Retinoblastoma
-
మీకు డయాబెటిస్ ఉందా.. అయితే మీ కళ్లు జాగ్రత్త!!
డయాబెటిస్ అనే రుగ్మత తల నుంచి మొదలుపెట్టి... కాలి వేళ్ల వరకు ఏ భాగానైనా ప్రభావితం చేయగలదు. కంటిపై ప్రభావం చూపిందంటే ‘చూపే’ ఉండదు కాబట్టి కళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. అది కంటిపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. కంటికి వెనక భాగంలో రెటీనా అనే తెర ఉంటుంది. మనకు కనిపించే ప్రతి దృశ్యం దీనిపై తలకిందులుగా పడుతుంది. ఆ ఇమేజ్ తాలూకు సిగ్నల్స్... ఆప్టిక్ నర్వ్ అనే నరం ద్వారా మెదడుకు చేరడం వల్లనే మనం ‘చూడ’గలుగుతాం. అన్ని అవయవాల్లాగే ఈ రెటీనాకు కూడా సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. చక్కెర నియంత్రణలో లేని కొందరిలో కంటిపై దుష్ప్రభావం పడి ‘డయాబెటిక్ రెటినోపతి’ అనే కండిషన్ వస్తుంది. ఇలాంటివారిలో రెటీనాకు చేరే రక్తనాళాలు బలహీనపడి, వాటిపై అక్కడక్కడ చిన్నపాటి ఉబ్బుల్లాంటివి కనిపించవచ్చు. ఇలా రక్తనాళాల్లోని బలహీన ప్రాంతాలు ఉబ్బడాన్ని ‘మైక్రో అన్యురిజమ్స్’ అంటారు. కొన్నిసార్లు బలహీనంగా ఉండటతో ఉబ్బిన రక్తనాళాలు చిట్లిపోయి, పోషకాలు, ఆక్సిజన్ లీక్ అయి, అవి రెటీనాకు అందవు. ఆ తర్వాత అతిసన్నటి ఈ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇలా జరిగిన కూడా పోషకాలూ, ఆక్సిజన్ అందవు. ఫలితంగా రెటీనా ఉబ్బడం (థికెనింగ్/రెటినల్ ఎడిమా/మాక్యులార్ ఎడిమా) జరుగుతుంది. అసాధారణమైనరీతిలో అవాంఛిత నాళాలు పెరుగుతాయి. డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు తొలినాళ్లలో కనిపించవు. రెటినల్ ఎడిమా వచ్చినపుపడు చూపు మందగించడమూ, చిన్న చిన్న అక్షరాలు కనపడకపోవడం జరుగుతాయి. అవాంఛిత, అసాధారణ రక్తనాళాల నుంచి రక్తస్రావం అయి, కంటిలోని విట్రియస్ అనే జెల్లీలోకి స్రవించినప్పుడు దాన్ని తొలిసారి గుర్తించవచ్చు. తర్వాత కంటి ముందు నల్లటి చుక్కలు తేలుకుంటూ పోతున్నట్లుగానూ, అల్లుకుపోతున్నట్లుగా కనిపిస్తుంటాయి. అప్పటికీ జాగ్రత్తపడకుండా, నిర్లక్ష్యం వహిస్తే క్రమంగాగానీ, అకస్మాత్తుగాగాని కంటిచూపు పోవచ్చు. విట్రియస్లోకి రక్తస్రావం జరిగాక... కనుగుడ్డు నుంచి రెటీనా విడిపోయే అవకాశం ఉంది. దీన్నే రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారైనా కంటి వైద్యనిపుణులను కలవాలి. అందునా ముఖ్యంగా రెటీనా స్పెషలిస్ట్‌ను కలవడం మంచిది. ఏదైనా తేడా గమనిస్తే వెంటనే వారు తగిన చికిత్స అందిస్తారు. తొలిదశలోనే చికిత్స అందితే కంటిచూపు కోల్పోయే ప్రమాదాన్ని నివారించవచ్చు. చికిత్స : బాధితుడి పరిస్థితినీ, అవసరాన్ని బట్టి కంటి డాక్టర్లు ఫ్లోరెసీన్ యాంజియోగ్రఫీ, ఓసీటీ అనే ప్రత్యేకమైన పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో చేతి రక్తనాళం నుంచి ఒక రంగును ప్రవేశపెట్టి, ఒక ప్రత్యేకమైన కెమెరా ద్వారా కంటిఫొటోలు తీస్తారు. దాంతో ఏయే భాగాల్లో రక్తం లీక్ అవుతుందో లేదా ఎక్కడ రక్తనాళాల్లో అడ్డంకి ఉందో తెలుస్తుంది. ఓసీటీలో మాక్యులార్ ఎడిమాను గుర్తిస్తారు. ఇక డయాబెటిక్ రెటినోపతిలో కంటికి ఏర్పడే నష్టాన్ని బట్టి అనేక రకాల చికిత్సలు అవరమవుతాయి. ఉదాహరణకు లేజర్ ఫొటోకోయాగ్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా లీకేజీలను అరికడతారు. అసాధారణంగా, అవాంఛితంగా పెరిగిన రక్తనాళాలనూ తగ్గిస్తారు. మాక్యులార్ ఎడిమా విషయంలో కంటికి ఇంజెక్షన్లు (యాంటీ–వెజ్) ఇచ్చి, వాపును తగ్గిస్తారు. కొన్ని సందర్భాల్లో అత్యాధునికమైన విట్రియో రెటినల్ మైక్రోసర్జరీ, ఎండోలేజర్ చికిత్స వంటి వాటితో చికిత్స అందించాల్సిరావచ్చు. డాక్టర్రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు చదవండి: చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం! -
కంటి కాన్సర్‌ను స్మార్ట్‌ఫోన్ పట్టిస్తుందట...
లండన్: చిన్న పిల్లల్లో వచ్చే అతి ప్రమాదకరమైన రెటినో బ్లాస్టోమా (కంటి క్యాన్సర్)ను స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా ఫ్లాష్ ద్వారా గుర్తు పట్టవచ్చట. ఐదేళ్లలోపు పిల్లల్లో వచ్చే అరుదైన, తీవ్రమైన క్యాన్సర్‌ను స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫ్లాష్ ద్వారా ఫోటో తీసినపుడు చాలా సులభంగా గుర్తించవచ్చని పిల్లల కంటి క్యాన్సర్ నివారణ కోసం పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో పేర్కొంది. బ్రిటిష్‌లోని చైల్డ్ ఐ క్యాన్సర్ ట్రస్ట్ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సంస్థ చీఫ్ జోయ్ ఫ్లెగేట్ తెలిపిన వివరాల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాతో ఫోటో తీసినపుడు, వ్యాధి సోకిన పిల్లల కంటిపాప చుట్టూ వెలుగుతో కూడిన తెల్లటి వలయం ఫోటోలో స్పష్టంగా కనపడుతుందన్నారు. కెమెరాలోని ఫ్లాష్ వ్యాధి సోకిన కంటిపాపపై పడినపుడు తరచుగా ఇలా కనపడుతుందన్నారు. అయితే ఇలా ఫ్లాష్ వచ్చిన అన్నిటినీ రెటినో బ్లాస్టోమా కేసులుగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు. ఈ సంస్థకు చెందిన బృందం ఈ పద్ధతిలో బ్రిటన్‌లోని నాలుగు సంవ్సతరాల పాపకు క్యాన్సర్ సోకినట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయడంతో పాప కోలుకుంటోందని ఈ బృందం తెలిపింది. తమ పరిశోధన ద్వారా భవిష్యత్తులో ఒక్క చిన్నారి కూడా ఈ మహమ్మారి బారిన పడి కంటి చూపును కోల్పోకూడదనేదే తమ లక్ష్యమని వారు తెలిపారు. -
ఆర్బీ... మహాప్రాణాంతకం
న్యూఢిల్లీ: బతికి ఉన్నందుకు.. ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నందుకు రాహుల్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అతనికి ఉన్నది ఒక్క కన్నే. అతని అక్క దురదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమెకు కంటి క్యాన్సర్ ఉందని చాలా ఆలస్యంగా గుర్తించగలిగారు తల్లిదండ్రులు. ఫలితం చివరికి ఆమె ప్రాణాలనే కోల్పోయింది. ‘రాహుల్‌కి ఎనిమిది నెలలప్పుడు... రెటినా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తేలింది. ఎయిమ్స్‌లోని ఆర్పీ సెంటర్లోని వైద్యులు అంతకుముందే హెచ్చరించి ఉన్నందువల్ల మేం చాలా జాగ్రత్తగా ఉన్నాం. కంటికి రెప్పలా కాపాడుకున్నాం’ అని అంటుంది ప్రస్తుతం క్యాన్‌కిడ్స్ స్వచ్ఛంద సంస్థ పేరెంట్ సపోర్ట్ గ్రూప్‌లో పనిచే స్తున్న రాహుల్ తల్లి కవిత. ప్రస్తుతం రాహుల్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రాహుల్‌లాగే సమస్యను తొందరగా గుర్తించడం, తల్లి జాగ్రత్తపడి నిఘా ఉంచడంవల్ల... ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆకాంక్ష కూడా ఇప్పుడు బతికి ఉంది. ప్రపంచాన్ని చూడగలుగుతోంది. పదో తరగతి చదువుతున్న ఆకాంక్షకు ఎనిమిది నెలలు ఉన్నప్పుడే కంటి క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించగలిగారు. టాటా మెమోరియల్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆమె తల్లి 42 ఏళ్ల అనిత కూడా కంటి క్యాన్సర్ నుంచి బయటపడ్డ విజేత. అనిత రెండేళ్ల వయసులో ఆమెకు కంటి క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారు. ‘కంటి క్యాన్సర్ అనువంశికంగా వచ్చే జబ్బు. మా కుటుంబంలో నా తరువాత నా కూతురికి వచ్చింది. ఇలా జరుగుతుందని మేం ముందే అనుమానించాం’ అని చెబుతుంది అనిత. రెటినోబ్లాస్టొమా (ఆర్బీ)... పిల్లల్లో చిన్నతనంలోనే అంటే ఐదేళ్లలోపే వచ్చే కంటి క్యాన్సర్. ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ రెటినాలో వృద్ధి చెందుతుంది. పలుచని, సున్నితమైన పొరలాగా కంటి వెనుక కనిపించే ఇది ఒక్కోసారి ఏ రంగూ లేకుండా, కొన్నిసార్లు రంగుల్లో కనపడుతుంది. బాల్యంలో వచ్చే ఇతర క్యాన్సర్స్‌లాగే ఇది కొన్నిసార్లు అనువంశికంగా కూడా వస్తుంది. మే 12 నుంచి 19 వరకు రెటినోబ్లాస్టొమా అవేర్నెస్ వీక్ సందర్భంగా దేశవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చిన్నపిల్లల్లో కంటి క్యాన్సర్‌పై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ క్యాన్ కిడ్స్ సంస్థ చైర్పర్సన్ పూనమ్ బాగై తెలిపారు. మే 26 వరకూ ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. సజీవ్ క్యాన్‌కిడ్స్ రెటినోబ్లాస్టొమా ప్రాజెక్టు కింద నిర్వహించే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం పిల్లలకు చిన్నతనంలోనే వచ్చే ఈ కంటి క్యాన్సర్‌ను త ్వరగా గుర్తించడం, చికిత్స అందించడంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం. ఆర్బీ సెంటర్లతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం భారతీయులను ఆర్బీ నుంచి బయటపడేయడం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ క్యాన్సర్‌నుంచి బయటపడుతున్నవారి సంఖ్య 90 నుంచి 95 శాతం ఉండగా మన దేశంలో కేవలం 50 శాతమే. ‘ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి పిల్లలది ఒక్క ఫ్లాష్ ఫొటో తీయిస్తే చాలు. ఫొటోలో కంటిలోపల తెల్లగా మెరిసే ప్రాంతం కనిపించినట్టయితే ఆ పిల్లలు ఆర్బీతో బాధపడుతున్నట్టే’ అని ఎన్జీవో ఆఫీసర్, క్యాన్సర్ నుంచి బయటపడ్డ కపిల్ చావ్లా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 9000 ఆర్బీ కేసులు నమోదవుతున్నాయని, పుట్టిన పదివేల మందిలో ఒక్కరికి ఈ క్యాన్సర్ ఉంటోందని క్యాన్‌కిడ్స్ అడ్వైజర్, హైదరాబాద్‌లోని సైట్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రిలో నేత్రవ్యాధుల డెరైక్టర్ సంతోష్ జి హోన్వార్ తెలిపారు. భారతదేశంలో ప్రతి ఏటా 2.6 కోట్ల మంది జన్మిస్తున్నారు. దీని ప్రకారం భారతదేశంలో 2,500 నుంచి 2,600 ఆర్బీ కేసులు నమోదవుతున్నట్టు అంచనా. దేశవ్యాప్తంగా 15 రెటినోబ్లాస్టొమా చికిత్స కేంద్రాలుండగా అందులో హైదరాబాద్‌లో రెండు ఉన్నాయి. ఒకటి ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కాగా, సెంటర్ ఫర్ సైట్ రెండోది. తమ అవగాహనా కార్యక్రమంతో జమ్మూకాశ్మీర్‌లోని ఓ బాబును కంటి క్యాన్సర్ నుంచి కాపాడామని పూనమ్ గుర్తు చేసుకున్నారు. ‘కంటి క్యాన్సర్‌ను గుర్తించడమెలా అనే ఓ వీడియోను మేం యూట్యూబ్‌లో ఉంచాం. అది చూసిన ఒక జమ్మూకాశ్మీర్ కుటుంబం తమ చిన్నారికి క్యాన్సర్ ఉందని గుర్తించి చికిత్స కోసం మమ్మల్ని స్పందించారు. మా స్వచ్ఛంద సంస్థలోని పేరెంట్ సపోర్ట్ గ్రూప్ వాళ్లను ఎయిమ్స్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయిం చింది. ఆ అబ్బాయిలో డెవలప్మెంట్ చూసి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అని పూనమ్ చెప్పారు. తమ పిల్లలను కంటి క్యాన్సర్‌నుంచి బయటపడేసిన తల్లిదండ్రులు అలా ఉండిపోకుండా తమ పీఎస్ గ్రూప్స్‌లో చేరి ఇతరులకు తోడ్పడుతున్నారని ఆమె తెలిపారు. అలా తన ఎనిమిదేళ్ల బిడ్డను క్యాన్సర్ నుంచి కాపాడుకున్న ప్రీతీ రస్తోగీ ప్రస్తుతం లక్నోలోని కింగ్జార్జ్మెడికల్ యూనివర్సిటీలో పనిచేస్తోంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో ఆ కంటిని పూర్తిగా తీసేసి కృత్రిమ కంటిని అమర్చాల్సి ఉంటుంది. ఈ విషయం చెప్పగానే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. అయితేనా కూతురు ఒకటిన్నరేళ్ల వయసునుంచే కృత్రిమ కన్నుతో ఉంది. అందుకే తల్లిదండ్రులను ఒప్పించేటప్పుడు నా కూతురు గురించే చెబుతూ ఉంటా అని అంటోంది. క్యాన్సర్ సోకిన కంటిని తీసేయించకపోవడం వల్ల ఒక్క కన్ను పోవడమే కాదు.. మొత్తం పిల్లల జీవితాన్నే కోల్పోయిన వారవుతారని హెచ్చరిస్తున్నారు ప్రీతి. తొందరగా గుర్తించలేకపోతే ఈ క్యాన్సర్ కంటినుంచి మెదడుకు వ్యాపిస్తుందని చెబుతోందామె.