ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకునిగా తొలి అడుగు వేశారు.
తరంగిణిలో రైలు చేత పాట పాడించారు.
అమ్మోరులో గ్రాఫిక్స్‌ను పరిచయం చేశారు.
అరుంధతిలో జేజమ్మను ప్రతిష్ఠించారు..
మానవ సంబంధాలు, దైవభక్తి, ఆధునిక గ్రాఫిక్స్...
అన్నిటినీ తెలుగు వెండి తెర మీద ప్రదర్శించిన కోడి రామకృష్ణ...
ఇంటి దగ్గర ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా స్నేహంగా ఉండేవారంటున్నారు
కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య..
కోడి నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా నాన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. పాలకొల్లు కాలేజీలో బికామ్ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పీచ్‌లు రాసి ఇచ్చేవారట, పెయింటింగ్స్, మంచి మంచి స్కెచ్‌లు కూడా వేసేవారట. నాటకాలు వేయటానికి కావలసిన డబ్బుల కోసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా బయటి వాళ్లకు పెయింటింగ్స్ వేసిన సందర్భాలున్నాయని నాన్న చెబుతుండేవారు.
పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం
అమ్మ వాళ్లది తెనాలి. తాత (ఎ. సుభాష్) గారు సినిమాలు నిర్మించాలనే ఆసక్తితో మద్రాసు వచ్చి, ‘భారత్ బంద్’ చిత్రం నిర్మించారు. అమ్మ పేరు పద్మ. నాన్నగారి ‘రంగుల పులి’ చిత్రంలో ఇష్టం లేకుండానే అమ్మ నటించింది. నాన్నగారు అమ్మను ఇష్టపడ్డారు. ఇద్దరూ వివాహం చేసుకుందామనుకు న్నారు. సన్నిహితులతా కలిసి అమ్మవాళ్ల నాన్నను ఒప్పించారు. నానమ్మకు ఇచ్చిన మాట ప్రకారం, చెల్లెలికి, తమ్ముళ్లకి వివాహం చేసిన తరవాతే 1983లో అమ్మను వివాహం చేసుకున్నారు. తాతగారు పోయాక నాన్నే ఇంటి బాధ్యత తీసుకు న్నారు. నాన్నకు మేం ఇద్దరు ఆడపిల్లలం. చెల్లి పేరు ప్రవల్లిక. నేను బిబిఏ, చెల్లి ఎంబిఏ చేశాం. నేను యానిమేషన్ కూడా చేశాను. నన్ను ‘దీపమ్మా’ అని, చెల్లిని ‘చిన్నీ’ అని పిలిచేవారు. ఇద్దరూ ఆడపిల్లలేనా అని ఎవరైనా అంటే నాన్నకు నచ్చేది కాదు.
స్నేహితునిలా ఉండేవారు..
సినిమాలలో పూర్తిగా బిజీగా ఉండటంతో, ఏ మాత్రం అవకాశం వచ్చినా నాన్న మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాక, మమ్మల్ని కార్‌లో బీచ్‌కి తీసుకువెళ్లి, ఐస్‌క్రీమ్ కొనిపెట్టేవారు. ఉదయాన్నే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. ఎక్కడ ఉన్నా ఫోన్ చేసేవారు. చాలా స్నేహంగా ఉండేవారు. ఒక్క రోజు కూడా కోప్పడలేదు. నేను నాన్న దగ్గర అసిస్టెంట్‌గా ఉండాలి అని నాన్నతో అన్నప్పుడు, అమ్మ నా పెళ్లి చేసేయమంది. అప్పుడు కూడా నాకు నచ్చినట్లే చేయమన్నారు. ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు. నాన్నకు ఏదీ షో చేయటం నచ్చదు. అలా ప్రదర్శించటం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు అనేవారు. ఎవరో ఏదో అనుకుంటారనే ఆలోచనే ఉండేది కాదు. అమ్మ తన బంధువులకు ఎంతో సహాయం చేస్తుంటే, ఎన్నడూ అమ్మను ప్రశ్నించలేదు.
కథ ఎలా ఉంది అని అడిగేవారు..
వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకునేవారు. ఔట్‌డోర్ షూటింగ్స్‌కి ఇతర దేశాలకు మమ్మల్ని కూడా తీసుకువెళ్లేవారు. మేం సినిమా చూసి వచ్చాక మమ్మల్ని కథ ఎలా ఉందో చెప్పమనేవారు. ఇల్లు, షూటింగ్ అంతే. పుట్టినరోజుకి మాత్రమే పార్టీ చేసేవారు. ఇంటి భోజనమే ఇష్టపడేవారు. అది కూడా చాలా మితంగా తినేవారు.
దాసరిగారితో అనుబంధం...
నానమ్మ వాళ్లు నాన్న సినిమాలలోకి వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదు. మద్రాసులో దాసరి గారిని కలిస్తే, ఆయన డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నారు. ఆ ప్రకారమే డిగ్రీ పూర్తి చేశాక, దాసరిగారు ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని మద్రాసు వెళ్లారు. అలా నాన్న సినీ రంగ ప్రవేశం జరిగింది. దాసరిగారు కన్ను మూయటానికి నెల రోజుల ముందు నాన్నకు ఏమనిపించిందో కానీ, రోజూ ఆయన ఇంటికి వెళ్లేవారు. ఆయన పోయినప్పుడు తట్టుకోలేక పోయారు. ఎంత బాధలో ఉన్నా పని మాత్రం మానేసేవారు కాదు.
నేను వచ్చేశాను...
నా పెళ్లి కుదిరిన తరవాత, నేను అత్తవారింటికి వెళ్లిపోతానన్న దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు. నాన్నను ఓదార్చవలసి వచ్చింది. మా పెళ్లయ్యాక కొంచెం ఆలస్యంగా పుట్టింది పాప. ‘ఆలస్యం చేసుకుంటున్నారెందుకు’ అని అమ్మ అంటున్నా కూడా నాన్న అననిచ్చేవారు కాదు. నాన్నకు బాగోలేదని తెలియగానే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాం. నా డెలివరీ ముందు రోజు నేను వినాలని హనుమాన్ చాలీసా చదివారు. మరుసటి రోజు నాకు డెలివరీ అయ్యేవరకు మంచి నీళ్లు మాత్రమే తాగారట. పసిపాపను చూస్తూనే, మా అమ్మ నరసమ్మ మళ్లీ పుట్టింది అని పాపాయిని ‘చిట్టి నరసమ్మా!’ అని పిలిచారు.
భక్తి ఎక్కువ..
నాన్నకు దేవుడి మీద విపరీతమైన భక్తి. దేవుడికి నాన్నకు మధ్య ఎవరు ఏం చెప్పినా వినరు. ఆరు గంటలకు షూటింగ్ అంటే మూడు గంటలకల్లా నిద్ర లేచి, పూజ చేసుకుని పావు గంట ముందే స్పాట్‌లో ఉండేవారు. ఆసుపత్రిలో ఉండి కూడా, స్నానం చేయించుకుని, పూజ చేసుకున్నాకే టిఫిన్ తినేవారు. వినాయక చవితి రోజున కథ చదువుతుండగా దగ్గు వస్తే, మళ్లీ మొదటి నుంచి చదివేవారు. పూజ అయ్యాక మాతోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. దీపావళి రోజున అందరికీ శుభాకాంక్షలు చెప్పి, నా చేత 100 రూపాయలు ఇప్పించేవారు. ఎక్కడకు వెళ్తున్నా నన్ను ఎదురు రమ్మనేవారు. నా పెళ్లయ్యాక నాతో మాట్లాడటం కోసం మొబైల్ కొన్నారు.
అప్పుడు కూడా నిర్మాత గురించే...
వేళకు ఆహారం తీసుకోకపోవటం వల్ల నాన్న ఆరోగ్యం దెబ్బ తింది. 2012లో ఒక సినిమా ప్రారంభోత్సవం రోజే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యి, స్పృహలోకి వచ్చిన వెంటనే, ‘నిర్మాత ఎలా ఉన్నారు’ అని అడిగారు. మాకు వింతగా అనిపించింది. 104 డిగ్రీల జ్వరంతో కూడా షూటింగ్ చేశారు. నాన్న అంత్యక్రియలు స్వయంగా నేనే చేశాను.
కంటిన్యూ చేస్తున్నాను..
కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సినిమా నిర్మాణం చేస్తున్నాను. ‘కోడి పిల్లలు’ అని వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఆ గ్రూపులో మేం నలుగురం, నాన్న దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేసినవారు, నాన్న అభిమానులు ఉన్నారు.
Kodi Ramakrishna: ‘కోడి పిల్లలు’ అని వాట్సాప్ గ్రూప్ పెట్టాం
Published Sun, Aug 8 2021 9:20 AM | Last Updated on Sun, Aug 8 2021 12:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment