ఆర్బీ... మహాప్రాణాంతకం | the world retinoblastoma awareness meetings | Sakshi
Sakshi News home page

ఆర్బీ... మహాప్రాణాంతకం

Published Sun, May 11 2014 10:25 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

the world retinoblastoma awareness meetings

న్యూఢిల్లీ: బతికి ఉన్నందుకు.. ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నందుకు రాహుల్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అతనికి ఉన్నది ఒక్క కన్నే. అతని అక్క  దురదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమెకు కంటి క్యాన్సర్ ఉందని చాలా ఆలస్యంగా గుర్తించగలిగారు తల్లిదండ్రులు. ఫలితం చివరికి ఆమె ప్రాణాలనే కోల్పోయింది. ‘రాహుల్‌కి ఎనిమిది నెలలప్పుడు... రెటినా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తేలింది. ఎయిమ్స్‌లోని ఆర్పీ సెంటర్‌లోని వైద్యులు అంతకుముందే హెచ్చరించి ఉన్నందువల్ల మేం చాలా జాగ్రత్తగా ఉన్నాం. కంటికి రెప్పలా కాపాడుకున్నాం’ అని అంటుంది ప్రస్తుతం క్యాన్‌కిడ్స్ స్వచ్ఛంద సంస్థ పేరెంట్ సపోర్ట్ గ్రూప్‌లో పనిచే స్తున్న రాహుల్ తల్లి కవిత. ప్రస్తుతం రాహుల్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

రాహుల్‌లాగే సమస్యను తొందరగా గుర్తించడం, తల్లి జాగ్రత్తపడి నిఘా ఉంచడంవల్ల... ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆకాంక్ష కూడా ఇప్పుడు బతికి ఉంది. ప్రపంచాన్ని చూడగలుగుతోంది. పదో తరగతి చదువుతున్న ఆకాంక్షకు ఎనిమిది నెలలు ఉన్నప్పుడే కంటి క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించగలిగారు. టాటా మెమోరియల్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆమె తల్లి 42 ఏళ్ల అనిత కూడా కంటి క్యాన్సర్ నుంచి బయటపడ్డ విజేత. అనిత రెండేళ్ల వయసులో ఆమెకు కంటి క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారు. ‘కంటి క్యాన్సర్ అనువంశికంగా వచ్చే జబ్బు. మా కుటుంబంలో నా తరువాత నా కూతురికి వచ్చింది. ఇలా జరుగుతుందని మేం ముందే అనుమానించాం’ అని చెబుతుంది అనిత. రెటినోబ్లాస్టొమా (ఆర్బీ)... పిల్లల్లో చిన్నతనంలోనే అంటే ఐదేళ్లలోపే వచ్చే కంటి క్యాన్సర్.

ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ రెటినాలో వృద్ధి చెందుతుంది. పలుచని, సున్నితమైన పొరలాగా కంటి వెనుక కనిపించే ఇది ఒక్కోసారి ఏ రంగూ లేకుండా, కొన్నిసార్లు రంగుల్లో కనపడుతుంది. బాల్యంలో వచ్చే ఇతర క్యాన్సర్స్‌లాగే ఇది కొన్నిసార్లు అనువంశికంగా కూడా వస్తుంది. మే 12 నుంచి 19 వరకు రెటినోబ్లాస్టొమా అవేర్‌నెస్ వీక్ సందర్భంగా దేశవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చిన్నపిల్లల్లో కంటి క్యాన్సర్‌పై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ క్యాన్ కిడ్స్ సంస్థ చైర్‌పర్సన్ పూనమ్ బాగై తెలిపారు. మే 26 వరకూ ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. సజీవ్ క్యాన్‌కిడ్స్ రెటినోబ్లాస్టొమా ప్రాజెక్టు కింద నిర్వహించే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం పిల్లలకు చిన్నతనంలోనే వచ్చే ఈ కంటి క్యాన్సర్‌ను త ్వరగా గుర్తించడం, చికిత్స అందించడంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం. ఆర్బీ సెంటర్లతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం భారతీయులను ఆర్బీ నుంచి బయటపడేయడం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ క్యాన్సర్‌నుంచి బయటపడుతున్నవారి సంఖ్య 90 నుంచి 95 శాతం ఉండగా మన దేశంలో కేవలం 50 శాతమే.

 ‘ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి పిల్లలది ఒక్క ఫ్లాష్ ఫొటో తీయిస్తే చాలు. ఫొటోలో కంటిలోపల తెల్లగా మెరిసే ప్రాంతం కనిపించినట్టయితే ఆ పిల్లలు ఆర్బీతో బాధపడుతున్నట్టే’ అని ఎన్జీవో ఆఫీసర్, క్యాన్సర్ నుంచి బయటపడ్డ కపిల్ చావ్లా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 9000 ఆర్బీ కేసులు నమోదవుతున్నాయని, పుట్టిన పదివేల మందిలో ఒక్కరికి ఈ క్యాన్సర్ ఉంటోందని క్యాన్‌కిడ్స్ అడ్వైజర్, హైదరాబాద్‌లోని సైట్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రిలో నేత్రవ్యాధుల డెరైక్టర్ సంతోష్ జి హోన్వార్ తెలిపారు. భారతదేశంలో ప్రతి ఏటా 2.6 కోట్ల మంది జన్మిస్తున్నారు. దీని ప్రకారం భారతదేశంలో 2,500 నుంచి 2,600 ఆర్బీ కేసులు నమోదవుతున్నట్టు అంచనా. దేశవ్యాప్తంగా 15 రెటినోబ్లాస్టొమా చికిత్స కేంద్రాలుండగా అందులో హైదరాబాద్‌లో రెండు ఉన్నాయి.

 ఒకటి ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కాగా, సెంటర్ ఫర్ సైట్  రెండోది. తమ అవగాహనా కార్యక్రమంతో జమ్మూకాశ్మీర్‌లోని ఓ బాబును కంటి క్యాన్సర్ నుంచి కాపాడామని పూనమ్ గుర్తు చేసుకున్నారు. ‘కంటి క్యాన్సర్‌ను గుర్తించడమెలా అనే ఓ వీడియోను మేం యూట్యూబ్‌లో ఉంచాం. అది చూసిన ఒక జమ్మూకాశ్మీర్ కుటుంబం తమ చిన్నారికి క్యాన్సర్ ఉందని గుర్తించి చికిత్స కోసం మమ్మల్ని స్పందించారు.

 మా స్వచ్ఛంద సంస్థలోని పేరెంట్ సపోర్ట్ గ్రూప్ వాళ్లను ఎయిమ్స్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయిం చింది. ఆ అబ్బాయిలో డెవలప్‌మెంట్ చూసి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అని పూనమ్ చెప్పారు. తమ పిల్లలను కంటి క్యాన్సర్‌నుంచి బయటపడేసిన తల్లిదండ్రులు అలా ఉండిపోకుండా తమ పీఎస్ గ్రూప్స్‌లో చేరి ఇతరులకు తోడ్పడుతున్నారని ఆమె తెలిపారు. అలా తన ఎనిమిదేళ్ల బిడ్డను క్యాన్సర్ నుంచి కాపాడుకున్న ప్రీతీ రస్తోగీ ప్రస్తుతం లక్నోలోని కింగ్‌జార్జ్‌మెడికల్ యూనివర్సిటీలో పనిచేస్తోంది.

 ఈ వ్యాధి సోకిన పిల్లల్లో ఆ కంటిని పూర్తిగా తీసేసి కృత్రిమ కంటిని అమర్చాల్సి ఉంటుంది. ఈ విషయం చెప్పగానే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. అయితేనా కూతురు ఒకటిన్నరేళ్ల వయసునుంచే కృత్రిమ కన్నుతో ఉంది. అందుకే తల్లిదండ్రులను ఒప్పించేటప్పుడు నా కూతురు గురించే చెబుతూ ఉంటా అని అంటోంది. క్యాన్సర్ సోకిన కంటిని తీసేయించకపోవడం వల్ల ఒక్క కన్ను పోవడమే కాదు.. మొత్తం పిల్లల జీవితాన్నే కోల్పోయిన వారవుతారని హెచ్చరిస్తున్నారు ప్రీతి. తొందరగా గుర్తించలేకపోతే ఈ క్యాన్సర్ కంటినుంచి మెదడుకు వ్యాపిస్తుందని చెబుతోందామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement