రక్త సంబంధం, వీరాభిమన్యు, ఆరాధన, లక్ష్మీ నివాసం, విక్రమ్..
అన్నీ విజయకేతనం ఎగురవేసిన రజతోత్సవ చిత్రాలే...
వీరమాచినేని ఇంటి పేరును విక్టరీగా మార్చిన చిత్రాలు..
ప్రజా నాట్య మండలి భావాలతో కమ్యూనిస్టు వివాహం చేసుకున్నారు...
జీవితం మీద ఆశతో జీవించిన తండ్రి వీరమాచినేని (విక్టరీ) మధుసూదనరావు గురించి
రెండో కుమార్తె వాణి చెబుతున్న విషయాలు...
నాన్న కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో పుట్టారు. నాన్న వాళ్లు ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి. నాన్న ఎనిమిదో ఏటే తల్లిని పోగొట్టుకోవటంతో, మూడు సంవత్సరాల వయసున్న చెల్లిని ఎంతో బాధ్యతగా పెంచారు. నాన్నకు మేం ఇద్దరం ఆడపిల్లలం. అక్క వీణ, నేను వాణి. నా ఎనిమిదో యేట అమ్మ నాన్నలతో మేం చెన్నై వచ్చాం. ప్రకాశ్ స్టూడియోలో చిన్న జీతానికి చేరారు. నాన్నకి ఆర్థికంగా సహాయపడటం కోసం అమ్మ డబ్బింగ్ చెప్పేది. అక్క నేను కేసరి హైస్కూల్లో చదువు పూర్తయ్యాక, అక్క బి.ఎస్.సి, నేను ఎం.ఎస్.సి. చదివాం. నాన్న ప్రారంభించిన మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చూస్తున్నాను.
చాలా కష్టజీవి
నాన్న సోడా బండి తోసి, పొలంలో నాట్లు వేసి, కూలి పని చేసి డబ్బులు సంపాదిస్తూ వారలబ్బాయిగా చదువుకుంటూ, ఇంటర్మీడియెట్ స్టేట్ ఫస్ట్‌లో ప్యాసయ్యారు. నటన మీద శ్రద్ధతో సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఎనిమిదేళ్లు ప్రకాశ్ స్టూడియోలో కె. ఎస్. ప్రకాశరావు గారి దగ్గర అసిస్టెంట్‌గా చేశాక దర్శకులయ్యారు. తన సినిమాలకు దగ్గరుండి మరీ ఆత్రేయతో పాటలు రాయించుకున్నారు. ముందుగానే మ్యూజిక్ సిద్ధం చేసుకునేవారు. రికార్డయిన పాటలను ఇంట్లో వినిపించేవారు. అందరం పాడుకునేవాళ్లం. నాన్నకు ‘ప్రొడ్యూసర్స్ మ్యాన్’ అనీ, కోపిష్ఠి అనీ పరిశ్రమలో పేరుంది.
సినిమా పూర్తయ్యే వరకు క్రమశిక్షణతో, యజ్ఞం చేస్తున్నట్లు మౌనంగా మునిలా ఉండేవారు. అప్పుడప్పుడు నాన్నతో షూటింగ్‌లకి వెళ్లేవాళ్లం. ఒక హిందీ సినిమా షూటింగ్‌కి వెళ్తూ, నన్ను కాశ్మీర్ తీసుకువెళ్లారు. సినీ నటి జి. వరలక్ష్మిగారికి నాన్న కమిట్‌మెంట్ నచ్చింది. నాన్నను ఆప్యాయం గా‘మధు’ అని పిలిచేవారు. నాన్న ఆవిడను ‘అమ్మ’ అనేవారు. ‘ఎ డైరెక్టర్ ఈజ్ జస్ట్ లైక్ ఎ గుడ్ రిక్రియేటర్ హిమ్‌సెల్ఫ్’ అన్నారు నాన్న గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌కపూర్.
సొంత ఆస్తి వద్దనుకున్నారు..
నాన్న సినిమాలలో బాగా బిజీ అయ్యాక ఉదయాన్నే ఏడు గంటలకు షూటింగ్ ఉంటే, ఐదు గంటలకే రెడీ అయిపోయేవారు. నాన్నతో ఎక్కువ సమయం గడపలేకపోయాం. అమ్మ పంపే క్యారేజీ సెట్‌లో అందరితో కలిసి తినేవారు. మేం పెద్దవాళ్లం అయ్యాక మమ్మల్ని చూడాలనిపిస్తే ‘వాణిని పేపర్ తెమ్మను’ అనేవారు. అలా మమ్మల్ని చూసేవారు. పర్సనల్ ప్రోపర్టీ వద్దనుకున్నారు. కాని నాన్న సన్నిహితులు నాన్న చేత పొదుపు చేయించి, స్థలం కొనిపించారు. ఎకరం స్థలంలో దగ్గరుండి స్టూడియో కట్టించారు. నాన్న మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించి, చాట్ల శ్రీరాములుగారిని ప్రిన్సిపాల్‌గా నియమించి ఆయనకు బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఆయనంటే నాన్నకు అంత గౌరవం.
ప్రజాసేవ అంటే ఇష్టం...
ఒకసారి నాకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పుడు రాయలసీమ కరవు ప్రాంతాల వారికి సహాయం చేయటం కోసం సినిమా వారంతా జోలె పట్టారు. అందరితో పాటు అమ్మనాన్నలు బయలుదేరారు. ‘చంటిపిల్లకు అనారోగ్యంగా ఉంది కదా’ అని బంధువులంటే, ‘నా బిడ్డల్ని దేవుడు చూస్తాడు. అక్కడ వందల మంది ఆకలి బాధతో మరణిస్తున్నారు’ అన్నారట అమ్మ నాన్నలు. సమాజం పట్ల అంత బాధ్యతగా ఉండేవారు. నాకు చిన్నప్పుడు నాలుగు సంవత్సరాల వయసులో లివర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నన్ను ఎత్తుకుని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. అవసరాన్ని బట్టి ఎప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నాన్న ఆలోచించేవారు. నేను సర్జరీ చేయించుకున్నప్పుడు నాన్న ఇంట్లోనే ఉండి, కంటికి రెప్పలా చూసుకున్నారు. నాన్నకు ఆడపిల్లలంటే సాఫ్ట్ కార్నర్.
నాన్న ఇష్టాలు...
నాన్నకి తెల్ల బట్టలంటే ఇష్టం. మల్లెపూలంటే మక్కువ. మల్లెపూల దండ చేతికి కట్టుకుని, ఆ సువాసనను ఆస్వాదిస్తూ, భోజనం చేసేవారు. శాకాహారమంటేనే ఇష్టం. రోటి పచ్చళ్లు బాగా తినేవారు. రోజూ పెరుగన్నంలో ఉసిరికాయ బద్దలు, మామిడికాయ బద్దలు ఉండవలసిందే. నాన్న కోసం జలాలు రకం మామిడికాయలతో ఆవకాయ పెట్టేది అమ్మ. చిన్న వంటకాన్ని సైతం బాగా ఆస్వాదించే వారు. జుట్టుకు రంగు వేయటం ఇష్టం లేదు. నాన్న ప్రారంభించిన మధు మూవీస్ బ్యానర్‌లో నన్ను పెళ్లికూతురు గెటప్‌లో మధుకలశం పట్టుకుని ఉన్న పొజిషన్‌లో చూపించారు నాన్న.
నాన్న ఆశావాది
నాన్నకి తీవ్రంగా అనారోగ్యం చేసినా, బతకాలనే కోరికే ఆయనను బతికించింది. పదకొండు సంవత్సరాలు ఆయనను కంటిపాపలా చూసుకున్నాను. ‘‘ఇప్పుడు నువ్వు నన్ను నీ కొడుకులా చూసుకుంటున్నావు. నాకు ఇంకా పదమూడేళ్లు జీవితం ఉంది’’ అన్నారు. కాని 2012లో తన 89వ ఏట కన్నుమూశారు. 2023లో నాన్నగారి శతజయంతి చేయాలనుకుంటున్నాం.పద్నాలుగేళ్ల్ల వయసులోనే, తాతతో కలిసి అమ్మ మీటింగ్స్‌కి వెళ్లేది. నాన్న 1940లో కమ్యూనిస్టు పార్టీ ప్రెసిడెంట్‌గా స్పీచ్ ఇస్తుంటే, ఆయన మాటలు విని ఆకర్షితురాలై, ఎలాగైనా నాన్ననే వివాహం చేసుకోవాలనుకుంది. స్కూల్ మాస్టర్‌గా పనిచేస్తున్న మా తాతయ్యతో అమ్మ, ‘ఉరై సుబ్బన్నా, నన్ను మధుసూదన్‌కి ఇచ్చి చేయకపోతే కుదరదు’ అందట. అలా యాభై రూపాయల ఖర్చుతో అమ్మనాన్నలకు కమ్యూనిస్టు పెళ్లి జరిగిపోయింది. అమ్మ ఆ రోజుల్లో ప్రజానాట్య మండలిలో బుర్రకథలు చెప్పేదట.
సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment