కంటి కాన్సర్ను స్మార్ట్ఫోన్ పట్టిస్తుందట...
లండన్: చిన్న పిల్లల్లో వచ్చే అతి ప్రమాదకరమైన రెటినో బ్లాస్టోమా (కంటి క్యాన్సర్)ను స్మార్ట్ఫోన్లోని కెమెరా ఫ్లాష్ ద్వారా గుర్తు పట్టవచ్చట. ఐదేళ్లలోపు పిల్లల్లో వచ్చే అరుదైన, తీవ్రమైన క్యాన్సర్ను స్మార్ట్ఫోన్ కెమెరా ఫ్లాష్ ద్వారా ఫోటో తీసినపుడు చాలా సులభంగా గుర్తించవచ్చని పిల్లల కంటి క్యాన్సర్ నివారణ కోసం పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో పేర్కొంది.
బ్రిటిష్లోని చైల్డ్ ఐ క్యాన్సర్ ట్రస్ట్ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సంస్థ చీఫ్ జోయ్ ఫ్లెగేట్ తెలిపిన వివరాల ప్రకారం స్మార్ట్ఫోన్లోని కెమెరాతో ఫోటో తీసినపుడు, వ్యాధి సోకిన పిల్లల కంటిపాప చుట్టూ వెలుగుతో కూడిన తెల్లటి వలయం ఫోటోలో స్పష్టంగా కనపడుతుందన్నారు. కెమెరాలోని ఫ్లాష్ వ్యాధి సోకిన కంటిపాపపై పడినపుడు తరచుగా ఇలా కనపడుతుందన్నారు. అయితే ఇలా ఫ్లాష్ వచ్చిన అన్నిటినీ రెటినో బ్లాస్టోమా కేసులుగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు.
ఈ సంస్థకు చెందిన బృందం ఈ పద్ధతిలో బ్రిటన్లోని నాలుగు సంవ్సతరాల పాపకు క్యాన్సర్ సోకినట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయడంతో పాప కోలుకుంటోందని ఈ బృందం తెలిపింది. తమ పరిశోధన ద్వారా భవిష్యత్తులో ఒక్క చిన్నారి కూడా ఈ మహమ్మారి బారిన పడి కంటి చూపును కోల్పోకూడదనేదే తమ లక్ష్యమని వారు తెలిపారు.