ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో కవిరాజు రాసిన ‘వీరగంధము తెచ్చినారము.. వీరుడెవ్వడు తెల్పుడీ’ పద్యం జాతికి మేలు కొలుపు. కవిరాజు ఎంత జాతీయవాదో అంత తెలుగుజాతి అభిమాని కూడా. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం అనేక గేయాలు రాశారు.
సరిగ్గా వందేళ్ల క్రితం– బారిస్టర్ చదువు పూర్తి చేసుకున్న ఒక మహానుభావుడు నవంబర్ 12, 1917న తెలుగు నేలపై అడుగుపెట్టారు. రష్యాలో అక్టోబర్ విప్లవం విజయవంతమైన నెల తర్వాత, విప్లవ ప్రారంభ సూచకంగా ఇక్కడ ఆయన అడుగుపెట్టినప్పుడు లభించిన స్వాగతం మాటలకందనిది. బెజవాడ నుంచి నూజెళ్ల రైల్వే స్టేషన్ దాకా, అక్కడి నుంచి ఆయన స్వగ్రామం అంగలూరు వరకు విజయధ్వజ సహస్రముల్లాగా రోడ్డుకి అటూ ఇటూ అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజానీకం బారులు తీర్చి నిలబడి నినాదాలు చేశారు. అంతటి ఘన స్వాగతం అందుకున్న ఆ మహనీయుడే–తెలుగుజాతికి ‘ఎందుకు?’ అన్న ప్రశ్నను నేర్పిన భావ విప్లవ ప్రదాత త్రిపురనేని రామస్వామి.
మా తాతగారు రామస్వామి జనవరి 15, 1887న జన్మించారు. తర్వాతకాలంలో ఆయన పెను సంచలనమయ్యారు. బాల్యం నుంచే హేతువాది. మూఢ విశ్వాసాలపై తిరగబడేవాడు. ఒకరోజు పళ్లుతోముకోవడానికి వేపపుల్ల కోసం వెళితే, ఆ చెట్టుకు దిగ్గొట్టిన ఓ మేకు, దానికి చుట్టి ఉన్న వెంట్రుకలు కనిపించాయి. చెట్టు మొదలులో డబ్బులు, నిమ్మకాయలు, వేపబెత్తం. అవి చేతబడి సామగ్రి. ఆ డబ్బులతో చిరుతిండి కొనుక్కుని, వేపబెత్తంతో గాడిదలను అదిలిస్తూ వస్తున్న ఆ బాలుడిని చూసి ఊరంతా విస్తుపోయింది. చాలాకాలం ఆ బెత్తాన్ని తన దగ్గరే ఉంచుకుని ఊరివాళ్ల మూఢ విశ్వాసాలను చెల్లాచెదురు చేసిన ఆ బాలుడి వయసు అప్పటికి ఆరేళ్లు.
మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీ యుడు వర్ణవివక్షతో రైలు బోగీనుంచి నెట్టివేసిన సంఘటన లాంటిదే రామస్వామి బాల్యంలో జరి గింది. తన విద్యాభ్యాసం రోజుల్లో ఒకరోజు మిఠాయిలు కొనుక్కుంటుంటే, ఒక అగ్రకుల సహ విద్యార్థి తనకూ కొనిపెట్టమని అడిగాడు. సరేనని రెండు పొట్లాలు తీసుకోబోతుంటే ఆ స్నేహితుడు ‘ఆగాగు.. ఆ పొట్లం నువ్వు తాకకూడదు రామస్వామీ’ అని ఒక పొట్లం తానే తీసుకున్నాడు. వెంటనే ప్రశ్న –ఎందుకు తాకకూడదు? నేనే కదా డబ్బులిచ్చింది? జీవితంలో ప్రశ్నల పరంపరకు దోహదం చేసిన ప్రశ్న. ఉదయాన్నే స్నానం చేసే
ఆ బాలుడి అలవాటుని, ‘ఏమిటీ, నీకు ప్రాతఃస్నానమా? ప్రాతః స్నానమూ, దైవధ్యానమూ అగ్రకులానికేనోయ్!’ అని అగ్రకుల గురువు చులకన చేశాడు. ప్రకృతి సౌకర్యాలు అందరికీ భోగ్యాలు కావా? అంద రికీ సమానం కాదా? ఆధిక్యమూ, అల్పత్వమూ ఏమిటి అని మళ్లీ ‘ప్రశ్న’. ఆ ప్రశ్నే రామస్వామిని ‘మనీషి’ని చేసింది.
తాత హిందూ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అక్కడే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (తిరుపతివేంకట కవులలో ఒకరు) దగ్గర శిష్యరికం. కాలేజీ విద్య బందరు నోబెల్ కళాశాలలో జరిగింది. 1907లో వందేమాతరం నినాదం బందరును తాకింది. ఆ సమయంలో రామస్వామిలోని కవి సాక్షీమాత్రుడిగా ఉండగలడా? కలం చేపట్టి నిప్పులు కురిపిం
చారు. దాని ఫలితమే కారెంపూడి కథనం. ‘కొండవీటి పతనం’, ‘రాణా ప్రతాప్’ వంటి నాటకాలు నిషేధం పాలయ్యాయి. పిన్నవయసులోనే రామస్వామి సాధించిన ఘనవిజయమిది. 1910లో మా తండ్రి గోపీచంద్ పుట్టారు. దాదాపు ఆ సమయంలోనే తాత రాసిన ‘కురుక్షేత్ర సంగ్రామం’ నాటకం వెలువడింది. తాత విమర్శనాదృష్టికి, హేతువాద ఆలోచనా ధోరణికి మచ్చుతునక. 1911వ సంవత్సరంలో అష్టావధానం, 1912లో శతావధానం చేశారు.
తాత శాకాహారి. ఐర్లండ్‌లో మూడేళ్లపాటు ఎంత కష్టమైనా దోసకాయ, టమాట లాంటి శాకాహారాన్నే తీసుకునేవారు. మొదట ట్రినిటీ కాలేజీలో చేరారు. విదేశంలోను తెలుగువాడిలాగే పంచె, లాల్చీ, తలకట్టుతోనే ఉండేవారు, క్లాసుకు వెళ్లేవారు. ట్రినిటీ ప్రొఫెసర్ అందుకు అభ్యంతరం చెబితే ఆ కాలేజీకి స్వస్తి చెప్పి ఇంటర్నల్ టెంపుల్ లా కాలేజీలో చేరారు. బారిస్టర్ అయ్యాక 1917లో భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. సొంతగడ్డపై కాలుమోపే వేళకి స్వాతంత్యోద్యమం ఊపులో ఉంది. అప్పటికే ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు!’ అని బాలగంగాధర్ తిలక్ గర్జించాడు. అనీబిసెంట్ హోంరూల్ నినాదం దేశమంతటా ప్రతిధ్వనించింది. తాత జస్టిస్ పార్టీకి చెందినా ఇలాంటి కార్యక్రమాల్లో జాతీయ కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేవారు. ఆయన భారత్‌కు వచ్చిన సంవత్సరమే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడి, బెజవాడలో సమావేశాలు జరి పింది. వాటికి రామస్వామి అధ్యక్షులు.
విదేశం నుంచి తిరిగివచ్చిన తర్వాత రామస్వామి చేసిన మొదటి రచన ‘శంభుక వధ’. దీనితో తెలుగుజాతి ఉలిక్కిపడింది. కాదు కాదు.. మేల్కొంది. తెలుగులో మొదటిసారి సాంస్కృతిక విప్లవానికి నాంది పలి కింది. ఎందుకు? అని ప్రశ్నించడం నేర్పింది. 1922లో నాటి రైతు నాయకుడు ఎన్.జి. రంగా రైతు పత్రిక సంపాదకులుగా తాతగారిని తెనాలికి ఆహ్వానించారు. తెనాలిలో ఆయన నివాసం పేరు మొదట ‘శంభుకాశ్రమం’. అదే తర్వాత ‘సూతాశ్రమం’. తెనాలి మున్సిపల్ చైర్మన్‌గా మూడుసార్లు చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. శంభుక వధ తర్వాత ఆయనకు శాశ్వత కీర్తి తెచ్చిపెట్టిన సంచలన కావ్యం ‘సూత పురాణము’. ఈ మహాకావ్యమే రామస్వామి గారిని ‘కవిరాజు’ మకుటంతో అలంకరించింది. కవిరాజు చేసిన మరో గొప్ప ప్రయోగం వివాహవిధి. వధూవరులకు అర్థం కాని సంస్కృత మంత్రాలతో జరిపే పెళ్లి కాకుండా అందరికీ అర్థం అయ్యే విధంగా తెలుగు పెళ్లి జరిపించడం ఉద్యమంలాగా మొదలైంది. ఆ దశలో రాసిందే ‘కుప్పుస్వామి శతకము’.
1930లో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో కవిరాజు రాసిన ‘వీరగంధము తెచ్చినారము.. వీరుడెవ్వడు తెల్పుడీ’ పద్యం జాతికి మేలు కొలుపు. కవిరాజు ఎంత జాతీయవాదో అంత తెలుగుజాతి అభిమాని కూడా. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం అనేక గేయాలు రాశారు. ‘ఖూనీ’ నాటకంలో ‘పగవారు మనపైకి వచ్చినప్పుడు’ గేయం ఎంతో కీర్తి ప్రతి ష్టలు తెచ్చిపెట్టింది. భారత–చైనా యుద్ధకాలంలో కూడా ఊరూవాడా మారుమోగింది. ‘కుప్పుస్వామి శతకము’ తర్వాత అంతకు మించిన మరో శతకం ‘ధూర్తమానవా!’ ఇది పూర్తిగా వ్యంగ్యపూరితం. కవిరాజు కలం నుంచి జాలువారిన చిట్టిచివరి కళాఖండం భగవద్గీత. పల్నాటి పౌరుషం ఇతి వృత్తంగా ఆవిర్భవించింది. ఆయన అభిమానులు 1942 నవంబర్ 25, 26 తేదీల్లో గుడివాడలో గజారోహణం చేయించారు.
అవి క్విట్ ఇండియా ఉద్యమరోజులు. తెనాలిలో జరిగిన కాల్పులకు నిరసనగా ఏర్పాటు చేసిన సభలో కవిరాజు ఉపన్యసించారు. మరుసటి రోజు అంటే 1943 జనవరి 1న ఆయనకు జ్వరం మొదలైంది. అలాంటి సమయంలో ఒక పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహించారు. ఆ ప్రయాణం ఆయన్ని మరింత దెబ్బతీసింది. కవిరాజు మృత్యువుతో పది హేను రోజులుపోరాడి 1943 జనవరి 16న కన్నుమూశారు. ‘విధి ప్రాణికోటిని పీల్చేస్తుంది. ఒకే ఒక్కడు దాన్నే సముద్రంలో పడేస్తాడు’ అని డబ్లు్యహెచ్ ఆడెన్ అన్న మాటలు కవిరాజు విషయంలో అక్షరసత్యం.
(కవిరాజు ఐర్లండ్ నుంచి బారిస్టర్‌గా తిరిగివచ్చి రేపటికి నూరేళ్లు)
- సాయిచంద్
వ్యాసకర్త సినీనటులు, కవిరాజు మనవడు‘ 93475 00041
Comments
Please login to add a commentAdd a comment