ammoru
-
కోడి రామకృష్ణ: ‘దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు’
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకునిగా తొలి అడుగు వేశారు. తరంగిణిలో రైలు చేత పాట పాడించారు. అమ్మోరులో గ్రాఫిక్స్‌ను పరిచయం చేశారు. అరుంధతిలో జేజమ్మను ప్రతిష్ఠించారు.. మానవ సంబంధాలు, దైవభక్తి, ఆధునిక గ్రాఫిక్స్... అన్నిటినీ తెలుగు వెండి తెర మీద ప్రదర్శించిన కోడి రామకృష్ణ... ఇంటి దగ్గర ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా స్నేహంగా ఉండేవారంటున్నారు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య.. కోడి నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా నాన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. పాలకొల్లు కాలేజీలో బికామ్ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పీచ్‌లు రాసి ఇచ్చేవారట, పెయింటింగ్స్, మంచి మంచి స్కెచ్‌లు కూడా వేసేవారట. నాటకాలు వేయటానికి కావలసిన డబ్బుల కోసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా బయటి వాళ్లకు పెయింటింగ్స్ వేసిన సందర్భాలున్నాయని నాన్న చెబుతుండేవారు. పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అమ్మ వాళ్లది తెనాలి. తాత (ఎ. సుభాష్) గారు సినిమాలు నిర్మించాలనే ఆసక్తితో మద్రాసు వచ్చి, ‘భారత్ బంద్’ చిత్రం నిర్మించారు. అమ్మ పేరు పద్మ. నాన్నగారి ‘రంగుల పులి’ చిత్రంలో ఇష్టం లేకుండానే అమ్మ నటించింది. నాన్నగారు అమ్మను ఇష్టపడ్డారు. ఇద్దరూ వివాహం చేసుకుందామనుకు న్నారు. సన్నిహితులతా కలిసి అమ్మవాళ్ల నాన్నను ఒప్పించారు. నానమ్మకు ఇచ్చిన మాట ప్రకారం, చెల్లెలికి, తమ్ముళ్లకి వివాహం చేసిన తరవాతే 1983లో అమ్మను వివాహం చేసుకున్నారు. తాతగారు పోయాక నాన్నే ఇంటి బాధ్యత తీసుకు న్నారు. నాన్నకు మేం ఇద్దరు ఆడపిల్లలం. చెల్లి పేరు ప్రవల్లిక. నేను బిబిఏ, చెల్లి ఎంబిఏ చేశాం. నేను యానిమేషన్ కూడా చేశాను. నన్ను ‘దీపమ్మా’ అని, చెల్లిని ‘చిన్నీ’ అని పిలిచేవారు. ఇద్దరూ ఆడపిల్లలేనా అని ఎవరైనా అంటే నాన్నకు నచ్చేది కాదు. స్నేహితునిలా ఉండేవారు.. సినిమాలలో పూర్తిగా బిజీగా ఉండటంతో, ఏ మాత్రం అవకాశం వచ్చినా నాన్న మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాక, మమ్మల్ని కార్లో బీచ్‌కి తీసుకువెళ్లి, ఐస్‌క్రీమ్ కొనిపెట్టేవారు. ఉదయాన్నే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. ఎక్కడ ఉన్నా ఫోన్ చేసేవారు. చాలా స్నేహంగా ఉండేవారు. ఒక్క రోజు కూడా కోప్పడలేదు. నేను నాన్న దగ్గర అసిస్టెంట్‌గా ఉండాలి అని నాన్నతో అన్నప్పుడు, అమ్మ నా పెళ్లి చేసేయమంది. అప్పుడు కూడా నాకు నచ్చినట్లే చేయమన్నారు. ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు. నాన్నకు ఏదీ షో చేయటం నచ్చదు. అలా ప్రదర్శించటం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు అనేవారు. ఎవరో ఏదో అనుకుంటారనే ఆలోచనే ఉండేది కాదు. అమ్మ తన బంధువులకు ఎంతో సహాయం చేస్తుంటే, ఎన్నడూ అమ్మను ప్రశ్నించలేదు. కథ ఎలా ఉంది అని అడిగేవారు.. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకునేవారు. ఔట్‌డోర్ షూటింగ్స్‌కి ఇతర దేశాలకు మమ్మల్ని కూడా తీసుకువెళ్లేవారు. మేం సినిమా చూసి వచ్చాక మమ్మల్ని కథ ఎలా ఉందో చెప్పమనేవారు. ఇల్లు, షూటింగ్ అంతే. పుట్టినరోజుకి మాత్రమే పార్టీ చేసేవారు. ఇంటి భోజనమే ఇష్టపడేవారు. అది కూడా చాలా మితంగా తినేవారు. దాసరిగారితో అనుబంధం... నానమ్మ వాళ్లు నాన్న సినిమాలలోకి వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదు. మద్రాసులో దాసరి గారిని కలిస్తే, ఆయన డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నారు. ఆ ప్రకారమే డిగ్రీ పూర్తి చేశాక, దాసరిగారు ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని మద్రాసు వెళ్లారు. అలా నాన్న సినీ రంగ ప్రవేశం జరిగింది. దాసరిగారు కన్ను మూయటానికి నెల రోజుల ముందు నాన్నకు ఏమనిపించిందో కానీ, రోజూ ఆయన ఇంటికి వెళ్లేవారు. ఆయన పోయినప్పుడు తట్టుకోలేక పోయారు. ఎంత బాధలో ఉన్నా పని మాత్రం మానేసేవారు కాదు. నేను వచ్చేశాను... నా పెళ్లి కుదిరిన తరవాత, నేను అత్తవారింటికి వెళ్లిపోతానన్న దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు. నాన్నను ఓదార్చవలసి వచ్చింది. మా పెళ్లయ్యాక కొంచెం ఆలస్యంగా పుట్టింది పాప. ‘ఆలస్యం చేసుకుంటున్నారెందుకు’ అని అమ్మ అంటున్నా కూడా నాన్న అననిచ్చేవారు కాదు. నాన్నకు బాగోలేదని తెలియగానే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాం. నా డెలివరీ ముందు రోజు నేను వినాలని హనుమాన్ చాలీసా చదివారు. మరుసటి రోజు నాకు డెలివరీ అయ్యేవరకు మంచి నీళ్లు మాత్రమే తాగారట. పసిపాపను చూస్తూనే, మా అమ్మ నరసమ్మ మళ్లీ పుట్టింది అని పాపాయిని ‘చిట్టి నరసమ్మా!’ అని పిలిచారు. భక్తి ఎక్కువ.. నాన్నకు దేవుడి మీద విపరీతమైన భక్తి. దేవుడికి నాన్నకు మధ్య ఎవరు ఏం చెప్పినా వినరు. ఆరు గంటలకు షూటింగ్ అంటే మూడు గంటలకల్లా నిద్ర లేచి, పూజ చేసుకుని పావు గంట ముందే స్పాట్లో ఉండేవారు. ఆసుపత్రిలో ఉండి కూడా, స్నానం చేయించుకుని, పూజ చేసుకున్నాకే టిఫిన్ తినేవారు. వినాయక చవితి రోజున కథ చదువుతుండగా దగ్గు వస్తే, మళ్లీ మొదటి నుంచి చదివేవారు. పూజ అయ్యాక మాతోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. దీపావళి రోజున అందరికీ శుభాకాంక్షలు చెప్పి, నా చేత 100 రూపాయలు ఇప్పించేవారు. ఎక్కడకు వెళ్తున్నా నన్ను ఎదురు రమ్మనేవారు. నా పెళ్లయ్యాక నాతో మాట్లాడటం కోసం మొబైల్ కొన్నారు. అప్పుడు కూడా నిర్మాత గురించే... వేళకు ఆహారం తీసుకోకపోవటం వల్ల నాన్న ఆరోగ్యం దెబ్బ తింది. 2012లో ఒక సినిమా ప్రారంభోత్సవం రోజే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యి, స్పృహలోకి వచ్చిన వెంటనే, ‘నిర్మాత ఎలా ఉన్నారు’ అని అడిగారు. మాకు వింతగా అనిపించింది. 104 డిగ్రీల జ్వరంతో కూడా షూటింగ్ చేశారు. నాన్న అంత్యక్రియలు స్వయంగా నేనే చేశాను. కంటిన్యూ చేస్తున్నాను.. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమా నిర్మాణం చేస్తున్నాను. ‘కోడి పిల్లలు’ అని వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఆ గ్రూపులో మేం నలుగురం, నాన్న దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేసినవారు, నాన్న అభిమానులు ఉన్నారు. -
‘అమ్మోరు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
Ammoru Child Artist Sunaina Story: సాధారణంగా చాలా మంది అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది క్యారెస్ట్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా ఎదిగారు. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారు ఉన్నారు. వారిలో రాశి, శ్రీదేవి, మీనా లాంటి వారు ఉన్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్గా మారుతారని గ్యారెంటీ లేదు. అందుకు ఉదాహరణ సునైనా బాదం. సునైనా బాదం అని చెబితే ఎవరికీ అర్థం కాదు. కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘అమ్మోరు’సినిమా గుర్తుంది కదా? ఈ సినిమాలో నటించిన మరో పవర్ ఫుల్ చైల్డ్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలా సౌందర్య వద్దకు వచ్చే అమ్మోరు తల్లే సునైనా బాదం. ఆ సినిమాలో సౌందర్యను ఇంట్లో వాళ్లందరూ బాధిస్తుంటే.. అమ్మోరు తల్లి చిన్న పిల్లగా మారి సౌందర్యకు రక్షణగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్లతో గంభీరంగా కనిపించిన సునైనా ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించింది. అప్పట్లో ఆ చిన్నారి నిజంగానే దేవత అని జనాలు అనుకున్నారంటే.. ఆ క్యారెక్టర్లో ఆమె ఎంత జీవించేసేందో అర్థం చేసుకోవచ్చు. ఇలా బాల నటిగా పలు సినిమాల్లో కనిపించి మెప్పించిన సునైన ఆ తర్వాత కూడా ప్రేక్షకులతో టచ్ లోనే ఉంది. గత కొంత కాలంగా యూట్యూబ్ లో ఫ్రస్టేటెడ్ వీడియోలతో బాగా పాపుర్ అయ్యింది. సమంత ‘ఓబేబీ’సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సునైనా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఆమె చేసిన 'ఫ్రస్టేటెడ్ ఉమెన్’అనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అయితే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోయిన్లుగా అవుతుంటే.. సునైనా మాత్రం యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్ కావాలని పెద్దగా ఆశ లేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించాలని మాత్రం ఉంది అని సునైనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సునైనా బాదం భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలని ఆశిద్దాం. -
Kallu Chidambaram: మెల్ల కన్ను లేదు, స్మార్ట్‌గా ఉండేవాడు కానీ..
‘కళ్లు’ చిత్రంలో నటించి ఇంటి పేరు కొల్లూరును కళ్లుగా మార్చేసుకుని, కళ్లు చిదంబరంగా మారిపోయారు. పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే, నాటకాలు వేయిస్తూ, సినిమాలలో నటించారు. తుది శ్వాస వరకు తన జీవితాన్ని నాటక రంగానికి, సేవా కార్యక్రమాలకు, పర్యావరణ పరిరక్షణ కోసమే వినియోగించారు. తండ్రి గురించి రెండో కుమారుడు కొల్లూరు సాయి రాఘవ రామకృష్ణుడు అనేక విషయాలు పంచుకున్నారు. ‘కళ్లు’ చిత్రంలో నటించిన నాన్న కొల్లూరి చిదంబరరావు ‘కళ్లు చిదంబరం’ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. నాన్నగారు ఆగస్టు 8, 1948లో నాగుబాయమ్మ, వెంకట సుబ్బారావు దంపతులకు విజయనగరంలో జన్మించారు. తాతగారు స్కూల్ హెడ్ మాస్టర్. నాన్నగారికి ఒక అన్న, నలుగురు అక్కయ్యలు ఉన్నారు. నాన్నగారే అందరికంటె చిన్నవారు. విజయనగరం మునిసిపల్ హైస్కూల్లో ఎస్. ఎస్. ఎల్. సి, విశాఖపట్నంలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. నాన్నగారికి మేం నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అక్క, అన్నయ్య తరవాత నేను, చెల్లి కవల పిల్లలం. తల్లిదండ్రుల ఆశీస్సులతో అందరం హాయిగా ఉన్నాం. మా అందరికీ నాన్నగారి మీద భయంతో కూడిన గౌరవం ఉంది. నాన్నగారిని ప్రతి రోజు ఏదో ఒక దేవాలయానికి తీసుకువెళ్లేవాడిని. నాన్నగారికి నాటకాలు వేయటం కంటె, చూడటంలోనే ఆసక్తి ఎక్కువ. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే, కళాకారులను ప్రోత్సహించారు. విశ్రాంతి లేకపోవటం వల్లే... ప్రముఖ సినిమటోగ్రాఫర్ ఎం. వి. రఘు గారి దర్శకత్వంలో ‘కళ్లు’ చిత్రంలో 1987 డిసెంబర్లో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి, మొదటి చిత్రానికే ఎన్టిఆర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నారు. ఆ సంవత్సరమే ‘మద్రాస్ కళాసాగర్ అవార్డ్’ కూడా అందుకున్నారు. పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగికి అంత పేరు రావడంతో, డిపార్ట్మెంట్ నాన్నను ప్రోత్సహించింది. అందరూ అనుకున్నట్లు నాన్నగారికి చిన్నప్పటి నుంచి మెల్ల కన్ను లేదు. చాలా స్మార్ట్‌గా ఉండేవారు. పన్నెండు సంవత్సరాల పాటు నిద్రాహారాలు లేకుండా నాటకాలు నిర్వహిస్తూండటంతో ఒక నరం పక్కకు వెళ్లి, మెల్ల కన్ను ఏర్పడింది. ఆ లోపమే నాన్నగారిని సినీ రంగానికి పరిచయమయ్యేలా చేసింది. నాటకం చూశారు.. గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’ నాటకాన్ని చూసి, సినిమాగా తీయటం కోసం, సినిమా డైరెక్టర్ అండ్ టీమ్ వస్తారని తెలిసి, ‘నాటకం నాటకంలా ఉండాలే కాని, సినిమాగా తీయకూడదని, నాటకంలో నటించన’ని నాన్న పట్టుబట్టారు. ‘మీ కోసం కాకపోయినా, మా కోసమైనా రండి’ అని అందరూ అడగటంతో, అయిష్టంతోనే ఆ నాటకం వేశారు. డైరెక్టర్ రఘుగారు అందరినీ వదిలేసి, నాన్నగారిని ఎంపిక చేయటంతో, నాన్నగారికి ఆశ్చర్యం వేసింది. ‘ఆ ఒక్క సినిమా చేసి ఆపేద్దాం’ అనుకున్నారు. కాని చెవిలోపువ్వు, ఆర్తనాదం, ముద్దుల మావయ్య... ఇలా 300 చిత్రాలలో నటించారు. భయపడ్డాం... కళ్లు సినిమా షూటింగ్ వైజాగ్‌లోనే జరగటం వల్ల ఒక్కో రోజు ఆ మేకప్‌తోనే ఇంటికి వచ్చేవారు. ఒక రోజున... రక్తం కారుతున్న మేకప్‌తోనే ఇంటికి వచ్చారు. మాకు భయం వేసింది. అప్పుడు నా వయసు పదేళ్లు. ఆ సీన్లో నాన్నగారు, కుక్కని పట్టుకుని, ‘కళ్ళు లేని కబోదిని రామా (నాటకం అంతా కళ్ళు ఉంటాయి. లే నట్లు నటిస్తారు), దయగల వారు ధర్మం చేసుకోండి రామా, లేకపోతే కుక్క బతుకు తప్పదు రామా’ అని కుక్క వైపు చూపిస్తూ అడుక్కుంటారు. ఆ డైలాగు మాకు చాలా ఇష్టం. మానేద్దాం అనుకున్నారు.. సినిమాలలో బిజీ కావటంతో, చేస్తున్న ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నారు. మా మేనత్త గారి సలహా మేరకు ఆ ఆలోచన మానుకుని, పాతికేళ్లు వైజాగ్ నుంచి హైదరాబాద్ ప్రయాణించారు. అప్పుడప్పుడు రిజర్వేషన్ లేక, అప్పటికప్పుడు టికెట్ తీసుకుని, టీటీ చుట్టూ సీట్ కోసం తిరిగేవారు. ‘అనవసరంగా ఎందుకు కష్టపడుతున్నారు నాన్నా మీరు’ అనేవాళ్లం. ‘నా కోసం కాదురా, సమాజం కోసం, పరిశ్రమ కోసం’ అనేవారు. కుటుంబ జీవితం మిస్ కాకుండా, ఆఫీస్ విడవకుండా సినిమాలలో నటించారు. పారితోషికం ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. మంచి పేరు సంపాదించారు. నాన్నే ఉండాలన్నారు వర్మ... ‘గోవిందా గోవిందా’ సినిమాలో ‘నేను ఈ నటుడితో నటించను’ అని శ్రీదేవి అన్నారట. అప్పుడు వర్మగారు, ‘ఈయన అసిస్టెంట్ ఇంజినీర్, నంది అవార్డు అందుకున్న నటుడు, ఆయన ఉంటేనే ఈ రోజు నేను డైరెక్ట్ చేస్తాను’ అనటంతో శ్రీదేవి ఒప్పుకున్నారట. ‘అమ్మోరు’ సినిమా విడుదలయ్యాక అందరూ నాన్నను ‘అమ్మోరు తల్లీ’ అని పిలిచేవారు. ఐసియూలో ఉండి కూడా.. విశాఖ కళాకారులకి ఏదో ఒకటి చేయాలనే తపనతో చివరి రోజుల్లో సినిమాలు వదిలిపెట్టి, ‘కళలు వేరైనా కళాకారులు ఒక్కటే’ అనే నినాదంతో ‘సకల కళాకారుల సమాఖ్య’ స్థాపించి కళాకారులను ప్రోత్సహించారు. 2013 మే నెలలో ఊపిరితిత్తుల సమస్య రావటంతో ఇంటికే పరిమితమయ్యారు. రెండున్నర సంవత్సరాలు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మీదే ఉంటూ, వైజాగ్‌లో అన్ని కార్యక్రమాలకు వెళ్లేవారు. ఐసియులో ఉండి కూడా, ‘రాఘవేంద్ర మహత్యం’ నాటకం వేయించినప్పుడు, ‘అనారోగ్యంతో ఉండి కూడా ఇంత చక్కగా వేయించారు’ అని అందరూ ఆశ్చర్యపోయారు. 2015 అక్టోబర్ 19న నవ్వు ముఖంతోనే కాలం చేశారు. ‘ఇచ్చిన మాట తప్పకూడదు. డబ్బు పోయినా పరవాలేదు, పరువు పోకూడదు. రేపు అనేది ఉండదు. ఈ రోజే చేసేయాలి’ అని నాన్నగారు చెప్పిన మాటలను ఇప్పటికీ రోజూ గుర్తు చేసుకుంటూ, సాధ్యమైనంత వరకు ఆచరిస్తున్నాం. - సంభాషణ: వైజయంతి పురాణపండ -
దైవశక్తా? దుష్టశక్తా?
బేబి రసజ్ఞ టైటిల్ రోల్లో, శ్రీరాజ్ గౌడ్, పూజ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమ్మో అమ్మోరు’. టి.రాము దర్శకత్వంలో మనీష్ గౌర్ సమర్పణలో బిఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ముఖ్య అతిథి, నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘సంగీత దర్శకుడు అర్జున్‌గారు నా తొంభై సినిమాలకు సంగీతం అందించారు. ‘అమ్మో అమ్మోరు’ చిత్రానికి కూడా తను మంచి పాటలిచ్చారు. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా విజయవంతం అవ్వాలి’’ అన్నారు. ‘‘దేవుడికీ, దుష్ట శక్తికీ మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం. ఇందులో నాలుగు పాటలున్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతానికీ ప్రాధాన్యం ఉంది’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్. ‘‘రాము మంచి కథతో ఈ సినిమా తీశాడు. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత బియన్ రెడ్డి. బేబి రసజ్ఞ, నిర్మాత సాయి వెంకట్, శ్రీరాజ్ గౌడ్, పూజ, దర్శకులు హరిబాబు, అళహరి పాల్గొన్నారు. -
పోలీసుల మధ్య ఘర్షణ: ఎస్సైకి తీవ్రగాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలో సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయంలో ఇద్దరు పోలీసుల మధ్య గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భగవాన్‌తో కానిస్టేబుల్ అమ్మోరు డ్యూటీ విషయమై వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఇరువురు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కానిస్టేబుల్ అమ్మోరు తనను వెపన్తో కొట్టి గాయపరిచాడని ఎస్ఐ ఆరోపించాడు. అలాగే ఎస్ఐ భగవాన్ తనను కులం పేరుతో దూషించడమే కాకుండా తరచు వేధించాడని కానిస్టేబుల్ ఆరోపించాడు. అయితే అమ్మోరును నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయాలపాలైన ఎస్ఐ భగవాన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు.