నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’  | Maa Bhoomi Movie Producer B Narsing Rao Shares Memories With Sakshi | Sakshi
Sakshi News home page

‘బండెనుక బండి కట్టి’.. పాట గుర్తుందా!.. నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ 

Published Fri, Sep 16 2022 2:45 PM | Last Updated on Fri, Sep 16 2022 5:04 PM

Maa Bhoomi Movie Producer B Narsing Rao Shares Memories With Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మా భూమి’ ఒక సినిమా మాత్రమే కాదు. ఒక చారిత్రక దృశ్యకావ్యం. తెలుగు సినీచరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయోగం. నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టిన సామాజిక చిత్రం. నలభై రెండేళ్ల క్రితం విడుదలైన ‘మా భూమి’సినిమా ఇప్పటికీ  ప్రేక్షాకాదరణను పొందుతూనే ఉంది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ  సినిమా  ఒక చర్చనీయాంశం. సాయుధపోరాటాన్ని, తెలంగాణలో పోలీస్‌ యాక్షన్‌ కాలాన్ని ‘మాభూమి’లో చిత్రీకరించారు. రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలను, హింసను చూసిన హైదరాబాద్‌ రాజ్యం  పోలీసు  యాక్షన్‌తో  భారత యూనియన్‌లో  భాగమైంది.ఆ నాటికి  ఒక కీలకమైన దశాబ్ద కాలాన్ని  అద్భుతమైన మా భూమి సినిమా ద్వారా  ప్రపంచానికి  పరిచయం చేశారు చిత్ర నిర్మాత, సంగీత దర్శకులు బి. నర్సింగ్‌రావు. అప్పటి అనుభవాలు ఆయన  ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... 


నిర్మాత నర్సింగరావుతో నటుడు సాయిచంద్‌

అదొక ప్రయోగం.. 
‘మా భూమి’ సినిమా ఒక ప్రయోగం.అప్పటి వరకు సినిమా  తీసిన అనుభవం లేదు. నటీనటులు  కూడా అంతే. స్టేజీ ఆర్టిస్టులు. సాయిచంద్‌ బహుశా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. క్రికెట్‌  ఆడుతుండగా తీసుకెళ్లాం, ఆయనకు అదే మొదటి సినిమా. కాకరాల, భూపాల్‌రెడ్డి, రాంగోపాల్, తదితరులంతా రంగస్థల నటులు. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు గౌతమ్‌ఘోష్‌  అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ సినిమా కోసం పని చేశాం.  

►1978 నుంచి  1980 వరకు సినిమా నిర్మాణం కొనసాగింది. చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సం నుంచి లెక్కిస్తే ఇప్పటికి  44 ఏళ్లు. విడుదలైనప్పటి నుంచి  అయితే  42  సంవత్సరాలు. సినిమా విడుదలైన రోజుల్లో  సినిమా టాకీస్‌ల వద్దకు జనం పెద్ద ఎత్తున ఎడ్ల  బండ్లు కట్టుకొని వచ్చేవారు. సినిమా టాకీసులన్నీ జాతర వాతావరణాన్ని తలపించేవి. హైదరాబాద్‌లో ఈ సినిమాకు అపూర్వమైన ఆదరణ లభించింది. దర్శకుడు  గౌతమ్‌ఘోష్‌  మా భూమిని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా, ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు.  


‘మా భూమి’ సినిమాలోని సన్నివేశాలు

హైదరాబాద్‌లో చిత్రీకరణ... 
మా భూమి సినిమాను చాలా వరకు మొదక్‌ జిల్లా మంగళ్‌పర్తి, దొంతి గ్రామాల్లో , శివంపేట గడీలో  చిత్రీకరించాము. విద్యుత్‌ సదుపాయం కూడా లేని ఆ రోజుల్లో పగటిపూటనే చీకటి వాతావరణాన్ని చిత్రీకరించి సినిమా షూటింగ్‌ చేశాం.రజాకార్ల దాడి , కమ్యూనిస్టుల పోరాటాలు వంటి కీలకమైన ఘట్టాలను చిత్రీకరించే సమయంలో కళాకారులకు  దెబ్బలు కూడా తగిలేవి. గాయాలకు కట్టుకట్టేందుకు రోజుకు  ఒక అయోడిన్‌ బాటిల్‌ చొప్పున వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది.

హైదరాబాద్‌ నగర సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా ఆఫ్జల్‌గంజ్‌లోని  ఇరానీ హాటల్‌లో ఒక సన్నివేశాన్ని  తీశాం. అలాగే కార్వాన్, జాహనుమా, జూబ్లీహాల్, వనస్థలిపురం, నయాఖిల్లా, సాలార్‌జంగ్‌ మ్యూజియం, కాలాగూడ, తదితర ప్రాంతాల్లో మా భూమి సినిమా తీశాం. కథానాయిక చంద్రి నివాసం, గుడిసెలు అంతా హైదరాబాద్‌లోనే సెట్టింగ్‌ వేశాం.ఈ  సినిమా ఒక అద్భుతమైన అనుభవం. అందరికీ  ఒకే కిచెన్‌ ఉండేది.  అందరం కలిసి  ఒకే చోట భోజనాలు చేసేవాళ్లం. లారీల్లో ప్రయాణం చేసేవాళ్లం,  

ప్రజలు  కళాకారులే... 
ఆ రోజుల్లో కేవలం రూ.5.40 లక్షలతో ఈ సినిమా పూర్తయింది. ఆర్టిస్టులకు  రూ.300, రూ.500, రూ.1000 చొప్పున ఇచ్చాం.చాలా మంది స్వచ్చందంగా నటించారు. సగం మంది ఆర్టిస్టులు ఉంటే మిగతా సగం మంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలే. షూటింగ్‌ సందర్శన కోసం వచ్చిన వాళ్లే ఆర్టిస్టులయ్యారు. ఒకసారి  80  మంది గ్రామస్తులకు ఆ  రోజు కూలి డబ్బులు మాత్రమే చెల్లించి  సినిమా షూటింగ్‌లో భాగస్వాములను చేశాం.అప్పటి తెలంగాణ సమాజాన్ని, రజాకార్ల హింసను,  పోలీసు చర్య పరిణామాలను   ఈ సినిమా ఉన్నదున్నట్లుగా చూపించింది. ‘ అని వివరించారు. 

బండెనుక బండి కట్టి... 
ఈ సినిమాలో  ప్రజాగాయకుడు గద్దర్‌ పాడిన  పాట అప్పటి  నిజాం రాక్షస పాలన, జమీందార్ల  దౌర్జన్యాలపైన ప్రజల తిరుగుబాటును కళ్లకు కట్టింది. ‘బండెనుక బండి కట్టి. పదహారు బండ్లు కట్టి.. నువు ఏ బండ్లె పోతవురో నైజాము సర్కరోడా....’ అంటూ గద్దర్‌ ఎలుగెత్తి  పాడిన ఆ పాటు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది. నిజాం నిరంకుశ పాలనపైన, దొరలు, జమీందార్ల పెత్తనంపైన  ప్రజాగ్రహం పెల్లుబికేవిధంగా  ఈ పాట  స్ఫూర్తిని రగిలించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement