
నిర్మాత కోడి దివ్య దీప్తి
‘‘నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. నాన్న (కోడి రామకృష్ణ) ద్వారా దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాను. మా ఆయన కూడా డైరెక్షన్ చేయమని ప్రోత్సహించారు. ఇంతలో నాన్న దూరమయ్యారు. దర్శకుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వంతోనూ అభిమానులను సంపాదించుకున్నారు నాన్న. అటువంటిది నేను డైరెక్షన్ చేసి ఆయన పేరు చెడగొట్టకూడదని నా నిర్ణయం మార్చుకున్నాను’’ అని నిర్మాత కోడి దివ్య దీప్తి అన్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్‌టైన్ మెంట్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
నేడు (జూలై 8) కోడి దివ్య దీప్తి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఉన్నప్పుడే కిరణ్‌తో సినిమా చేద్దామని కథలు విన్నాను. ‘మనం పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్‌పై కనపడేలా చెయ్యాలి తప్ప వృథా చేయకూడదు’ అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. ఆ మాటలు మనసులో పెట్టుకొని ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చేస్తున్నాను. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 10న పాలకొల్లులో విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 9న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. నాకు కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలంటే ఇష్టం. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. నా తర్వాతి సినిమా ఏంటనేది త్వరలో చెబుతాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment