మీకు డయాబెటిస్‌ ఉందా.. అయితే మీ కళ్లు జాగ్రత్త!! | What happens when a diabetic gets an infection | Sakshi
Sakshi News home page

మీకు డయాబెటిస్‌ ఉందా.. అయితే మీ కళ్లు జాగ్రత్త!!

Published Sun, Nov 14 2021 12:34 PM | Last Updated on Sun, Nov 14 2021 1:10 PM

What happens when a diabetic gets an infection - Sakshi

డయాబెటిస్‌ అనే రుగ్మత తల నుంచి మొదలుపెట్టి... కాలి వేళ్ల వరకు ఏ భాగానైనా ప్రభావితం చేయగలదు. కంటిపై ప్రభావం చూపిందంటే ‘చూపే’ ఉండదు కాబట్టి కళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. అది కంటిపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. 
కంటికి వెనక భాగంలో రెటీనా అనే తెర ఉంటుంది. మనకు కనిపించే ప్రతి దృశ్యం దీనిపై తలకిందులుగా పడుతుంది. ఆ ఇమేజ్‌ తాలూకు సిగ్నల్స్‌... ఆప్టిక్‌ నర్వ్‌ అనే నరం ద్వారా మెదడుకు చేరడం వల్లనే మనం ‘చూడ’గలుగుతాం. 

అన్ని అవయవాల్లాగే ఈ రెటీనాకు కూడా సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్‌) ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది.  చక్కెర నియంత్రణలో లేని కొందరిలో కంటిపై దుష్ప్రభావం పడి ‘డయాబెటిక్‌ రెటినోపతి’ అనే కండిషన్‌ వస్తుంది. ఇలాంటివారిలో రెటీనాకు చేరే రక్తనాళాలు బలహీనపడి, వాటిపై అక్కడక్కడ చిన్నపాటి ఉబ్బుల్లాంటివి కనిపించవచ్చు. ఇలా రక్తనాళాల్లోని బలహీన ప్రాంతాలు ఉబ్బడాన్ని ‘మైక్రో అన్యురిజమ్స్‌’ అంటారు.

కొన్నిసార్లు బలహీనంగా ఉండటతో ఉబ్బిన రక్తనాళాలు చిట్లిపోయి, పోషకాలు, ఆక్సిజన్‌ లీక్‌ అయి, అవి రెటీనాకు అందవు. ఆ తర్వాత అతిసన్నటి ఈ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇలా జరిగిన కూడా పోషకాలూ, ఆక్సిజన్‌ అందవు. ఫలితంగా రెటీనా ఉబ్బడం (థికెనింగ్‌/రెటినల్‌ ఎడిమా/మాక్యులార్‌ ఎడిమా) జరుగుతుంది. అసాధారణమైనరీతిలో అవాంఛిత నాళాలు పెరుగుతాయి.

డయాబెటిక్‌ రెటినోపతి లక్షణాలు తొలినాళ్లలో కనిపించవు. రెటినల్‌ ఎడిమా వచ్చినపుపడు చూపు మందగించడమూ, చిన్న చిన్న అక్షరాలు కనపడకపోవడం జరుగుతాయి. అవాంఛిత, అసాధారణ రక్తనాళాల నుంచి రక్తస్రావం అయి, కంటిలోని విట్రియస్‌ అనే జెల్లీలోకి స్రవించినప్పుడు దాన్ని తొలిసారి గుర్తించవచ్చు. తర్వాత కంటి ముందు నల్లటి చుక్కలు తేలుకుంటూ పోతున్నట్లుగానూ, అల్లుకుపోతున్నట్లుగా కనిపిస్తుంటాయి.

అప్పటికీ జాగ్రత్తపడకుండా, నిర్లక్ష్యం వహిస్తే క్రమంగాగానీ, అకస్మాత్తుగాగాని కంటిచూపు పోవచ్చు. విట్రియస్‌లోకి రక్తస్రావం జరిగాక... కనుగుడ్డు నుంచి రెటీనా విడిపోయే అవకాశం ఉంది. దీన్నే రెటినల్‌ డిటాచ్‌మెంట్‌ అంటారు. అందుకే డయాబెటిస్‌ ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారైనా కంటి వైద్యనిపుణులను కలవాలి. అందునా ముఖ్యంగా రెటీనా స్పెషలిస్ట్‌ను కలవడం మంచిది. ఏదైనా తేడా గమనిస్తే వెంటనే వారు తగిన చికిత్స అందిస్తారు. తొలిదశలోనే చికిత్స అందితే కంటిచూపు కోల్పోయే ప్రమాదాన్ని నివారించవచ్చు. 

చికిత్స : బాధితుడి పరిస్థితినీ, అవసరాన్ని బట్టి కంటి డాక్టర్లు ఫ్లోరెసీన్‌ యాంజియోగ్రఫీ, ఓసీటీ అనే ప్రత్యేకమైన పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో చేతి రక్తనాళం నుంచి ఒక రంగును ప్రవేశపెట్టి, ఒక ప్రత్యేకమైన కెమెరా ద్వారా కంటిఫొటోలు తీస్తారు.    దాంతో  ఏయే భాగాల్లో రక్తం లీక్‌ అవుతుందో లేదా ఎక్కడ రక్తనాళాల్లో అడ్డంకి ఉందో తెలుస్తుంది. ఓసీటీలో మాక్యులార్‌ ఎడిమాను గుర్తిస్తారు.

ఇక డయాబెటిక్‌ రెటినోపతిలో కంటికి ఏర్పడే నష్టాన్ని బట్టి అనేక రకాల చికిత్సలు అవరమవుతాయి. ఉదాహరణకు లేజర్‌ ఫొటోకోయాగ్యులేషన్‌ అనే ప్రక్రియ ద్వారా లీకేజీలను అరికడతారు. అసాధారణంగా, అవాంఛితంగా పెరిగిన రక్తనాళాలనూ తగ్గిస్తారు. మాక్యులార్‌ ఎడిమా విషయంలో కంటికి ఇంజెక్షన్లు (యాంటీ–వెజ్‌) ఇచ్చి, వాపును తగ్గిస్తారు. కొన్ని సందర్భాల్లో అత్యాధునికమైన విట్రియో రెటినల్‌ మైక్రోసర్జరీ, ఎండోలేజర్‌ చికిత్స వంటి వాటితో చికిత్స అందించాల్సిరావచ్చు.
డాక్టర్‌రవికుమార్‌ రెడ్డి
సీనియర్‌ కంటి వైద్య నిపుణులు

చదవండి: చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement