్థకు చెందిన బృందం ఈ పద్ధతిలో బ్రిటన్‌లోని నాలుగు సంవ్సతరాల పాపకు క్యాన్సర్ సోకినట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయడంతో పాప కోలుకుంటోందని ఈ బృందం తెలిపింది. తమ పరిశోధన ద్వారా భవిష్యత్తులో ఒక్క చిన్నారి కూడా ఈ మహమ్మారి బారిన పడి కంటి చూపును కోల్పోకూడదనేదే తమ లక్ష్యమని వారు తెలిపారు. -
పాక్ బాలిక కంటికి శస్త్రచికిత్స విజయవంతం
జూబ్లీహిల్స్ (హైదరాబాద్): కంటి కేన్సర్‌తో బాధపడుతున్న ఓ పాకిస్తాన్ బాలికకు నగరంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. బుధవారం ఆ బాలికను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి కన్సల్టెంట్ ఆక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్వాతి మాట్లాడుతూ... గత దశాబ్ద కాలంలో 1,500కు పైగా రెటినో బ్లాస్టోమా (కంటి కేన్సర్ ) శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 8,000 కేసులు నమోదు అవుతుండగా మన దేశంలో దాదాపు 1,000 రెటీనా బ్లాస్టోమా కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు వారికి ఎక్కువగా వచ్చే ఈ వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చన్నారు. -
ఆర్బీ... మహాప్రాణాంతకం
న్యూఢిల్లీ: బతికి ఉన్నందుకు.. ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నందుకు రాహుల్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అతనికి ఉన్నది ఒక్క కన్నే. అతని అక్క దురదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమెకు కంటి క్యాన్సర్ ఉందని చాలా ఆలస్యంగా గుర్తించగలిగారు తల్లిదండ్రులు. ఫలితం చివరికి ఆమె ప్రాణాలనే కోల్పోయింది. ‘రాహుల్‌కి ఎనిమిది నెలలప్పుడు... రెటినా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తేలింది. ఎయిమ్స్‌లోని ఆర్పీ సెంటర్లోని వైద్యులు అంతకుముందే హెచ్చరించి ఉన్నందువల్ల మేం చాలా జాగ్రత్తగా ఉన్నాం. కంటికి రెప్పలా కాపాడుకున్నాం’ అని అంటుంది ప్రస్తుతం క్యాన్‌కిడ్స్ స్వచ్ఛంద సంస్థ పేరెంట్ సపోర్ట్ గ్రూప్‌లో పనిచే స్తున్న రాహుల్ తల్లి కవిత. ప్రస్తుతం రాహుల్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రాహుల్‌లాగే సమస్యను తొందరగా గుర్తించడం, తల్లి జాగ్రత్తపడి నిఘా ఉంచడంవల్ల... ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆకాంక్ష కూడా ఇప్పుడు బతికి ఉంది. ప్రపంచాన్ని చూడగలుగుతోంది. పదో తరగతి చదువుతున్న ఆకాంక్షకు ఎనిమిది నెలలు ఉన్నప్పుడే కంటి క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించగలిగారు. టాటా మెమోరియల్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆమె తల్లి 42 ఏళ్ల అనిత కూడా కంటి క్యాన్సర్ నుంచి బయటపడ్డ విజేత. అనిత రెండేళ్ల వయసులో ఆమెకు కంటి క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారు. ‘కంటి క్యాన్సర్ అనువంశికంగా వచ్చే జబ్బు. మా కుటుంబంలో నా తరువాత నా కూతురికి వచ్చింది. ఇలా జరుగుతుందని మేం ముందే అనుమానించాం’ అని చెబుతుంది అనిత. రెటినోబ్లాస్టొమా (ఆర్బీ)... పిల్లల్లో చిన్నతనంలోనే అంటే ఐదేళ్లలోపే వచ్చే కంటి క్యాన్సర్. ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ రెటినాలో వృద్ధి చెందుతుంది. పలుచని, సున్నితమైన పొరలాగా కంటి వెనుక కనిపించే ఇది ఒక్కోసారి ఏ రంగూ లేకుండా, కొన్నిసార్లు రంగుల్లో కనపడుతుంది. బాల్యంలో వచ్చే ఇతర క్యాన్సర్స్‌లాగే ఇది కొన్నిసార్లు అనువంశికంగా కూడా వస్తుంది. మే 12 నుంచి 19 వరకు రెటినోబ్లాస్టొమా అవేర్నెస్ వీక్ సందర్భంగా దేశవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చిన్నపిల్లల్లో కంటి క్యాన్సర్‌పై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ క్యాన్ కిడ్స్ సంస్థ చైర్పర్సన్ పూనమ్ బాగై తెలిపారు. మే 26 వరకూ ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. సజీవ్ క్యాన్‌కిడ్స్ రెటినోబ్లాస్టొమా ప్రాజెక్టు కింద నిర్వహించే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం పిల్లలకు చిన్నతనంలోనే వచ్చే ఈ కంటి క్యాన్సర్‌ను త ్వరగా గుర్తించడం, చికిత్స అందించడంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం. ఆర్బీ సెంటర్లతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం భారతీయులను ఆర్బీ నుంచి బయటపడేయడం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ క్యాన్సర్‌నుంచి బయటపడుతున్నవారి సంఖ్య 90 నుంచి 95 శాతం ఉండగా మన దేశంలో కేవలం 50 శాతమే. ‘ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి పిల్లలది ఒక్క ఫ్లాష్ ఫొటో తీయిస్తే చాలు. ఫొటోలో కంటిలోపల తెల్లగా మెరిసే ప్రాంతం కనిపించినట్టయితే ఆ పిల్లలు ఆర్బీతో బాధపడుతున్నట్టే’ అని ఎన్జీవో ఆఫీసర్, క్యాన్సర్ నుంచి బయటపడ్డ కపిల్ చావ్లా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 9000 ఆర్బీ కేసులు నమోదవుతున్నాయని, పుట్టిన పదివేల మందిలో ఒక్కరికి ఈ క్యాన్సర్ ఉంటోందని క్యాన్‌కిడ్స్ అడ్వైజర్, హైదరాబాద్‌లోని సైట్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రిలో నేత్రవ్యాధుల డెరైక్టర్ సంతోష్ జి హోన్వార్ తెలిపారు. భారతదేశంలో ప్రతి ఏటా 2.6 కోట్ల మంది జన్మిస్తున్నారు. దీని ప్రకారం భారతదేశంలో 2,500 నుంచి 2,600 ఆర్బీ కేసులు నమోదవుతున్నట్టు అంచనా. దేశవ్యాప్తంగా 15 రెటినోబ్లాస్టొమా చికిత్స కేంద్రాలుండగా అందులో హైదరాబాద్‌లో రెండు ఉన్నాయి. ఒకటి ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కాగా, సెంటర్ ఫర్ సైట్ రెండోది. తమ అవగాహనా కార్యక్రమంతో జమ్మూకాశ్మీర్‌లోని ఓ బాబును కంటి క్యాన్సర్ నుంచి కాపాడామని పూనమ్ గుర్తు చేసుకున్నారు. ‘కంటి క్యాన్సర్‌ను గుర్తించడమెలా అనే ఓ వీడియోను మేం యూట్యూబ్‌లో ఉంచాం. అది చూసిన ఒక జమ్మూకాశ్మీర్ కుటుంబం తమ చిన్నారికి క్యాన్సర్ ఉందని గుర్తించి చికిత్స కోసం మమ్మల్ని స్పందించారు. మా స్వచ్ఛంద సంస్థలోని పేరెంట్ సపోర్ట్ గ్రూప్ వాళ్లను ఎయిమ్స్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయిం చింది. ఆ అబ్బాయిలో డెవలప్మెంట్ చూసి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అని పూనమ్ చెప్పారు. తమ పిల్లలను కంటి క్యాన్సర్‌నుంచి బయటపడేసిన తల్లిదండ్రులు అలా ఉండిపోకుండా తమ పీఎస్ గ్రూప్స్‌లో చేరి ఇతరులకు తోడ్పడుతున్నారని ఆమె తెలిపారు. అలా తన ఎనిమిదేళ్ల బిడ్డను క్యాన్సర్ నుంచి కాపాడుకున్న ప్రీతీ రస్తోగీ ప్రస్తుతం లక్నోలోని కింగ్జార్జ్మెడికల్ యూనివర్సిటీలో పనిచేస్తోంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో ఆ కంటిని పూర్తిగా తీసేసి కృత్రిమ కంటిని అమర్చాల్సి ఉంటుంది. ఈ విషయం చెప్పగానే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. అయితేనా కూతురు ఒకటిన్నరేళ్ల వయసునుంచే కృత్రిమ కన్నుతో ఉంది. అందుకే తల్లిదండ్రులను ఒప్పించేటప్పుడు నా కూతురు గురించే చెబుతూ ఉంటా అని అంటోంది. క్యాన్సర్ సోకిన కంటిని తీసేయించకపోవడం వల్ల ఒక్క కన్ను పోవడమే కాదు.. మొత్తం పిల్లల జీవితాన్నే కోల్పోయిన వారవుతారని హెచ్చరిస్తున్నారు ప్రీతి. తొందరగా గుర్తించలేకపోతే ఈ క్యాన్సర్ కంటినుంచి మెదడుకు వ్యాపిస్తుందని చెబుతోందామె.